మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జూన్ 14, 2026న ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించనున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్
గ్లోబల్ డీప్ టెక్, ఆవిష్కరణలు, అంకుర వ్యవస్థల పురోగతికి ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యం
प्रविष्टि तिथि:
12 JUN 2026 6:00PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి జూన్ 14, 2026న ఫ్రాన్స్‌లోని పాలైస్ డెస్ ఎక్స్‌పోజిషన్స్ డి నీస్ వద్ద భారత్ ఇన్నోవేట్స్-2026ను ప్రారంభించనున్నారు.
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యక్రమం. ఇందులో 120 మంది భారతీయ ఆవిష్కర్తలు, సుమారు 15 ఉన్నత విద్యా సంస్థలు (హెచ్‌ఈఐలు), ప్రముఖ కార్పొరేట్లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలతో పాటు ప్రపంచ సీఈఓలు, పారిశ్రామిక నాయకులతో సహా 500 మందికి పైగా పెట్టుబడిదారులు పాల్గొంటారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు, డీప్ టెక్ వ్యవస్థను ప్రతిబింబించేలా.. అధునాతన కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగం వంటి 13 కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, భారత్ ఇన్నోవేట్స్-2026కు భారత్ నుంచి 120 అంకుర సంస్థలను ఎంపిక చేసే సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి నాయకత్వం వహించిన భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు శ్రీ అజయ్ కుమార్ సూద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.
భారత్ ఇన్నోవేట్స్-2026 మొదటి ఎడిషన్ నీస్‌లో జరుగుతుంది. ఇది భారతదేశ డీప్ టెక్ ఆవిష్కర్తలను, స్టార్టప్‌లను ప్రపంచ పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు పరిచయం చేస్తుంది. భారతదేశానికి, ప్రపంచ భాగస్వాములకు మధ్య ఆవిష్కరణల ఆధారిత భాగస్వామ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ప్రభావవంతమైన వేదిక అవుతుంది. ఈ కార్యక్రమంలో డీప్ టెక్, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్ విస్తరణ, సరిహద్దుల మధ్య పెట్టుబడుల సౌలభ్యం వంటి రంగాల్లో బలమైన భాగస్వామ్య వ్యవస్థలతో కూడిన పలు కీలక ప్రకటనలు, ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
సహ-అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణపై దృష్టి సారిస్తూ.. భారతదేశ, ఫ్రెంచ్ ఆవిష్కరణ వ్యవస్థల మధ్య సంస్థాగత భాగస్వామ్యాల కోసం నూతన మార్గాలను ఈ కార్యక్రమం అందుబాటులోకి తీసుకొస్తుంది. పెట్టుబడులు, సాంకేతిక ధ్రువీకరణ, సహ-అభివృద్ధి అవకాశాలు, పైలట్ ప్రాజెక్టులు, తయారీ భాగస్వామ్యాల కోసం పాల్గొనే ఆవిష్కర్తలు, సంస్థలను.. పెట్టుబడిదారులు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ భాగస్వాములతో అనుసంధానించటానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు, స్వీకరణ, మార్కెట్ ప్రవేశం, భారతదేశ ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు మార్గాలను కల్పించాలని భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని రూపొందించారు.
భారత్ ఇన్నోవేట్స్-2026.. ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల వ్యవస్థలతో భారతదేశ బంధాన్ని బలోపేతం చేస్తుందని, సాంకేతికత ఆధారిత వృద్ధి, వ్యవస్థాపకతకు ప్రధాన కేంద్రంగా భారత్‌ను నిలుపుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 2026లో ముంబయిలో భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు సంయుక్తంగా ప్రారంభించిన భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
భారత్ ఇన్నోవేట్స్ గురించి మరిన్ని వివరాల కోసం https://bharatinnovates.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
****
(रिलीज़ आईडी: 2272448)
आगंतुक पटल : 11