యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నటుడు శ్రీ విక్రాంత్ మాసీ‌తో పాటు


దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాలకు నాయకత్వం వహించిన క్రీడల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా

దేహ దారుఢ్యాన్ని, నిరంతర ప్రగతిని ప్రోత్సహించే ఉద్దేశంతో దేశమంతటా వేల చోట్ల నిర్వహించిన ఒక రోజు కార్యక్రమంలో

పాల్గొన్న 4 వేల కన్నా ఎక్కువ మంది వ్యక్తులు

प्रविष्टि तिथि: 07 JUN 2026 4:30PM by PIB Hyderabad

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా జాతీయ రాజధానిలో ప్రసిద్ధ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. అక్కడ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక దేశవ్యాప్త కార్యక్రమానికి యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా నేతృత్వం వహించారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ నటుడు శ్రీ విక్రాంత్ మాసీ, ప్రపంచ చాంపియన్‌షిప్పులలో రజత పతక విజేత, బాక్సింగ్ క్రీడాకారిణి నూపుర్ శ్యోరాణ్‌లతో పాటు ప్రముఖ కన్నడ నటి రాగిణీ ద్వివేదీ కూడా పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో 15,000 కన్నా ఎక్కువ మంది ఫిట్‌నెస్ ఔత్సాహికులు సైకిళ్లను నడిపారు. మరో వైపు, దేశం అంతటా కార్గిల్ మొదలు లేహ్, కన్యాకుమారి, అలెప్పీల వరకూ, త్రిపుర నుంచి వడోదరా వరకూ వేయి చోట్లలో ఏర్పాటు చేసిన ఒక రోజు సైకిలింగ్ కార్యక్రమంలో 4 లక్షల కన్నా ఎక్కువ మంది పాలుపంచుకున్నారు.
డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా 2024 డిసెంబరులో మొదలుపెట్టిన ఈ సైకిలింగ్ కార్యక్రమంతో ఇప్పటి వరకు 30 లక్షల మంది జతపడ్డారు. ఈ సైకిలింగ్ కార్యక్రమం దేశం నలుమూలలా వేల చోట్లకు చేరుకుంది. స్నేహపూర్వకంగా నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో నటుడు శ్రీ విక్రాంత్ మాసీపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి గెలిచారు. దీని తరువాత తోటి సైకిలిస్టులతో కలసి ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘ఫిట్ ఇండియా, హిట్ ఇండియా’’ నినాదాల మధ్య మంత్రి సైకిల్‌ను నడిపారు.




ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల క్రీడా విభాగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఏపీఎఫ్), కోస్తా తీర రక్షక దళం, సైన్యం, నౌకాదళం, వాయు సేన, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్), కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్), ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ)లతో పాటు సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకొంది.
సైకిల్‌ను నడపడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ మాండవియా వివరిస్తూ, ‘‘ ఈ రోజు ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’’  77వ సంచికను నిర్వహించుకొంటున్నాం. సైకిల్‌ను నడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాక, మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. ఇది ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు, పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఇది అంతకంతకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఒక ప్రభావవంతమైన పరిష్కారం కూడా. సైకిల్ నడిపే అలవాటు కారణంగా ఒకే సారి అనేక సవాళ్లను పరిష్కరించవచ్చు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా దేహ దారుఢ్యం కోసం రోజూ కనీసం అరగంట కాలాన్ని కేటాయించాలని సలహా ఇచ్చారు. మనం ప్రతి రోజూ పాటించే ఫిట్‌నెస్ సంబంధిత దినచర్యలో సైకిల్ నడిపే అలవాటును ఒక భాగంగా చేసుకున్నామంటే, అప్పుడు ఈ అలవాటు మన అనేక సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. రండి, మనమంతా మన నిత్య జీవనంలో సైకిలింగ్‌కు చోటిద్దాం.. ‘ఆదివారాల్లో సైకిల్‌ను నడుపుదాం’ కార్యక్రమంలో  నాతో పాటు మీరు కూడా పాలుపంచుకోండి. క్రమం తప్పక సైకిల్‌ను నడపండి, ఫిట్‌గా ఉండండి, ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు చెప్పిన ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ వంతు తోడ్పాటును అందించండి’’ అన్నారు.
నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ), అగ్రివిజన్, కిసాన్ సంఘాలు, క్రీడాకారిణులు, క్రీడాకారులు, సామాన్య ప్రజానీకం, మై భారత్ కార్యకర్తలు, ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (పీఈఎఫ్ఐ) సభ్యులు, క్రీడా భారతి సభ్యులతో పాటు నమో ఫిట్ ఇండియా సైకిలింగ్ క్లబ్బులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి హేకా, ఫిట్‌స్పైర్, దేశీ ఫారమ్స్, ఏవన్ సైకిల్స్, సైక్లోఫిట్ వంటివి ప్రాయోజిత సంస్థలుగా వ్యవహరించాయి.




వివిధ నగరపాలక సంస్థలు కూడా వాటి పరిధిలో సైకిళ్లను నడిపే కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. ఇండియా సైకిలింగ్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా మహిళలకు ప్రత్యేకంగా ‘అస్మిత సైకిలింగ్ పోటీల’ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సైకిలింగ్ క్రీడల అంతర్జాతీయ సంస్థ యూసీఐ కూడా సహకారాన్ని అందించింది.
‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం జనప్రియ చలనచిత్ర నటుడు శ్రీ విక్రాంత్ మాసీకి బాల్య జ్ఞాపకాల్ని గుర్తుకు తీసుకువచ్చింది. అలాగే, ఒకే చోటులో పని చేయాల్సివస్తున్న జీవనశైలితో పాటు స్క్రీన్‌పై అత్యధిక సమయాన్ని గడపాల్సివచ్చే ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.




ఆయన మాట్లాడుతూ, ‘‘చాలా సంవత్సరాల తరువాత, చిన్నతనంలో మన స్నేహితులతో కలసి మనం ఎలా బయటికి వెళ్లే వాళ్లమో ఆ జ్ఞాపకాల్ని ఈ ఆదివారం ఉదయం నాకు గుర్తుకు తీసుకువచ్చింది. ఎన్నో పాత స్మృతులను మరో సారి నెమరువేసుకున్నా. క్రీడల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా గత ఏడాదిన్నర, రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధతో ముందుకు తీసుకుపోతున్నారు. ఆయన ప్రతి రోజూ సైకిల్ నడుపుతారు. ఆదివారాలైనా సరే, ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. ఇది ఒక ఉద్యమ రూపాన్ని అందుకుంది. ఇవాళ, కనీసం 15000 నుంచి 18000 మంది ఇక్కడికి వచ్చారు. ఇది ఆయన కఠోర శ్రమకు అద్దం పడుతోంది. మనమందరం మంచి ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నాం. మనం మన పిల్లలకు వారి స్క్రీన్ టైమును తగ్గించుకొమ్మనీ, మైదానాలకు వెళ్లి ఆటలు ఆడుకొమ్మనీ తప్పక చెబుదాం.  మీరు ఎంత డబ్బు సంపాదించినా, లేదా మీరు ఎన్ని ఆస్తులను పోగేసుకున్నా సరే, ఆరోగ్యం లేందే వాటికి ఎంతమాత్రం ప్రాముఖ్యం ఉండదు’’ అన్నారు.
ప్రపంచ కప్ పోటీల్లో ఎనభై కేజీల విభాగంలో రెండు బంగారు పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ క్రీడాకారిణి నూపుర్ శ్యోరాణ్‌ మాట్లాడుతూ, ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాల కారణంగా భారతీయ పౌరులు ఇప్పుడు దేహ దారుఢ్యం విషయంలో మరింతగా అవగాహనను ఏర్పరుచుకున్నారన్నారు. సైకిల్ నడపడానికి ముందు ఆమె నటుడు శ్రీ విక్రాంత్ మాసీకి బాక్సింగ్ క్రీడను గురించి కొన్ని సూచనలను కూడా ఇచ్చారు.
నూపుర్ శ్యోరాణ్ ఇంకా ఇలా అన్నారు.. ‘‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు ఇక్కడికి ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసమూహం శారీరక ఫిట్‌నెస్‌ విషయంలో వారు ఎంత జాగరూకతతో ఉన్నారో తెలియజెబుతోంది. సైకిల్‌ను నడపడం నిజానికి సంతోషాన్ని ఇచ్చేదే కాకుండా ప్రయోజనకరమైన కార్యక్రమం కూడా. అందరూ రోజూ కనీసం పావు గంట నుంచి అర గంట పాటు సైకిలింగ్ చేయడమో, లేదా మరే ఇతర శారీరక కార్యకలాపానికో సమయాన్ని వెచ్చించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’
సైక్లోథాన్లో ప్రసిద్ధ ట్రిపుల్ జంప్ క్రీడాకారిణి ప్రాచీ తోమర్ , జాతీయ స్థాయిలో 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ క్రీడాకారిణి శివానీ ప్రధానియా కూడా పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని నిర్వహించిన చోట ఒక ఫన్ జోనును కూడా ఏర్పాటు చేశారు. అక్కడ బ్యాడ్మింటన్, చదరంగం, క్యారం, లూడో వంటి వాటిలో పాలుపంచుకొనేందుకు అవకాశాన్ని కల్పించారు. దీనికి తోడు లెమన్ రేస్, బాల్ గేమ్, ఎదురుబొదురు బలప్రదర్శన, స్క్వాట్ చాలెంజ్‌తో పాటు పుష్-అప్ చాలెంజ్ వంటి పోటీలను కూడా నిర్వహించారు.
‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ను ఇండియా సైకిలింగ్ ఫెడరేషన్ (సీఎఫ్ఐ), యోగాసన భారత్, రాహ్‌గిరీ ఫౌండేషన్‌తో పాటు మై భారత్ సహకారంతో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ నిర్వహిస్తోంది. ఈ సైకిలింగ్ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏక కాలంలో నిర్వహిస్తుంటారు. దీనిలో ఎస్ఏఐ ప్రాంతీయ కేంద్రాలు, నేషనల్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు (ఎన్‌సీఓఈస్), ఎస్ఏఐకి చెందిన శిక్షణ కేంద్రాలు (ఎస్‌టీసీస్), ఖేలో ఇండియా ఎక్స్‌లెన్స్ సెంటర్లు (కేఐఎస్‌సీఈస్)తో పాటు ఖేలో ఇండియా సెంటర్లు (కేఐసీస్) కూడా భాగం అవుతున్నాయి.

***


(रिलीज़ आईडी: 2270236) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam