కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2026- 27 సంవత్సరానికి బీమా పరిధిలో ఉన్న వ్యక్తుల పిల్లల (వార్డ్ ఆఫ్ ఐపీ) కోటాలో
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఈఎస్ఐసీ
దేశవ్యాప్తంగా 22 వైద్య కళాశాలల్లో 783 సీట్ల కేటాయింపు
ఈఎస్ఐసీ పరిధిలో ఉన్న కార్మికుల పిల్లలను సాధికారులను చేయడం లక్ష్యం
బీమా పరిధిలో ఉన్న కార్మికుల పిల్లలకు ధ్రువపత్రాల జారీ కోసం 2026 జూన్ 21 వరకు అందుబాటులో ఆన్‌లైన్ పోర్టల్
నాడు పోస్టు చేయడమైనది:
05 JUN 2026 12:08PM by PIB Hyderabad
2026-27 విద్యా సంవత్సరానికిగాను బీమా పరిధిలో ఉన్న కార్మికుల పిల్లల (వార్డ్ ఆఫ్ ఐపీ) కోటా కింద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. కేంద్ర కార్మిక - ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) దరఖాస్తులను ఆహ్వానించింది. ఉద్యోగుల రాజ్య బీమా (ఈఎస్‌ఐ) పథకం పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు మాత్రమే ఈ కోటాలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా బీమా పరిధిలోకి వచ్చే కార్మికుల కుటుంబాలకు అర్థవంతమైన సామాజిక భద్రతతోపాటు విద్యాపరమైన ప్రయోజనాలను అందించడంలో ఈఎస్‌ఐసీ నిబద్ధతకు ఇది నిదర్శనం.
2026-27 విద్యా సంవత్సరానికి గాను వార్డ్ ఆఫ్ ఐపీ కోటా కింద దేశవ్యాప్తంగా మొత్తం 783 సీట్లను తాత్కాలికంగా కేటాయించారు. 22 వైద్య, దంత, నర్సింగ్ కళాశాలల్లో మొత్తం 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలతోపాటు.. అర్హులైన కార్మికుల పిల్లల కోసం సీట్లను రిజర్వు చేసిన కొన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా ఇందులో ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) నిర్వహించే కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రవేశాలు జరుగుతాయి.
కార్మికుల కుటుంబాల విద్యాపరమైన ఆకాంక్షలకు దన్నుగా నిలిచేందుకు ఈఎస్‌ఐసీ చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంక్షేమ కార్యక్రమాల్లో వార్డ్ ఆఫ్ ఐపీ కోటా ఒకటి. అర్హులైన విద్యార్థులు అత్యంత తక్కువ ట్యూషన్ ఫీజులతోనే ప్రొఫెషనల్ కోర్సులైన వైద్య, నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఈ కోటా కింద ప్రవేశం పొందే విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఏడాదికి కేవలం రూ. 24,000, అలాగే బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఏడాదికి రూ. 10,000 ట్యూషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ఈఎస్‌ఐ పథకం లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య విద్య సులభంగా, తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి వస్తుంది. ఈ కోటాలో ప్రవేశాల కోసం ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్లు వసూలు చేయడానికి వీల్లేదు.
తల్లి లేదా తండ్రి ఈఎస్‌ఐ చట్టం కింద నమోదు చేసుకుని బీమా పొంది ఉండి, 2025 సెప్టెంబర్ 30 నాటికి ఈఎస్‌ఐ పథకానికి తమ వాటా చెల్లిస్తూ ఉంటే.. వారి పిల్లలు ఈ కోటాను పొందేందుకు అర్హులు. దరఖాస్తుదారు సదరు బీమా పొందిన కార్మికుడి సంతానమై ఉండాలి. అలాగే నీట్ (యూజీ)- 2026 పరీక్షకు తప్పక హాజరై ఉండాలి. అలాగే జాతీయ వైద్యవిద్యా కమిషన్, భారత దంతవైద్య విద్యా మండలి, భారత నర్సింగ్ కౌన్సిల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తిచేయాలి. వయోపరిమితి విషయానికొస్తే.. 2026 మార్చి 8 నాటికి పురుష అభ్యర్థుల వయస్సు 21 ఏళ్లు దాటకూడదు. అయితే ఈఎస్‌ఐ చట్టం-1948 నిబంధనల ప్రకారం, బీమా పరిధిలో ఉన్న కార్మికుడిపై ఆధారపడి ఉన్న అవివాహిత మహిళా (కుమార్తెలు) అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన వర్తించదు.
ఈ ప్రవేశ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఈఎస్‌ఐసీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ‘వార్డ్ ఆఫ్ ఐపీ’ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందే దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. దీనిని ఈఎస్ఐసీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దేశిత వివరాలను అందించడంతోపాటు.. ఫొటోలు, వయస్సు ధ్రువీకరణ పత్రం, నీట్(యూజీ)- 2026 అడ్మిట్ కార్డు, అవసరమైన చోట్ల సంబంధిత ఇతర సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ 21. ఈ దరఖాస్తు ప్రక్రియ ఓటీపీతో ముడిపడి ఉన్నందున.. బీమా పరిధిలో ఉన్న కార్మికుడి మొబైల్ నంబరు ఈఎస్‌ఐసీ డేటాబేస్‌లో సరిగ్గా అప్‌డేట్ అయి ఉండేలా అభ్యర్థులు ముందుగానే సరిచూసుకోవాలి. వార్డ్ ఆఫ్ ఐపీ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత, కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడం కోసం.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పోర్టల్లో అభ్యర్థులు విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రవేశ ప్రక్రియ గురించిన సమాచారం అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాల్సిందిగా.. యాజమాన్యాలు, కార్మికులు, ప్రాంతీయ కార్యాలయాలు, శాఖా కార్యాలయాలు, హాస్పిటళ్లు, రాష్ట్ర ఈఎస్‌ఐ అధికారులు సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఈఎస్‌ఐసీ విజ్ఞప్తి చేసింది. ఈఎస్‌ఐ పథకం పరిధిలోకి వచ్చే యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఈ అవకాశం గురించి తెలియజేయాలని, పని ప్రదేశాల్లో ఈ అడ్మిషన్ నోటీసును అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని కోరింది. అలాగే ఈఎస్ఐసీ రికార్డుల్లో కార్మికుల మొబైల్ నంబర్ల ధ్రువీకరణ, అప్డేషన్ ప్రక్రియలో సహకరించాలని సూచించింది. దరఖాస్తులను సకాలంలో సమర్పించి, ప్రాసెస్ చేయడానికి వీలుగా అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని అందించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని క్షేత్రస్థాయి కార్యాలయాలకు సూచించింది.
ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తుంది. ప్రసూతి ప్రయోజనం, దివ్యాంగజనులూ, కార్మికులపై ఆధారపడిన వారికీ వివిధ సేవలతోపాటు సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది. వార్డ్ ఆఫ్ ఐపీ కోటా వంటి పథకాల ద్వారా.. భారతీయ కార్మికుల సంక్షేమం, సాధికారత, సామాజిక - ఆర్థిక పురోగతి పట్ల అంకితభావాన్ని ఈఎస్ఐసీ ఎప్పటికప్పుడు బలంగా చాటుకుంటోంది.
అర్హత, దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు ఈఎస్ఐసీ వెబ్‌సైట్ www.esic.gov.in, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్ www.mcc.nic.in లను సందర్శించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2269341)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6