వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత వ్యవసాయ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం - తొలిసారి ఒకే వేదికపైకి 22 రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు


మంత్రుల నాయకత్వంలో ప్రకృతి వ్యవసాయానికి నూతనోత్తేజం
భారతీయ వ్యవసాయ రంగం మార్పునకు ప్రధాన కేంద్రంగా పూసా

వ్యవసాయ వృద్ధి తదుపరి దశ కోసం కార్యాచరణను నిర్దేశించిన జాతీయ ఖరీఫ్ సదస్సు

చర్చల నుంచి సేవలు అందించే వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సంస్కరణలను అమలు చేయడానికి రాష్ట్రాల కట్టుబాటు

प्रविष्टि तिथि: 30 MAY 2026 2:33PM by PIB Hyderabad

భారత వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా తొలిసారి 22 రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఒకే వేదికపైకి వచ్చారు. దేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఒకటైన న్యూఢిల్లీ లోని పూసా ప్రాంగణంలో మే 28-29 తేదీలలో జరిగిన రెండు రోజుల జాతీయ ఖరీఫ్ సదస్సులో 22 రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొని సమన్వయ చర్యలు, సమర్థవంతమైన ఆచరణ ద్వారా రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను ప్రకటించారు. 

ఇది కేవలం ఒక సాధారణ సమీక్షా సమావేశం మాదిరి కాకుండా నిబద్ధత, సమన్వయం, క్షేత్రస్థాయి ఆచరణ కోసం ఒక జాతీయ వేదికగా ఆవిర్భవించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మొదటి రోజు సమావేశంలో రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారుల మధ్య విస్తృతమైన చర్చలు జరిగాయి. రెండవ రోజు సమావేశంలో  రాష్ట్ర వ్యవసాయ మంత్రుల మధ్య సాయంత్రం వరకు కొనసాగిన సుదీర్ఘ చర్చలలో కూడా  కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ స్వయంగా పాల్గొన్నారు. ఖరీఫ్ సంసిద్ధత, పప్పుధాన్యాలు, నూనెగింజలలో స్వయంసమృద్ధి, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, ప్రతిపాదిత 'ఖేత్ బచావో అభియాన్' ప్రచారంతో సహా కీలకమైన అంశాలపై వీరంతా కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

శ్రీ చౌహాన్ పిలుపు మేరకు  ప్రకృతి వ్యవసాయానికి కేవలం విధానపరమైన స్థాయిలో మద్దతు ఇవ్వడమే కాకుండా, తమ స్వంత పొలాలలో కూడా దానిని అవలంబించి, ప్రయోగాలు చేస్తామని వ్యవసాయ మంత్రులు ముక్తకంఠంతో ప్రకటించడం ఈ సదస్సు ముఖ్యమైన ఫలితాలలో ఒకటిగా నిలిచింది. తామే ఆదర్శంగా నిలుస్తూ రైతులలో మరింత నమ్మకాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత ప్రభుత్వం వ్యవసాయాన్ని కేవలం ఉత్పత్తి అంశంగా కాకుండా, నేల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, పోషకాహార భద్రత, రైతుల సంపద, భవిష్యత్ తరాల సంక్షేమాన్ని కలిగిన సమగ్ర జాతీయ బాధ్యతగా పరిగణిస్తున్నట్టు జాతీయ ఖరీఫ్ సదస్సు మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాల నుంచి రైతులు మరింత సమర్థవంతంగా ప్రయోజనం పొందేలా పరిపాలనాపరమైన విధానాలను సరళీకృతం చేయాలని, అనవసరమైన సంక్లిష్టతలను తొలగించాలని శ్రీ చౌహాన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

సదస్సు మొదటి రోజున దేశవ్యాప్తంగా ఉన్నతాధికారులు ఒకే చోటికి చేరి ఖరీఫ్ సీజన్ సంసిద్ధత, విత్తనాల లభ్యత, ఎరువుల నిర్వహణ, పంటల ప్రణాళిక, నీటి నిర్వహణ,  ప్రాంతాల వారీగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. కేంద్ర మంత్రి  శ్రీ చౌహాన్ తన ప్రారంభ ఉపన్యాసం ముగిసిన తర్వాత కూడా ప్రతినిధుల మధ్య కూర్చుని చర్చలలో వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినడం విశేషం. మరుసటి రోజు కూడా ఆయన అధ్యక్షతన రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఈ చర్చను ముందుకు తీసుకెళ్లి, దీనిని ఒక ఉమ్మడి విధానపరమైన కట్టుబాటుగా,  కార్యాచరణ ప్రణాళికగా మార్చారు.

ముగింపు సమావేశంలో, అధికారులు,  మంత్రులు ప్రదర్శించిన నిబద్ధతను, అంకితభావాన్ని,  క్రియాశీల భాగస్వామ్యాన్ని శ్రీ చౌహాన్ అభినందించారు. ప్రతినిధుల నుంచి ఇంతటి కట్టుబాటుతో కూడిన భాగస్వామ్యాన్ని తాను చాలా అరుదుగా చూశానని ఆయన పేర్కొన్నారు. హాజరైన వారు తమను కేవలం పాలకులగానే కాకుండా ఆలోచనాపరులుగా, ఆచరణకర్తలుగా,  మార్పునకు వారధులుగా ప్రదర్శించుకున్న తీరు ఈ సదస్సు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సదస్సు ద్వారా వెలువడిన అత్యంత బలమైన సందేశం బహుశా “వ్యవసాయాన్ని రక్షించడం అంటే భవిష్యత్తును రక్షించడమే”. పంట పొలాలను రక్షించడం అనేది కేవలం వ్యవసాయ భూములను కాపాడటం మాత్రమే కాదని, పర్యావరణాన్ని, దేశాన్ని,  రాబోయే తరాల భవిష్యత్తును కూడా సంరక్షించడమని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. ఎరువుల సమతుల్య వినియోగం ఆవశ్యకతపై సదస్సు ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం. 

 

రసాయన ఎరువులను పూర్తిగా నిషేధించడం తమ ఉద్దేశం కాదని, వాటి శాస్త్రీయ, సమతుల్య, విచక్షణాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీనిని సాధించేందుకు దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన ఉద్యమం,  సంస్థాగత ప్రచారాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకనుగుణంగా “ఖేత్ బచావో అభియాన్” ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), కృషి విజ్ఞాన కేంద్రాలు, విస్తృత శాస్త్రీయ సమాజం కలిసి సంయుక్త జాతీయ కార్యక్రమంగా అభివృద్ధి చేయాలని సదస్సు ప్రతిపాదించింది.

ఈ ప్రచారం కేవలం ఒక పిలుపుగానే మిగిలిపోకుండా, క్షేత్రస్థాయిలో ప్రయోజనకరమైన ఫలితాలను అందించేలా చూడటం కోసం సమన్వయ ఆచరణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలు,  ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా శ్రీ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. 

రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఈ సదస్సులో తమ సొంత పొలాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వ్యక్తిగతంగా అవలంబిస్తామని బహిరంగంగా కట్టుబాటును ప్రకటించడం మరో విశేషం. చాలా మంది వ్యవసాయ మంత్రులకు స్వయంగా వ్యవసాయంతో అనుబంధం ఉండటం వల్ల, ఈ నిర్ణయం కేవలం ప్రతీకాత్మకంగా కాకుండా ఆచరణాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. విధాన రూపకర్తలు, ప్రజాప్రతినిధులు స్వయంగా చిన్న స్థాయిలోనైనా ప్రకృతి వ్యవసాయ నమూనాలను ప్రదర్శించినప్పుడు, ఆ సందేశం రైతులకు మరింత నమ్మశక్యంగా,  స్ఫూర్తిదాయకంగా మారుతుందని శ్రీ చౌహాన్ అన్నారు. 

ఈ విషయంలో గుజరాత్ వంటి రాష్ట్రాల అనుభవాలను విలువైన ఉదాహరణలుగా ప్రముఖంగా ప్రస్తావించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా ఈ సదస్సులో క్రియాశీలకంగా పాల్గొన్నారు.  ఒక ప్రత్యేక సెషన్‌లో దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల విస్తరణను గట్టిగా సమర్థించారు.

ఈ సదస్సు ద్వారా ఖరీఫ్ ప్రణాళిక అనేది ఇకపై కేవలం ఆయా సీజన్ల సంసిద్ధతకే పరిమితం కాదని స్పష్టమైంది. బదులుగా, దీనిని పప్పుధాన్యాలు, నూనెగింజలలో స్వయంసమృద్ధి, నేల ఆరోగ్యం, పెట్టుబడి వ్యయాల విచక్షణాయుత నిర్వహణ, వ్యవసాయ ఉత్పాదకత నిరంతర పెంపుదలతో కూడిన ఒక విస్తృతమైన ఎజెండాతో అనుసంధానిస్తారు. ఈ నూతన విధాన దృష్టికోణం ఉత్పత్తిని పెంచడంతో పాటు సహజ వనరుల ఆరోగ్యాన్ని కాపాడటం, పునరుద్ధరించడం రెండింటినీ ఏకకాలంలో సాధించాలనే లక్ష్యాన్ని కలిగిఉంది.

విధానపరమైన నిర్ణయాలను ప్రజా ఉద్యమాలుగా మార్చడానికి అవసరమైన సమాచార ప్రసార వ్యూహం  ఈ చర్చలోని మరొక ముఖ్యమైన అంశం. శ్రీ చౌహాన్ తన ముగింపు ఉపన్యాసంలో, ఈ సదస్సులో ఖరారు చేసిన నిర్ణయాలు, ప్రచార కార్యక్రమాలను వివిధ అవగాహన, ప్రచార వేదికల ద్వారా రైతులకు, ప్రజలకు నిరంతరం చేరవేయాలని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు వ్యవసాయ సంస్కరణలను కేవలం పరిపాలనా కార్యక్రమాలుగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో నడిచే ప్రజాకేంద్రిత ఉద్యమాలుగా మారుస్తాయని ఆయన తెలిపారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ నిర్వహణను కేవలం పథకాల ప్రకటనలకే పరిమితం చేయకుండా ఉమ్మడి బాధ్యతా సంస్కృతిని పెంపొందించాలని ఆకాంక్షిస్తోందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను సాధించడానికి గొప్ప హోదా అవసరం లేదని, గొప్ప సంకల్పం ఉంటే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భావనే ఈ సదస్సు ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది, మంత్రులు, అధికారులు తమ బాధ్యతలను అంకితభావంతో, స్పష్టమైన ఉద్దేశంతో నెరవేర్చడానికి సమిష్టిగా కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

వ్యవసాయాన్ని కేవలం ఒక శాఖాపరమైన అంశంగా కాకుండా జాతీయ మిషన్ స్థాయికి తీసుకెళ్లిన రెండు రోజుల జాతీయ ఖరీఫ్ సదస్సు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోంది. ‘ఖేత్ బచావో అభియాన్’, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయానికి ఆచరణాత్మక నమూనాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలలో స్వయంసమృద్ధి లక్ష్యాలు ఇకపై నిర్దిష్ట కాలపరిమితులు,  అమలు చర్యలతో ముందుకు సాగనున్నాయి. ఈ సదస్సు వ్యవసాయ రంగానికి ఒక కీలకమైన, సానుకూల మలుపుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

సదస్సు ముగింపు సందర్భంగా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రెండు రోజుల సుదీర్ఘ చర్చల నుంచి వెలువడిన ఆలోచనలు,  కట్టుబాట్లను క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రతినిధులతో సమిష్టి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఖరీఫ్ సదస్సు 2026 ఆలోచనల నుంచి కట్టుబాటు వైపు, కట్టుబాటు నుంచి ఆచరణ వైపు సాగే మార్పు దిశగా అత్యంత ముఖ్యమైన విజయంగానూ,  కార్యాచరణ వైపు నిర్ణయాత్మకంగా అడుగులు వేస్తున్న భారత వ్యవసాయ రంగ మార్పునకు సంకేతంగానూ నిలుస్తోంది. 

***


(रिलीज़ आईडी: 2267171) आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam