వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చరిత్రాత్మక కెనడా పర్యటనను ముగించుకున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతం, సీఈపీఏ చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో ఇండో-కెనడా సమాజం పాత్రను చాటేలా సాగిన పర్యటన
భారత ఆర్థిక పరివర్తననూ, భారత్ - కెనడా భాగస్వామ్య విస్తరణనూ చాటేలా.. టొరొంటో యూనివర్సిటీలోని మంక్ స్కూల్‌లో ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్
ఆంటారియో ఆవిష్కరణల కేంద్రం, కెనడా - ఇండియా టెక్ కనెక్ట్ ప్రతినిధులతో శ్రీ గోయల్ భేటీ.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్ సహకారంలో అవకాశాలపై చర్చ
భారత్ - కెనడా వ్యాపార సహకారాన్నీ, పెట్టుబడి భాగస్వామ్యాలనూ బలోపేతం చేసుకునేలా.. ప్రాంతీయ మండళ్లతో చర్చించిన శ్రీ పీయూష్ గోయల్
పెట్టుబడి భాగస్వామ్యాల విస్తరణ, భారత అంతర్జాతీయ ఆర్థిక పరపతిని బలోపేతం చేయడం లక్ష్యంగా.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, భారత పారిశ్రామిక ప్రముఖులతో చర్చించిన శ్రీ పీయూష్ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 9:56AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ మూడు రోజుల కెనడా పర్యటన 2026 మే 28న ముగిసింది. ఈ చరిత్రాత్మక పర్యటన అత్యంత ఫలప్రదంగా సాగింది. టొరంటోలో విద్యాసంస్థలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు, భారతీయ ప్రవాస సంఘాలతో పలు కీలక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఆయన షెడ్యూల్ కొనసాగింది. భారత్ - కెనడా ఆర్థిక భాగస్వామ్యంలో నిరంతర ఉత్తేజాన్ని బలోపేతం చేయడంతోపాటు.. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు భారత్ ప్రధాన అంతర్జాతీయ గమ్యస్థానంగా ఎదుగుతున్న తీరును ఈ సమావేశాలు స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ సంబంధాలు, ప్రభుత్వ విధానాల అధ్యయనంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచిన, టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్ఠాత్మక మంక్ అంతర్జాతీయ వ్యవహారాలు - ప్రభుత్వ విధాన సంస్థ (గ్లోబల్ అఫైర్స్ - పబ్లిక్ పాలసీ స్కూల్)లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులనుద్దేశించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రసంగంతో ఈ పర్యటనలో తొలి రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ సాధిస్తున్న వేగవంతమైన ఆర్థిక పురోగతిని, విప్లవాత్మక సంస్కరణలను, పెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతిని వివరించారు. భారత్ - కెనడా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసేలా విద్యాసంస్థలు, పరిశ్రమలు, విధాన నిర్ణేతల మధ్య బలమైన సమన్వయానికి విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన వివరించారు.
అనంతరం శ్రీ పియూష్ గోయల్ ఆంటారియో ఆవిష్కరణల కేంద్రాన్ని (ఆంటారియో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ - ఓసీఐ) సందర్శించారు. అక్కడ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, అంకుర సంస్థలకు దన్నుగా నిలిచేందుకు, పరిశ్రమలు - విద్యాసంస్థలు - ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి చేపడుతున్న విస్తృతమైన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సరికొత్త సాంకేతిక రంగాలపై కెనడా-ఇండియా టెక్ కనెక్ట్ ప్రతినిధులతో ఫలప్రదంగా చర్చించారు. ఈ సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంకుర సంస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలను వివరించడంతోపాటు, వృద్ధికి అపార అవకాశాలున్న ఈ రంగాల్లో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని కెనడా ఏ విధంగా ఏర్పరచుకోవచ్చో శ్రీ గోయల్ వివరించారు. ఇరు దేశాలకు పరస్పర పూరక నైపుణ్యాలున్న ఏఐ, క్లీన్టెక్, అగ్రీటెక్, డీప్ టెక్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత భారత్ - కెనడా కారిడార్‌లో పనిచేస్తున్న ప్రాంతీయ మండళ్ల ప్రతినిధులతో శ్రీ పియూష్ గోయల్ విస్తృతంగా చర్చించారు. వ్యాపారపరంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచే మార్గాలపై ఈ సందర్భంగా వారి నుంచి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలను స్వీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో ఈ మండళ్ల పాత్రను ఆయన అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన నవోత్తేజం, ప్రస్తుత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద చర్చల ద్వారా లభించే విస్తృతమైన అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
కీలక ఉన్నత స్థాయి సమావేశంలో భాగంగా గౌరవ ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్‌ను.. శ్రీ పియూష్ గోయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్ - ఆంటారియో మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి భాగస్వామ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలూ.. ఇరుపక్షాలకు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ఉత్పాదక రంగం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, శుద్ధ ఇంధనం, ఆహార శుద్ధి, కీలక ఖనిజాల రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న వివిధ మార్గాలపై చర్చించారు.
కెనడా వాణిజ్య మండలి అధ్యక్షుడు, సీఈవో శ్రీ గోల్డీ హైదర్‌తో శ్రీ పియూష్ గోయల్ అత్యంత ఫలప్రదమైన సమావేశాన్ని నిర్వహించారు. భారత్ - కెనడా మధ్య వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు.. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, శుద్ధ ఇంధనం, కీలక ఖనిజాలు, అధునాతన ఉత్పాదక రంగాల్లో పారిశ్రామిక నేతృత్వంలో భాగస్వామ్యాలను పెంపొందించడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో ఇండియా - కెనడా సీఈఓ ఫోరమ్ కీలక పాత్ర పోషిస్తోందని ఇరుపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ అధ్యక్షులు, సీఈవో జో టేలర్‌తో శ్రీ పియూష్ గోయల్ భేటీ అయ్యారు. భారత్‌లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, సాంకేతికత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఈ సందర్భంగా వారు విస్తృతంగా చర్చించారు. సుస్థిర, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతూనే.. భారత్‌లో ఉన్న బలమైన అభివృద్ధి అవకాశాలనూ, ఉత్పాదక రంగంతోపాటు దేశీయ పరిశ్రమలతో భాగస్వామ్యానికి గల విస్తృత అవకాశాలనూ మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు.
సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్షుడు, సీఈవో జాన్ గ్రాహంతో కూడా శ్రీ పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా, పునరుత్పాదక ఇంధనం, రవాణా, ఆర్థిక సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో భారత్‌లో దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడులను విస్తరించడంపై వారు చర్చించారు. భారత్ వృద్ధిపై సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పటినుంచో కనబరుస్తున్న నమ్మకాన్ని శ్రీ పీయూష్ గోయల్ స్వాగతించారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవల రంగాల్లో ఆ సంస్థ భారీగా చేసిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. భారత ఆర్థిక పునాదులు, భవిష్యత్ పురోగతిపై అంతర్జాతీయంగా ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇది చాటుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా భారత్ మరింత బలంగా తన ముద్రను వేయడం కోసం.. భారతీయ వ్యాపార ప్రతినిధి బృందంతో శ్రీ పియూష్ గోయల్ ఫలప్రదంగా చర్చించారు. సుస్థిర వృద్ధికి, ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలున్న శుద్ధ ఇంధనం, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, కీలక ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాల్లో భాగస్వామ్యాలను, పెట్టుబడి అవకాశాలపై క్రియాశీలకంగా చర్చించాలని వ్యాపార వర్గాలను ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న భారత ఆర్థిక పరపతితో దేశ పరిశ్రమలకు సరికొత్త మార్గాలు తెరచుకుంటున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ దేశాలకు చాటడంలో పరిశ్రమలకు పూర్తి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు.
కెనడా - ఇండియా ఫౌండేషన్ సభ్యులతో ప్రత్యేకమైన సమావేశంతో శ్రీ పియూష్ గోయల్ తన మూడు రోజుల కెనడా పర్యటనను ముగించారు. బలమైన వ్యాపార సంబంధాలు, ప్రజా సంబంధాల ద్వారా రెండు దేశాలను మరింత దగ్గర చేయడంలో ఇండో-కెనడా సమాజం అమూల్యమైన సహకారాన్ని అందించిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా వందకు పైగా భారతీయ పరిశ్రమల అధినేతలతో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శ్రీ పియూష్ గోయల్ కెనడాలో పర్యటించారు. భారత్-కెనడా ఆర్థిక సంబంధాల సమగ్ర పునరుద్ధరణ దిశగా ఇదొక చరిత్రాత్మక ముందడుగు. మే 25న ఒట్టావా, మే 26 నుంచి 28 వరకు టొరంటో నగరాల్లో సాగిన ఈ మూడు రోజుల పర్యటన సాగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక బంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే దీని లక్ష్యం. ముఖ్యంగా, ప్రస్తుతం కొనసాగుతున్న భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చర్చలను వేగవంతం చేయడంపై ఈ పర్యటనలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 8.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి దానిని 50 బిలియన్ డాలర్లకు విస్తరించాలన్న ఉమ్మడి, ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఇరుదేశాల ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2266425)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10