వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడం... భారత్-కెనడా సీఈపీఏ చర్చలను త్వరగా ముగించడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కెనడా వాణిజ్య మంత్రి శ్రీ మణిందర్ సిధూ


పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, భారత్-కెనడా సీఈపీఏ చర్చలను ప్రోత్సహించడం లక్ష్యంగా టొరంటోలో కెనడియన్ వ్యాపార ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించిన శ్రీ పీయూష్ గోయల్

టొరంటోలో జరిగిన కెనడా-ఇండియా బిల్డింగ్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో శ్రీ పీయూష్ గోయల్ కీలకోపన్యాసం

వ్యూహాత్మక రంగాల్లో గల అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి

కెనడా-భారత్ పెట్టుబడుల రౌండ్‌టేబుల్‌కు సహ-అధ్యక్షత వహిస్తూ... వ్యూహాత్మక రంగాల్లో భారత వృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని కెనడియన్ పెట్టుబడిదారులకు ఆహ్వానం

భారత పెట్టుబడి, వృద్ధి అవకాశాలను వివరిస్తూ ప్రముఖ కెనడియన్ కంపెనీలు, పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశాలు

బ్రాంప్టన్‌లో ప్రవాస భారతీయులతో సమావేశంలో భారత్-కెనడా వ్యాపార, సాంస్కృతిక సంబంధాల బలోపేతంలో వారి పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ పీయూష్ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 10:42AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తన కెనడా పర్యటన రెండో రోజున టొరంటోలో ఆ దేశ వ్యాపార రంగ ప్రముఖులు, సంస్థాగత పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సమావేశాలు సాగాయి. 

టొరంటోలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో గ్లోబల్ అఫైర్స్ కెనడా, సీఐఐ, అసోచామ్ సంయుక్తంగా నిర్వహించిన కెనడా-ఇండియా బిల్డింగ్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో శ్రీ పీయూష్ గోయల్ కీలకోపన్యాసంతో ఆ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అధునాతన తయారీ, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, ఇంధనం, ఆయిల్-గ్యాస్ వంటి రంగాలకు చెందిన వ్యాపారులు, పెట్టుబడిదారుల బృందాలు, పారిశ్రామిక సంఘాల నుంచి 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ మణిందర్ సిధూతో శ్రీ పీయూష్ గోయల్ ఒక అనధికారిక సంభాషణలో పాల్గొన్నారు. భారత్-కెనడా మధ్య పెరుగుతున్న పరస్పర అనుకూలతలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... బలమైన ప్రభుత్వ-పరిశ్రమల సహకారంతో నడిచే మరింత పటిష్ఠమైన, విశ్వసనీయ ఫలితాలను అందించగల వ్యాపార వ్యవస్థ ఆవశ్యకతను ఈ సందర్భంగా శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాల పట్ల కెనడా మంత్రి సిధూ తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. కెనడా పర్యటనకు వచ్చిన అతిపెద్ద భారతీయ వ్యాపార ప్రతినిధి బృందాన్ని ఆయన అభినందించారు. ఈ ఏడాది నవంబరు నెలలో భారత్‌లో పర్యటించే 'టీమ్ కెనడా ట్రేడ్ మిషన్'ను ప్రకటించారు. కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు, అణు ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు, క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అధునాతన తయారీ వంటి రంగాల్లో సహకారానికి గల అవకాశాలను అన్వేషించడానికి కెనడియన్ కంపెనీలను భారత్‌కు తీసుకురావడమే ఈ ప్రతిపాదిత మిషన్ లక్ష్యం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు విస్తరించడం సహా, ఈ ఏడాది చివరి నాటికి సీఈపీఏ చర్చలను ముగించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.

అనంతరం ఇరువురు మంత్రులు సహ-అధ్యక్షత వహించిన కెనడా-భారత్ పెట్టుబడుల రౌండ్‌టేబుల్ జరిగింది. ఈ రౌండ్‌టేబుల్‌కు పెన్షన్ ఫండ్‌లు, బ్యాంకులు సహా కెనడాకు చెందిన ప్రముఖ ఆర్థిక పెట్టుబడిదారులతో పాటు భారత్, కెనడా దేశాల ప్రభుత్వాల సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సౌలభ్యంపై భారత ప్రభుత్వం నిరంతరం ఇస్తున్న ప్రాధాన్యతపై చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇవి ప్రపంచ పెట్టుబడిదారులకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. పరిశుద్ధ ఇంధనం, సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, సరుకు రవాణా వ్యవస్థ విస్తరణ వంటి రంగాల్లో భారత్‌తో భాగస్వాములు కావాలని శ్రీ గోయల్ ఆహ్వానించారు. ఇరు దేశాల సుస్థిర వృద్ధికి, ఉమ్మడి శ్రేయస్సుకు మద్దతుగా ఆర్థిక మార్కెట్లలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలను అన్వేషించాలనీ ఆయన కోరారు.

బీమా, ఆహార శుద్ధి, బ్యాంకింగ్, కీలక ఖనిజాల శుద్ధి వంటి రంగాలతో పాటు... కెనడాకు చెందిన ప్రముఖ కంపెనీలు, ప్రముఖ ఆర్థిక రంగ పెట్టుబడిదారులతోనూ శ్రీ గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరిస్తున్న ప్రయోజనాలపై చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. భారత స్థూల ఆర్థిక దృక్పథం, గత ఒకటిన్నర సంవత్సరాలుగా వాణిజ్య ఒప్పందాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించడం, అధిక వృద్ధి రంగాల్లో అవకాశాలు, ఎస్‌టీఈఎమ్ ప్రతిభ లభ్యత, తత్ఫలితంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీల) పెరుగుదల, వ్యూహాత్మక పెట్టుబడులను ప్రోత్సహించే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలు, దేశంలో నిరంతరం మెరుగవుతున్న నియంత్రణ వాతావరణం వంటి అంశాలను ఈ చర్చల్లో ప్రస్తావించారు.

హంబర్ బే పార్క్‌లోని కనిష్క స్మారక చిహ్నాన్ని సందర్శించిన శ్రీ పీయూష్ గోయల్... బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. ఎయిర్ ఇండియా ఏఐ 182 ఉగ్రదాడి మృతులకు ఘన నివాళులర్పించారు.

బ్రాంప్టన్‌లోని పియర్సన్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన విందుతో ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్... కెనడాలోని భారతీయ సమాజం బలాన్నీ, భారత్-కెనడా వ్యాపార కారిడార్‌ను మరింత బలోపేతం చేయడంలో వారి కీలక పాత్రనూ ప్రధానంగా ప్రస్తావించారు. భారత్‌తో వ్యాపార, పెట్టుబడి సంబంధాలను విస్తరించడంలోనే కాకుండా... బలమైన సాంస్కృతిక, సామాజిక భాగస్వామ్యాన్నీ, కెనడా వ్యాప్తంగా భారతీయ వ్యాపారాల వృద్ధినీ ప్రోత్సహించడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఆయన ఉద్ఘాటించారు.

భారత్-కెనడా ఆర్థిక సంబంధాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే దిశగా చరిత్రాత్మక అడుగుగా... 100కు పైగా భారతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో కూడిన అతిపెద్ద భారతీయ వ్యాపార ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ శ్రీ గోయల్ కెనడా పర్యటనకు వచ్చారు. మే 25న ఒట్టావాలో కీలక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూడు రోజుల పర్యటన... భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కోసం కొనసాగుతున్న చర్చలను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. భారత్-కెనడా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

***


(రిలీజ్ ఐడి: 2265800) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil