సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కేవీఐసీ
వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని అందించడంలో ప్రధానమంత్రి చూపిన మార్గదర్శకత్వాన్ని ప్రస్తావించిన చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్
రూ. 1.87 లక్షల కోట్లు దాటిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు... కళాకారుల వేతనాల్లో 275 శాతం వరకు పెరుగుదల నమోదు
గత 12 ఏళ్లలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగంలో 56 శాతం పెరిగిన ఉపాధి కల్పన... 2.04 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 3:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో గత 12 ఏళ్లలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగం అద్భుతమైన వృద్ధినీ, ఊహించని విజయాలను నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా రూ. 1,87,105 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నమోదైన అమ్మకాల్లో ఇదే అత్యధికం. గ్రామీణ భారత్లో పెరుగుతున్న పారిశ్రామిక స్పూర్తికి, స్వయం సమృద్ధికి, ఆర్థిక సాధికారతకు ఈ విజయం బలమైన నిదర్శనంగా నిలుస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘లోకల్ టు గ్లోబల్’ వంటి జాతీయ ఉద్యమాల స్ఫూర్తితో ఖాదీ నేడు కేవలం సంప్రదాయ ఉత్పత్తిగా మాత్రమే మిగిలిపోలేదు. ఇది ‘నవ భారతం’ స్వావలంబనకు, స్వదేశీ ఆత్మగౌరవానికి, గ్రామీణ శ్రేయస్సుకు ప్రతీకగా మారింది. వస్తువుల ఉత్పత్తి, మార్కెటింగ్, ఉపాధి కల్పనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగం దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్తేజాన్ని, దిశానిర్దేశాన్ని అందించింది.
న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్, గాంధీ దర్శన్లో ఉన్న కేవీఐసీ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను వీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు, ఉపాధి కల్పన రంగాల్లో కేవీఐసీ కమిషన్ సరికొత్త రికార్డులను సృష్టించిందని తెలిపారు. 2013-14 సంవత్సరంతో పోలిస్తే గత 12 ఏళ్ల కాలంలో అమ్మకాల్లో 501 శాతం, ఉత్పత్తిలో 380 శాతం, ఉపాధి కల్పనలో 56 శాతం గొప్ప వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. గత సంవత్సరాల వృద్ధి వివరాలను కూడా ఆయన వివరించారు. 2013-14 సంవత్సరంతో పోల్చి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 447 శాతం, ఉత్పత్తి 347 శాతం పెరిగాయని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 400 శాతం, ఉత్పత్తిలో 315 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.
రూ.1.87 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలు
కేవీఐసీ సాధించిన ఈ అద్భుతమైన ప్రదర్శన ‘వికసిత్ భారత్ @2047’ సంకల్పాన్ని వేగవంతం చేయడమే కాకుండా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోందని చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ ఘనత సాధించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, మహాత్మా గాంధీ నుంచి పొందిన స్ఫూర్తి, దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కళాకారుల కష్టమే కారణమని కొనియాడారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విలువ రూ. 26,109 కోట్లు ఉండగా.. అది 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాదాపు అయిదు రెట్లు (380 శాతం) పెరిగి రూ. 1,25,296 కోట్లకు చేరుకుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 31,154 కోట్లుగా ఉన్న అమ్మకాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాదాపు ఆరు రెట్ల (501 శాతం) వృద్ధిని నమోదు చేస్తూ రూ. 1,87,105 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు నమోదైన అమ్మకాల్లో ఇదే అత్యధికం..
ఖాదీ వస్త్రాల ఉత్పత్తి, విక్రయాల్లో గణనీయమైన వృద్ధి
ఖాదీ వస్త్ర రంగంలో కూడా అద్భుతమైన పురోగతి నమోదైంది. 2013-14లో రూ. 811 కోట్లుగా ఉన్న ఖాదీ వస్త్రాల ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 390 శాతం పెరిగి రూ. 3,974 కోట్లకు చేరుకుంది. అమ్మకాలు సైతం రూ. 1,081 కోట్ల నుంచి సుమారు 628 శాతం వృద్ధితో రూ. 7,869 కోట్లకు పెరిగాయి. ఖాదీని ప్రోత్సహించడంలోనూ, ప్రచారం చేయడంలోనూ ప్రధానమంత్రి శ్రీ మోదీ చేసిన కృషి... ఈ రంగంపై పెరుగుతున్న ఆదరణలో, మార్కెట్ విస్తరణలో స్పష్టంగా కనిస్తోంది.
గ్రామీణ పరిశ్రమల రంగంలో ఉత్పత్తి, అమ్మకాల్లో కొత్త రికార్డులు
గ్రామీణ పరిశ్రమల రంగంలో గణనీయమైన పురోగతి కనిపించింది. 2013-14లో ఈ ఉత్పత్తుల తయారీ రూ. 25,298 కోట్లుగా ఉండగా అది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 380 శాతం పెరిగి రూ. 1,21,322 కోట్లకు చేరుకుంది. అమ్మకాలు కూడా రూ. 30,073 కోట్ల నుంచి దాదాపు 496 శాతం వృద్ధితో రూ. 1,79,236 కోట్లకు పెరిగాయి. ఉపాధి కల్పనలో కూడా గ్రామీణ పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించింది. 2013-14లో ఈ రంగంలో 1.19 కోట్ల మంది ఉపాధి పొందగా... 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య దాదాపు 1.99 కోట్లకు పెరిగింది. గ్రామాల్లో జీవనోపాధి కల్పించడంలో ఈ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘ఘర్-ఘర్ స్వదేశీ’ వంటి ఉద్యమాల ప్రభావంతో గ్రామ పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండు నిరంతరం పెరుగుతూ వస్తోంది. దీనిద్వారా గ్రామీణ పరిశ్రమల విస్తరణకు, మార్కెట్ బలోపేతానికి, ఉపాధి కల్పనకు ఈ రంగం కీలకంగా నిలుస్తోంది.
ఉపాధి కల్పనలో కేవీఐసీ చారిత్రక విజయం
ఉపాధి కల్పన రంగంలో కేవీఐసీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. 2013-14 సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన పనుల్లో మొత్తం ఉపాధి 1.30 కోట్లుగా ఉండగా.. అది 2025-26 ఆర్థిక సంవత్సరానికి 56 శాతం వృద్ధితో 2.04 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో కేవీఐసీ పోషిస్తున్న కీలక పాత్రను ఇది ప్రతిబింబిస్తోంది
పీఎంఈజీపీ ద్వారా స్వయం ఉపాధి, వ్యాపార రంగానికి సరికొత్త ఉత్తేజం
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 66,494 వ్యాపార, పరిశ్రమల యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి కోసం రూ. 7,375 కోట్ల రుణాలకు గానూ రూ. 2,457 కోట్ల మార్జిన్ మనీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త యూనిట్ల ద్వారా 7,31,434 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 10,84,679 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి కోసం మొత్తం రూ. 80,705 కోట్ల రుణాలకు గానూ రూ. 29,623 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దాదాపు 97.95 లక్షల మందికి ఉపాధి లభించింది.
గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద పనిముట్ల పంపిణీ.. చేతివృత్తుల వారికి సాధికారత కల్పన
గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 51,230 ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలు, 2,46,099 తేనె టీగల పెట్టెలు, తేనె టీగలు, 2,674 ఆటోమేటిక్, పెడల్ ద్వారా నడిచే అగరబత్తీ తయారీ యంత్రాలు, 7,669 చెప్పుల తయారీ, మరమ్మత్తు పనిముట్ల కిట్లు, 836 పేపర్ ప్లేట్లు, దొన్నెల తయారీ యంత్రాలు, 7,571 ఏసీ, మొబైల్ మరమత్తు, టైలరింగ్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల కోసం పరికరాలు, 5,138 కర్రను మలిచే, వ్యర్థ కలపతో కళాకృతులు, చెక్క బొమ్మలు తయారు చేసే యంత్రాలు, 1,789 తాటి బెల్లం తయారీ, గానుగ నూనె, చింతపండు శుద్ది యంత్రాలను పంపిణీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కింద 37,769 యంత్రాలు, పనిముట్ల కిట్లను పంపిణీ చేశారు. గత నాలుగు సంవత్సరాల రికార్డులను పరిశీలించగా.. 2022-23లో 21,874 యూనిట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,540 యూనిట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 38,904 యూనిట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 37,769 యంత్రాలు, పరికరాలను పంపిణీ చేసినట్లు వెల్లడైంది. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద కేవీఐసీ ఇప్పటివరకు మొత్తం 3,23,006 యంత్రాలు, పనిముట్ల కిట్లను పంపిణీ చేసింది. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేసే దిశగా ఈ పథకం గొప్ప సహకారాన్ని అందించింది.
కేవీఐసీ కృషి ద్వారా పెరిగిన మహిళా సాధికారత
మహిళా సాధికారత రంగంలో కూడా కేవీఐసీ కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేవీఐసీ శిక్షణ కార్యక్రమాల ద్వారా మొత్తం 79,682 మంది శిక్షణ పొందారు. వీరిలో 47,382 మంది మహిళలు ఉండటం విశేషం. ఇది మొత్తం శిక్షణార్థుల్లో సుమారు 59 శాతానికి సమానం. పీఎమ్ఈజీపీ పథకం కింద 2025-26లో 28,180 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార సంస్థలను స్థాపించారు. ఈ సంస్థల ద్వారా వారు మరో 3,09,980 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఈ పథకం పోషిస్తున్న గణనీయమైన పాత్రను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఖాదీ రంగంలోని సుమారు 5,00,000 మంది కళాకారుల్లో 80 శాతానికి పైగా మహిళలే ఉండటంతో ఈ రంగం మహిళల నేతృత్వంలోని ఆర్థిక సాధికారతకు ఒక సమర్థవంతమైన మాధ్యమంగా నిలుస్తోంది.
కళాకారుల పారితోషికంలో 275 శాతం వరకు పెరుగుదల
కళాకారులకు చెల్లించే పారితోషికంలో కూడా అద్భుతమైన పెరుగుదల నమోదైంది. 2013-14 సంవత్సరంలో ఒక్కో నూలు కండెకుకు రూ. 4 ఉన్న పారితోషికం.. ప్రస్తుతం రూ. 15 చేరింది. ఇది సుమారు 275 శాతం భారీ పెరుగుదలను సూచిస్తుంది.
ప్రభుత్వ కొనుగోళ్లు, ప్రదర్శనల విక్రయాలు, జాతీయ జెండాల డిమాండులో వృద్ధి
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం రూ. 92.08 కోట్లకు పెరిగింది. ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణను డిమాండును ఇది ప్రతిబింబిస్తోంది. ఖాదీ ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ, వినియోగదారులను ఆకట్టుకునేలా చేపట్టిన వివిధ ప్రదర్శనలు, మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా రూ. 30.83 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దేశంలో జాతీయ జెండాల అమ్మకాల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జెండాల అమ్మకాలు రూ. 0.87 కోట్లు ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2.35 కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ త్రివర్ణ పతాకం) వంటి ప్రజా ఉద్యమాల ప్రభావాన్నీ, ఖాదీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరుగుతున్న మక్కువను ఈ అద్భుతమైన వృద్ధి స్పష్టం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2265625)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17