హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎఫ్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి, రుస్తమ్ జీ స్మారక ఉపన్యాసానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ అమిత్ షా


బీఎస్ఎఫ్ సిబ్బందికిచ్చే పురస్కారం దేశం పట్ల అంచంచలమైన విధేయతకు, విధుల పట్ల అంకితభావానికి, పూర్తి నిబద్దతకు ప్రతీక

దుర్భేద్యమైన సరిహద్దు భద్రతా వ్యవ్థను ఏర్పాటు చేసేందుకు డ్రోన్లు, రాడార్లు, అత్యాధునిక కెమెరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ‘స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు’ను వచ్చే ఏడాదిలోగా మోదీ ప్రభుత్వం ప్రారంభిస్తుంది

అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు కట్టుబడి ఉన్న త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ బీఎస్ఎఫ్ పని చేయాలి

అక్రమ చొరబాట్లను అడ్డుకొనేందుకు త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జిల్లా పరిపాలనా వ్యవస్థలు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, పట్వారీలతో కలసి పనిచేయాలని బీఎస్ఎఫ్‌కు హోం మంత్రి ఆదేశం

సరిహద్దు భద్రత ఏ ఒక్కరికో పరిమితమైనది కాదు.. అది ప్రాదేశిక బాధ్యత

సమస్యను మూలాల నుంచి తొలగించడమే అంతర్గత భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం: నక్సలిజం తర్వాత అక్రమ చొరబాట్లను నిర్మూలించడంపై సారించిన దృష్టి

సైబర్ ముప్పులు, హైబ్రిడ్ యుద్ధాలు, డ్రోన్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు నూతన సరిహద్దు భద్రతా వ్యూహం అవసరాన్ని స్పష్టం చేసిన అమిత్ షా

సరిహద్దుల వెంబడి సాంకేతిక ఆధారిత స్మార్ట్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న మోదీ ప్రభుత్వం

నిర్భయంగా ఉగ్రవాదులు దాడులు, నక్సలైట్లు హత్యాకాండలు సాగిస్తే ప్రభుత్వాలు చర్చలకు పరిమితమయ్యే కాలం ముగిసింది, ఇదే సరికొత్త రక్షణ సిద్ధాంతం – మోదీ సిద్ధాంతం

అత్యున్నత స్థాయి జనాభా మిషన్ ఏర్పాటును ప్రకటించిన మోదీ, కమిటీ ఏర్పాటైన అనంతరం దానికి సంబంధించిన పని ప్రారంభమవుతుంది

భారత జనాభాలో కృత్రిమ మార్పులను మేం అనుమతించబోం, ప్రతి చొరబాటుదారుడునీ గుర్తించి ఏరివేస్తాం

సీఏపీఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం కోసం మరో రెండు నెలల్లో బృహత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్న మోదీ ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 5:26PM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లో జరిగిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పురస్కార ప్రదాన కార్యక్రమం, రుస్తంజీ స్మారక ఉపన్యాసానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిఘా విభాగం డైరెక్టర్, కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ), బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. బీఎస్ఎఫ్‌కున్న అంచంచలమైన అంకితభావానికి, విధుల పట్ల నిబద్ధతకు, దేశభక్తికి ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం ప్రతీక అన్నారు. 1965 యుద్ధం తర్వాత సరిహద్దు భద్రతలో ఉన్న లోపాలను అంచనా వేసి.. సాధారణ సమయాల్లో సైతం భారత దేశ సరిహద్దులను పరిరక్షించేందుకు ప్రత్యేక దళం అవసరాన్ని గుర్తించారని తెలిపారు. ఆ సమయంలో పద్మవిభూషణ్ కేఎఫ్ రుస్తంజీ నాయకత్వంలో బీఎస్ఎఫ్ ఏర్పాయిందని, అప్పటి నుంచీ దేశ సరిహద్దుల వద్ద భద్రతను ఈ దళం నిర్వహిస్తోందని అన్నారు. శ్రీ రుస్తంజీ వేసిన బలమైన పునాది ఆధారంగా జాతీయ భద్రతా రంగంలో ఓ సంస్థను నెలకొల్పి బీఎస్ఎఫ్ దేశానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.

సరిహద్దు భద్రతా దళంలో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, పశువుల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, వ్యవస్థీకృత నేరాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లాంటి అనేక సవాళ్లను బీఎస్ఎఫ్ ఎదుర్కొంటోదన్నారు. అయితే, ఈ సవాళ్లను పక్కా ప్రణాళికలతో బీఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు నిలువరిస్తోందన్నారు. బీఎస్ఎఫ్ తన వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ సవాళ్లు ఎదుర్కొని దేశాన్ని సురక్షితంగా ఉంచుతోందని శ్రీ షా తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ భద్రతా దళం మరింత సమన్వయమైన, సమగ్రమైన పాత్ర పోషించాలని సూచించారు.

 

ఇకపై సాంప్రదాయ పద్ధతులపై మాత్రమే సరిహద్దు భద్రత ఆధారపడి ఉండబోదని శ్రీ అమిత్ షా అన్నారు. భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఇతర సాయుధ బలగాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), నిఘా సంస్థలు, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమన్నారు. సరిహద్దు భద్రతను ఇకపై ఏ ఒక్కరికో పరిమితమైన బాధ్యతగా కాకుండా విస్తృతమైన ప్రాదేశిక బాధ్యతగా చూడాలన్నారు. సరిహద్దు చొరబాట్ల వల్ల ఎదురయ్యే జనాభాపరమైన మార్పుల పట్ల, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలహీన పరిచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీ షా స్పష్టం చేశారు. సైబర్ ముప్పులు, హైబ్రిడ్ యుద్ధం, డ్రోన్ ఆధారిత సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలను అవలంబించాలని ఆయన చెప్పారు.

సియాచిన్‌లోని మంచు పర్వతాలు, కశ్మీర్, కుప్వారా, కేరన్, ఉరి లాంటి కఠిన పరిస్థితులున్న ప్రాంతాలు, రాజస్థాన్ ఎడారులు, రాన్ ఆఫ్ కచ్, సర్ క్రీక్‌లోని చిత్తడి కాలువలు, దట్టమైన సుందర్‌బన్ అడవులు, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల తూర్పు సరిహద్దులు, సున్నితమైన బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతాలతో సహా సవాళ్లతో నిండి ఉన్న ప్రాంతాల్లో సరిహద్దు భద్రతా దళం దృఢంగా నిలబడుతోందని కేంద్ర హోం మంత్రి అన్నారు. 1965లో కేవలం 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో బీఎస్ఎఫ్ ప్రారంభమైందనీ, ఇప్పుడు 2.70 లక్షల సిబ్బందితో ప్రపంచంలోనే అతి పెద్ద సరిహద్దు భద్రతా దళంగా ఎదిగిందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి భారత దేశ రక్షణ, సరిహద్దు భద్రతా విధానాల్లో సమూల మార్పులు వచ్చాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఉరి, పుల్వామా, పహల్గాం లాంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ నిర్ణయాత్మకంగా స్పందించిందని ఆయన వివరించారు. ఉగ్రవాద దాడులకు చర్చలతో స్పందించే యుగం ముగిసిందని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తన భద్రతా విధానాన్ని భారత్ బలోపేతం చేరుకుందని వెల్లడించారు. దీనిని నూతన రక్షణ సిద్ధాంతంగా వర్ణిస్తూ.. దీనిలో బీఎస్ఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.

దేశ సరిహద్దును ‘స్మార్ట్ బోర్డర్’గా మార్చేందుకు భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంకేతిక సహకారాన్ని అందిస్తాయని శ్రీ అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బోర్డర్ భావన పరిధిలో వచ్చే ఏడాదిలోగా అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానించి దుర్భేద్యమైన సరిహద్దు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా కృషి జరుగుతోందన్నారు. డ్రోన్లు, రాడార్లు, అత్యాధునిక కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును త్వరలోనే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైతే సరిహద్దు భద్రతా దళం పని మరింత సులభతరంగా, పటిష్టంగా మారుతుందని హోం మంత్రి అన్నారు. 

సరిహద్దు భద్రతా దళం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించి బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో ఉన్న మొత్తం సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మారుస్తామని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బీఎస్ఎఫ్‌కు గణనీయమైన రీతిలో సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. ధైర్యం, పరాక్రమం, అంకితభావం, దేశభక్తితో పాటు బలమైన సాంకేతిక సహకారంతో కూడిన ఈ దళం రెండు సరిహద్దుల వద్ద భద్రతను మరింత పెంపొందిస్తుందని అన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వద్ద చొరబాట్లను నిలువరించడం మాత్రమే కాకుండా.. ప్రతి చొరబాటుదారుడునీ గుర్తించి దేశం నుంచి పంపించేయాలని సంకల్పించుకుందని, జనాభాలో అసహజ మార్పులను అనుమతించబోమని శ్రీ అమిత్ షా తెలిపారు. అక్రమ చొరబాట్ల ద్వారా జనాభాను మార్చే కుట్రలను బీఎస్ఎఫ్ అడ్డుకోవాలని చెప్పారు. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు అక్రమ చొరబాట్లను వ్యతిరేకించే స్పష్టమైన విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాకుండా గ్రామ స్థాయి అధికారులు, పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టర్లు, డీడీవోలు, పోలీసు సూపరింటెండెంట్లతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించే బాధ్యత కూడా బీఎస్ఎఫ్‌కు ఉందన్నారు. కొత్త చొరబాటుదారులు, దేశంలోకి వారు ప్రవేశిస్తున్న మార్గాలు, పశువుల అక్రమ రవాణాతో సహా ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న నెట్‌వర్కుల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. అలాంటి మార్గాలన్నింటినీ నిర్దేశిత విధానంలో గుర్తించి మూసివేయాలన్నారు. చొరబాటుదారులను నిలువరించడం, ఏరివేయడం కోసం ఒక వ్యవస్థీకృత విధానాన్ని రూపొందించడానికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అనేక సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగుతున్న చొరబాట్లను అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హోం మంత్రి అన్నారు.

ప్రభుత్వం దృఢసంకల్పంతో చేసిన ప్రయత్నాల వల్ల అయిదు దశాబ్దాలు కొనసాగిన నక్సలిజం సమస్య భారత్‌లో తొలగిపోయిందని అమిత్ షా అన్నారు. సమస్యలను అదుపులో ఉంచడానికి మాత్రమే కాకుండా దానిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా విధానం ఉండాలని ఆయన చెప్పారు. చొరబాట్లను ఎదుర్కోవడంలో కూడా ఇదే తరహా దృఢ సంకల్పాన్ని బీఎస్ఎఫ్‌ను అవలంబించాలని కోరారు.

వైబ్రంట్ విలేజెస్-1, వైబ్రంట్ విలేజెస్-2 అనేవి సరిహద్దు భద్రతా దళం సహకారంతో ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని శ్రీ అమిత్ షా తెలిపారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కి.మీ.ల నుంచి 50 కి.మీలకు విస్తరించినట్లు, పశ్చిమ బెంగాల్లో భూకేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలను సైతం ఖరారు చేసినట్లు తెలిపారు.

ఉన్నత స్థాయి జనాభా మిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారని, కమిటీ ఏర్పాటైన అనంతరం పని ప్రారంభమవుతుందని శ్రీ అమిత్ షా చెప్పారు. భవిష్యత్తులో రెండు దేశాల సరిహద్దుల వెంబడి పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం విస్తృత స్థాయిలో ప్రచారాన్ని కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఎస్ఎఫ్ 60వ వార్సికోత్సవాన్ని స్మార్ట్ బోర్డర్ నిర్మాణానికి, బీఎస్ఎఫ్ సిబ్బంది సంక్షేమానికి అంకితం చేశామని శ్రీ అమిత్ షా చెప్పారు. రాబోయే రెండు నెలల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది, సీఏపీఎఫ్ జవాన్లందరి సంక్షేమం కోసం ఓ బృహత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని శ్రీ షా తెలిపారు.

మాదకద్రవ్యాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ఓ బృహత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోందని కేంద్ర హోం మంత్రి వెల్లడించారు. దీనిలో సరిహద్దు భద్రతా దళం కీలకమైన పాత్రను పోషిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో సరిహద్దుకు ఇరువైపులా నిఘా సమాచారాన్ని సేకరించడంలో భద్రతా దళం కనబరుస్తున్న అప్రమత్తతను ఆయన ప్రశంసించారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో సరిహద్దు భద్రతలో అనేక మార్పులు వస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, అలాగే బాధ్యతలకు కూడా పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ను చొరబాటురహితంగా మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని, స్థానిక సమాజాలతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకోవాలని బీఎస్ఎఫ్ సిబ్బందిని  హోం మంత్రి కోరారు.


(రిలీజ్ ఐడి: 2264480) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada