పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని సాసన్‌గిర్‌లో ‘సింహ’జాతుల స్పాట్‌లైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పర్యావరణ మంత్రి... ఐబీసీఏ సదస్సు నేపథ్యంలో ముందస్తుగా నిర్వహణ
పర్యావరణ దృక్పథం ద్వారా ఆర్థిక పురోగతి, వన్యప్రాణి సంరక్షణ కలిసి సాగే తీరుకు ‘గిర్’ సజీవ ఉదాహరణ: గుజరాత్ ముఖ్యమంత్రి
సింహం భారత ప్రతిష్ఠకు, శౌర్యానికి, సహజ వారసత్వానికి ప్రతీక.. ప్రాజెక్ట్ లయన్‌తో గిర్ ప్రాంతంలో ఆసియా సింహాల దీర్ఘకాలిక సంరక్షణ మరింత బలోపేతం: శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 12:09PM by PIB Hyderabad
గుజరాత్‌లోని సాసన్ గిర్‌లో నిర్వహించిన ‘సింహ’ జాతుల స్పాట్‌లైట్ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు ప్రారంభించారు. అంతర్జాతీయ పెద్ద పులి జాతుల (బిగ్ క్యాట్స్) అలయన్స్/ ఐబీసీఏ సదస్సు – 2026 నేపథ్యంలో వరుసగా నిర్వహిస్తున్న ముందస్తు జీవజాతుల సదస్సుల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుజరాత్ అటవీ శాఖ మంత్రి శ్రీ అర్జున్ మోద్వాడియా, గుజరాత్ అటవీ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రవీణ్ మాలిలతోపాటు ఐబీసీఏ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ‘వసుధైవ కుటుంబకం’ భావనను తెరపైకి తెచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భావనే ‘పెద్ద పులి జాతుల (బిగ్ క్యాట్స్)’ సంరక్షణ దిశగా విశిష్ట కార్యక్రమంగా ఐబీసీఏ ఏర్పాటుకు దారితీసిందన్నారు. వాటి సంరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న స్పృహకు ఈ దృక్పథమే ప్రధాన కారణమని కొనియాడారు.
ఆసియా సింహాల సంరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ పటేల్ అన్నారు. సింహం ఈ ప్రాంత ప్రజల సంస్కృతిలో అంతర్భాగమని, గిర్ అడవుల్లో ఆసియా సింహాల సంఖ్య విశేషంగా పెరగడానికి ఇదెంతగానో దోహదపడిందని ఆయన వ్యాఖ్యానించారు. పర్యావరణ అనుకూల దృక్పథంతో ఆర్థిక వృద్ధిని, వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేయగల విధానానికి గిర్‌ను ఒక సజీవ ఉదాహరణగా పేర్కొన్నారు. ఆసియా సింహాల సహజ సిద్ధమైన విస్తరణ కోసం బార్దా వన్యప్రాణుల అభయారణ్యాన్ని నూతన ఆవాస ప్రాంతంగా అభివృద్ధి చేయడంతోపాటు.. వివిధ సంరక్షణ కార్యక్రమాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చర్యలను కూడా ఆయన వివరించారు.
సభనుద్దేశించి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. 2026 జూన్ 1-2 తేదీల్లో న్యూఢిల్లీలో మొదటి ఐబీసీఏ సదస్సు-2026ను భారత్ ఆతిథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అనంతరం జూన్ 1, 2 తేదీల్లో సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయని తెలిపారు. ‘పెద్ద పులి జాతులను (బిగ్ క్యాట్స్) కాపాడుకుందాం, మానవీయతను నిలుపుకొందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ సదస్సులో.. వివిధ దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, విధానకర్తలు, శాస్త్రవేత్తలు, సంరక్షక నిపుణులు, బహుపాక్షిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, భాగస్వామ్య సంస్థలతోపాటు ఆసియా, ఆఫ్రికా, అమెరికాల్లోని 95 దేశాలకు చెందిన దాదాపు 400 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వివరించారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్, ప్యూమా అన్న ఏడు ప్రధాన పెద్ద పులి జాతుల (బిగ్ క్యాట్) జాతుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి, అలాగే శాస్త్రీయ, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఐబీసీఏ ఒక అంతర్జాతీయ స్థాయి కూటమిగా సేవలందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సుసంపన్నమైన మన దేశ జీవవైవిధ్యానికి, ప్రకృతి పట్ల మనకున్న సున్నితత్వానికి, దాని సంరక్షణ పట్ల మన నిబద్ధతకు సాసన్ గిర్ ఒక సజీవ ప్రతీక అని మంత్రి అభివర్ణించారు. గిర్ సింహం గుజరాత్ అస్తిత్వం మాత్రమే కాదన్న ఆయన.. అది యావద్భారత దేశ ప్రతిష్ఠకు, శౌర్యానికి, సహజ వారసత్వానికి అది చిహ్నమని వ్యాఖ్యానించారు. దూరదృష్టితో కూడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఆసియా సింహాల గణన, జునాగఢ్‌లో జాతీయ వన్యప్రాణి చికిత్స కేంద్రం ఏర్పాటు, ఆసియా సింహాల సహజ విస్తరణ ప్రదేశంగా బార్దా జాతీయ వన్యప్రాణి అభయారణ్యాన్ని అభివృద్ధి చేయడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్న తీరును మంత్రి వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సింహ జాతుల సంరక్షణ స్థితిగతులను, వాటి సంరక్షణ కోసం భారత్ చేపట్టిన చర్యలను ఈ కార్యక్రమం చాటుతోందని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. విజయవంతమైన మన దేశ సింహాల సంరక్షణ నమూనాను ప్రపంచానికి చాటడం, సింహాలున్న వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ఆవాసాలపై ఒత్తిడి పెరగడం, వాతావరణ మార్పులు, మానవ - వన్యప్రాణి ఘర్షణల వంటి సవాళ్లపై చర్చించడం, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పెద్ద పులి జాతుల (బిగ్ క్యాట్స్) సింహం ఒకటని శ్రీ యాదవ్ అన్నారు. వేటాడే జంతువుల్లో సింహాలు అగ్రశ్రేణికి చెందినవని, ఇవి శాకాహార జంతువుల సంఖ్యను నియంత్రించడం ద్వారా పర్యావరణపరంగా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దానితోపాటు జీవవైవిధ్యం, జాతుల మధ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో ముందంజలో నిలుస్తాయన్నారు. ఆవాస ప్రాంతాలను కోల్పోవడం, క్షీణత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సింహాల జనాభా 30 శాతానికి పైగా తగ్గిపోయిందని, అయితే ఆసియా సింహం మాత్రం భారత్‌లోని గిర్ ప్రాంతంలో ఏకైక వన్యప్రాణిగా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు.
వన్యప్రాణి సంరక్షణలో భారత్ విజయాలను వివరిస్తూ.. గ్రేటర్ గిర్ ప్రాంతంలో సింహాల సంఖ్య 2025 నాటికి దాదాపు 891కి చేరుకున్నట్టు అంచనా వేశారని, 2020తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైందని శ్రీ యాదవ్ తెలిపారు. సమర్థమైన సంరక్షణ, నిర్వహణ చర్యల వల్ల గిర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సింహాల సమూహాలు స్థిరపడి, అవి విస్తరించాయని వివరించారు. ఆసియా సింహానికి సైట్స్‌లోని అనుబంధం-I, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం- 1972లోని మొదటి షెడ్యూలు ప్రకారం అత్యున్నత స్థాయి చట్టపరమైన రక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. 2020లో భారత ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ లయన్’ను ప్రారంభించిందన్నారు. ఆవాసాల పునరుద్ధరణ, జనాభా నిర్వహణ, పర్యావరణ రక్షణ ద్వారా.. ఆసియా సింహాల దీర్ఘకాలిక సంరక్షణ కోసం వివిధ ప్రాంతాలకు తగిన సమగ్ర విధానాన్ని ఈ ప్రాజెక్టు అనుసరిస్తోందని వివరించారు.
బిగ్ క్యాట్స్, వాటి ఆవాసాలకు బలమైన సామాజిక - పర్యావరణ భవితను అందించే దిశగా.. అంతర్జాతీయ సహకారాన్ని, ప్రజల్లో అవగాహనను, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని, అత్యుత్తమ విధానాల ఆచరణను ఐబీసీఏ సదస్సు – 2026 మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటూ శ్రీ యాదవ్ తన ప్రసంగాన్ని ముగించారు.
‘సింహాల సంరక్షణ బ్రోచర్’ను కూడా ఈ కార్యక్రమ సందర్భంగా ఆవిష్కరించారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, సభకు హాజరైన వీక్షకుల కోసం.. పెద్ద పులి జాతుల సంరక్షణ చర్యలపై వివరణాత్మక ప్రదర్శనలను నిర్వహించారు. అవగాహన చిత్రాలను కూడా ప్రదర్శించారు.
***
(రిలీజ్ ఐడి: 2261230)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10