యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భాగస్వామ్య కార్యక్రమాలను ప్రారంభించిన మై భారత్‌, భారత క్రీడా ప్రాధికార సంస్థ


కామన్వెల్త్ క్రీడల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా యువతకు ఆహ్వానం

యువతలో ప్రజా భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడమే లక్ష్యంగా మూడు ఉచిత కార్యక్రమాలు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 12:16PM by PIB Hyderabad

న్యూఢిల్లీ, మే 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న 2030 కామన్వెల్త్ క్రీడల సన్నాహకాల్లో భాగంగా మై భారత్ సంస్థతో కలిసి భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేసే మూడు కార్యక్రమాలను ప్రారంభించింది. 

క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, యువతలో సృజనాత్మకతను వెలికితీయడం, దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. ఈ ప్రచారంలో భాగంగా... ‘కామన్వెల్త్ క్రీడలు 2030 టార్చ్ డిజైన్ పోటీ’, ‘సీడబ్ల్యూజీ రీల్ ఛాలెంజ్’‌, ‘కామన్వెల్త్ క్రీడలు 2030 క్విజ్’ వంటి పోటీల్లో  పాల్గొనవచ్చు. 

ఈ పోటీలు మై భారత్ వేదికను ఉపయోగించే వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి. ‘#CWG2030InBharat’ దార్శనికతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, క్రీడల పట్ల ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పోటీలను రూపొందించారు. 

కామన్వెల్త్ క్రీడలు 2030 టార్చ్ డిజైన్ పోటీ 

కామన్వెల్త్ క్రీడలు 2030 టార్చ్ డిజైన్ పోటీ ద్వారా భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణలు, సుస్థిరత, క్రీడా నైపుణ్యం నుంచి స్పూర్తి పొంది క్రీడా జ్యోతి నమూనాను రూపొందించాలని పౌరులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు తమ నమూనాలను డిజిటల్ రూపంలో గానీ లేదా చేతితో గీసిన చిత్రాల రూపంలో గానీ సమర్పించవచ్చు. నమూనా ఉద్దేశాన్ని వివరిస్తూ గరిష్టంగా 200 పదాలకు మించకుండా ఒక వివరణాత్మక పత్రాన్ని కూడా జత చేయాలి. 

ఈ పోటీని 11 మే 2026 నుంచి 20 మే 2026 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పాల్గొనేవారు ఒక ఎంట్రీని మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విజేతలకు ఫిట్ ఇండియా హ్యాంపర్లు, గుర్తింపు పత్రాలు అందజేస్తారు. అయితే అర్హత సాధించిన ఇతర అభ్యర్థులకు కూడా డిజిటల్ పార్టిసిపేషన్ ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. 

మరిన్ని వివరాల కోసం: https://mybharat.gov.in/pages/event_detail?event_name=CWG-2030-Torch-Design-Contest&key=644159126644 ను సందర్శించండి

 

సీడబ్ల్యూజీ రీల్ పోటీ 

 

జీడబ్ల్యూజీ రీల్ పోటీ దేశంలో అభివృద్ధి చెందుతున్న క్రీడా సంస్కృతి, స్థానిక క్రీడా మౌలిక సదుపాయాలు, ఫిట్‌నెస్‌, కామన్వెల్త్ 2030 నిర్వహణ పట్ల ఉన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రీళ్లను రూపొందించమని పాల్గొనేవారిని ప్రోత్సహిస్తుంది. 

సీడబ్ల్యూజీ 2030 నిర్వహణకు భారత్‌ సిద్ధంగా ఉందనే సందేశాలను పంచుకోవడంతోపాటు, కామన్వెల్త్‌ క్రీడల్లో పొల్గొనే భారత క్రీడా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ రీల్స్‌ చేయవచ్చు. రీల్‌ వ్యవధి 60 సెకన్లకు మించకూడదు. 

ఈ పోటీ 07 మే 2026 నుంచి 16 మే 2026 వరకు జరుగుతుంది. పాల్గొనేవారు కేవలం ఒక ఎంట్రీ మాత్రమే సమర్పించాలి. ఉత్తమంగా నిలిచిన అయిదుగురు రీల్‌ సృష్టికర్తలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ఫిట్‌ ఇండియా హ్యాంపర్లు లభిస్తాయి. 

మరిన్ని వివరాల కోసం: https://mybharat.gov.in/pages/event_detail?event_name=CWG-Reel-Challenge&key=139158851139 ను సందర్శించండి

 

కామన్వెల్త్ క్రీడలు 2030 క్విజ్ 

దేశ క్రీడా వారసత్వాన్ని చాటిచెబుతూ కామన్వెల్త్ క్రీడల్లో దేశ ప్రస్థానంపై అవగాహన పెంచడమే ‘కామన్వెల్త్ గేమ్స్ 2030 క్విజ్’ ప్రధాన ఉద్దేశం. 

ఈ క్విజ్‌లో 10 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని అయిదు నిమిషాల్లో పూర్లి చేయాలి. అభ్యర్థులు కనీసం 8 మార్కులు సాధిస్తేనే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. 

ఈ క్విజ్ 2026 మే 09 నుంచి సెప్టెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన విజేతలను ప్రకటిస్తారు. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్‌ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. 

మరిన్ని వివరాలకు: https://mybharat.gov.in/quiz/quiz_dashboard/c09vUVNQUjlMKytsTStSQUkyVFhWQT09 ను సందర్శించండి. 

ఈ మూడు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు, పూర్తిగా ఉచితం. భారత క్రీడా ఉద్యమంలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు కామన్వెల్త్ క్రీడలు 2030ను విజయవంతంగా నిర్వహించడం కోసం యువతలో సృజనాత్మకతను, జాతీయ గర్వం, సామూహిక ఉత్సాహాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.

***


(రిలీజ్ ఐడి: 2260287) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam