ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సుమారు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సహా దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


· “రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన మౌలిక సదుపాయాలు.. నిరంతర సంధానం వైపు ఇదొక కీలక మలుపు”

· “భారత్‌ నేడు సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో దూసుకెళ్తూ... ఆధునిక మౌలిక సదుపాయాలకు రూపుదిద్దుతోంది”

· “లోగడ భారత్‌ ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నపుడు జౌళి పరిశ్రమ కీలక పాత్ర పోషించింది.. ఆ వారసత్వాన్ని మనం నేడు మళ్లీ బలోపేతం చేస్తున్నా... ఈ క్రమంలో వరంగల్‌ ‘పీఎం మిత్ర పార్క్’ జాతీయ జౌళి విప్లవాన్ని వేగిరపరుస్తుంది”

· “కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా ఆధునిక అనుసంధానానికి అగ్ర ప్రాధాన్యమిస్తోంది.. దీనికి అనుగుణంగా రోడ్లు-రైల్వేలు-విమానాశ్రయాలు తదితర ప్రతి రంగంలో ఇతోధికంగా పెట్టుబడులు వస్తున్నాయి”

· “ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నేడు ఇంధన భద్రత ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఇంధన భద్రతకు భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెడుతోంది”

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 5:59PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్‌లో దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల కూడలిగా హైదరాబాద్‌ నగర పరిణామాత్మక ప్రాశస్త్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ సహా యావద్దేశాన్నీ శరవేగంగా పురోగమింపజేయడంలో ఈ ప్రాంతం కీలక పోషిస్తున్నదని ప్రస్ఫుటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభించిన వివిధ భారీ ప్రాజెక్టులు ఈ రాష్ట్రాన్ని ఓ ప్రధాన తయారీ కూడలిగా నిలుపుతాయని ఆయన పేర్కొన్నారు. నేటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో వేలాది కొత్త ఉపాధి అవకాశాల సృష్టి సహా ప్రాంతీయ అనుసంధానం బలోపేతం కాగలదన్నారు. ప్రగతికి దోహదం చేసే ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రజలకూ ఎంతో ప్రయోజనం కల్పిస్తాయంటూ వారికి అభినందనలు తెలిపారు.

భారత్‌ నేడు వివిధ రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో శరవేగంగా దూసుకెళ్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక కారిడార్లకు రూపుదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ జాతీయ లక్ష్యానికి జహీరాబాద్ పారిశ్రామిక వాడ ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వినూత్న రూపాంతరీకరణకు మూలస్తంభంగా మారిందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, అధునాతన ఐసీటీ నెట్‌వర్క్‌ సహా నిరంతర పురోగమిస్తున్న ఈ ప్రాంగణం అత్యాధునిక పారిశ్రామిక నగరంగా రూపొందుతోందని కొనియాడారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనువైన సౌకర్యాలన్నీ ఇక్కడ లభిస్తాయని తెలిపారు. వీటన్నిటినీ పూర్తి చేయడానికి సంబంధించిన ఆర్థిక నిబద్ధతను వివరిస్తూ- కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తద్వారా హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది యువతకు ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. దీనివల్ల బహుగుణ ప్రయోజనాలుంటాయని చెబుతూ- “ఇక్కడ తయారయ్యే వాహనాలు, యంత్రాలు, ఈ పారిశ్రామిక మండలిలో ఏర్పాటయ్యే ఆహార తయారీ పరిశ్రమలు రాష్ట్ర కార్మికులకు, రైతులకు ఆర్థిక సాధికారతనిస్తాయి” అని శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు.

 

భారత జౌళి పరిశ్రమలు పరిణామాత్మక పోషించిన సమయంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా మన దేశానికిగల చారిత్రక ప్రాముఖ్యాన్ని ఆయన గుర్తుచేశారు. సమకాలీన కార్యక్రమాల ద్వారా ఈ వ్యూహాత్మక రంగం పునరుజ్జీవనానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో వరంగల్‌లో ఏర్పాటయ్యే జౌళి పరిశ్రమలకు ‘పీఎల్‌ఐ’ పథకం సహా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ‘పీఎం మిత్ర పార్క్’ సమగ్ర ప్రయోజనాలను చేరువ చేస్తూ జాతీయ జౌళి విప్లవానికి ఉత్తేజమివ్వగలదని ఆయన వివరించారు. ఈ మేరకు లబ్ధిదారు సంస్థలు ఇప్పటికే ‘పీఎల్‌ఐ’ పథకం తోడ్పాటును పొందుతున్నాయని చెప్పారు. “ఈ టెక్స్‌టైల్ పార్క్ పెద్ద సంఖ్యలో ప్రజలకు... ముఖ్యంగా మన అక్కచెల్లెళ్లకు, బిడ్డలకు ఉపాధి కల్పిస్తుంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల వంటి ఆధునిక సంధాన మౌలిక సదుపాయాలలో 12 ఏళ్ల నుంచీ భారీగా పెట్టుబడులు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక్క జాతీయ రహదారుల నిర్మాణం కోసమే దాదాపు 1.75 లక్షల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఈ జాతీయ దృక్పథం వల్ల తెలంగాణకూ గణనీయ ప్రయోజనాలు సమకూరాయని, గత 12 ఏళ్లుగా రాష్ట్ర పరిధిలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపైందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ-కర్ణాటక జాతీయ రహదారి విస్తరణతో ప్రయాణ సమయం ఆదా కాగా, రవాణా వ్యయం తగ్గిందన్నారు. తద్వారా లభించిన తక్షణ ప్రయోజనాలు వ్యవస్థీకృత మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల విస్పష్ట ప్రభావాన్ని చాటుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు “తెలంగాణ, కర్ణాటకలను కలిపే జాతీయ రహదారి విస్తరణతో ప్రజలకు, రవాణా రంగానికీ ఎనలేని ప్రయోజనం చేకూరింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

తెలంగాణలో రైల్వేరంగం పరంగా పెట్టుబడుల రూపాంతరీకరణను 2014 పూర్వ ప్రామాణికతతో ఆయన పోల్చారు. ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లకు మించకపోగా, నేడు ఒక్క తెలంగాణకే ప్రస్తుత వార్షిక రైల్వేరంగ కేటాయింపులు రూ.5.5వేల కోట్లు దాటాయని వివరించారు. మొత్తంమీద రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఏకకాలంలో అమలవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు సేవలందించే 5 వందే భారత్, 6 అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఆధునిక రైలు రవాణా రంగంలో వినూత్న మార్పును ప్రతిబింబిస్తున్నదని ఆయన తెలిపారు. కాజీపేట-విజయవాడ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని ప్రత్యేక విభాగాల ప్రారంభోత్సవంతోపాటు కాజీపేట రైల్వే అండర్ బైపాస్ లైన్ ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ- “ఈ సౌకర్యాలతో ప్రయాణ సౌలభ్యం కలగడమే కాకుండా రవాణా వేగం పుంజుకుంటుది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

నేటి 21వ శతాబ్దపు ప్రపంచంలో ఇంధన భద్రత ప్రాధాన్నాన్ని స్పష్టం చేస్తూ- ఇంధన సరఫరాలో అంతరాయం అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలకూ అవరోధం కాగలదని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంధన భద్రతకుగల వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఇంధన భద్రత బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. ఇందులో భాగంగా మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని ఓ కీలక వ్యూహాత్మక మలుపుగా ఆయన అభివర్ణించారు. సుస్థిర ప్రాంతీయ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ- “ఈ టెర్మినల్ తెలంగాణలో పెరిగే ఇంధన అవసరాలను తీర్చడంతోపాటు సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

సౌర విద్యుదుత్పాదన రీత్యా ఇటీవలి కాలంలో భారత్‌ అద్భుత ప్రగతి సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి దూసుకెళ్లడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రభుత్వం క్రమబద్ధ ఇంధన వైవిధ్యీకరణ వ్యూహాన్ని అనుసరించిందని తెలిపారు. ముఖ్యంగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం దిశగా అసాధారణ ప్రగతి సాధించామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎల్‌పీజీ విస్తరణపై తొలినాళ్ల ప్రాధాన్యం, ఇప్పుడు చౌకగా పైపుల ద్వారా సహజ వాయువు పంపిణీని ప్రోత్సహించే వైపు మళ్లిందన్నారు. దీంతో దేశమంతటా సీఎన్‌జీ ఆధారిత వ్యవస్థల రూపకల్పనవైపు పరిణామాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సమగ్ర కార్యక్రమాలు ప్రస్తుత ప్రపంచ ఇంధన సంక్షోభ పరిష్కారంలో మనకు తోడ్పడతాయంటూ ఇంధన పొదుపు ఆవశ్యకతను కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దిగుమతి చేసుకున్న ఇంధన ఉత్పత్తులను వాస్తవిక అవసరాలకు అనుగుణంగా, వివేచనతో వాడుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. సంయమనంతో సిద్ధించే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను విశదీకరిస్తూ- “విదేశీ మారకద్రవ్యం ఆదా సహా యుద్ధ సంక్షోభ ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం కోసం అవసరాలకు తగినంతగా మాత్రమే వినియోగంపై మనం దృష్టి సారించాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

తెలంగాణ యువతను వినూత్న ఆకాంక్షల రూపశిల్పులుగానూ, రాష్ట్ర రైతు లోకాన్ని సరికొత్త ఆశలకు వాహకులుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. వికసిత తెలంగాణ సాకారంలో అర్థవంతంగా తోడ్పడాలనే పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల సమష్టి సంకల్పాన్ని ప్రధానమంత్రి అభినందించారు. దేశ పురోగమనంలో తెలంగాణ ప్రగతి అంతర్భాగమని, రాష్ట్ర-జాతీయ సౌభాగ్యాల మధ్య ఇదొక కార్యకారణ సంబంధం ఏర్పరుస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికీ విస్పష్ట హామీ ఇస్తూ- రాష్ట్ర పౌరులందరి ఆశలు-ఆకాంక్షలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తన అభివృద్ధి-కేంద్రక కృషిని కొనసాగిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు “తెలంగాణ అభివృద్ధితోనే జాతీయాభివృద్ధి ముడిపడి ఉంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

 

****


(రిలీజ్ ఐడి: 2259585) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam