సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసార భారతి చైర్మన్‌గా ప్రఖ్యాత గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడు శ్రీ ప్రసూన్ జోషి నియామకం


శ్రీ ప్రసూన్ జోషి నియామకం ప్రసార భారతికి కొత్త ఉత్తేజాన్ని, సృజనాత్మక స్వరాన్ని అందిస్తుంది: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 02 MAY 2026 5:12PM by PIB Hyderabad

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... ప్రముఖ  గీత రచయిత, రచయిత, ప్రసార నైపుణ్య నిపుణుడు శ్రీ ప్రసూన్ జోషిని భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ  - ప్రసార భారతి -  అధ్యక్షుడిగా నియమించింది.

 

శ్రీ జోషి సాహిత్యం, వాణిజ్య ప్రకటనలు, చలనచిత్రం, ప్రజా ప్రసార రంగాలలో విస్తృతమైన సేవలందించిన విశిష్ట సృజనాత్మక నిపుణులు. తన ప్రభావవంతమైన రచనలు, లోతైన సాంస్కృతిక స్పృహతో సమకాలీన భారతీయ ప్రసార మాధ్యమ కథనాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రశంసలు పొందిన సినీ గీతాలు, ప్రకటనల ప్రచారాలు, దేశవ్యాప్త వైవిధ్యభరిత ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సామాజిక కథనాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు.

శ్రీ జోషి నియామకంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ “ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా నియమితులైన శ్రీ ప్రసూన్ జోషికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రసూన్ జీ ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాలలో విశేష ఖ్యాతి పొందిన అరుదైన సృజనాత్మక వ్యక్తి. ఆయన హృదయం నిరంతరం భారతదేశం కోసమే పరితపిస్తుంది. ఆయన పదాల్లో మన మట్టి సువాసన ఉంటుంది; ఆయన దృష్టిలో మన సంస్కృతికి చెందిన శాశ్వత సారం ప్రతిబింబిస్తుంది. ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త ఉత్తేజాన్ని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మక స్వరాన్ని సంతరించుకుంటుంది. ఆయన పదవీ కాలం చిరస్మరణీయంగా, అర్థవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. 

 ఈ నియామకానికి ముందు, శ్రీ జోషి ఆగస్టు 2017 నుంచి ముంబైలోని కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ చలనచిత్ర పరిశ్రమ వర్గాలను సమన్వయం చేసుకుంటూ సినిమాల అనుమతుల ప్రక్రియలను బలోపేతం చేయడంలో తోడ్పడ్డారు. ఆయన పదవీ కాలంలో సృజనాత్మకతకు, నియంత్రణ బాధ్యతలకు మధ్య సమతుల్యత కనిపించింది. గతంలో మెకాన్ వరల్డ్ గ్రూప్ ఇండియాకు సీఈఓగా, మెకాన్ వరల్డ్ గ్రూప్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. అలాగే 2016 నుంచి ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ట్రస్టీలలో ఒకరుగా కొనసాగుతున్నారు.

సృజనాత్మక రంగాలు, ప్రభుత్వ కమ్యూనికేషన్లలో తన అపార అనుభవంతో శ్రీ జోషి ప్రసార భారతి నాయకత్వానికి ఒక ప్రత్యేక దృక్పథాన్ని తీసుకువస్తారని భావిస్తున్నారు. ప్రజా ప్రసార రంగం వేగవంతమైన సాంకేతిక మార్పులు, మారుతున్న ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సాగుతున్న తరుణంలో ఆయన బాధ్యతలు చేపట్టడం విశేషం.

ప్రసార భారతి గురించి: 

ప్రసార భారతి (భారత ప్రసార సంస్థ) చట్టం, 1990 కింద ఏర్పాటై, 1997 నుంచి  కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ భారత చట్టబద్ధ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రజా సేవా ప్రసార సంస్థగా కార్యకలాపాలుసాగిస్తోంది. దీనిలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి:

  • ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో- ఏఐఆర్)– ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజలకు అనేక భాషలు, మాండలికాల్లో సమాచారాన్ని చేరవేస్తుంది.

  • దూరదర్శన్ (డీడీ)– భారత జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థ. ఇది వార్తలు, విద్య, వినోదం, సాంస్కృతిక అంశాలతో కూడిన విభిన్న కార్యక్రమాలను అందిస్తుంది.

ప్రజా ప్రసార స్ఫూర్తితో ఉచిత ఓటీటీ సేవలను బలోపేతం చేయడానికి ప్రసార భారతి 'వేవ్స్' ఓటీటీ వేదికను కూడా ప్రారంభించింది.

సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో, జాతీయ సమగ్రతను పెంపొందించడంలో, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ప్రసార భారతి కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా విశ్వసనీయ ప్రజా ప్రసార సేవలు అందుబాటులో ఉండేలా ఇది కృషి చేస్తోంది. విస్తృతమైన భూభాగ (టెరెస్ట్రియల్), డిజిటల్ ప్రాతినిధ్యం కలిగిన ఈ సంస్థ డిజిటల్ వేదికలు, డీటీహెచ్ సేవలు, ఆర్కైవల్ కార్యక్రమాల ద్వారా తన పరిధిని నిరంతరం విస్తరిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2257579) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam