జాతీయ మానవ హక్కుల కమిషన్
వడగాలుల నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడేందుకు
ముందస్తు చర్యలు చేపట్టాలని 21 రాష్ట్రాలు, ఎన్‌సీటీ ఢిల్లీని ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
ఆర్థికంగా వెనుకబడిన వారు, ఎండలో పనిచేసే కూలీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, శిశువులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం..
సరైన ఆశ్రయం, కనీస వనరులు లేక నిరాశ్రయుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న కమిషన్
రాష్ట్రాల్లోని ప్రస్తుత ఎస్ఓపీలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కోరిన కమిషన్
प्रविष्टि तिथि:
28 APR 2026 11:54AM by PIB Hyderabad
దేశంలో వీస్తున్న వడగాలుల నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను రక్షించేందుకు ముందస్తు చర్యలతోపాటు సహాయక చర్యలనూ ఖచ్చితంగా అమలు చేయాలని 21 రాష్ట్రాలతోపాటు ఎన్‌సీటీ-ఢిల్లీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కోరింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
వడగాలుల తీవ్రత, వ్యవధి పెరగడం వల్ల తగిన ఆశ్రయం, వనరులు లేని అట్టడుగు వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, నిరాశ్రయులపై తీవ్ర ప్రభావం పడుతోందని కమిషన్ గుర్తించింది. వృద్ధులు, పిల్లలు, నవజాత శిశువులు ఈ తీవ్రమైన వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు త్వరగా గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాలులు కేవలం ఆరోగ్యంపైనే కాకుండా, జీవనోపాధి కోల్పోవడానికి, అగ్ని ప్రమాదాల ముప్పు పెరగడానికి కూడా కారణమవుతాయని హెచ్చరించింది.
ఈ కారణాలతో రాష్ట్రాలు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సమగ్రమైన, సమ్మిళిత చర్యల తక్షణ అవసరాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలియజేసింది. 2019-23 మధ్య దేశంలో వడదెబ్బ, తీవ్రమైన వేడి కారణంగా 3,712 మంది మరణించినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) డేటాను కమిషన్ ప్రస్తావించింది. వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి ఇప్పటికే వారి వద్ద ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సహాయక చర్యల ప్రణాళికను రూపొందించి, వాటి అమలును సులభతరం చేయాలని కమిషన్ వారిని కోరింది.
రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో అన్ని జిల్లాల నుంచి సేకరించిన ఏకీకృత చర్యల నివేదికలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
***
(रिलीज़ आईडी: 2256401)
आगंतुक पटल : 70