హోం మంత్రిత్వ శాఖ
పద్మ పురస్కారాలు- 2027 నామినేషన్లకు చివరి తేదీ 2026 జూలై 31
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 3:00PM by PIB Hyderabad
2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోయే పద్మ పురస్కారాలు-2027 కోసం నామినేషన్లు/సిఫార్సుల ప్రక్రియ 2026 మార్చి 15న ప్రారంభమైంది. పద్మ పురస్కారాలకు నామినేషన్ల కోసం చివరి తేదీ 2026 జూలై 31. పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పేరిట అందించే పురస్కారాలు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ముఖ్యమైనవి. 1954లో నెలకొల్పిన ఈ పురస్కారాలను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. విశిష్టమైన కృషిని గుర్తించడం ఈ పురస్కారం లక్ష్యం. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రాలు, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, ప్రజాసేవ, వాణిజ్యం - పరిశ్రమల వంటి రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. జాతి, వృత్తి, పదవి లేదా లింగ భేదం లేకుండా పౌరులంతా ఈ పురస్కారాలకు అర్హులే. అయితే డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు పద్మ పురస్కారాలకు అర్హులు కాదు.
పద్మ పురస్కారాలను ‘ప్రజాపద్మాలు’గా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల స్వీయ నామినేషన్లు సహా ప్రజలంతా నామినేషన్లు/సిఫార్సులు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, దివ్యాంగులు, నిస్వార్థ సామాజిక సేవలందిస్తున్న వారిలో.. గుర్తింపునకు అర్హులైన ప్రతిభావంతులను, వారి ఉన్నతినీ విజయాలనూ గుర్తించేందుకు సమష్టి కృషి ఆవశ్యకం.
వారి కృషిని వివరించేలా కథన రూప వివరణ (గరిష్టంగా 800 పదాలు)తోపాటు.. పైన పేర్కొన్న పోర్టల్‌లో ఉన్న ఫార్మాట్‌లో నిర్దేశించిన విధంగా సంబంధిత వివరాలన్నీ నామినేషన్లు/సిఫార్సులలో ఉండాలి. సిఫార్సు చేసిన వ్యక్తి తన సంబంధిత రంగం/విభాగంలో సాధించిన విశిష్టమైన, అసాధారణమైన విజయాలు/సేవలను అవి స్పష్టంగా వివరించాలి.
ఈ విషయానికి సంబంధించిన వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో (https://mha.gov.in) ‘పురస్కారాలు, పతకాలు’ శీర్షికలో, అలాగే పద్మ పురస్కారాల వెబ్‌సైట్ (https://padmaawards.gov.in)లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పురస్కారాలకు సంబంధించిన శాసనాలు, నియమాలు.. వెబ్‌సైట్‌లోని https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2255966)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam