ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కురుక్షేత్రలో శ్రీ గురు తేగ్‌ బహాదూర్ 350వ అమరవీర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 25 NOV 2025 7:52PM by PIB Hyderabad

జై బోలో సో నిహాల్‌... సత్‌ శ్రీ అకాల్!

హర్యానా గవర్నర్ శ్రీ ఆశింఘోష్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ రావు ఇందర్‌జిత్‌ సింగ్, శ్రీ కృష్ణ పాల్, హర్యానా ఎస్‌జీపీసీ అధ్యక్షుడు శ్రీ జగదీష్ సింగ్ జిందా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా!

భారత వారసత్వ అద్భుత సమ్మేళనానికి నెలవైన ప్రత్యక దినమిది. ఈ రోజు ఉదయం రామాయణ నగరం అయోధ్యలో ఉన్న నేను, ఇప్పుడిక్కడ భగవద్గీత ఆవిష్కృతమైన కురుక్షేత్రంలో ఉన్నాను. అయితే, శ్రీ గురు తేగ్‌ బహాదూర్‌ 350వ అమరవీర దినోత్సవం సందర్భంగా ఆయనకు నేడు నివాళి అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన మాననీయ సాధువులతోపాటు గౌరవనీయ సిక్కు సమాజ పెద్దలకు భక్తితో ప్రణమిల్లుతున్నాను.

మిత్రులారా!

దాదాపు ఐదారేళ్ల కిందట చోటు చేసుకున్న మరో అద్భుత యాదృచ్ఛిక ఉదంతాన్ని నేనిప్పుడు తప్పక ప్రస్తావించాలి. అదేమిటంటే- 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు రామమందిరంపై తీర్పునిచ్చింది. దీనికి కాస్త ముందుగా కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం డేరా బాబా నానక్‌లో ఉన్న నేను, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం కావాలని, కోట్లాది రామభక్తుల ఆకాంక్షలు నెరవేరాలని అక్కడ ప్రార్థించాను. సరిగ్గా అదేరోజు తీర్పు వెలువడటంతో మా ప్రార్థన ఫలించింది. ఇక ప్రస్తుతానికి వస్తే, ఈ రోజు అయోధ్యలో ‘ధర్మధ్వజం’ ఆవిష్కరణ అనంతరం నేనిక్కడ సిక్కు పెద్దల ఆశీర్వాదం పొందుతున్నాను.

మిత్రులారా!

కురుక్షేత్ర గడ్డపై ఇంతకుముందే పాంచజన్య స్మారకం ప్రారంభోత్సవం నిర్వహించాం. సత్యం, న్యాయం పరిరక్షణ అత్యతున్న ధర్మమని శ్రీకృష్ణ పరమాత్మ ఈ నేల నుంచే ప్రబోధించాడు. ఆ మేరకు “స్వధర్మే  నిధనం శ్రేయః”.. అంటే- “సత్యపాలన, కర్తవ్య నిర్వహణలో ప్రాణార్పణం మహత్కార్యమే”నని అర్థం. శ్రీ గురు తేగ్‌ బహాదూర్ కూడా సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన కర్తవ్యంగా పరిగణించి జీవితాన్నే త్యాగం చేశారు. ఈ చారిత్రక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ మహనీయుడి స్మారక తపాలా బిళ్లతోపాటు ప్రత్యేక నాణాన్ని ఆవిష్కరించే మహదవకాశం నాకు లభించింది. పవిత్ర గురు సంప్రదాయానికి ఈ సేవను ప్రభుత్వం సదా కొనసాగించాలన్నది నా ఆకాంక్ష.

మిత్రులారా!

ఈ పవిత్ర కురుక్షేత్రం సిక్కు సంప్రదాయానికీ ఓ ప్రధాన కేంద్రం. ఈ నేల ఎంతటి అదృష్టం చేసుకున్నదంటే- సిక్కు సంప్రదాయంలోని పూజనీయులైన గురువులలో అధికశాతం తమ పవిత్ర యాత్రల సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ముఖ్యంగా 9వ గురువైన శ్రీ గురు తేగ్‌ బహాదూర్ కురుక్షేత్రానికి వచ్చినపుడు తన ప్రగాఢ దీక్ష, నిర్భీక సాహస ముద్రను ఇక్కడ వదిలివెళ్లారు.

మిత్రులారా!

శ్రీ గురు తేగ్‌ బహాదూర్ వంటి మహనీయులు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన జీవితం, త్యాగం, వ్యక్తిత్వం అపార స్ఫూర్తిప్రదాతలు. మొఘల్ దురాక్రమణ కాలంలో గురు సాహిబ్ ధైర్యానికి అత్యున్నత ప్రమాణాన్ని నెలకొల్పారు. ఆనాడు శ్రీ గురు తేగ్‌ బహాదూర్‌ బలిదానానికి ముందు జరిగిందేమిటో మనందరికీ తెలుసు. మొఘల్ పాదుషాల దురాగత శకంలో కశ్మీరీ హిందువులను బలవంతంగా మతమార్పిడి చేశారు. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడం కోసం వారు శ్రీ గురు సాహిబ్ మద్దతు కోరారు. అప్పుడు “శ్రీ గురు తేగ్‌ బహాదూర్ ఇస్లాంను అంగీకరిస్తే, మేమూ అంగీకరిస్తామని మీరంతా ఔరంగజేబుకు స్పష్టం చేయండి” అని ఆయన మార్గనిర్దేశం చేశారు.

మిత్రులారా!

శ్రీ గురు తేగ్‌ బహాదూర్‌ నిర్భీకతకు ఈ మాటలే నిదర్శనం. అందరూ ఊహించిన విధంగానే ఆయన మాటలతో క్రూరుడైన ఔరంగజేబు ఆగ్రహంతో రగిలిపోతూ గురు సాహిబ్‌ను నిర్బంధించాలని తన సైన్యాన్ని ఆదేశించాడు. అయితే, తానే స్వయంగా ఢిల్లీ వస్తానని గురు సాహిబ్ ప్రకటించారు. అంతకుముందే మొఘల్ పాలకులు ఆయనను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, శ్రీ గురు తేగ్‌  బహాదూర్‌ చలించలేదు... తన మతం లేదా సిద్ధాంతాలపై రాజీపడలేదు. ఈ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయడంలో భాగంగా గురుసాహిబ్‌ సహచరులైన ‘భాయ్ దయాళ, భాయ్ సతీదాస్, భాయ్ మతిదాస్’లను మొఘల్‌ సైనికులు ఆయన ముందే దారుణంగా చంపారు. అయినప్పటికీ, గురు సాహిబ్ తన పట్టు వీడలేదు సరికదా... ఆయన సంకల్పం మరింత గట్టిపడింది. ధర్మ మార్గం వీడేందుకు ససేమిరా అంగీకరించని గురు సాహిబ్‌, చివరకు ధ్యాన స్థితిలోకి వెళ్లి తన విశ్వాస రక్షణలో కరవాలానికి శిరస్సును అర్పించాడు తప్ప తలొగ్గలేదు.

మిత్రులారా!

గురు సాహిబ్‌ శిరసును ఖండించినా మొఘలుల క్రూరత్వం ఇసుమంత కూడా తగ్గలేదు. చివరకు వారు గురు మహారాజ్ పవిత్ర శిరసుకు అవమానం తలపెట్టారు. కానీ, వారిని ధిక్కరిస్తూ భాయ్ జైతా శౌర్యపరాక్రమాలు ప్రదర్శిస్తూ గురువు శిరసును ఆనంద్‌పూర్ సాహిబ్‌కు తరలించాడు. ఈ ఉదంతంపై శ్రీ గురు గోవింద్ సింగ్ “తిల్కజంజూ రాఖా ప్రభ్‌ తా కా, తేగ్‌ బహాదూర్‌ సీ క్రియా, కరీ న కిన్హూ ఆన్‌” అని వ్యాఖ్యానించారు. అంటే- తన విశ్వాస గౌరవ పరిరక్షణ కోసం, ప్రజల విశ్వాసంపై అమానుష దాడుల నిరోధం కోసం గురు సాహిబ్ సర్వస్వం త్యాగం చేశాడని అర్థం.

మిత్రులారా!

గురుదేవుని ఆనాటి త్యాగానికి ఢిల్లీలోని సిస్ గంజ్ గురుద్వారా నేడు నిత్య చైతన్య, స్ఫూర్తిదాయక నిదర్శనంగా నిలుస్తుంది. ఆనంద్‌పూర్ సాహిబ్ మన జాతీయ చైతన్యానికి నెలవైన పవిత్ర భూమి. భారతదేశం నేడు ఏ రూపంలో ఉన్నా, గురు సాహిబ్ వంటి మహనీయుల త్యాగం, అంకితభావం సజీవమే. ఈ అసమాన త్యాగం నేపథ్యంలోనే శ్రీ గురు తేగ్ బహదూర్ ను ‘హింద్ ది చాదర్‌’గా గౌరవిస్తారు.

మిత్రులారా!

మన దేశ విలక్షణత, సంస్కృతి, మూల విలువలకు ఈ గురు సంప్రదాయం పునాది. మా ప్రభుత్వం ఈ పవిత్ర సంప్రదాయాలను, ముఖ్యంగా సిక్కు సంప్రదాయంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని గత 11 సంవత్సరాల నుంచీ జాతీయ వేడుకగా పరిగణించడంపై నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ మేరకు శ్రీ గురు నానక్ దేవ్ 550వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు తేగ్‌ బహాదూర్ సాహిబ్ 400వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాష్ పర్వ్‌లను దేశ ఐక్యత-సమగ్రతల వేడుకలుగా నిర్వహించే అదృష్టం మా ప్రభుత్వానికి దక్కింది. దేశం నలుమూలల నుంచి ప్రజలందరూ తమ నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచారాలతో నిమిత్తం లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మిత్రులారా!

గురువులతో ముడిపడిన పవిత్ర స్థలాలకు దివ్య-భవ్య రూపమిచ్చే భాగ్యం మా ప్రభుత్వానికి లభించింది. గత దశాబ్ద కాలంలో గురు సంప్రదాయ సంబంధిత కార్యక్రమాలలో నేను పాల్గొన్న సందర్భాలెన్నో ఉన్నాయి. కొంతకాలం కిందట గురు గ్రంథ్ సాహిబ్ మూడు మూల రూపాలను  ఆఫ్ఘనిస్థాన్ నుంచి తిరిగి తేవడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగింది.

మిత్రులారా!

అలాగే గురువుల ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని ఆధునిక భారత స్ఫూర్తితో అనుసంధానించేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. కర్తార్‌పూర్ కారిడార్ పనులు పూర్తి చేయడం, హేమకుండ్ సాహిబ్‌లో రోప్‌వే నిర్మాణం లేదా ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని విరాసత్-ఎ-ఖల్సా మ్యూజియం విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను ఉజ్వల గురు సంప్రదాయ స్ఫూర్తితోనే మేం పూర్తిచేశాం.

మిత్రులారా!

ధీరులైన సాహిబ్‌జాదాల విషయంలోనూ మొఘలుల క్రూరత్వం పరాకాష్ఠకు చేరిన తీరు మనందరికీ తెలిసిందే. పసివాళ్లని కూడా చూడకుండా ఇటుకలతో కొట్టినా, విశ్వాసంపై మొక్కవోని పట్టుదలతో వారు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు తప్ప తమ కర్తవ్యాన్ని, ధర్మ మార్గాన్ని వీడేందుకు సుతరామూ అంగీకరించలేదు. ఇటువంటి ఆదర్శాలను గౌరవించడంలో భాగంగా మేమిప్పుడు ఏటా డిసెంబరు 26న ‘వీరబాలల దినోత్సవం’ నిర్వహిస్తున్నాం.

మిత్రులారా!

సిక్కు సంప్రదాయం చరిత్ర, గురు బోధనలను కూడా జాతీయ పాఠ్యాంశాల్లో భాగం చేశాం. తద్వారా సేవ, ధైర్యం, సత్యం వంటి ఆదర్శాలు నవతరం ఆలోచనలకు పునాదిగా మారాయి.

మిత్రులారా!

మీరందరూ ‘జోడా సాహిబ్’ పవిత్ర దర్శనం చేసుకునే ఉంటారని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి మొదట ఈ కీలక అవశేషాల గురించి నాతో చర్చించడం నాకింకా గుర్తుంది. శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్ల పవిత్ర పాదరక్షలను (జోడా సాహిబ్) తమ వంశీయులు దాదాపు 300 ఏళ్లుగా సంరక్షిస్తున్నారని ఆయన అప్పట్లో నాకు చెప్పారు. ఇప్పుడీ పవిత్ర వారసత్వాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా విస్తరించిన సిక్కు సమాజానికి వాటిని అంకితం చేయాలని వారు భావిస్తున్నారు.

మిత్రులారా!

ఈ పవిత్ర ‘జోడా సాహిబ్‌’ను పూర్తి గౌరవమర్యాదలతో శాస్త్రీయంగా పరీక్షించి, భావితరాల కోసం ఈ పవిత్ర అవశేషాన్ని భద్రపరచాలని నిర్ధారించారు. ఈ మేరకు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని, ‘జోడా సాహిబ్‌’ను గురు మహారాజ్ తన బాల్యంలో ఎక్కువ కాలం గడిపిన ‘తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్‌’కు అందజేయాలని మేం సమష్టిగా నిర్ణయించాం. తదనుగుణంగా పవిత్ర యాత్రలో భాగంగా గత నెలలో ‘జోడా సాహిబ్‌’ను ఢిల్లీ నుంచి పాట్నా సాహిబ్‌కు తీసుకెళ్లారు. ‘జోడా సాహిబ్’కు శిరసాభివందనం చేసే అవకాశం అక్కడ కూడా నాకు లభించింది. గురువుల ప్రత్యేక కృప నాపై వర్షించడంగా దీన్ని నేను భావిస్తున్నాను. సేవ, అంకితభావం, పవిత్ర వారసత్వంతో అనుసంధానమయ్యే అవకాశాన్ని వారు నాకు కల్పించారు.

మిత్రులారా!

భారత సంస్కృతి ఎంత విశాలమైనదో... మరెంతటి ఉదారమైనదో... ఇంకెంతటి మానవ-కేంద్రకమో గురు తేగ్ బహదూర్ సాహిబ్ స్మృతులు మనకు బోధపరుస్తాయి. ‘సర్బత్ ద భాలా (సర్వజన సంక్షేమం) సూత్రానికి ఆయన జీవన విధానమే తార్కాణం. ఆయన జ్ఞాపకాలు, ప్రబోధాలను గౌరవించడానికి మాత్రమేగాక మన వర్తమానం, భవిష్యత్తుకూ ఈ కార్యక్రమం ఎనలేని స్ఫూర్తినిస్తుంది. గురు సాహిబ్ ఆనాడు “జో నర్‌ దుఃఖ్‌ మే దుఃఖ్‌ నహీ మానే, సోయీ పూరణ్‌ జ్ఞానీ” అన్నారు. అంటే- “సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చలించని వాడే నిజమైన సంపూర్ణ జ్ఞాని” అని అర్థం. ఈ స్ఫూర్తితోనే మనం ప్రతి సవాలునూ అధిగమిస్తే దేశాన్ని ముందుకు నడిపించి, వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలి.

మిత్రులారా!

అలాగే “భయ్‌ కాహూ కో దేత్‌ నయ్‌, నయ్‌ భయ్‌ మానత్‌ ఆన్‌” అని గురు సాహిబ్ మనకు బోధించారు. అంటే- “మనం ఎవరినీ భయపెట్టరాదు... ఎవరికీ భయపడరాదు” అని అర్థం. సమాజాన్ని, దేశాన్ని పటిష్ఠం చేసేది ఈ నిర్భీకతే. భారత్ కూడా నేడీ సూత్రాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తోంది. ప్రపంచంతో సోదరభావం గురించి మనం మాట్లాడుతాం.. మన సరిహద్దులను కూడా రక్షించుకుంటాం. మనం శాంతికాముకులమే అయినా, భద్రతపై రాజీపడబోం. ఆపరేషన్ సిందూర్ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. నవ భారత్‌ ఉగ్రవాదానికి జడిసి, వెనుకంజవేయదు సరికదా... దీటైన జవాబిస్తుందనే వాస్తవాన్ని యావత్‌ ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. నేటి భారత్ సంపూర్ణ శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు, స్పష్టతతో ముందంజ వేస్తోంది.

మిత్రులారా!

ప్రస్తుత కీలక సందర్భంలో- మన సమాజం, యువతరానికి సంబంధించి గురుసాహిబ్‌ కూడా ఆందోళన వెలిబుచ్చిన ఒక సమస్యను ప్రస్తావిస్తున్నాను. మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న మన యువతలో ఈ వ్యసనం ఎందరో కంటున్న కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. అందుకే, ఈ సమస్యను కూకటివేళ్లతో పెళ్లగించేందుకు మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది సమాజంతోపాటు  కుటుంబాల కోసం కూడా సాగుతున్న ఓ యుద్ధం. ఇలాంటి సమయంలో శ్రీ గురు తేగ్ బహాదూర్‌ సాహిబ్ బోధనలు మనకు పరిష్కారాలను సూచించడమేగాక స్ఫూర్తినిస్తాయి. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి తన యాత్రను ప్రారంభించిన గురు సాహిబ్ అనేక గ్రామాలను సంగత్‌తో అనుసంధానించారని మనందరికీ తెలిసిందే. ప్రజల్లో భక్తివిశ్వాసాలను బలోపేతం చేయడమే కాకుండా సామాజికంగా సత్ప్రవర్తనకు కృషి చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు అన్నిరకాల మత్తు పదార్థాల సాగుకు స్వస్తి చెప్పి, తమ భవిష్యత్తును గురు సాహిబ్ పాదాల ముందుంచారు. ఆనాడు ఆ మహనీయుడు చూపిన మార్గంలో సమాజం, కుటుంబాలు, యువత కలసికట్టుగా నడుస్తూ, మాదకద్రవ్యాలపై నిర్ణయాత్మక పోరు ప్రారంభిస్తే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించగలం.

మిత్రులారా!

మన ప్రవర్తనలో సౌజన్యం, విధానాలలో సమతౌల్యంతోపాటు సమాజంలో విశ్వాసానికి శ్రీ గురు తేగ్‌ బహాదూర్ సాహిబ్ బోధనలు పునాది కావాలన్నదే నేటి సందర్భ సారాంశం. ఆయన పేరిట  అమరవీరుల దినోత్సవాన్ని యావద్దేశం నిర్వహించుకుంటున్న తీరు మన సమాజంలో గురు బోధనల శాశ్వతత్వం ఎంత సజీవమో నిరూపిస్తుంది. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే దిశగా ఈ వేడుకలు మన యువతకు స్ఫూర్తినిస్తాయన్న ఆశాభావంతో మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

వాహే గురూ జీ కా ఖాల్సా, వాహే గురూజీ కి ఫతే!


(रिलीज़ आईडी: 2254296) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam