ప్రధాన మంత్రి కార్యాలయం
నారీశక్తి వందన్ అధినియం సవరణకు అనుకూలంగా ఓటు వేయాలని ఎంపీలను కోరిన ప్రధాని.. ఇదొక చరిత్రాత్మక అవకాశమన్న శ్రీ మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 2:13PM by PIB Hyderabad
నారీశక్తి వందన్ అధినియం సవరణపై ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై నిన్న రాత్రి ఒంటి గంట వరకు సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ సవరణపై అన్ని అపోహలనూ హేతుబద్ధమైన సమాధానాలతో నివృత్తి చేశామని, సభ్యులు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అవసరమైన సమాచారం లేనిచోట.. సభ్యులకు ఆ సమాచారాన్ని కూడా అందించామని, తద్వారా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చామని ఆయన వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ల అంశం చుట్టూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ చర్చలు సాగుతున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం దక్కేలా చూడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, నిర్ణయాధికార ప్రక్రియలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం సరైంది కాదని, దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
లోక్‌సభలో కొద్దిసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందని ప్రధానమంత్రి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తూ.. ఆలోచనాత్మకమైన, సునిశితమైన నిర్ణయం తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థించారు.
నారీశక్తి మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలూ ఉండొద్దని.. దేశ మహిళల తరఫున పార్లమెంటు సభ్యులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోని కోట్లాది మంది పార్లమెంటు వైపు ఆశగా చూస్తున్నారన్నారు. సభ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, సభ తీసుకునే నిర్ణయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సభ్యులు తమ కుటుంబాల్లోని తల్లులు, అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలు, గృహిణులను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని, అంతరాత్మ ప్రబోధాన్ని విని నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
దేశ మహిళలకు సేవ చేసేందుకు, వారిని గౌరవించేందుకు లభించిన ఒక విశిష్ట అవకాశంగా ఈ సవరణను ఆయన అభివర్ణించారు. మహిళలకు లభించే ఈ కొత్త అవకాశాలను దూరం చేయొద్దని పార్లమెంటు సభ్యులను కోరారు.
ఈ సవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందితే.. అది నారీశక్తితోపాటు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదొక చరిత్రాత్మక ఘట్టమన్న ప్రధానమంత్రి... దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించి, చరిత్ర సృష్టించేందుకు సభ్యులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“పార్లమెంటు ప్రస్తుతం నారీ శక్తి వందన్ అధినియం సవరణలపై చర్చిస్తోంది. ఈ చర్చ నిన్న రాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది.
హేతుబద్ధమైన సమాధానాలతో దీనిపై అపోహలను దూరం చేశాం. ప్రతి సందేహాన్నీ నివృత్తి చేశాం. ఎక్కడైనా సమాచారం లోపిస్తే.. ప్రతి సభ్యుడికీ సమాచారాన్ని అందించాం. అందరి మనస్సుల్లో దీనిపై ఉన్న అన్ని ఆందోళనలను పరిష్కరించాం.
దేశంలో నాలుగు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల అంశంపై తీవ్రంగా రాజకీయాలు జరిగాయి. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న వారు తమ హక్కులను పొందేలా చూడాల్సిన తరుణమిది.
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా.. నిర్ణయాధికార ప్రక్రియలో భారతీయ మహిళలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉండటం సరికాదు.
లోక్‌సభలో మరికొద్దిసేపట్లో పోలింగ్ జరగనుంది. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాను.. వారికిదే నా విజ్ఞప్తి...
దయచేసి జాగ్రత్తగా ఆలోచించి, పూర్తి సున్నితత్వంతో నిర్ణయం తీసుకోండి. మహిళా రిజర్వేషన్‌కు అనుకూలంగా ఓటు వేయండి.
దేశ నారీశక్తి తరఫున సభ్యులందరినీ కోరుతున్నాను... మహిళా శక్తి మనోభావాలను దెబ్బతీసే పనేదీ చేయొద్దు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు సభను, మనల్ని చూస్తున్నారు. మన నిజాయితీని, మన నిర్ణయాలను గమనిస్తున్నారు. దయచేసి నారీ శక్తి వందన్ అధినియం సవరణకు మద్దతివ్వండి.
“ఎంపీలందరికీ నా విజ్ఞప్తి...
ఇంట్లో ఉన్న తల్లులు, అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలు, గృహిణులను ఒక్కసారి గుర్తుచేసుకోండి.. మీ అంతరాత్మ చెప్పేది వినండి.
దేశ నారీశక్తికి సేవ చేసేందుకు, వారిని గౌరవించేందుకు లభించిన గొప్ప అవకాశమిది.
వారికి కొత్త అవకాశాలను దూరం చేయొద్దు.
ఈ సవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందితే, దేశ మహిళా శక్తి మరింత బలపడుతుంది... దేశ ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుంది.
రండి... ఈ రోజు మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం. దేశ జనాభాలో సగభాగమైన భారతీయ మహిళలకు వారి హక్కులను అందిద్దాం.”
***
(రిలీజ్ ఐడి: 2252974)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam