ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 5:43PM by PIB Hyderabad
గౌరవనీయ అధ్యక్షా!
ఈ రోజు ఉదయాన్నే ఓ కీలక బిల్లుపై చర్చ మొదలైంది. నా సహ సభ్యులలో అనేకమంది ప్రధానాంశాలను ప్రస్తావించి, ఎన్నో వాస్తవాలను సభ ముందుంచారనడంలో సందేహం లేదు.
గౌరవనీయ అధ్యక్షా!
ఒక దేశ సుదీర్ఘ ప్రయాణంలో అనేక కీలక ఘట్టాలు అంతర్భాగంగా ఉంటాయి. తదనుగుణంగా సమాజం ధోరణి, నాయకత్వ సామర్థ్యం అనేక అవకాశాలను అందిపుచ్చుకుని, బలమైన జాతీయ వారసత్వాన్ని ప్రోదిచేసింది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రస్తుత తరుణం కూడా అటువంటి చారిత్రక ఘట్టమేనని నా విశ్వాసం. నేటి ఈ ఆలోచన సైద్ధాంతికంగా 25 నుంచి 30 ఏళ్ల కిందటే సాకారం కావాల్సి ఉంది. ఆ అవసరం ఏర్పడినప్పుడే అది అమలులోకి వచ్చి ఉండాల్సింది. అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన ఆలోచనలకు మెరుగులు దిద్దుకుని ఉండవచ్చు... అదే ప్రజాస్వామ్య శోభ. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారత్ ప్రగతి ప్రస్థానానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఓ సరికొత్త, సంస్కరణాత్మక శోభను జోడించే దిశగా సభ్యులందరికీ ఈ సభ నేడొక శుభప్రద అవకాశం ఇచ్చింది. నేను మొదట్లోనే చెప్పినట్టు- దేశ ప్రగతి దిశగా విధాన రూపకల్పనలో జనాభాలోని సగభాగాన్ని చురుకైన భాగస్వాములను చేయడం మనందరికీ దక్కిన ఒక అరుదైన అదృష్టం. ఇటువంటి సదవకాశాన్ని జారవిడచుకోరాదని గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరికీ ఈ సందర్భంగా నా విన్నపం. ఈ మేరకు భారతీయులమైన మనమంతా సమష్టిగా దేశానికి ఒక దశ, దిశను నిర్దేశిద్దాం. దేశ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంలో భాగంగా పరిపాలన వ్యవస్థలో ప్రగాఢ అవగాహన నింపేందుకు మనం సమష్టిగా చేస్తున్న పరిణామాత్మక కృషి ఎంతో ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు ఓ కీలక మలుపులో మేధా మథనం చేస్తున్నాం. దీన్నుంచి ఆవిర్భవించే అమృతమే దేశ రాజకీయాలకు రూపుదిద్దడమే కాదు... ప్రగతి దశను, దిశను కూడా నిర్దేశిస్తుంది. అంటే- మనమిప్పుడు ఓ కీలక మలుపులో ఉన్నాం.
గౌరవనీయ అధ్యక్షా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత్ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటోంది. యావద్దేశం నేడు విస్తృత ప్రపంచ ఆమోదం పొందుతుండటం, ఇది వికసిత భారత్ సంకల్పంతో ముడిపడినది కావడం మనకెంతో గర్వకారణం. అభివృద్ధి చెందిన భారత్ అంటే- నా దృక్కోణంలో రైల్వేలు, రహదారులు, అత్యున్నత మౌలిక సదుపాయాలకు లేదా ఆర్థిక ప్రగతిని సూచించే గణాంకాలకు పరిమితం కాదు. న్నారు. వికసిత భారత్‌పై మన దృక్పథం అంత సంకుచితమైనది కాదు. అది ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రాన్ని విధాన రూపకల్పనలో అర్థవంతంగా ఏకీకృతం చేయడంలో ఇమిడి ఉంది. మన జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలను విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయడం నేటి తక్షణావసరం. ఇప్పటికే మనమెంతో ఆలస్యం చేశాం... ఇందుకు కారకులు ఎవరైనప్పటికీ, మనం ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. మనమంతా వ్యక్తిగతంగా కలుసుకున్నపుడు ఈ వాస్తవంతో ఏకీభవిస్తుంటాం. కానీ, అందరం ఒక వేదికపై కలుసుకున్నపుడు పరిస్థితి మారిపోతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అఖిలపక్ష సమావేశం సందర్భంగా మనమంతా కలిశాం. ఆ సందర్భంలో ఒక్క పార్టీ మినహా మిగిలినవన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత జరిగిందేమిటన్న దానితో నిమిత్తం లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ తనదైన మార్గం అనుసరించాయి. అయితే, రాజకీయ కోణంలో మాత్రమే ఆలోచించేవారికి ఓ మిత్రుడుగా నేనొక మాట చెప్పదలిచాను. ఈ సలహా వారికెంతో ఉపయుక్తం కూడా కాగలదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌పై చర్చ మొదలయ్యాక ప్రతిసారి దేశంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూ వచ్చింది. ఫలితంగా మహిళలకు ఈ హక్కును వ్యతిరేకించిన పార్టీలను వారెన్నడూ క్షమించలేదు సరికదా.. కఠినంగా వ్యవహరించారు. కానీ, 2024 నాటి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పరిణామమేదీ సంభవించ లేదు. ఎందుకంటారు?.. ఆ ఎన్నికలకు ముందు దీనికి ఆమోదముద్ర వేయడంలో అందరూ ఏకతాటిపైకి వచ్చారు. కాబట్టే, ఏ ఒక్కరో రాజకీయంగా లాభపడటం లేదా కోల్పోవడం వంటివేవీ సంభవించలేదు. ఆ మేరకు 2024 ఎన్నికల పోరాటం ఇతరత్రా అంశాల ప్రాతిపదికగా సాగింది. వారిలో కొందరిక్కడున్నార... కొందరు లేరు. ఇప్పుడు కూడా నేనిదే చెబుతున్నాను... మనమంతా ఏకమై ముందడుగు వేస్తే, ఇది ఏదో ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేది కాదనడానికి చరిత్రే సాక్ష్యమిస్తుంది. అది దేశ ప్రజాస్వామ్యానికి, సామూహిక నిర్ణయాత్మక శక్తికి సానుకూల పరిణామం కాగలదు. అంతేకాదు... ఆ ఉజ్వల చరిత్రకు మనమంతా అర్హులమవుతాం. అంటే- అధికార పార్టీకి లేదా మోదీకి మాత్రమే పరిమిత కాదు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటుంది. కాబట్టి, నేటి ఈ ప్రక్రియను రాజకీయం చేయాలని చూస్తే, గడచిన మూడు దశాబ్దాలను ఒక్కసారి వెనక్కు తిరిగి చూడాలని కోరుతున్నాను. ఇందులో వారికీ ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆ మార్గమేమిటో కూడా నేనిప్పుడు చెబుతున్నాను... అదేమిటంటే- మీరు కూడా చారిత్రక నష్టాల నుంచి కోలుకుంటారు. కాబట్టి, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
గౌరవనీయ అధ్యక్షా!
ప్రభుత్వాధినేతగా అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు నేనొక సంస్థలో కార్యకర్తగా ఉన్నాను. ఆ సమయంలో మహిళలకు పంచాయతీ స్థాయి రిజర్వేషన్లపై రాజకీయ వేదికలలో చర్చలను గమనించాను. అటుపైన వారికి ఆ హక్కు సరళంగా దక్కడం చూశాను. తమ పదవులు లేదా అధికారం కోల్పోతామనే భయం లేకపోవడం వల్ల పంచాయతీలలో వారికి కోటాపై నాయకులు సుముఖత ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే, పార్లమెంటు స్థాయిలో ఇది అంత సులభం కాబోదన్న వాదనలు ఈ ప్రాంగణంలో వినిపిస్తూండేవి. ఎందుకంటే- తామేదో కోల్పోతామనే భయం వారిలో ఉండేది. ఇలాంటి ధోరణి ఫలితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ 50 శాతానికి చేరింది.
మిత్రులారా! రాజకీయంగా, మరొక అంశాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను...
ఓ పాతిక 30 ఏళ్ల కిందటిలా కాకుండా మహిళల హక్కులపై వ్యతిరేకత రాజకీయ ఉపరితలం దిగువన నేడు లోతుగా ప్రతిధ్వనిస్తోంది. కాబట్టి, ఇవాళ కూడా అదేవిధంగా ఆలోచించవద్దని నా సూచన. ఆనాడు పంచాయతీ ఎన్నికలలో గెలిచిన మహిలల్లో నేడొక ప్రగాఢ రాజకీయ చైతన్యం పెల్లుబుకుతోంది. వారంతా నేడు క్షేత్రస్థాయి అభిప్రాయ రూపకర్తలుగా పరిణామం చెందారు. మూడు దశాబ్దాల కిందట వారు నిశ్శబ్దంలో ఉండి, అంతా అర్థం చేసుకోగలిగినా అభిప్రాయాలను బయటపెట్టేవారు కాదు. అయితే, నేడు ఈ అనుభవజ్ఞులైన లక్షలాది సోదరీమణులు తాము ఏ స్థానంలో ఉన్నా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. వారి ఆవేదనను గమనించి ఆందోళన చెందారు. ఇవాళ వారేమంటారంటే- మీరు మమ్మల్ని ఇళ్లలో ఊడ్చే, కడిగే పనుల్లోకి నెట్టారు. కానీ, ఇప్పుడు మమ్మల్ని నిర్ణయాత్మక ప్రక్రియలో భాగం చేస్తున్నారు. నిర్ణయాలు అసెంబ్లీలలో, పార్లమెంటులో తీసుకుంటారు. అందువల్ల, రాజకీయ జీవన ప్రగతి అభిలషించే ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, ఏ పార్టీ గురించీ మాట్లాడకుండా, విజయవంతంగా ముందుకెళ్లాలని భావిస్తే, గత 25-30 ఏళ్లలో లక్షలాది సోదరీమణులు క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదిగారనే వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. ఇకపై మీ నిర్ణయాలను ఇక్కడ మాత్రమే కాకుండా అక్కడ కూడా 33 శాతంతో ప్రభావితం చేస్తారు.
అందువల్ల, ఈ రోజు దీన్ని వ్యతిరేకించేవారు చాలాకాలం పాటు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టే- క్షేత్రస్థాయి నుంచి పుట్టుకొచ్చిన మహిళల రాజకీయ నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడంలోనూ రాజకీయ వివేచన ప్రస్ఫుటమవుతోంది. ములాయం సింగ్ గారి కాలం నుంచి ఈ అంశం ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం దాన్ని కొనసాగిస్తోందని నేను విన్నాను. దేశంలోని మహిళలను నమ్మండి.. వారి వివేకాన్ని విశ్వసించండి... 33 శాతం సోదరీమణులను ఇక్కడికి రానివ్వండి... ఎవరికివ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో.. ఏ వర్గానికి ఇవ్వాలో, ఏ వర్గానికి ఇవ్వకూడదో కూడా వారినే నిర్ణయించుకోనివ్వండి. ఇకపై వారే నిర్ణయాలు తీసుకుంటారు. వారి సామర్థ్యాన్ని మనమెందుకు సందేహించాలి? వారిని ఒక్కసారి... ఒక్కసారి రానివ్వండి! అప్పుడు... అంటే- 2034లో... ధర్మేంద్ర గారూ, నన్ను పరిచయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇది నిజం.. నేను అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చాను. ధర్మేంద్ర జీ.. మీకు చాలా కృతజ్ఞతలు.. అఖిలేష్ జీ నా మిత్రుడు కాబట్టి, కొన్నిసార్లు ఆయన నాకు సాయం చేస్తారు. నేను అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చానన్నది నిజమే కానీ, అందరితో మమేకం కావడం నా బాధ్యత. రాజ్యాంగం కూడా నాకు చూపిన మార్గమిదే. రాజ్యాంగమే నాకు సర్వోన్నతం.. ఇంత సామాన్యుడైన, అత్యంత వెనుకబడిన సమాజానికి చెందిన నాలాంటి వ్యక్తికి దేశం ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించడం రాజ్యాంగ బలం వల్లనే సాధ్యమైంది. ఆ మేరకు ఈ రోజు నేనిక్కడ ఉండటానికి కారణమైన దేశ ప్రజలకు, రాజ్యాంగ నిర్మాతలకు రుణపడి ఉన్నాను.
అయితే.. గౌరవనీయ అధ్యక్షా!
ఈనాడు జీవితంలోని ప్రతి రంగంలో దేశ గౌరవాన్ని నిలబెట్టడంలో, పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడంలో మహిళలు ఏమాత్రం వెనుకబడలేదు. ఆ మేరకు మన తల్లులు, సోదరీమణులు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని, మన కుమార్తెలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని మనం గర్వించవచ్చు! ఇంతటి గొప్ప శక్తిగల వారి భాగస్వామ్యాన్ని అడ్డుకోవడానికి మనమెందుకు ఇంత శక్తిని వెచ్చిస్తున్నాం? వారి చేరిక మన శక్తిసామర్థ్యాలను మరింత ఇనుమడింపజేస్తుంది. అందువల్ల, ఈ విషయాన్ని రాజకీయ త్రాసులో తూకం వేయవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం.
గౌరవనీయ అధ్యక్షా!
అందరం కలిసి కూర్చుని, ఒకే దిశలో ఆలోచించి వికసిత భారత్ సాకారంలో మన నారీశక్తి భాగస్వామ్యాన్ని ఏకాభిప్రాయంతో బలపరచాలని నిర్ణయించుకోవడం మనకు దక్కిన అవకాశం. నేను ముందే చెప్పినట్లుగా ఈనాడు యావద్దేశం... ముఖ్యంగా మహిళా శక్తి, మన నిర్ణయాలను గమనిస్తుంది. కానీ, నిర్ణయాలకు మించి మన సంకల్పాన్నే వారు చూస్తారు. కాబట్టి, మన సంకల్పంలో లోపం కనిపిస్తే, దేశంలోని మహిళా శక్తి మనల్ని ఎప్పటికీ క్షమించదు.
గౌరవనీయ అధ్యక్షా!
ఈ కొత్త సభలో 2023లోనే మనమీ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. దేశవ్యాప్తంగా ఒక ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీనికి ఎలాంటి రాజకీయ రంగూ పులమలేదు కాబట్టి, ఇదెన్నడూ రాజకీయ సమస్యగా మారలేదు. అదొక మంచి పరిస్థితి... ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే- దీన్ని ఇంకా ఎంతకాలం ఆలస్యం చేయాలి? మనం జనగణన ఎప్పుడు నిర్వహించామో జనాభా సమస్యలను లేవనెత్తే వారికి తెలియదా? ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు తలెత్తాయో సవివరంగా తన ప్రసంగంలో ప్రస్తావించాలని అమిత్ భాయ్‌ని నేను కోరుతున్నాను. ఈ అంశాలన్నీ నేడు మన ముందున్నాయి. కానీ, మనం 2023లో చర్చించినప్పుడు, దీన్ని త్వరగా సాకారం చేయాలన్న విస్తృత ఏకాభిప్రాయానికి వచ్చాం... ప్రతి ఒక్కరూ అదే కోరారు. అయితే, సమయం తక్కువగా ఉండటం వల్ల 2024లో అది సాధ్యం కాలేదు. ఇప్పుడిక 2029లో మనకో అవకాశం ఉంది.. ఇప్పుడు కాకపోతే అప్పుడెలాంటి పరిస్థితి తలెత్తగలదో మనం ఊహించుకోవచ్చు. అప్పుడు మనం నిజంగా ఈ ప్రయత్నం చేయగలమని దేశంలోని తల్లులను, సోదరీమణులను ఒప్పించలేం. అందువల్ల, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకపోవడమే తక్షణావసరం. ఈలోగా రాజకీయ పార్టీల సభ్యులు, రాజ్యాంగ నిపుణులు, మహిళా కార్యకర్తలు సహా అనేకమందితో చర్చలు సాగాయి. కొందరు స్వచ్ఛందంగా సూచనలిచ్చారు. అన్ని పార్టీలతో, సంస్థాగతంగా, అనధికారికంగానూ నిరంతరం చర్చలు సాగాయి. ఇంత లోతైన మథనం తర్వాత మన తల్లులు, సోదరీమణుల శక్తిసామర్థ్యాలను వినియోగించుకునే మార్గాన్ని మనం అన్వేషించాలి.
గౌరవనీయ అధ్యక్షా!
నేను ఒక విషయం కచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. దేశాన్ని ముక్కలుగా భావించే హక్కును రాజ్యాంగం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికీ ఇవ్వలేదు. మనం తీసుకున్న ప్రమాణం... దేశాన్ని ఒకటిగా భావించాలని నిర్దేశిస్తుంది. అది కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, మనం దేశాన్ని వేర్వేరు భాగాలుగా ఆలోచించలేం, విభజించి నిర్ణయాలూ తీసుకోలేం. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఏమాత్రం నిజం లేని నిరాధార ఆరోపణల గురించి... ఈ సభలోని ఈ పవిత్ర స్థానం నుంచి నేను పూర్తి బాధ్యతతో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అది దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమ ప్రాంతాలైనా... చిన్న రాష్ట్రాలైనా... పెద్ద రాష్ట్రాలైనా... ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరిపైనా వివక్ష చూపదని, ఎవరికీ అన్యాయం చేయదని నేను బాధ్యతతో చెబుతున్నాను. మునుపటి ప్రభుత్వాల హయాంలో ఏ డీలిమిటేషన్లు జరిగినా, అప్పటి నుంచి ఏ నిష్పత్తులను అనుసరించినా, ఆ నిష్పత్తుల్లో ఎటువంటి మార్పూ ఉండదు. ఏదైనా పెరుగుదల ఉన్నా అది అదే నిష్పత్తిలో ఉంటుంది. ఇక్కడ 'హామీ' అనే పదం అవసరమైతే, నేను హామీ అనే పదాన్నే ఉపయోగిస్తాను. మీకు 'వాగ్దానం' అనే పదం కావాలంటే, నేను వాగ్దానం అనే పదాన్నే ఉపయోగిస్తాను. తమిళంలో మంచి పదం ఏదైనా ఉంటే, దాన్నీ వాడటానికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు, మనం పదాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉండదు.
గౌరవనీయ అధ్యక్షా!
సభలోని సహచరులందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే... మనం భ్రమల్లో, అహంకారంతో ఉండిపోకూడదు. నేను ‘మనం’ అనే పదాన్ని వాడుతున్నాను. ‘నేను’, ‘మీరు’ అని మాట్లాడటం లేదు. దేశంలోని మహిళా శక్తికి మనం ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఉండిపోకూడదు. అది వారి హక్కు. దాన్ని మనం ఎన్నో దశాబ్దాలుగా అడ్డుకున్నాం. మనం చేసిన తప్పును సరిద్దిదుకోవడం ద్వారా ఈ రోజు ఆ పాపం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే అవకాశం లభించింది. దీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఎలా కుట్రలు పన్నారో, ఎలాంటి కుటిల చాకచక్యాన్ని ప్రదర్శించారో మనందరికీ తెలుసు. దీనికి ఎప్పుడూ అనుకూలమేనని మనం చెప్పాం... కానీ దీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఏదో ఒక సాంకేతిక సాకు చూపేవారు. ప్రతిసారీ ఇలాంటి విషయాలనే ముందుకు తెచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకించే ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదు. ఆ కాలం గడిచిపోయింది. మీరు అలా చేయలేరు. ఆ మాట చెప్పే ధైర్యం మీకు లేదు. ఇది చేయండి, అది చేయండి, ఇది జోడించండి వంటి సాంకేతిక సాకులతో ఇప్పుడు మీరు దేశంలోని మహిళలకు ఈ విషయాన్ని వివరించలేరు. సభలోని సంఖ్యాబలాలను కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు రకరకాల సాకులు, సాంకేతిక సమస్యలను చూపుతూ మనం దీనిని మూడు దశాబ్దాలుగా అడ్డుకున్నామన్నది మాత్రం నిశ్చయం. మీరు కోరుకున్నదంతా సాధించారు, ఇక దానిని వదిలేయండి! దానిని అడ్డుకోవడానికి మూడు దశాబ్దాలు సరిపోవా? మూడు దశాబ్దాలుగా మీరు దానిని ఆపారు, అయినా ఏమీ సాధించలేకపోయారు, కాబట్టి ఇప్పుడైనా చేయండి.
గౌరవనీయ అధ్యక్షా!
ఇక్కడ కొంత మంది ఇలా అనుకుంటున్నారు.
గౌరవనీయ అధ్యక్షా!
దీని వెనక ఎక్కడో మోదీ రాజకీయ స్వార్థం దాగి ఉందని ఇక్కడ కొంతమందికి అనిపిస్తోంది. వాళ్ళని మాట్లాడనివ్వండి. పాపం, ఆ మనిషి నోరు అక్కడ మూసుకుపోతుంది. బెంగాల్‌లో ఎవరూ అతన్ని మాట్లాడనివ్వరు కదా.
గౌరవనీయ అధ్యక్షా!
చూడండీ... దీనిని వ్యతిరేకిస్తే, సహజంగానే నాకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది. కానీ మనం కలిసి ముందుకు సాగితే, అప్పుడు ప్రత్యేకించి ఎవరికీ లాభం ఉండదు. ఇది రాసుకోండి. ఎవరికీ లాభం ఉండదు... ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎవరికీ ప్రయోజనం లభించదు. మాకు గుర్తింపు అక్కర్లేదు. ఇది ఆమోదం పొందిన వెంటనే... రేపు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటన ఇవ్వడానికి, మీ అందరి ఫోటోలను ప్రచురించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ గుర్తింపు మీరే తీసుకోండి! మీకు గుర్తింపు గురించి చింత ఉంటే, తీసుకోండి. మీరు ఎవరి ఫోటోను ప్రచురించాలనుకున్నా, మేం దానిని ప్రభుత్వ ఖర్చుతో ప్రచురిస్తాం. నేను ముందు నుంచీ పూర్తి గుర్తింపును మీకే ఇస్తున్నాను.
గౌరవనీయ అధ్యక్షా!
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యాపరమైన అంశం గానీ, ప్రజాస్వామ్య ఏర్పాట్లలో ఒక పరిమిత మెరుగుదల గానీ కాదు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య మాతగా భారత్ నిబద్ధత. ఇది ఒక సాంస్కృతిక నిబద్ధత. ఈ నిబద్ధత కారణంగానే పంచాయతీల్లో ఈ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాల్లో ఇది 50 శాతానికి చేరుకుంది. మనం దీనిని అనుభవపూర్వకంగా చూశాం. చాలా కాలం పాటు, ప్రజలు నాకు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశాన్నిచ్చారు. ఆ కాలంలో నేను క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని చూశాను. నా అనుభవం ప్రకారం, సమస్యలను సున్నితత్వంతో పరిష్కరించడంలో వారి నిబద్ధత చాలా ప్రభావవంతంగా ఉంది, అది అభివృద్ధి ప్రయాణానికి ఊపునిచ్చింది. ఆ అనుభవం ఆధారంగా నేను చెబుతున్నాను... ఈ సభలో వారి గొంతు ఒక కొత్త బలంగా మారుతుంది. ఒక కొత్త ఆలోచనను జోడిస్తుంది. దేశ దిశకు సున్నితత్వం చేకూరుతుంది. వాస్తవాలు, వాదనలతో కలిసినప్పుడు అనుభవం బలం అనేక రెట్లు పెరుగుతుంది. సభ సుసంపన్నమవుతుంది.
గౌరవనీయ అధ్యక్షా!
మన దేశంలో అనుభవజ్ఞులైన మహిళా శక్తికి కొరత లేదు. సమర్థులైన మహిళలకు ఏమాత్రం లోటు లేదు. మనం వారిని విశ్వసిద్దాం. వారు తమ వంతు కృషి చేస్తారు. అత్యంత అద్భుతంగా సేవలందిస్తారు. నేటికీ, ఇక్కడ మన సోదరీమణులకు ఎప్పుడు అవకాశం లభించినా, వారు తమ సామర్థ్యాన్ని చక్కగా చాటుకున్నారు. ఈ సభకు ఎంతో వన్నె తెచ్చారు.
గౌరవనీయ అధ్యక్షా!
దేశవ్యాప్తంగా ఈ రోజు 650కి పైగా జిల్లా పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 275 పంచాయతీలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల కంటే వీరికే అధిక బాధ్యతలు, నిధులు, నిర్వహణ అధికారాలు ఉన్నాయి. వీరు అత్యంత సమర్థవంతంగానూ పనిచేస్తున్నారు. సుమారు 6,700 మండల పంచాయతీల్లో 2,700కి పైగా పంచాయతీలకు మహిళలే సారథ్యం వహిస్తున్నారు. నేడు 900కి పైగా నగరాల్లోని పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లుగా గానీ, స్థాయీ సంఘాల అధ్యక్షులుగా గానీ మన సోదరీమణులే అధికారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశం సాధిస్తున్న ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో గణనీయమైనదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ సేవను గుర్తించి, సముచితంగా గౌరవించడానికి ఇదే సరైన సందర్భం. ఈ అనుభవం సభకు తోడైనప్పుడు, సభ బలం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది.
గౌరవనీయ అధ్యక్షా!
సుదీర్ఘ నిరీక్షణ మనందరిలో ఒక సందేహాన్ని సృష్టించింది. ఈ పరిస్థితిని మనమే సృష్టించుకున్నాం. గతంలో ఉన్న పరిమితులు, ఇబ్బందుల నుంచి బయటపడి... ధైర్యంగా ముందుకు సాగి... దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ రోజు మనమంతా కలిసి నిర్ణయం తీసుకుని, ఏకగ్రీవంగా ముందుకు సాగాలని నేను గట్టిగా కోరుతున్నాను. అలా ఏకగ్రీవంగా ముందుకు సాగినప్పుడు, అధికార యంత్రాంగంపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ప్రతి ఒక్కరు చెప్పే వాటిని పరిగణనలోకి తీసుకోవాలనీ, ఇందులో ఎలాంటి హానీ లేదని వారు భావిస్తారు. ఐకమత్య బలం మనకు ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది.
గౌరవనీయ అధ్యక్షా!
ఎక్కువ సమయం తీసుకోకుండా, నేను ఒక్క విషయం మాత్రం చెబుతాను. దీనిని రాజకీయ త్రాసులో తూచవద్దు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే... మనం ఇక్కడికి తీసుకువస్తున్న వారిపైనే ఈ గొప్ప దేశ బాధ్యతలో సగ భాగం ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే హక్కు వారికీ ఉంది. మనం వారిని అడ్డుకోకూడదు. ఇక సంఖ్యా బలాల విషయానికి వస్తే... గతంలో ఒక చర్చ జరిగింది. వారి సంఖ్యను తగ్గించకూడదు... బదులుగా మరింత పెంచాలని, అప్పుడే ప్రక్రియ వేగవంతమవుతుందనేది ఆ చర్చల సారం. ఇప్పుడు ఆ అంశమే మన ముందుకు వచ్చింది. గతంలో ఉన్న 33 శాతం సంఖ్యను పెంచాలనే చర్చ. తద్వారా ఎవరికీ తమ హక్కులు హరించుకుపోయాయని అనిపించకుండా ఉంటుంది. దీనివల్ల ఒక కొత్త బలం సమకూరుతుంది. అదనపు శక్తీ చేకూరుతుంది. సభ కూర్పులోనూ తగిన సర్దుబాట్లు జరుగుతాయి. మేం ఇప్పటికే ఆ దిశగా ఆలోచించి, అందుకు అవసరమైన వేదికను సిద్ధంగా ఉంచాం.
గౌరవనీయ అధ్యక్షా!
కాస్త సరదాగా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ వారి సొంత రాజకీయ కారణాలు ఉంటాయన్నది వాస్తవం. ఓటమి భయం ఉండటం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ మన సంప్రదాయం ప్రకారం, ఏదైనా మంచి పని జరిగినప్పుడు 'దిష్టి' తగలకుండా ఉండేందుకు మనం ఒక నల్ల చుక్క పెడతాం. అలా ఈ మంచి పనికీ నల్లని దిష్టి చుక్క పెట్టినందుకు మీకు నా ధన్యవాదాలు!
చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
****
(రిలీజ్ ఐడి: 2252785)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22