పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా స్థితి
పరిశ్రమల సంఘాలతో సహా వివిధ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్న గనుల మంత్రిత్వ శాఖ
ఎల్‌పిజి సరఫరాలో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం; పంపిణీదారుల వద్ద సరిపడా నిల్వలు
ఏప్రిల్ 3 నుంచి 5 కేజీల ఎఫ్టిఎల్ సిలిండర్లపై 5,600 పైగా అవగాహన సదస్సులు నిర్వహించిన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు; 69,000 పైగా సిలిండర్ల విక్రయం
ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు... 62 శాతం పెరిగిన అమ్మకాలు
దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఎక్కడా రద్దీ లేకుండా సాధారణ స్థాయిలో కొనసాగుతున్న కార్యకలాపాలు
ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారత్ తిరిగి వచ్చిన సుమారు 10.10 లక్షలమంది ప్రయాణికులు
2,348 మంది భారతీయ పౌరులను అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా భారతదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేసిన ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 5:56PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల సన్నద్ధతకు, సజావుగా పనితీరు సాగేందుకు భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఉంది. మైనింగ్, ఇంధన సరఫరా, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులకు సహాయం వంటి అంశాల్లో చేపడుతున్న చర్యల వివరాలను ఈ తాజా సమాచారం అందిస్తుంది.
గనుల రంగం తాజా స్థితి
పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తే సమస్యల విషయంలో గనుల మంత్రిత్వ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలను ఆ శాఖ వివరించింది.
-
పెట్రోలియం, ఇంధనానికి సంబంధించి మార్చి 2026లో ఏర్పాటైన సాధికార బృందానికి గనుల మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తోంది. పశ్చిమ ఆసియా పరిణామాల వల్ల కలిగే సమస్యలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.
-
పరిశ్రమల భాగస్వాముల అవసరాలను అంచనా వేయడానికి వారి సలహాలు కోరారు. సమర్థవంతమైన సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించి, వారి వివరాలను పరిశ్రమలకు అందించారు.
-
వివిధ ముడి పదార్థాల అవసరాల గురించి చర్చించడానికి సంబంధిత భాగస్వాములతో మూడు సమావేశాలు నిర్వహించారు.
-
మొదటి సమావేశం ఏప్రిల్ 01, 2026 న ప్రాథమిక, ద్వితీయ శ్రేణి అల్యూమినియం తయారీదారులు, అల్యూమినియం సంఘాలతో జరిగింది.
-
రెండవ సమావేశం ఏప్రిల్ 02, 2026 న రాగి ఉత్పత్తిదారులు, సంఘాలతో జరిగింది.
-
ఏప్రిల్ 09, 2026 న పరిశ్రమల సంఘాలతో (ఫిమీ, ఫిక్కీ, సీఐఐ, పీహెచ్‌డీసీసీఐ, అసోచామ్ మొదలైనవి) చర్చలు జరిగాయి. పరిశ్రమల నుంచి అందిన సలహాలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపారు.
-
తదనంతరం, ఏప్రిల్ 08, 2026 నాటి లేఖ ద్వారా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ లోహాల వంటి కొన్ని కీలక రంగాలకు ఎల్‌పిజి కేటాయింపుపై భరోసా ఇచ్చింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సమగ్ర విధానానికి అనుగుణంగా అవసరమైన సహకారం అందిస్తామని కూడా పరిశ్రమలకు హామీ ఇచ్చారు.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పిజి నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడడానికి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం:
ప్రజలకు సూచనలు, అవగాహన
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ప్రజలు ఆందోళనతో వీటిని కొనుగోలు చేయవద్దని సూచించారు.
-
పుకార్లను నమ్మవద్దని, సరైన సమాచారం కోసం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
-
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ మార్గాలను ఉపయోగించాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం తగ్గించాలని కోరారు.
-
పౌరులు పీఎన్జీ, విద్యుత్ లేదా ఇండక్షన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడాలని ప్రోత్సహిస్తున్నారు.
-
ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ తమ రోజువారీ అవసరాల్లో ఇంధనాన్ని పొదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సన్నద్ధత - సరఫరా నిర్వహణ చర్యలు
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ప్రమేయం లేకుండా గృహ అవసరాలకు ఎల్‌పిజి, పిఎన్‌జి , రవాణాకు సిఎన్‌జి 100 శాతం సరఫరాను నిర్ధారించారు.
-
వాణిజ్య ఎల్‌పిజి కోసం ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికులకు అందించే 5 కేజీల ఎఫ్టిఎల్ సరఫరాను 2026 మార్చి 2, 3 తేదీల సగటు రోజువారీ విక్రయాల ఆధారంగా రెట్టింపు చేశారు.
-
సరఫరా, డిమాండ్ రెండింటినీ క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను అమలు చేసింది. ఇందులో రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, బుకింగ్ కాలపరిమితిని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, సరఫరాలో ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఉన్నాయి.
-
ఎల్‌పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
-
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా, సింగరేణి సంస్థలను ఆదేశించింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పిఎన్‌జి కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయ ప్రయత్నాలు - సంస్థాగత యంత్రాంగం:
-
నిత్యావసర వస్తువుల చట్టం, 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు, 2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడానికి, అక్రమ నిల్వలు, నల్లబజారు అమ్మకాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు.
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలోనూ, క్రమబద్ధీకరించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలదే ప్రధాన పాత్ర. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అన్ని రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
-
భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీ లేఖల ద్వారా, ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందని పౌరులకు భరోసా ఇవ్వడానికి విస్తృత ప్రచారం అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, 02.04.2026 (పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026 (పెట్రోలియం,సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సమాచార, ప్రసార, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శులతో కలిసి నిర్వహించిన సమావేశం) తేదీలలో సమావేశాలు జరిగాయి. వీటిలో ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రముఖంగా పేర్కొన్నారు.
-
రోజువారీ మీడియా సమావేశాలు ప్నిర్వహించాలని, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు.
-
సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, అసత్య సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షిస్తూ, వాటిని తిప్పికొట్టాలని సూచించారు.
-
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమన్వయంతో తనిఖీలు, దాడులు కొనసాగించాలని కోరారు.
-
సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పిజి కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించారు.
-
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ పంపిణీ ఉత్తర్వులను విడుదల చేయాలని నిర్ణయించారు.
-
పీఎన్జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
-
ఎల్‌పిజి సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. సుస్థిర సరఫరాకు 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీ విధానాన్ని అనుసరిస్తారు.
-
అక్రమ నిల్వలు, నల్లబజారు అమ్మకాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
-
అనేక రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి/ పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
-
దేశవ్యాప్తంగా ఎల్‌పిజి అక్రమ నిల్వలు, నల్లబజారు అమ్మకాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. 15.04.2026 నాటికి 2500 పైగా దాడులు నిర్వహించారు.
-
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. నిన్నటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 238 ఎల్‌పిజి పంపిణీ సంస్థలపై జరిమానాలు విధించగా, 63 పంపిణీ సంస్థలను సస్పెండ్ చేశారు.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
-
గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
-
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
-
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
-
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 92 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
-
గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
-
మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
-
కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
-
2026 ఏప్రిల్ 3 వరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 5600 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 69,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 15.5 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
-
15.04.2026 నాడు 7,930 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్పీజీ విక్రయమైంది. ఇది 4.17 లక్షలకు పైగా (19 కిలోల) సిలిండర్లతో సమానం.
-
2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,42,156 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ విక్రయమైంది. ఇది 74.8 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లతో సమానం. ఇందులో 8,400 మెట్రిక్ టన్నులకు పైగా ఆటో ఎల్‌పీజీ కూడా ఉంది.
-
2026 ఏప్రిల్ 2026 నెలలో (15వ తేదీ వరకు) పీఎస్‌యూ చమురు సంస్థల సగటు ఆటో ఎల్‌పీజీ విక్రయాలు రోజుకు సుమారు 286 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరిలో ఉన్న రోజువారీ సగటు 177 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ విషయంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది.
-
ఆటో ఎల్‌పీజీ విక్రయాలు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు సంస్థలకు మారిన ధోరణి కనిపిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి పీఎస్‌యూ సంస్థల ఆటో ఎల్‌పీజీ విక్రయాలు 62 శాతం పెరిగాయి. ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ భారీ వృద్ధి కనిపించింది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు
-
వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్‌జీ విభాగాలకు 100 శాతం సరఫరాను అందిస్తున్నారు.
-
ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపును వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
-
సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
-
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించి తలెత్తే ఆందోళనలను తగ్గించేందుకు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో(జీఏ) హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
-
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
-
సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరడం జరిగింది.
-
కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయించనున్నట్లు ప్రతిపాదించింది.
-
పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలతో అనుసంధానమైన అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
-
రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి 3 నెలల పాటు ప్రత్యేకంగా 'తక్కువ కాలపరిమితితో కూడిన వేగవంతమైన అనుమతుల ఫ్రేమ్‌వర్క్'ను అనుసరించాలని నిర్ణయించింది.
-
కేంద్ర ప్రభుత్వం 24.03.2026 నాటి గెజిట్ ద్వారా నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద 'సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026'ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల ఏర్పాటు, విస్తరణ కోసం క్రమబద్ధీకరించిన, కాలపరిమితితో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది అనుమతులలో జాప్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పీఎన్జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేయటం, చిట్టచివరి వరకు కనెక్టివిటీని మెరుగుపరచటంతో పాటు స్వచ్ఛమైన ఇంధనాల వైపు పరివర్తనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ భారతదేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఇది ముందుకు తీసుకెళ్తుంది.
-
గృహావసరాల పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని అన్ని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. అలాగే పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి 'జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0' గడువును 30.06.2026 వరకు పొడగించారు.
-
స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి ఒక నమూనా డ్రాఫ్ట్ 'స్టేట్ సీబీడీ (కంప్రెస్డ్ బయోగ్యాస్) విధానాన్ని' రూపొందించింది. రాష్ట్రాలు సొంత పెట్టుబడిదారుల అనుకూల, అమలు-ఆధారిత వ్యవస్థను సృష్టించుకోవడానికి ఇది ఒక సమగ్ర, సరళమైన మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
-
2026 మార్చి నుంచి సుమారు 4.58 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది.. సుమారు 5.1 లక్షల మంది అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు. 15.04.2026 నాటికి దాదాపు 35,000 మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు పరిస్థితి, చమురు శుద్ధి కార్యకలాపాలు
-
అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు ఉన్నాయి.
-
గృహ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి గృహావసరాల ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
-
దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఉమ్మడి కార్యవర్గ బృందాన్ని (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేశారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీహెచ్‌టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ) నిర్ణయించిన ప్రకారం కీలక రంగాలకు అవసరమైన కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లతో సహా చమురు శుద్ధి కర్మాగారాలకు అనుమతినిచ్చింది.
-
ఔషధ విభాగం, రసాయనాలు- పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఫార్మా - రసాయన రంగ సంస్థల కోసం ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1,000 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ఎల్పీజీ కేటాయించారు.
-
2026 ఏప్రిల్ 9 నుంచి ఇప్పటివరకు సుమారు 2,000 మెట్రిక్ టన్నుల ప్రోపిలిన్ విక్రయమైంది.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధ చర్యలు
దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను ఆదుకోవడం కోసం భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడం కోసం భారత ప్రభుత్వం 11.04.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50కు, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42కు పెంచింది.
పీఎస్‌యూ ఓఎంసీల రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు, ధరల పెంపూ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్, లదాఖ్‌లు దీని అవసరం లేదని సూచించాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికులను కాపాడటం కోసం నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను చేపట్టింది. ఆ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది.
సముద్రయాన సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకావాణిజ్య భాగస్వాములతో సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ యాక్టివేషన్ అయినప్పటి నుంచి 6,580 కాల్‌లు, 13,719 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించింది. గత 24 గంటల్లో 131 కాల్‌లు, 276 ఈమెయిళ్లు అందాయి.
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో చేరుకున్న 80 మంది సహా, ఇప్పటివరకు మొత్తం 2,417 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడానికి డీజీ షిప్పింగ్ కృషి చేసింది.
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయి. భారత మిషన్లతో సమన్వయంతో కొనసాగిస్తున్నాయి.
సమాచారాన్ని పంచుకోవడం, మరింత మెరుగైన సమన్వయం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది.
భారత మిషన్లు, పోస్టులు ఇరవై నాలుగు గంటలూ హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ భారత పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు... విమాన, ప్రయాణ పరిస్థితులు... కాన్సులర్ సేవలు... మన పౌరులకు మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యల గురించిన సమాచారం సహా, ఎప్పటికప్పుడు అవసరమైన తాజా సూచనలను జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు ఈ ప్రాంతంలోని వివిధ సంఘాలు, సంస్థలు, వృత్తి నిపుణుల సమూహాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వాములు సహా భారతీయ సమాజంతో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి.
మన మిషన్లు ఈ ప్రాంతంలోని నౌకల్లో గల భారతీయ సిబ్బందిని స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సహాయం అందించడం, భారత్‌కి తిరిగి రావాలనే అభ్యర్థనలను సులభతరం చేయడం సహా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నాయి.
గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 10,10,000 మంది ప్రయాణికులు భారత్‌కు ప్రయాణించారు.
యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ- భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు యూఏఈ, భారత్ మధ్య సుమారు 100 విమానాలు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు సుమారు 10 విమానాలను భారత్‌కు నడపనుంది.
కువైట్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను భారత్‌కు నడుపుతున్నాయి.
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ సంస్థ భారత్‌కి పరిమిత విమాన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు షెడ్యూల్ చేయని విమానాలను నడుపుతోంది.
ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. భారత్‌కి ప్రయాణించడం కోసం దేశంలోని పలు గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 1,031 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులను ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ల మీదుగా భారత్ తరలించేందుకు 2,348 మంది భారతీయ పౌరుల రవాణాను సులభతరం చేసింది.
పరిమిత విమాన కార్యకలాపాలతో ఇజ్రాయెల్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత్‌కు ప్రయాణించడానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252779)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam