పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలోని పరిస్థితుల దృష్ట్యా కీలక అంశాలపై తాజా సమాచారం
సాధారణంగా కొనసాగుతున్న గృహావరసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ… నిన్న 51.5 లక్షల సిలిండర్ల పంపిణీ
ఇప్పటివరకు ఎంవైపీఎన్‌జీడీ.ఇన్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసుకున్న 26,000 మందికిపైగా పీఎన్‌జీ వినియోగదారులు
5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోసం గత 8 రోజుల్లో సుమారు 2,900 అవగాహనా సదస్సులను నిర్వహించిన పీఎస్‌యూ ఓఎంసీలు
హర్మూజ్ జలసంధిని దాటిన సుమారు 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీగల భారత నౌక్ జగ్ విక్రమ్
గల్ఫ్ ప్రాంతం నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న 2,009 మందికి పైగా భారత నావికులు.. 24 గంటల్లో 81 మంది రాక
భారత పౌరులకు నిరంతర హెల్ప్‌లైన్ సేవలు, ముందస్తు సహకారాలను అందిస్తున్న విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, ఇతర కేంద్రాలు
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 4:45PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం క్రియాశీలకంగా, సమన్వయంతో చర్యలు చేపడుతోంది. నిరంతరం ఇంధన సరఫరాను కొనసాగించటం, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు సహకరించటంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హర్మూజ్ జలసంధి మూసివేయటంతో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా చర్యలు చేపడుతోంది. ఇంధన సరఫరా పరిస్థితిపై మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా వివరాలు:
ప్రభుత్వ ప్రకటన, ప్రజలకు అవగాహన
· పౌరులు ఆందోళనతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అవసరానికి మించికొనుగోలు చేయవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
· ఎల్పీజీ వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ల వద్దకు నేరుగా వెళ్లకుండా డిజిటల్ వేదికల ద్వారా బుకింగ్ చేసుకోవాలని కోరారు.
· పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించేలా పౌరులను ప్రోత్సహించారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పౌరులందరూ రోజువారీ అవసరాల్లో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ, పీఎన్‌జీలకు, ఆస్పత్రులు, విద్యా సంస్థలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
· సరఫరా, డిమాండ్‌ను సమన్వయం చేయటానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంచటం, ఎల్పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచటం, ప్రాధాన్యత గల రంగాలకు సరఫరాను క్రమబద్ధీకరించటం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎంపిక చేసుకునేలా అందుబాటులోకి తెచ్చింది.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేయటానికి రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు నూతన పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
రాష్ట్రాలు, యూటీలు, సంస్థాగత వ్యవస్థలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావతసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ (నియంత్రణ) ఉత్తర్వులు-2000 ప్రకారం నిల్వలు చేపట్టేవారిపై, బ్లాక్ మార్కెట్ సృష్టించేవారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
· భారత ప్రభుత్వ 27.03.2026, 02.04.2026 తేదీల్లో ప్రకటించిన లేఖల ద్వారా దేశంలో సరిపడా ఇంధనం అందుబాటులో ఉందనే విషయంపై పౌరులకు భరోసా కల్పించేందుకు క్రియాశీల బహిరంగ సమాచార ప్రసారం అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు, యూటీలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో 02.04.2026న (ఎంఏపీఎన్‌జీ సెక్రటరీ అధ్యక్షతన), 06.04.2026న (ఎంఏపీఎన్‌జీ సెక్రటరీతో పాటు సమాచార, ప్రసార, వినియోగదారుల వ్యవహారాల శాఖల సెక్రటరీల అధ్యక్షతన) సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఈ అంశాలపై స్పష్టతనిచ్చారు:
· రోజూ పత్రికా సమావేశాలను నిర్వహించటం, క్రమం తప్పకుండా బహిరంగ ప్రకటనలను జారీ చేయటం.
· సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని పర్యవేక్షించటం, వాటిని అరికట్టటం.
· జిల్లా పరిపాలనా వ్యవస్థ ద్వారా రోజువారీ అమలు చర్యలను వేగవంతం చేయటం, ఓఎంసీల సమన్వయంతో తనిఖీలు, దాడులను కొనసాగించటం.
· రాష్ట్రాలు, యూటీల్లో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయటం.
· రాష్ట్రాలు, యూటీలకు అదనంగా కేటాయించిన ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
· పీఎన్‌జీ వాడకాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించటం.
· గృహావసర ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వటం, సరఫరాలో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని నిర్దేశిత పద్ధతిలో చేపట్టటం.
· అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కంట్రోల్ రూంలను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను అన్ని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, యూటీలు క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణా చర్యలు
· ఎల్పీజీ అక్రమ నిల్వలను, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 10.04.2026న దేశవ్యాప్తంగా 3400కు పైగా దాడులు జరిగాయి.
· పీఎస్‌యూ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. నిబంధనలను ఉల్లఘించిన 214 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై జరిమానాలు విధించటమే కాక, 55 డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ సరఫరా వివరాలు:
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు అయిపోయినట్లుగా నివేదికలు లేవు.
· ఆన్‌లైన్ ఎల్పీజీ బుకింగ్‌లు దాదాపు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టటానికి ప్రవేశపెట్టిన డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీలు సుమారు 93 శాతం పెరిగాయి.
· గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉంది.
· 10.04.2026 తేదీన దేశవ్యాప్తంగా 51.5 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
· సంక్షోభానికి ముందుతో పోలిస్తే, మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు సుమారు 70 శాతానికి పెరిగింది. ఇందులో 10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపు ఉంది.
· భారత ప్రభుత్వ 08.04.2026 నాటి లేఖ ద్వారా ప్రస్తుత సమాచారాన్ని వెల్లడించింది.
· ఫార్మా, ఆహార శుద్ధి, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తన శుద్ధి, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ వంటి రంగాల్లోని పారిశ్రామిక యూనిట్లు.. మార్చి 2026 కంటే ముందు వినియోగించిన మొత్తం గృహేతర ఎల్పీజీ పరిమాణంలో 70% వరకు పొందవచ్చు. అయితే, ఇది మొత్తం ఆయా రంగాల వారీగా రోజుకు 0.2 టీఎంటీ పరిమితికి లోబడి ఉంటుంది.
· ఈ కేటాయింపు ద్వారా మొత్తం ఎల్పీజీని పొందాలంటే, సదరు పరిశ్రమలు 21.03.2026 నాటి లేఖలోని పారా (బి) ప్రకారం ఓఎంసీల వద్ద నమోదు చేసుకోవటం, పారా (సి) ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్ కోసం సీజీడీ సంస్థలకు దరఖాస్తు చేసుకోవటం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. పైన పేర్కొన్న పరిశ్రమలు తయారీ ప్రక్రియలో ఎల్పీజీని అంతర్భాగంగా ఉపయోగిస్తున్నా లేదా సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక అవసరాల కోసం వాడుతున్నా, పీఎన్‌జీ దరఖాస్తు నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
· ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లోనూ పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరం కొనసాగేలా, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా నివారించటానికి, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు కలగకుండా చూసేందుకు ఈ చర్యలు తోడ్పడతాయని భావిస్తున్నారు.
· భారత ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు 5కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రోజూవారీ పరిమాణాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించి మార్చి 2026లోని 2వ, 3వ తేదీల్లో వలస కార్మికులకు జరిగిన సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా ఈ కోటాను ఇప్పుడు రెట్టింపు చేసింది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీల) సహకారంతో రాష్ట్రంలోని వలస కార్మికులకు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది.
· పీఎస్‌యూ ఓఎంసీలు గత 8 రోజుల్లో 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై దాదాపు 2,900 అవగాహన సదస్సులను నిర్వహించాయి. ఈ సదస్సుల ద్వారా 29,000లకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించాయి.
· ఫిబ్రవరి-2026లో రోజువారీ సగటు అమ్మకాలు 77,000 ఉండగా.. 10.04.2026న ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· మార్చి 23, 2026 నుంచి ఇప్పటివరకు విద్యార్థులు, వలస కార్మికులతో సహా ఇతర వెనుకబడిన వర్గాలకు 12 లక్షలకు పైగా 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల విక్రయం జరిగింది.
· వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు ఐఏసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన కమిటీ, రాష్ట్ర అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· మార్చి 14, 2026 నుంచి ఇప్పటివరకు దాదాపు 1,13,233 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (ఇది 60 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లకు సమానం) విక్రయాలు జరిగాయి. కేవలం 10.04.2026న 7,140 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (3.76 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లకు సమానం) అమ్మకాలు జరిగాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
· ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దేశీయ గృహ అవసరాల పీఎన్‌జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.
· అందుబాటులో ఉన్న నిల్వలు, రానున్న ఎల్‌ఎన్‌జీ కార్గో షిప్పులను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపులను మరో 5 శాతం పెంచుతున్నారు. ఈ ప్లాంట్లు తమ ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతం సరఫరాను పొందనున్నాయి. ఈ కేటాయింపు 09.04.2026 నుంచి అమలులోకి వచ్చింది.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.
· గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి, మూడు నెలలపాటు తర్వతి ఆమోద విధానాన్ని అమలు చేస్తోంది.
· నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి 30 జూన్ 2026 వరకు పొడిగించింది.
· పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయో, వాటికి అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.
· స్వచ్ఛమైన ఇంధనాన్ని పెంపొందించడానికి, పైపుల ద్వారా గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10.04.2026 తేదీ గల లేఖ ద్వారా ‘‘ఆంధ్రప్రదేశ్ పీఎన్‌జీ సబ్వెన్షన్ పథకం’’ కింద దేశీయ పీఎన్‌జీ వినియోగదారులకు సబ్సిడీ మద్దతును పొడిగించింది.
· మార్చి 2026 నుంచి ఇప్పటి వరకు సుమారు 4.15 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. సుమారు 4.55 లక్షల అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం పేరు నమోదు చేసుకున్నారు.
· ఇప్పటి వరకు 26,000 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
· భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం... మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది. ఔషధ రంగం, ఆహార, పౌర సరఫరాల శాఖ, రసాయనాల శాఖ వంటి కీలక విభాగాలకు వీటిని కేటాయించనున్నారు. ఏ రిఫైనరీ నుంచి ఎంత పరిమాణంలో గ్యాస్ ఇవ్వాలనేది సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్ణయిస్తుంది.
· పైన చెప్పిన శాఖలకు సంబంధించిన కంపెనీల కోసం రోజుకు 800 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను కేటాయించారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· దేశీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి డీజిలుపై లీటరుకు రూ. 21.5, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
· పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
· ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం కోరింది. సరైన సమాచారాన్ని పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· భారత ప్రభుత్వం 29 మార్చి 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేవలం వంట, వెలుతురు అవసరాల కోసం పీడీఎస్ కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ సేవా కేంద్రాలలో (ప్రాధాన్యంగా సంస్థ స్వయంగా నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ కిరోసిన్‌ను నిల్వ చేయడానికి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు నిర్దేశిస్తాయి.
· ఇప్పటికే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికులను సురక్షితంగా ఉంచడానికి ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను పేర్కొంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
· భారత జెండా కలిగిన ఎల్‌పీజీ నౌక ‘జగ్ విక్రమ్’ నేడు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది.
· ఈ నౌకలో సుమారు 20,400 ఎమ్ టీల ఎల్‌పీజీ సరుకుతో పాటు 24 మంది నావికులు ఉన్నారు. ఇది 2026 ఏప్రిల్ 15న ముంబైకి చేరుకుంటుందని అంచనా.
· షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. అయినప్పటి నుండి 5,973 కాల్స్ , 12,675 కంటే ఎక్కువ ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.. గత 24 గంటల్లో 128 కాల్స్, 319 ఈమెయిళ్లు అందాయి.
· డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 81 మందితో సహా, ఇప్పటివరకు 2,009 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో · మంత్రిత్వ శాఖ సహాయపడింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
· భారతీయ నావికుల సంక్షేమ, అంతరాయం లేని నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, ఇతర సముద్రయాన భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
యుద్ధ ప్రభావ ప్రాంతాల్లో భారతీయ సమాజంతో భారత రాయబార కార్యాలయాలు, పోస్టులు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ... వారి భద్రత, శ్రేయస్సు కోసం సహాయాన్ని అందిస్తూ, అవసరమైన సలహాలను జారీ చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం:
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· సమాచార మార్పిడి, సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ సమాజం రక్షణ, భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
· భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. భారతీయ పౌరులకు సహాయం అందిస్తున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· ఆ ప్రాంతంలోని భారతీయ సంఘాలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో భారతీయ రాయబార కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 8,71,000 మంది ప్రయాణికులు భారత్‌కు చేరుకున్నారు.
· యూఏఈలో భద్రతా, కార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ- భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. ఈ రోజు సుమారు 95 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండటంతో ఖతార్ ఎయిర్‌వేస్ నేడు భారత్‌కు సుమారు 8 నుంచి 10 విమానాలను నడపనుంది.
· కువైట్ గగనతలం ఇంకా మూసివేసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. కువైట్ నుంచి భారతీయ పౌరులు సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
· బహ్రెయిన్ గగనతలం తెరుచుకుంది. గల్ఫ్ ఎయిర్ త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్ నుంచి భారతీయుల ప్రయాణాన్ని సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,225 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్‌కు పంపింది. వీరిలో 981 మంది భారతీయ విద్యార్థులు, 662 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.
· ఇజ్రాయెల్ గగనతలం మూసివేసి ఉంది. భారతీయ పౌరుల ప్రయాణాన్ని జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా సులభతరం చేస్తున్నారు.
· ఇరాక్ గగనతలం పరిమిత కార్యకలాపాలతో తెరిచి ఉంది. భారతీయ పౌరులు జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2251301)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam