భారత ఎన్నికల సంఘం
ఐఈవీపీ 2026: భారతదేశ ప్రజాస్వామ్య పండుగను వీక్షిస్తోన్న ప్రపంచం
22 దేశాల అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలు.. ప్రణాళిక, విస్తృతి, ఓటర్ల భాగస్వామ్యం అద్భుతమని ప్రశంస
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 3:51PM by PIB Hyderabad
1. కేరళ, పుదుచ్చేరి, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్వహించిన 'అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం- 2026'లో (ఐఈవీపీ) భాగంగా 22 దేశాల నుంచి వచ్చిన 38 మంది ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలోని విస్తృతి, ఖచ్చితత్వం, చైతన్యాన్ని స్వయంగా వీక్షించారు.
2. ఈ అనుభవాన్ని ‘ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ’గా అభివర్ణించిన విదేశీ ప్రతినిధులు.. రికార్డు స్థాయిలో ఓటర్ల భాగస్వామ్యం, ఎన్నికల సంఘం చేపట్టిన పకడ్బందీ ప్రణాళిక, ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించారు. క్రొయేషియాకు చెందిన బ్రానిమిర్ ఫర్కాస్ మాట్లాడుతూ.. “భారతీయ ఓటింగ్ విధానం ప్రపంచానికే ఒక నిజమైన ప్రజాస్వామ్య పండుగ. ఓటు వేయడానికి ప్రజల్లో ఉన్న ఉత్సాహం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంతటి భారీ ప్రక్రియను ఇంత పకడ్బందీగా నిర్వహించడం చూసి మేం ఎంతో నేర్చుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
3. అంతర్జాతీయ ప్రతినిధులు తమ రెండు రోజుల పర్యటనను (ఏప్రిల్ 8-9) అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు తొలుత డిస్పాచ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పకడ్బందీ రవాణా, నిర్ణీత ఎస్‌ఓపీ ద్వారా ఎన్నికల సామగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది క్రమ పద్ధతిలో తరలివెళ్లే విధానాన్ని వారు పరిశీలించారు.
4. అనంతరం ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓ), రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులతో విదేశీ ప్రతినిధులు చర్చించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లోని 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించేందుకు సీఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కంట్రోల్ రూంలను కూడా వారు సందర్శించారు. ఈ వ్యవస్థను వారు ‘పారదర్శకతకు ఒక బలమైన స్తంభం’గా అభివర్ణించారు.
“భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం”
- ఉక్-కిబ్ ఎస్పదాస్ అంకోనా, మెక్సికో
5. పోలింగ్ రోజు ఉదయం నమూనా పోలింగ్‌ను విదేశీ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం ఈ 22 దేశాల ప్రతినిధులు అస్సాం (కామ్రూప్ మెట్రో, కామ్రూప్ రూరల్), కేరళ (కొచ్చి, తిరువనంతపురం), పుదుచ్చేరిలోని పోలింగ్ కేంద్రాలను విడివిడిగా సందర్శించి అసలైన ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.
6. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, వీల్‌చైర్లు, వాలంటీర్లు, శిశు సంరక్షణ సౌకర్యాలతో పాటు మహిళలు, దివ్యాంగులు స్వయంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను చూసి వారు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఇక్కడి సమ్మిళిత, భాగస్వామ్య, సులభతర వసతులను వారు కొనియాడారు.
“అత్యున్నత స్థాయి సమ్మిళితత్వం”
- సుశ్రీ ఫాహిమా అరాఫత్ అబ్దుల్లా, కెన్యా
“పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విధానం, కల్పించిన వసతులు ముఖ్యంగా వీల్‌చైర్లు, శిశు సంరక్షణ సౌకర్యాలు మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి”
- పౌలస్ షిగ్వేధా, నమీబియా
7. విదేశీ ప్రతినిధులు జిల్లా స్థాయి మీడియా పర్యవేక్షణ కేంద్రాలను సందర్శించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని వారు అభినందించారు. పర్యావరణహిత, సుస్థిర ఎన్నికల పద్ధతులను చాటిచెబుతూ పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
“భారతదేశంలో ఉన్న గొప్ప విషయాలలో ఈవీఎంల వినియోగం ఒకటి... మేం ఇక్కడ నేర్చుకున్న కొన్ని అంశాలను మా దేశానికి తీసుకెళ్లి అక్కడ ఎలా అమలు చేయవచ్చో పరిశీలిస్తాం. ఇది ఒక పండుగలా ఉంది.. ఎన్నికల స్ఫూర్తి ఇలాగే ఉండాలి”
- అబూబకర్ మహమూద్ కొరోమా, సియెర్రా లియోన్
8. పుదుచ్చేరిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, డ్రోన్ల ద్వారా నిఘా, ‘నీలా’ అనే స్వాగత రోబో వంటి వినూత్న ప్రయత్నాలు విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళలో 'జెన్-జీ' థీమ్‌తో రూపొందించిన పోలింగ్ బూత్‌ను వారు సందర్శించారు. ఇక్కడ తొలిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. అస్సాంలోని కామ్రూప్‌లో(రూరల్) పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఆరోగ్య పరీక్షా కేంద్రాలను పరిశీలించిన విదేశీ ప్రతినిధులు.. స్వయంగా ఆ సేవలను వినియోగించుకున్నారు.
9. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడం, భారీ స్థాయిలో ఓటర్లు తరలిరావడం సందర్శక బృందాలపై బలమైన ముద్ర వేసింది. ఇంతటి భారీ స్థాయి ఎన్నికల నిర్వహణను స్వయంగా వీక్షించే అవకాశం కల్పించినందుకు వారు భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకత, సమ్మిళితత్వం, అత్యున్నత ప్రమాణాల పట్ల ఈసీఐకి ఉన్న నిబద్ధతను వారు కొనియాడారు. “ప్రపంచం నేర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటే భారత్ సాటిలేని స్థాయిలో ఎన్నికలను నిర్వహిస్తూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇది నిజంగా ప్రజాస్వామ్య పండుగ” అని వారు ప్రశంసించారు.
10. ఇతర దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలు (ఈఎంబీ), అంతర్జాతీయ సంస్థలతో సహకారం, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమమే అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం (ఐఈవీపీ). ఈ కార్యక్రమం భారతదేశ ఎన్నికల ముసాయిదా, సంస్థాగత యంత్రాంగం, కార్యాచరణ నిర్మాణాన్ని సమగ్రంగా తెలియజేస్తుంది. ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, వినూత్న పోకడలను అంతర్జాతీయ ప్రతినిధులకు ఇది పరిచయం చేస్తుంది.
గమనిక: అనుబంధం – ఐఈవీపీ2026లో భాగంగా అంతర్జాతీయ ప్రతినిధుల అనుభవాలకు సంబంధించిన యూట్యూబ్ లింకులు.
అనుబంధం-
ఐఈవీపీ 2026 కింద అంతర్జాతీయ ప్రతినిధుల అనుభవాలకు సంబంధించిన యూట్యూబ్ లింకులు
***
(రిలీజ్ ఐడి: 2251296)
సందర్శకుల సూచీ సంఖ్య : : 32