ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌ బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర వద్ద గల హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)

ప్రాజెక్టు వ్యయం, ఈక్విటీ పెట్టుబడుల సవరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వాల జాయింట్ వెంచర్- హెచ్ఆర్ఆర్ఎల్

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 4:21PM by PIB Hyderabad

హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్‌ఆర్ఆర్ఎల్) ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 43,129 కోట్ల నుంచి రూ. 79,459 కోట్లకు పెంచేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనితో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నుంచి రూ. 8,962 కోట్ల అదనపు ఈక్విటీ పెట్టుబడికి కూడా ఆమోదం లభించింది. ఈ పెంపు తర్వాత ప్రాజెక్టులో హెచ్‌పీసీఎల్ మొత్తం ఈక్విటీ పెట్టుబడి రూ. 19,600 కోట్లకు చేరుకుంటుంది.

 

వ్యూహం, లక్ష్యాలు:

 

హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ (హెచ్ఆర్ఆర్ఎల్) 26 శాతం ముడి చమురును పెట్రోకెమికల్ ఉత్పత్తులుగా తయారు చేసే అత్యంత సంక్లిష్టమైన చమురు శుద్ధి కేంద్రం. ఇది ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) పెట్రోల్, 4 ఎంఎంటీపీఏ డీజిల్‌తో పాటు 1 ఎంఎంటీపీఏ పాలీప్రొపిలీన్, 0.5 ఎంఎంటీపీఏ ఎల్‌ఎల్‌పీడీఈ (లీనియర్ లో డెన్సిటీ పాలీఎథిలీన్), 0.5 ఎంఎంటీపీఏ హెచ్‌డీపీఈ (హై డెన్సిటీ పాలీఎథిలీన్).. సుమారు 0.4 ఎంఎంటీపీఏ బెంజీన్, టోలీన్, బ్యూటాడైన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ రవాణా, ఫార్మా, పెయింట్స్, ప్యాకేజింగ్ పరిశ్రమల వంటి భారతదేశ ఇంధన, పారిశ్రామిక వ్యవస్థలకు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు ఇంధన స్వయం సమృద్ధిని అందించడమే కాకుండా పెట్రోకెమికల్ రంగంలో ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

 

ప్రధాన ప్రభావం, ఉపాధి అవకాశాలు:

 

దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పెట్రోకెమికల్ అవసరాలు, ప్రత్యేక ఉత్పత్తుల తయారీ దృష్ట్యా హెచ్ఆర్ఆర్ఎల్ ఒక అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా ఉంది. ఇది ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. స్థానికంగా 'మంగళ క్రూడ్' పేరుతో లభించే ముడి చమురును ఇందులో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయి చమురు శుద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నప్పుడు ఆయా పనుల్లో నిమగ్నమైన వివిధ సంస్థల ద్వారా సుమారు 25,000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించాయి.

 

నేపథ్యం:

 

రాజస్థాన్‌ బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర వద్ద ఏర్పాటు చేస్తోన్న హెచ్ఆర్ఆర్ఎల్.. ఏటా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గ్రీన్‌ఫీల్డ్ చమురు శుద్ధి కేంద్రం -పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీనికి 2.4 ఎంఎంటీపీఏ పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టును హెచ్‌పీసీఎల్ (74 శాతం వాటా), రాజస్థాన్ ప్రభుత్వం (26 శాతం వాటా) సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన 'హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)' చేపడుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2250163) సందర్శకుల సూచీ సంఖ్య : : 29