నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2025-26లో ప్రధాన ఓడరేవుల నుంచి రికార్డు స్థాయిలో 915 మిలియన్ టన్నుల సరకు రవాణా.. లక్ష్యాన్ని అధిగమించి 7.06 శాతం వృద్ధి నమోదు
పనితీరు మెరుగుదల, సామర్థ్య విస్తరణను ప్రతిబింబిస్తున్న బలమైన వార్షిక వృద్ధి
మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 దిశగా భారత వాణిజ్య పురోగతిని వేగిరం చేస్తున్న ఓడరేవులు
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 2:27PM by PIB Hyderabad
న్యూఢిల్లీ 05 ఏప్రిల్ 2026: భారత నౌకాయాన రంగంలో ప్రతిష్ఠాత్మక విజయం నమోదైంది. ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన ఓడరేవుల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 915.17 మిలియన్ టన్నుల (ఎంటీ) సరకు రవాణా జరగటంతో, 904 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని అధిగమించాయి. గతేడాదితో పోల్చితే 7.06 శాతం వృద్ధి నమోదైంది. ఇది ఈ రంగం సాధించిన బలమైన పురోగతి, మెరుగైన సామర్థ్యం, నిరంతర వృద్ధి పథాన్ని స్పష్టం చేస్తోంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047లో భాగంగా ఓడరేవుల వద్ద మౌలిక సదుపాయాలను ఆధునీకరించటానికి, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నౌకాయాన కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయటానికి భారత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడుల ప్రభావాన్ని ఈ కీలక ఘట్టం తెలియజేస్తోంది.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “ప్రధాన ఓడరేవుల నుంచి 915 మిలియన్ టన్నులకుపైగా సరకు రవాణాతో రికార్డు నెలకొల్పటం.. భారతదేశ నౌకా వాణిజ్య రంగాన్ని బలోపేతం చేయటంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను తెలియజేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రపంచస్థాయిలో ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. పనితీరులో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నాం. నిరంతర రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాం. మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 లక్ష్యంతో ప్రపంచ నౌకాయాన శక్తి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే మా సంకల్పాన్ని ఈ విజయం మరింత బలోపేతం చేస్తోంది” అని అన్నారు.
ప్రధాన ఓడరేవులు నిలకడైన వృద్ధి కనబరుస్తూ.. దీన్‌దయాల్ పోర్టు అథారిటీ 160.11 మిలియన్ టన్నుల (ఎంటీ) సరకు రవాణాతో అగ్రస్థానంలో నిలవగా, పరదీప్ పోర్టు అథారిటీ 156.45 ఎంటీతో రెండో స్థానం, జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ (జేఎన్‌పీఏ) 102.01 ఎంటీతో మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు విశాఖపట్నం, ముంబయి, చెన్నై, న్యూ మంగళూరు పోర్టు అథారిటీలు కూడా అద్భుతమైన పనితీరుని కనబరిచి మొత్తం సరకు రవాణాలో కీలక పాత్ర పోషించాయి. వృద్ధి రేటు ప్రకారం.. మోర్ముగావ్ పోర్టు అథారిటీ అత్యధికంగా 15.91 శాతం వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా డాక్ సిస్టమ్ 14.28 శాతం, జేఎన్‌పీఏ 10. 74 శాతం వృద్ధిని కనబరిచాయి.
నౌకాశ్రయాల సామర్థ్యం పెంపుదల, మౌలిక సదుపాయాల ఆధునీకరణ, బహుముఖ అనుసంధానతను బలపరచటం, అంతర్గత ప్రాంతాలతో అనుసంధానత వల్ల సరకు రవాణాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిజిటల్, స్మార్ట్ పోర్టు విధానాలతో బొగ్గు, ముడి చమురు, కంటైనర్లు, ఎరువులు, పీఓఎల్ వంటి కీలక ఉత్పత్తుల నిర్వహణ పెరగటం, ఓడలు తిరిగి వెళ్లే సమయం తగ్గటం, సులభతర వాణిజ్యం మెరుగుపడటం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి, రవాణా సమగ్రత, స్థిరత్వంపై దృష్టి సారిస్తూ.. నౌకా వాణిజ్య వ్యూహాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రికార్డు.. పెరుగుతున్న వాణిజ్య విశ్వాసాన్ని, కార్యకలాపాల సామర్థ్యాన్ని, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన విధానపరమైన చర్యల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. విధానపరమైన సుస్థిర మద్దతు, మౌలిక సదుపాయాల పెట్టుబడులతో మరిన్ని లక్ష్యాలను అధిగమించేందుకు భారత్‌లోని ప్రధాన ఓడరేవులు సిద్ధంగా ఉన్నాయి. ఇవి దేశ ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్య నాయకత్వానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి.

***
(రిలీజ్ ఐడి: 2249253)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10