పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని ప్రజలకు సూచన
అవసరమైతే తప్ప డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లొద్దని విజ్ఞప్తి
సిలిండర్లు పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు డీఏసీ (డెలివరీ అథెంటికేషన్ కోడ్) ఆధారిత ఎల్‌పీజీ డెలివరీల పెంపు
నిన్నటికి 90 శాతానికి చేరుకున్న డీఏసీ ఆధారిత డెలివరీలు.. 2026 ఫిబ్రవరిలో 53 శాతంగా ఉన్న డీఏసీ వినియోగం
చిరునామా ధ్రువీకరణ అవసరం లేకుండానే సులభంగా లభిస్తోన్న 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు.. నిన్న ఒక్కరోజే 90,000 కంటే ఎక్కువ విక్రయం
2026 మార్చి నుంచి 3.6 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా
3.9 లక్షలకు పైగా కొత్త రిజిస్ట్రేషన్లతో వేగంగా విస్తరిస్తోన్న పీఎన్‌జీ నెట్‌వర్క్
భారతీయ నావికులందరూ క్షేమం.. భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి గత 24 గంటల్లో నమోదు కాని అవాంఛనీయ సంఘటనలు
దేశవ్యాప్తంగా సాధారణంగానే కొనసాగుతున్న ఓడరేవు కార్యకలాపాలు
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తోన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మెరుగుపడుతూనే ఉన్న విమాన ప్రయాణ పరిస్థితులు.. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారత్‌కు తిరిగి వచ్చిన 7,02,000 మందికి పైగా ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 2:38PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల నిరంతర పనితీరు, సంసిద్ధతను నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా నిమగ్నమై ఉంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం వంటి అంశాల్లో చేపడుతున్న చర్యలకు సంబంధించిన సమాచారం:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలతో సహా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ సరఫరా అంతరాయం లేకుండా సాఫీగా జరిగేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం:
ప్రజా సూచనలు, పౌరుల అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని, అవసరం లేకుండా ఎల్‌పీజీ బుకింగ్‌లు చేయొద్దని సూచించారు.
వదంతుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సరైన సమాచారం కోసం అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌కు డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని.. అవసరమైతే తప్ప ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లొద్దని కోరారు.
సాధ్యమైన చోటల్లా పీఎన్‌జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ రోజువారీగా ఇంధనాన్ని ఆదా చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని కోరారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆసుపత్రులు, విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గృహావసరాల ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది.
చమురు శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తిని పెంచడం.. పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. సరఫరా కోసం ప్రాధాన్యత కలిగిన రంగాలను గుర్తించడం వంటి సరఫరా, డిమాండ్‌కు సంబంధించిన అనేక హేతుబద్ధీకరణ చర్యలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది.
ఎల్‌పీజీ డిమాండ్ తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
గృహావసరాల, వాణిజ్య వినియోగదారులందరికీ కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్జీ) కార్యదర్శి ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో (ఆహారం - పౌర సరఫరాల శాఖ) ఒక సమావేశాన్ని నిర్వహించారు. తగినంత ఇంధన లభ్యతను నిర్ధారించడానికి తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గృహ, నిత్యావసరాల కోసం ఎల్‌పీజీ పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించారు. అక్రమ నిల్వలు, దారి మళ్లించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా కఠినమైన నిఘా ఉంచాలని సూచించారు. వలస కార్మికులకు అందుతున్న ఎఫ్‌టీఎల్ ఎల్‌పీజీ సరఫరాపై వస్తున్న నివేదికలపై రాష్ట్రాలు స్పందించాయి. వలసదారులకు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, పరిస్థితి స్థిరంగా ఉందని అవి స్పష్టం చేశాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలతో కలిసి 5 కిలోల ఎఫ్‌టీఎల్ ఎల్‌పీజీ సిలిండర్ల లక్షిత పంపిణీని నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కార్యదర్శి రాష్ట్రాలకు తెలిపారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేసింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీలు లేదా పౌర సరఫరాల శాఖ కార్యదర్శులకు ఈ కింది చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు:
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థాగతమైన సమాచారాన్ని అందించాలి. క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయాలి.
అత్యవసర సహాయం, సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు లేదా హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలి.
సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించి తిప్పికొట్టాలి.
జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను ఉద్ధృతం చేయాలి. ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ ఆకస్మిక తనిఖీలు, దాడులను కొనసాగించాలి.
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ- సుపీరియర్ కిరోసిన్ ఆయిల్) పంపిణీకి సంబంధించి కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయాలి. ఇందులో భాగంగా ఆర్ఓడబ్ల్యూ (రైట్ ఆఫ్ వే)/ఆర్ఓయూ (రైట్ ఆఫ్ యూజ్) అనుమతులు, 24 గంటలు పనులు చేసేందుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలి.
పీఎన్‌జీ వినియోగం, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలి.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో (ఎంఓపీఎన్జీ) నిరంతరం సమన్వయం చేసుకోవడానికి సీనియర్ నోడల్ అధికారులను నియమించాలి.
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలతో పాటు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తగినంత ఎల్‌పీజీ అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజలకు భరోసాగా తెలియజేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 27, 2026 ఏప్రిల్ 2 తేదీలలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ముందస్తు, క్రమబద్ధమైన ప్రజా సంబంధాలను బలోపేతం చేయాలని ఇందులో కోరింది. సీనియర్ అధికారుల స్థాయిలో ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించింది. సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని కోరింది.
ప్రస్తుతం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్, పర్యవేక్షణ చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. మార్చి నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్ర- కేంద్రపాలిత ప్రాంతాల బృందాలు, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో 50,000 కంటే ఎక్కువ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వలు లేదా నల్లబజారు క్రయవిక్రయాల వంటి వాటిని నిరోధించడానికి ఆకస్మిక తనిఖీల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 1,400 కంటే ఎక్కువ షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. అంతేకాకుండా ఇప్పటివరకు 36 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి:
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద గ్యాస్ కొరత ఉన్నట్లు ఎటువంటి నివేదికలు అందలేదు.
నిన్నటి గణాంకాల ప్రకారం పరిశ్రమ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు 95 శాతానికి పెరిగాయి.
డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో గ్యాస్ పక్కదారి పట్టకుండా నిరోధించడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలను పెంచారు. 2026 ఫిబ్రవరిలో 53 శాతంగా ఉన్న ఈ డెలివరీలు నిన్నటి నాటికి 90 శాతానికి చేరుకున్నాయి.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 51 లక్షల కంటే ఎక్కువ గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 2026 ఏప్రిల్ 1 నాటి ఉత్తర్వుల ప్రకారం.. దేశంలోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లతో సహా చమురు శుద్ధి కంపెనీలు సీహెచ్‍టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ) నిర్ణయించిన నిర్దిష్ట పరిమాణం, చమురు శుద్ధి వనరుల ఆధారంగా ఔషధ విభాగం, ఆహారం- ప్రజా పంపిణీ విభాగం, రసాయనాలు- పెట్రో కెమికల్ విభాగం మొదలైన కీలక రంగాలకు కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచడానికి అనుమతించారు.
సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయిలో 70 శాతం మేర మొత్తం వాణిజ్య కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపులు కలిసి ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే 90,000 కంటే ఎక్కువ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
ఈ సిలిండర్లు సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయొచ్చు. దీని కోసం ఎటువంటి చిరునామా ధ్రువీకరణ పత్రం అవసరం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ సంస్థలతో సంప్రదించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ విక్రయాల ప్రణాళికను ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలకు చెందిన కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఖరారు చేస్తుంది.
2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 78,833 ఎంటీ వాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్‌జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
పనిచేస్తున్న యూరియా ప్లాంట్లకు సరఫరా ఇప్పుడు వాటి గత 6 నెలల సగటు వినియోగంలో సుమారు 70-75 శాతం వద్ద స్థిరంగా ఉంది. అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ చేసిన ఎల్ఎన్‌జీ కార్గో రాకను పరిగణనలోకి తీసుకుంటే... 06.04.2026 నుంచి అమలులోకి వచ్చేలా ఎరువుల ప్లాంట్‌లకు అందుబాటులో ఉండే మొత్తం గ్యాస్ సరఫరాను గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 90 శాతానికి పెంచుతున్నారు. 06.04.2026 నుంచి అమలులోకి వచ్చేలా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను మరో 10 శాతం వరకు పెంచుతున్నారు.
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం కోసం తమ భౌగోళిక ప్రాంతాలన్నింటిలో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు భారత ప్రభుత్వం సూచించింది.
ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకునే వారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
భారత ప్రభుత్వం 18.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీ కోటాలో అదనంగా 10 శాతం కేటాయింపును ప్రతిపాదించింది. పీఎన్‌జీ విస్తరణ సంస్కరణ చర్యల కింద 12 రాష్ట్రాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంత దరఖాస్తు పరిశీలనలో ఉంది.
సమీపంలో పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, అంగన్వాడీ కిచెన్‌లు మొదలైనవాటిని 5 రోజుల్లోగా పీఎన్‌జీతో అనుసంధానించడానికి అన్ని సీజీడీ సంస్థలు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేయాలని తేదీ 23.03.2026 నాటి తన ఉత్తర్వుల ద్వారా పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.
సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య ప్రాతిపదికన ప్రాసెస్ చేసేందుకు, "తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక"ను 3 నెలల పాటు ఒక ప్రత్యేక చర్యగా అమలు చేస్తున్నట్లు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా తెలిపింది.
భారత ప్రభుత్వం, 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వులు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మూరుమూల ప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ 27.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా అన్ని నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్ల రక్షణలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేటయడం లక్ష్యంగా 30 జూన్ 2026 వరకు అమలులో ఉండే ఒక స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది.
డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడి సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 (01.01.2026 నుంచి 31.03.2026 వరకు)ను తాజాగా 30.06.2026 వరకు పొడిగించారు.
2026 మార్చి నెల నుంచి సుమారు 3.6 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌ల గ్యాసిఫికేషన్ పూర్తయింది. కొత్త కనెక్షన్‌ల కోసం 3.9 లక్షలకు పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో, అన్ని రిఫైనరీలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు కొనసాగుతున్నాయి.
దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల ద్వారా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధర సంబంధిత చర్యలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. ఈ ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడటం లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా ఈ భారాన్ని పాక్షికంగా భరించాలని నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ. 21.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని విధించింది.
పెట్రోల్, డీజిల్ సాధారణ చిల్లర ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం మరోసారి సూచనలు జారీ చేసింది. వదంతులను అరికట్టేందుకు, పత్రికా సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
భారత ప్రభుత్వం 29.03.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, పీడీఎస్ ఎస్‌కేవో రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం వంట, దీపాలు వెలిగించే ప్రయోజనం కోసం పీడీఎస్ ఎస్‌కేవో పంపిణీని సులభతరం చేసింది.
ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్లు (ప్రాధాన్యంగా కంపెనీ యాజమాన్యంలోనివి లేదా కంపెనీ నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ ఎస్‌కేవోను నిల్వ చేయడానికి అనుమతి ఉంటుంది.
ఈ పీఎస్‌యూ ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్లను ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం నియమిస్తుంది.
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో అవసరం లేదని తెలియజేశాయి.
నౌకా వాణిజ్య భద్రత, నాకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికులను రక్షించేందుకు నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఆ మంత్రిత్వ శాఖ కింది సమాచారాన్ని తెలియజేసింది:
నౌకా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే... నౌకాయాన కార్యకలాపాలు, నౌకాశ్రయ కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రతను నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు.
పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 460 మంది భారతీయ నావికులతో కూడిన మొత్తం 17 భారత జెండా గల నౌకలు ఉండగా... నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డీజీ షిప్పింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 5088 కాల్‌లు, 10547 ఈమెయిళ్లను నిర్వహించింది. గత 24 గంటల్లో 73 కాల్‌లు, 122 ఈమెయిళ్లూ అందాయి.
డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు 1479 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్‌లోని విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 159 మందిని భారత్‌కు తరలించింది.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించిన ప్రకారం... దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
సముద్రయాన సిబ్బంది సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఈ మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
ఈ ప్రాంతమంతటా భారత మిషన్లు, పోస్టులు భారతీయ పౌరులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి. వారి భద్రత, శ్రేయస్సు కోసం సహాయాన్ని అందిస్తున్నాయి. అవసరమైన సూచనలనూ జారీ చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
ఇరాన్‌లో చిక్కుకుపోయిన మొత్తం 345 మంది భారతీయ మత్స్యకారులు నిన్న స్వదేశానికి తిరిగి వచ్చారు. టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం వారిని దక్షిణ ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించడానికి సహకరించగా... అక్కడి నుంచి వారు విమానాల్లో చెన్నైకి బయలుదేరారు.
భారత పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ... గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత మిషన్లతో నిరంతర సమన్వయంతో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది.
మిషన్లు, పోస్టులు ఇరవై నాలుగు గంటలూ హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ... సూచనలు జారీ చేస్తూ... భారతీయ కమ్యూనిటీ సంఘాలు, కంపెనీలు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వీసాలు, కాన్సులర్ సేవలు, రవాణా సౌకర్యం, లాజిస్టికల్ మద్దతు వంటివీ ఈ సహాయంలో ఉన్నాయి.
భారతీయ విద్యార్థుల సంక్షేమం ఒక ప్రాధాన్యతగా కొనసాగుతోంది. విద్యా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, బోర్డులు, జాతీయ పరీక్షా సంస్థలతో మిషన్లు సమన్వయం చేసుకుంటున్నాయి.
మిషన్లు నౌకలలోని భారతీయ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, కాన్సులర్ మద్దతును అందిస్తూ, కుటుంబ సభ్యులతో సంభాషణలను సులభతరం చేస్తూ, తిరిగి వచ్చే అభ్యర్థనల్లో సహాయం చేస్తున్నాయి.
విమాన ప్రయాణ పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 7,02,000 మంది ప్రయాణికులు భారత్‌కు ప్రయాణించారు.
యూఏఈ: పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. భారత్‌కు సుమారు 90 విమానాలు వస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్: పలు విమానాశ్రయాల నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నాయి.
ఖతార్: గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. ఈ రోజు సుమారు 8–10 విమానాలు వస్తాయని అంచనా.
కువైట్, బహ్రెయిన్: గగనతలం మూసి ఉంది. విమానాలు దమ్మమ్ (సౌదీ అరేబియా) మీదుగా భారత్‌కు నడుస్తున్నాయి.
ఇరాన్: అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇజ్రాయెల్: ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇరాక్: జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఒమన్ తీరంలో ఓడపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుడి మృత దేహాన్ని భారత్ తీసుకువచ్చారు. మృతుని కుటుంబానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249208)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam