ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వావ్-థరద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 8:27PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

వేదికపై ఉన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ భాయ్, ఉపముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి, గుజరాత్ ప్రభుత్వ మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు, బనస్కాంత, వావ్, థరద్, ఉత్తర గుజరాత్ ప్రాంత సోదరీసోదరులకు,

ఈ రోజు, ఇక్కడికి పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు హాజరయ్యారు. ఈ తల్లులు, సోదరులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ మధ్యే పవిత్ర నవరాత్రి పూర్తయింది. అంబాజీ మాత దయ వల్ల ఈ రోజు ఆమె పాదాల చెంతకు వచ్చే అదృష్టం నాకు దక్కింది. ఆమె కృపతోనే ఈ రోజు మీ అందరినీ, నా కుటుంబ సభ్యులను చూసే వీలు కలిగింది. అమ్మ అంబాజీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వరాహ రూపమైన శ్రీ ధరణీధరుడు ‘‘ముకుంద కృష్ణ’’కు కూడా నమస్సులు అర్పిస్తున్నాను. ఈ రోజే భగవాన్ మహావీర్ జయంతిని నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ ప్రాంతం అనేక జైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి పొందింది. భగవాన్ మహావీరునికి నమస్సులు అర్పిస్తూ.. పవిత్రమైన మహావీర జన్మ కల్యాణ దినోత్సవం, మహావీర్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు మరో కారణం వల్ల కూడా నా మనసు ఆనందంతో నిండిపోయింది. నేను ప్రయాణిస్తున్న విమానం మొదటిసారి డీసా వైమానిక స్థావరంలో దిగింది. డీసాలోని ఈ ఎయిర్ బేస్ అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 130 కి.మీ.ల దూరంలో మాత్రమే ఉంది. దేశ భద్రతకు సంబంధించి ఈ ప్రాంతం ఎంత వ్యూహాత్మకమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు.

అయితే మిత్రులారా,

డీసా విమానాశ్రయ ప్రాజెక్టు ఆలోచన ఈ రోజు మొదలైంది కాదు. దీనికోసం, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నా రైతు సోదరీ సోదరుల వద్ద నుంచి భూమిని సమీకరించాం. దేశ, పశ్చిమ సరిహద్దు భద్రతకు అత్యంత ముఖ్యమైన ప్రదేశం డీసా అని గుర్తించిన మేం.. ఇక్కడ వైమానిక స్థావరం ఉండటం అవసరమని భావించాం. కానీ, ఆ సమయంలో ఢిల్లీని పాలించిన వారికి గుజరాత్ పట్ల ఎందుకు ద్వేషం ఉండేదో తెలియదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ ప్రాజెక్టు అయిదేళ్ల పాటు దస్త్రాల్లోనే కూరుకుపోయింది. మీరు నన్ను ఢిల్లీకి పంపినప్పుడు.. ఆ దస్త్రాలను నేను బయటికి తీశాను. దాని ఫలితమే ఇప్పుడు డీసాలో అతి పెద్ద వైమానిక స్థావరం ఏర్పాటైంది. ఇది సాధారణ ఎయిర్ స్ట్రిప్ మాత్రమే కాదు. దీనివల్ల ఇక్కడ అనేక కార్యకలాపాలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో సైనికులు ఇక్కడ నివాసముంటారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. అయితే ఈ జాప్యానికి ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం. జాతీయ భద్రత పట్ల ఇలాంటి ఉదాసీనతను దేశం క్షమించదు. మా ప్రభుత్వం డీసా విమానాశ్రయానికి ప్రథమ ప్రాధ్యాన్యమిచ్చి పూర్తి చేసింది. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రధాన మైలురాయిగా ఈ రోజు నిలిచింది. అలాగే దేశానికి అతి పెద్ద వ్యూహాత్మక బలంగా కూడా మారింది. ఈ విమానాశ్రయ ఏర్పాటు విషయంలో ఈ ప్రాంతానికి మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నాను.

మిత్రులారా,

వావ్- థరద్, బనస్కాంత ప్రాంతంతో నాకు ఎంత అనుబంధం ఉందో మీ అందరికీ తెలుసు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే. ఇక్కడ నా జ్ఞాపకాలు లేని గ్రామమంటూ ఉండదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనేక మంది వృద్ధుల ముఖాలను చూసే అవకాశం నాకు లభించింది. రోడ్‌షో కూడా విజయవంతమైంది. ఇది నాకు చాలా మేలు చేసింది. దూరం నుంచైనా సరే అనేక మంది పెద్దవారిని కలుసుకొనే అవకాశం లభించింది. నేను సంస్థాగత పని చేసిన సమయంలో ఇక్కడ స్కూటర్‌పై ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని. మీ అందరినీ కలుసుకుంటూ ఉండేవాడిని. నేను ఉత్తర గుజరాత్‌కు వచ్చినప్పుడు అమ్మలు, సోదరీమణులు నాకు రుచికరమైన రొట్టెలు చేసి పెట్టేవారు. సజ్జ రొట్టె, నెయ్యి, బెల్లం, వెల్లుల్లి చట్నీ, తాజా వెన్న. మీ అందరి ఆప్యాయత, మీ ప్రేమను నేను ఎప్పుడూ మరచిపోను. మీరు నాకు ఎంత అనురాగాన్ని పంచారంటే... మీ కుటుంబంలో కొడుకుగా నన్ను చూశారు. అందుకే నేను ఎక్కడ ఉన్నా సరే.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీ ఆప్యాయతను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నాను. ఇక్కడ అనేక మంది పాత సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు. వారితో రేయింబవళ్లు కలసి నేను పనిచేశాను. వారిలో చాలా మంది పెద్దలు ఇప్పుడు లేరు. కానీ వారి నుంచి నేర్చుకొనే అవకాశం నాకు దక్కింది. అలాంటి స్నేహితులు, బీజేపీ యువ కార్యకర్తలు ఈ రోజు నా ముందున్నారు. ఇలాంటి విజయంతమైన తరాన్ని చూసినప్పుడు జీవితంలో ఏదో సాధించామనే సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు యువ కార్యకర్తలు సైతం అదే నైపుణ్యంతో సంస్థాగత పనులను ముందుకు నడిపిస్తుండటం నేను చూస్తున్నాను. ఈ కార్యక్రమం, ఈ ప్రదర్శన, ఈ ఏర్పాట్లు, పెద్ద  సంఖ్యలో ఇక్కడికి మీరు రావడం, ఇవన్నీ దానికి నిదర్శనమే. కనీసం ఒక్కసారైనా నా చేయిని దూరంగా ఉన్నవారికి చూపించాలనుకున్నాను. కానీ నా కనుచూపు మేరంతా ప్రజలు కూర్చున్నారు. అనేక మంది బయట నిలుచున్నారు. బనస్కాంతతో పాటుగా పరిసర జిల్లాలైన పఠాన్, మెహసానా ప్రజలను కూడా నేను చూస్తున్నాను. దీనికి మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా నా అమ్మలు, సోదరీమణులకు మరోసారి నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

బనస్కాంతతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను మీరు నాకు అప్పగించారు. నేను గుజరాత్‌లో ఉన్నంత వరకు ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాను. గుజరాత్‌ను వీలైనంత అభివృద్ధి చేశాను. దశాబ్దాల తరబడి మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఈ ప్రాంతం ఎదుర్కొన్న నిర్లక్ష్యం, ఆ సమస్యలన్నీ ఇప్పుడు ముగిసిపోయాయి. అభివృద్ధి ఆశయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతున్నాయి. ఇక్కడ నేను ప్రారంభించిన అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతుండటం నాకు గర్వకారణం. 2014 నుంచి దీనికి డబుల్ ఇంజిన్ సామర్థ్యం కూడా తోడయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. రూ.20 వేల కోట్లు. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం మొత్తం స్వరూపమే మారిపోతుంది. విద్యుత్తు, రోడ్డు, రైల్వే, గృహనిర్మాణ రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు ఇక్కడి జీవనానికి కొత్త వేగాన్నిస్తాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను వావ్-థరద్, బనస్కాంత, మొత్తం గుజరాత్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు శంకుస్థాపన చేసిన రోడ్డు మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం ఉత్తర గుజరాత్ ప్రాంతానికి కొత్త వేగాన్నిస్తాయి. ఇక్కడ కొత్త అవకాశాల కల్పన జరుగుతుంది. ఇదార్ నుంచి వడాలి బైపాస్ వరకు నాలుగు వరుసల హైవే నిర్మాణం, ధోలవీర నుంచి సంతాల్ పూర్ వరకు మెరుగుపరుస్తున్న జాతీయ రహదారితో మార్కెట్లకు గ్రామాలు అనుసంధానమవుతాయి. రైతులకు కొత్త అవకాశాలు, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు అహ్మదాబాద్-ధొలేరా ఎక్స్‌ప్రెస్ వే కారిడార్‌ను ఈ ప్రాంతానికి అంకితం చేశాం. ఇంత పెద్ద స్థాయిలో రవాణా సదుపాయాలు కల్పించినప్పుడు.. పరిశ్రమలు, పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయి. అలాగే, ఈ ప్రాంతంలో రైలు సౌకర్యం కూడా మెరుగైంది. హిమత్ నగర్ నుంచి ఖేడ్‌బ్రహ్మ మార్గం గేజ్ మార్పిడి.. ఉత్తర గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలను జాతీయ బ్రాడ్ గేజ్ వ్యవస్థకు అనుసంధానిస్తుంది ఈ రోజు నుంచి ఖేడ్‌బ్రహ్మ, హిమత్ నగర్, అసర్వాలను కలుపుతూ రైలు సేవలు ప్రారంభమయ్యాయి.

సోదరీసోదరులారా,

మెరుగైన రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలను మెరుగుపరిచే ఈ ప్రాజెక్టులన్నీ గుజరాత్ సమగ్రాభివృద్ధికి సంబంధించినవే. ఈ ప్రణాళికను పూర్తి చేయడానికి విద్యుత్ అవసరాలపై సైతం మనం దృష్టి సారించాలి. ఎందుకంటే విద్యుత్ ఎక్కడ ఉంటే అక్కడికే కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు, నూతన అవకాశాలు వస్తాయి. అందుకే ఖావడా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రసార ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. ఇక్కడి నుంచి, నాలుగున్నర గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు కొత్త పరిశ్రమలకు, గృహాలకు చేరుకుంటుంది. రైతుల వ్యవసాయ క్షేత్రాలకు లబ్ధిని అందిస్తుంది.

మిత్రులారా,

ఇప్పుడు సౌర విద్యుత్తులో గుజరాత్ పతాకం విజయగర్వంతో రెపరెపలాడుతోంది. భారత్‌లో పునరుత్పాదక విద్యుత్తుకు ఎలాంటి ప్రాధాన్యం లభించని రోజుల్లోనే వీటిని ప్రారంభించడం వల్ల ఈ రంగంలో గుజరాత్ ముందుంది. 2010లో అంటే 15 నుంచి 16 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా చరంకాలోని రతన్‌పూర్‌ వద్ద దేశంలోనే మొదటి సోలార్ పార్కును ప్రారంభించాను. ఇప్పుడు 15-16 ఏళ్లున్న బాలలు అప్పటికి ఇంకా పుట్టి ఉండకపోవచ్చు. ఇది సోలార్ విద్యుత్ ఉద్యమాన్ని ప్రారంభించిన మల్టీ టెక్నాలజీ పార్కు. ఇఫ్పుడు గుజరాత్‌లో చేపడుతున్న సౌర విద్యుత్తు పనులు, ఇక్కడ సౌర శక్తి నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు, ఈ రోజు ప్రారంభించిన ఖావడా పునరుత్పాదక విద్యుత్ పార్కుకు సంబంధించిన ప్రాజెక్టులతో ప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధనానికి ప్రధాన కేంద్రంగా గుజరాత్ ఆవిర్భవించే రోజు ఎంతో దూరంలో లేదు.

 

***

 


(రిలీజ్ ఐడి: 2247882) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam