పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాలపై తాజా సమాచారం
· దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో అందుబాటులో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు
· సాధారణంగానే కొనసాగుతున్న గృహవసరాల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా
· నిన్న ఒక్కరోజే పంపిణీ అయిన 54 లక్షలకు పైగా ఎల్‌పీజీ సిలిండర్లు
· సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయిలో 70 శాతానికి పెరిగిన వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు
· 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు 33,781 మెట్రిక్ టన్నుల గృహేతర ఎల్‌పీజీని పొందిన వాణిజ్య సంస్థలు
· వదంతులను అరికట్టడానికి ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహణ, తాజా సమాచారాన్ని అందించటం చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిన కేంద్రం
· ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహిస్తోన్న 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
· గత 24 గంటల్లో స్వదేశానికి చేరకున్న 25 మంది భారతీయ నావికులు
· వీరితో కలిపి ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న మొత్తం 938 మందికి పైగా భారతీయ నావికులు
· ఎటువంటి రద్దీ లేకుండా దేశవ్యాప్తంగా సాధారణంగా కొనసాగుతున్న ఓడరేవు కార్యకలాపాలు
· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతీయుల తరలింపు, సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తోన్న ప్రభుత్వం
· తరలింపు, విమాన సర్వీసులు కొనసాగుతుండటంతో ఇప్పటివరకు భారత్‌కు తిరిగి వచ్చిన సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 5:40PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కీలక రంగాల్లో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సన్నద్ధత, ప్రతిస్పందన చర్యలను నిరంతరం చేపడుతోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయానికి సంబంధించిన తాజా సమాచారం ఇక్కడ ఉంది.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
· దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి గృహావసరాల ఎల్‌పీజీ ఉత్పత్తి పెరిగింది.
రిటైల్ విక్రయకేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయకేంద్రాలు సాధారణంగానే పనిచేస్తున్నాయి.
· కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ. 21.5, విమానయాన ఇంధనంపై (ఏటీఎఫ్) లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని విధించింది.
· కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందింది. వదంతుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని రిటైల్ విక్రయకేంద్రాల వద్దకు ఒకేసారి ప్రజలు భారీగా తరలిరావడంతో అసాధారణమైన అమ్మకాలు, విపరీతమైన రద్దీ నమోదయ్యాయి. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉన్నాయని మరోసారి ప్రభుత్వం తెలియజేసింది.
· వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తోంది.
సహజ వాయువు
· గృహావసర పీఎన్‌జీ, రవాణా రంగానికి సంబంధించిన సీఎన్‌జీ వినియోగదారులకు 100 శాతం సరఫరా అందేలా ప్రాధాన్యత ఇస్తున్నారు.
· గ్రిడ్‌కు అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం సరఫరా అందుతోంది.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై ఆందోళనలను తగ్గించేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సీజీడీ సంస్థలకు సూచించింది.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీజీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్ల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
· దీర్ఘకాలికంగా ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారేందుకు సహకరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను చేస్తామని 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్రాలకు అదనపు కేటాయింపులను సిఫార్సు చేశారు.
· కొన్ని రాష్ట్రాలు వినియోగదారు హక్కు (రైట్ ఆఫ్ యూజర్) లేదా దారి హక్కు (రైట్ ఆఫ్ వే) అనుమతులను వేగవంతం చేయడానికి, పని గంటలను పెంచడానికి, చార్జీలను క్రమబద్ధీకరించడానికి కొత్త విధానాలను రూపొందించాయి.
· సమీపంలో పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, అంగన్వాడీ కేంద్రాలకు 5 రోజుల్లోపు పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా అన్ని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.
· ఒక ప్రత్యేక చర్యగా 3 నెలల కాలానికి ‘సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద ఫ్రేమ్‌వర్క్‌ను తక్కువ కాలపరిమితితో అమలు చేస్తున్నట్లు’ 24.03.2026 నాటి లేఖ ద్వారా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని కింద సీజీజీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తారు.
· నిత్యావసర సరకుల చట్టం-1955 కింద ‘సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026’ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌ల ఏర్పాటు, విస్తరణ కోసం క్రమబద్ధీకరించిన, కాలపరిమితితో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది ఆమోదాలలో జరిగే జాప్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, చిట్టచివరి స్థాయి అనుసంధానతను మెరుగుపరుస్తుందని, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లడానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు భారతదేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది.
· రక్షణ శాఖకు సంబంధించిన నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్లలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడానికి 27.03.2026 నాటి లేఖ ద్వారా 2026 జూన్ 30 వరకు అమలులో ఉండేలా ఒక స్వల్పకాలిక విధాన సవరణను రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసింది:
o అవసరమైన పనులను చేపట్టడానికి కావలసిన ఆమోదాలను 24 గంటల లోపు మంజూరు చేయడం.
o భూగర్భ పైప్‌లైన్, వాల్వ్ ఛాంబర్ ఏర్పాటు కోసం రక్షణ శాఖ భూమిని ఉపయోగించుకోవడానికి అనుమతి. దీనికి సంబంధించి మొదటి 10 ఏళ్ల లైసెన్స్ కాలానికి సంవత్సరానికి రన్నింగ్ మీటరుకు రూ. 1 చొప్పున నామమాత్రపు లైసెన్స్ రుసుం వసూలు చేస్తారు.
o రోడ్డు పునరుద్ధరణ ఛార్జీలు ఉండవు. అయితే సీజీడీ సంస్థలే సొంత ఖర్చుతో ప్రభుత్వ ఆస్తులను నిర్ణీత ప్రమాణాల ప్రకారం పునరుద్ధరించాల్సి ఉంటుంది.
· నిన్న ఒక్కరోజే దృష్టి సారించిన 110 భౌగోళిక ప్రాంతాల్లో మొత్తం 11,463 పీఎన్‌జీ కనెక్షన్లు (కొత్త కనెక్షన్లు, పాత గ్యాస్-ఇన్) అందించినట్లు సీజీడీ సంస్థలు నివేదించాయి.
ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడింది.
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా:
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత ఉన్నట్లు ఎక్కడా నివేదికలు లేవు.
· నిన్నటి గణాంకాల ప్రకారం పరిశ్రమ అంతటా ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు 91 శాతానికి పెరిగాయి.
· డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో గ్యాస్ మళ్లింపును నిరోధించడానికి 'డెలివరీ ఆథెంటికేషన్ కోడ్' ఆధారిత డెలివరీలను 2026 ఫిబ్రవరి నాటి 53 శాతం నుంచి నిన్నటి వరకు 84 శాతానికి పెంచారు.
· నిన్న ఒక్కరోజే 54 లక్షలకు పైగా ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా:
· ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షిక వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను (20 శాతం) పునరుద్ధరించింది. పీఎన్‌జీ విస్తరణ కోసం 'సులభతర వాణిజ్య' సంస్కరణలను అమలు చేసే విధానం ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించాలని 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
· 21.03.2026 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (ఇందులో పీఎన్‌జీ విస్తరణ కోసం 'సులభతర వాణిజ్య సంస్కరణల' ఆధారంగా ఇచ్చే 10 శాతం కేటాయింపు కూడా కలిసి ఉంది) చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును ప్రాధాన్యత క్రమంలో రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి లేదా డైరీ యూనిట్లు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా నడిచే రాయితీ క్యాంటీన్లు లేదా అవుట్లెట్లు, సామాజిక వంటశాలలు, వలస కూలీల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల విభాగాలకు అందిస్తున్నారు.
· 27.03.2026 నాటి లేఖ ద్వారా వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో అదనంగా 20 శాతం కేటాయించాలని (దీనితో మొత్తం వాణిజ్య కేటాయింపు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 70 శాతానికి చేరుకుంటుంది. ఇందులో 10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపు కూడా ఉంది) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును పరిశ్రమలకు అందించనున్నారు. ఇందులో ముఖ్యంగా ఉక్కు, వాహనాలు, వస్త్రాలు, రంగులు (డై), రసాయనాలు, ప్లాస్టిక్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో కూడా ప్రాసెస్ పరిశ్రమలకు లేదా సహజ వాయువును ప్రత్యామ్నాయంగా వాడటానికి వీలులేకుండా ఉన్న ప్రత్యేక హీటింగ్ అవసరాల కోసం ఎల్‌పీజీని వినియోగించే పరిశ్రమలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
· నిన్న 46,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గృహేతర ఎల్‌పీజీని కేటాయించడానికి 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేస్తున్నాయి. 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థల ద్వారా మొత్తం 33,781 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను పొందాయి.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు క్రమం తప్పకుండా ఇచ్చే కేటాయింపులతో పాటు అదనంగా 48,000 కిలో లీటర్ల (కేఎల్) కిరోసిన్‌ను కేటాయించారు.
· కిరోసిన్ పంపిణీ కోసం జిల్లాల్లో తగిన ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
· 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. తమకు కిరోసిన్ అవసరం లేదని హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రభుత్వాలు తెలియజేశాయి.
రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల పాత్ర
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం... అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, ఏసీఎస్/ప్రధాన కార్యదర్శులు/ఆహార, పౌర సరఫరాల కార్యదర్శులందరికీ విజ్ఞప్తి –
రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు జారీ చేయాలి.
ప్రత్యేక కంట్రోల్ రూమ్/హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి.
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించాలి, ఎదుర్కోవాలి.
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ ముమ్మరం చేయాలి. ఓఎమ్‌సీలతో సమన్వయం చేసుకుంటూ సోదాలు, తనిఖీలను కొనసాగించాలి.
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
ఆర్‌వోడబ్ల్యూ, ఆర్‌వోయూ అనుమతులు, 24x7 పని అనుమతులు మొదలైన వాటిని వేగవంతం చేయడం సహా సీజీడీ విస్తరణనూ వేగవంతం చేయాలి.
పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
ఎమ్‌వోపీఎన్‌జీతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నామినేట్ చేయాలి.
సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వదంతుల వ్యాప్తిని నివారించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహించాలని... సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని భారత ప్రభుత్వం 27.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా కోరింది. ప్రస్తుతం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న సుమారు 2900 సోదాలు నిర్వహించగా, 1700కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
సరఫరా సజావుగా జరుగుతోందని నిర్ధారించుకోవడానికి... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కేసుల ఉనికిని తనిఖీ చేయడానికి... ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు నిన్న దేశవ్యాప్తంగా 1600కు పైగా ఆర్‌వో, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటివరకు ఎల్‌పీజీ పంపిణీ సంస్థలకు 390కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
ఈ యుద్ధ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆసుపత్రులు, విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు, గృహాలకు ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరా చేయుటకూ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.
రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, సరఫరా కోసం నిర్ధిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి అనేక హేతుబద్ధీకరణ చర్యలను ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండు వైపులా అమలు చేసింది.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రతిపాదించారు.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు ఆదేశాలు జారీ చేసింది.
గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం భయాందోళనలతో కొనుగోలు చేయడం, ఎల్‌పీజీని బుక్ చేసుకోవడం మానుకోవాలి.
వదంతుల పట్ల జాగ్రత్త వహించాలి. సరైన సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలి.
ఎల్‌పీజీ కోసం, పౌరులను ఈ విధంగా అభ్యర్థించారు–
బుకింగ్‌ల కోసం డిజిటల్ విధానాన్ని ఉపయోగించాలి.
ఎల్‌పీజీ పంపిణీదారులను సందర్శించవద్దు
పౌరులు పీఎన్‌జీ, ఇండక్షన్-విద్యుత్ కుక్‌టాప్‌లు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని కోరడమైనది.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలని కోరడమైనది.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికుల రక్షణ కోసం నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను చేపట్టింది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే... నౌకాయానం, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రతను నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.
-ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.
-540 మంది భారతీయ నావికులతో కూడిన 20 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వీటిని చురుగ్గా పర్యవేక్షిస్తోంది.
-డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తుంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 4,431 కాల్‌లు, 8,865 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. గత 24 గంటల్లో వచ్చిన 105 కాల్‌లు, 309 ఈమెయిళ్లు వీటిలో భాగంగా ఉన్నాయి.
-గత 24 గంటల్లో వచ్చిన 25 మంది సహా, ఇప్పటి వరకు 938 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు డీజీ షిప్పింగ్ సహకరించింది.
-దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు ఎటువంటి రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగుతున్నాయి. అవసరమైన చోట అదనపు కార్గో స్థలం కేటాయిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
-సముద్రయాన సిబ్బంది సంక్షేమం, కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య భాగస్వాములతో సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారత మిషన్లు, పోస్టులు భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... వారి భద్రత, శ్రేయస్సు కోసం అవసరమైన సూచనలను జారీ చేయడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలిపింది:
గల్ఫ్, పశ్చిమాసియాలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తోంది. సమాచారాన్ని పంచుకోవడం, సత్వర ప్రతిస్పందన కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతంలోని మిషన్లు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్‌లతో నిరంతరం పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలను జారీ చేస్తున్నాయి. భారతీయ కమ్యూనిటీ సమూహాలు, స్థానిక ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయి. సముద్రయాన కార్మికులు, విద్యార్థులు, చిక్కుకుపోయిన భారత పౌరులు, స్వల్పకాలిక సందర్శకులకు వీసాలు, కాన్సులర్ సేవలు, లాజిస్టిక్స్ కోసం సహాయం అందిస్తున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 4,97,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.
యూఏఈ: వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌కు ఈరోజు సుమారు 85 నాన్-షెడ్యూల్డ్ విమానాలు నడిచే అవకాశం ఉంది.
సౌదీ అరేబియా, ఒమన్: భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్: గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరవడంతో, ఈ రోజు సుమారు 8–10 షెడ్యూల్ చేయని విమానాలు నడిచే అవకాశం ఉంది.
కువైట్, బహ్రెయిన్: గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు... కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్, బహ్రెయిన్‌కు చెందిన గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
ఇరాన్: అర్మేనియా, అజర్‌బైజాన్ ద్వారా భారత పౌరుల ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇజ్రాయెల్: జోర్డాన్ ద్వారా ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇరాక్: జోర్డాన్, సౌదీ అరేబియా ద్వారా ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నారు.
అబుదాబిలో శిథిలాలు పడిన కారణంగా ఐదుగురు భారత జాతీయులు గాయపడ్డారు. మిషన్ సహాయాన్ని అందిస్తూ, వైద్య సంరక్షణనూ సమన్వయం చేస్తోంది. వారందరూ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం.
***
(రిలీజ్ ఐడి: 2246610)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam