|
పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోల్.. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ప్రభుత్వం
ప్రపంచ చమురు సంక్షోభం నుంచి వినియోగదారులు, చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ)కు ఊరట అదనపు వ్యయం నుంచి ‘ఓఎంసీ’లకు పాక్షిక రక్షణ... చిల్లర ధరల్లో మార్పు లేదు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 2:36PM by PIB Hyderabad
పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు ₹10 వంతున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ తగ్గించగా, ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల దానితో ముడిపడిన ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా, అత్యధిక స్థాయిలో పెరిగిపోయాయి. ఈ మేరకు గత నెలలో 70 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 122 డాల్లర స్థాయికి దూసుకెళ్లింది. అంటే- నాలుగు వారాల్లోగా దాదాపు 75 శాతం పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల పెట్రోల్, డీజిల్ చిల్లర విక్రయ ధరల్లో మార్పేదీ ఉండదు. అంటే- ఎక్సైజ్ సుంకం కోత పంపుల వద్ద వినియోగదారులకు ధర తగ్గింపుగా ఉండదు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు విక్రయ కంపెనీలు (ఓఎంసీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు వాటిల్లే నష్టం నుంచి ప్రత్యక్ష ఉపశమనం లభిస్తుంది. ‘ఓఎంసీ’లు ఇప్పటికే తమ సరఫరా వ్యయంకన్నా చాలా తక్కువ ధరతో వినియోగదారులకు ఇంధన సరఫరా చేస్తున్నాయి. అంటే- ప్రస్తుత అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రకారం, పెట్రోల్‌పై లీటరుకు సుమారు ₹26, డీజిల్‌పై ₹81.90 వంతున నష్టపోతున్నాయి. ఈ నష్టం రోజువారీగా దాదాపు ₹2,400 కోట్లు కాగా, ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఈ నష్టం లీటరుకు ₹10 చొప్పున భర్తీ అవుతుంది. తద్వారా ఈ రెండు ఇంధనాల చిల్లర విక్రయ ధర యథాతథంగా ఉండి, ‘ఓంఎసీ’ల నుంచి నిరంతరాయ ఇంధన సరఫరాకు భరోసా లభిస్తుంది.
ఈ పరిణామాన్ని ప్రపంచ ఇంధన మార్కెట్లతో పోల్చి చూస్తే మనకు ఒక అవగాహన కలుగుతుంది. ప్రస్తుత సంక్షోభం ఆరంభమైనప్పటి నుంచి దక్షిణ-ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం వంతున ఇంధన ధరలు పెరిగాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ఈ అదనపు వ్యయ భారాన్ని ఆర్థికంగా తానే భరిస్తూ ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి కిందివిధంగా ప్రకటించారు:
“ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండు: ఒకటి... ఇతర దేశాల తరహాలో భారత్‌లోనూ విపరీతంగా ధరల పెంపు. రెండోది... అంతర్జాతీయ అనిశ్చితి నుంచి దేశ పౌరులకు రక్షణ దిశగా ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించడం. ఈ నేపథ్యంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ప్రయోజనం పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు. తదనుగుణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అధిక నష్టాల నుంచి ‘ఓంఎసీ’లకు ఉపశకమనం కల్పిస్తూ ప్రభుత్వం తన పన్నుల రాబడిమీద గణనీయ భారం మోపింది.”
ఈ మేరకు ప్రభుత్వం ఒకవైపు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ, మరోవైపు డీజిల్‌పై ఎగుమతి సుంకం విధించింది. అంతర్జాతీయంగా డీజిల్ ధర విపరీతంగా పెరిగినందు వల్ల ఈ ఇంధన ఎగుమతిని నిరుత్సాహపరచేలా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా రిఫైనరీలలో డీజిల్ ఉత్పత్తి తొలుత దేశీయ అవసరాలు తీర్చడానికి మళ్లించే విధంగా జాగ్రత్త వహించింది. ప్రస్తుత అంతర్జాతీయ ధరలు వాణిజ్యపరంగా ఎగుమతులను ఆకర్షించేవిగా ఉన్నప్పటికీ, దేశంలో చిల్లర విక్రయాల నిమిత్తం పూర్తిస్థాయి సరఫరా కొనసాగించడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం అనంతరం 2022లో అనుసరించిన విధానం తరహాలోనే ప్రస్తుత నిర్ణయం తీసుకుంది. ఆనాడు ‘ఓఎంసీ’లు నిరంతర నష్టాలు భరించగా, ప్రపంచ ధరల అనిశ్చితి నుంచి గృహాలకు, వ్యాపారాలకు రక్షణనిస్తూ కేంద్ర ప్రభుత్వం తన పన్నులను తగ్గించింది. ప్రస్తుత సందర్భంలోనూ అదే సూత్రం ప్రకారం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. తమ ప్రమేయం లేని ప్రపంచ స్థితిగతుల దుష్పరిణామాల భారాన్ని దేశ పౌరులు, పరిశ్రమలపై మోపరాదని నిశ్చయించుకుంది. మరోవైపు నానాటికీ మారుతున్న ప్రపంచ ఇంధన పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వినియోగదారుల కోసం సరఫరా, ధరల స్థిరత్వం కొనసాగే విధంగా అవసరమైన చర్యలన్నీ చేపడుతుంది.
****
(రిలీజ్ ఐడి: 2246104)
|