పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
దేశవ్యాప్తంగా యథావిధిగా పనిచేస్తోన్న అన్ని రిటైల్ విక్రయకేంద్రాలు
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు
దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి పెరిగిన గృహావసరాల ఎల్‌పీజీ
ఉత్పత్తి
గృహావసరాల ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాకు అత్యున్నత ప్రధాన్యతను ఇస్తోన్న ప్రభుత్వం
'సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు- 2026'ను నోటిఫై చేసిన ప్రభుత్వం
దేశవ్యాప్త పైప్‌లైన్ విస్తరణ కోసం కాలపరిమితితో కూడిన ఒక ప్రణాళికను అందిస్తున్న ఈ ఉత్తర్వు
గృహేతర ఎల్‌పీజీ కేటాయింపుల కోసం ఉత్తర్వులు జారీ చేసిన 26
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
నిన్న ఒక్కరోజే 110 భౌగోళిక ప్రాంతాలలో నమోదైన 9,046 పీఎన్‌జీ కనెక్షన్లు (కొత్తవి, గ్యాస్-ఇన్)
నిత్యంక్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఆహార-
పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు
ప్రజలు దైనందిన వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని విజ్ఞప్తి
పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులంతా సురక్షితం
ఇప్పటివరకు 635 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి
తీసుకురావడానికి సహకరించిన డీజీ షిప్పింగ్
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన సుమారు 4,26,000 మంద ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 4:52PM by PIB Hyderabad
పశ్చిమాసియాలోని పరిస్థితులపై క్రమం తప్పకుండా జరుగుతున్న వివిధ మంత్రిత్వ శాఖల (ఇంటర్ మినిస్ట్రీయల్) సమావేశాలకు కొనసాగింపుగా పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో మాట్లాడారు. మారుతున్న పరిణామాలపై తాజా సమాచారాన్ని ఈ మీడియా సమావేశంలో అందించారు. ఇందులో ఇంధన సరఫరా- లభ్యత, ఆ ప్రాంతంలోని సముద్రయాన కార్యకలాపాలు, భారతీయులకు అందుతున్న నిరంతర సహాయక చర్యలు వంటి కీలక అంశాలను వివరించారు. ఆయా రంగాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి, ఎటువంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ మీడియా సమావేశంలో తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను వెల్లడించింది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి గృహావసరాల ఎల్‌పీజీ ఉత్పత్తి పెరిగింది.
రిటైల్ విక్రయకేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయకేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· వదంతుల కారణంగా కొన్ని ప్రాంతాలలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీని ఫలితంగా రిటైల్ విక్రయకేంద్రాల వద్ద అసాధారణంగా అమ్మకాలు పెరగడంతో పాటు విపరీతమైన రద్దీ ఏర్పడింది. అయినప్పటికీ అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
· వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
సహజ వాయువు
· గృహావసరాల పీఎన్‌జీ, రవాణా రంగ సీఎన్‌జీ విషయంలో 100 శాతం సరఫరాతో ప్రాధాన్యత కేటాయింపు కొనసాగుతోంది. గ్రిడ్‌కు అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల విషయంలో సగటు వినియోగంలో సుమారు 80 శాతం సరఫరా కొనసాగుతోంది.
· రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు సూచించారు.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్ల కోసం వివిధ రాయితీలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలను కోరింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారే తీరును బట్టి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయిస్తామని 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
· కొన్ని రాష్ట్రాలు వినియోగదారు హక్కు (ఆర్ఓయూ- రైట్ ఆఫ్ యూజర్), దారి హక్కు (ఆర్ఓడబ్ల్యూ- రైట్ ఆఫ్ వే) అనుమతుల కోసం వేగవంతమైన విధానాలను రూపొందించాయి. ఉదాహరణకు.. రోడ్డు పునరుద్ధరణ రుసుములను రద్దు చేయడమే కాకుండా కొత్త పీఎన్‌జీ పైప్‌లైన్ల నిర్మాణ పనులను 24x7 ప్రతిపాదికన నిర్వహించడానికి ఢిల్లీలోని డీడీఏ అనుమతించింది.
· సీజీడీ దరఖాస్తులు అందిన 10 రోజులలోపు వాటి ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్) తన పరిధిలోని కార్యాలయాలకు సూచించింది.
· పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న చోట ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సామాజిక వంట శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఐదు రోజులలోపు ప్రాధాన్యత ప్రతిపాదికన పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ (పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్) ఆదేశించింది.
· 24.03.2026 నాటి గెజిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. నిత్యావసర సరకుల చట్టం- 1955 కింద 'సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లు, ఇతర సౌకర్యాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026'ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల విస్తరణకు సంబంధించి అనుమతుల్లో జాప్యాన్ని, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన ప్రణాళికను అందిస్తుంది. ఇతర ప్రాంతాలతో పాటు నివాస ప్రాంతాల్లో సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. దీని ద్వారా పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధి చెందడమే కాకుండా ఇంధన భద్రత బలపడుతుందని, దేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని భావిస్తున్నారు.
· నిన్న ఒక్కరోజే 110 భౌగోళిక ప్రాంతాలలో 9,046 పీఎన్‌జీ కనెక్షన్లు (కొత్తవి, గ్యాస్-ఇన్) ఇచ్చినట్లు సీజీడీ సంస్థలు నివేదించాయి.
ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద ఎక్కడా కొరత ఉన్నట్లు నివేదికలు లేవు.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతోంది.
· ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షిక వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను (20 శాతం) పునరుద్ధరించింది. దీనికి తోడు పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు 10 శాతం కేటాయింపును 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
· 21.03.2026 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (పీఎన్‌జీ విస్తరణ సంస్కరణల ఆధారంగా ఇచ్చే 10% కేటాయింపుతో కలిపి) చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం సరఫరాను రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక కాంటీన్లు, ఆహార శుద్ధి కేంద్రాలు లేదా డైరీ, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు నడుపుతున్న రాయితీ క్యాంటీన్లు, సామాజిక వంటశాలలు, వలస కూలీల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లకు ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు.
· గృహేతర ఎల్‌పీజీ కేటాయింపుల కోసం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన ప్రాంతాల్లో పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరాను కొనసాగిస్తున్నాయి. 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 22,268 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ వినియోగించారు.
కిరోసిన్
· సాధారణ కేటాయింపులకు అదనంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు. జిల్లా స్థాయి పంపిణీ కేంద్రాలను గుర్తించాలని ఆయా రాష్ట్రాలను కోరారు.
· 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి. ఇంకా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
· నిత్యావసర సరకుల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం అక్రమ నిల్వలు, నల్లబజారును అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరాను నియంత్రించడంలో రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించాలి.
· 13.03.2026, 18.03.2026 నాటి లేఖల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కింది చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది:
o అక్రమ నిల్వలు, నల్లబజారుకు తరలించడం, గృహ అవసరాల ఎల్‌పీజీని ఇతర అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలి.
o సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం ఉల్లంఘనదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
o వాణిజ్య ఎల్‌పీజీ కోసం తగిన పంపిణీ విధానాలను రూపొందించాలి.
o భయాందోళనతో చేసే కొనుగోళ్లను నిరోధించడానికి, ఇంధనాన్ని పొదుపుగా వాడటాన్ని ప్రోత్సహించడానికి ప్రజా సూచనలను జారీ చేయాలి.
· జిల్లా కలెక్టర్లు, ఆహార - పౌర సరఫరాల అధికారులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తనిఖీలు (ఎన్‌ఫోర్స్‌మెంట్) చేపడుతున్నారు.
· చాలా వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ యంత్రాంగాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
· ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రతిరోజూ మీడియా సమావేశాలను నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు
· అక్రమ నిల్వలు, నల్లబజారును అరికట్టడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో 2,700 కంటే ఎక్కువ దాడులు నిర్వహించి దాదాపు 2,000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయకేంద్రాలు, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద 1,700 కంటే ఎక్కువ ఆకస్మిక తనిఖీలను నిర్వహించాయి.
· ఇప్పటివరకు మొత్తం 650 కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. దాదాపు 155 మందిని అరెస్టు చేశారు.
· ప్రభుత్వం చేపట్టిన చర్యలు
· ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి కీలక రంగాలతో పాటుగా... గృహాలకు ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరా చేయడం కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను కొనసాగిస్తోంది.
· రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధులను 21 రోజుల నుంచి 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సవరించడం, ప్రాధాన్యత ఆధారంగా సరఫరా కేటాయింపులు వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.
· ఎల్‌పీజీ డిమాండ్‌ను తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు.
· చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
· పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని సూచించారు.
· అధికారిక వనరుల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని పౌరులకు సూచించారు.
· ఎల్‌పీజీ బుకింగ్‌ల కోసం పౌరులు డిజిటల్ విధానాన్ని ఉపయోగించాలని, ఎల్‌పీజీ పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
· పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను, ఎలక్ట్రిక్-ఇండక్షన్ కుక్‌టాప్‌లను ఉపయోగించాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
· పౌరులందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
· నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
· పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితి గురించి... భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ కింది సమాచారాన్ని తెలియజేసింది:
· ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి నౌకా ప్రమాదం జరగలేదు.
· సుమారు 540 మంది భారతీయ నావికులతో కూడిన 20 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి సముద్రయాన సిబ్బంది, వారి కుటుంబాలు, సముద్రయాన భాగస్వాముల నుంచి వచ్చిన 4,108 ఫోన్ కాల్‌లు, 7,909 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 187 కాల్‌లు, 462 ఈమెయిళ్లూ ఉన్నాయి.
· డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 635 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయపడింది. గత 24 గంటల్లో స్వదేశానికి వచ్చిన 50 మంది వీరిలో ఉన్నారు.
· గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి సహా రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించినట్లుగా... ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.
· సులభమైన సరుకు నిర్వహణను నిర్ధారించడానికి వీలుగా జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం పోర్ట్, ముంద్రా, దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ, న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ, కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, చెన్నై పోర్ట్ అథారిటీ, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ వంటి కీలక ఓడరేవుల్లో ఇప్పటికే అదనపు స్థలాన్ని ఏర్పాటు చేసి, నౌకల రాకపోకలతో పాటు సరుకు రవాణా కార్యకలాపాలనూ నౌకాశ్రయాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
· ముంద్రా పోర్ట్ మధ్యప్రాచ్యానికి వెళ్లే ఎగుమతి కంటైనర్లకు 15 రోజుల ఉచిత నిల్వ, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలపై 80 శాతం మినహాయింపు, లిఫ్ట్-ఆన్/లిఫ్ట్-ఆఫ్ ఛార్జీలు, షట్అవుట్ ఛార్జీలు, రవాణా ఛార్జీల మినహాయింపుతో పాటు, పట్టణానికి తిరిగి వచ్చే కంటైనర్లకు 15 రోజుల ఉచిత నిల్వతో సహా అదనపు సులభతర చర్యలనూ అందించింది.
· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకా రవాణా కార్యకలాపాలు, నౌకాశ్రయ కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రత, నౌకా వాణిజ్య కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
· సంక్షోభ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
· భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం, విస్తరణతో పాటు ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై తాజా సమాచారాన్ని బ్రీఫింగ్‌లో పంచుకున్నారు. కింది సమాచారాన్ని తెలియజేశారు:
· అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతిని త్వరగా పునరుద్ధరించడం వంటి చర్యలకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
· ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సుకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనదనీ... అది తెరిచి ఉండేలా, సురక్షితంగా, అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
· శ్రీలంక అధ్యక్షుడు హెచ్.ఇ. అనుర కుమార దిసనాయకే నుంచీ ప్రధానమంత్రికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై, ముఖ్యంగా ప్రపంచ ఇంధన భద్రతను ప్రభావితం చేస్తున్న అంతరాయాలపై చర్చించారు.
· ప్రపంచ వాణిజ్యం, స్థిరత్వం దృష్ట్యా నౌకా రవాణా మార్గాలను తెరిచి ఉంచడం, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. భారత్-శ్రీలంక ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని వారు సమీక్షించారు.
· 'పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత' విధానం, 'మహాసాగర్ దార్శనికత'లకు అనుగుణంగా, ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడంలో శ్రీలంకతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
· విదేశాంగ మంత్రి భారత్‌లోని ఇరాన్ రాయబారితో సమావేశమై పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని భారత పౌరులకు ఇరాన్ అందిస్తున్న మద్దతు పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
· భారతీయ పౌరుల భద్రత, క్షేమం, శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ... గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
· భారత పౌరులు, వారి కుటుంబాల సందేహాలను నివృత్తి చేయడానికి, వారికి మద్దతునందించడానికి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ మిషన్లు, పోస్టులు 24×7 హెల్ప్‌లైన్‌లతో నిరంతరం పనిచేస్తూ, ఎప్పటికప్పుడు స్పందిస్తూ... భారతీయ కమ్యూనిటీ సంస్థలు, స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
· రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయి. విద్యార్థులు, నావికులు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, స్వల్పకాలిక సందర్శకులకు వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, లాజిస్టిక్ పరమైన మద్దతునందిస్తూ... చురుగ్గా సహాయం చేస్తున్నాయి.
· ఈ ప్రాంతం నుంచి అదనపు విమానాలు నడుస్తుండటంతో మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాంతం నుంచి సుమారు 4,26,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ కాలంలో భారతీయ, విదేశీ విమానయాన సంస్థల షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ విమానాలతో కలిపి ఈ ప్రాంతం నుంచి మొత్తం 2,149 విమానాలు భారత్‌కు నడిచాయి.
· యూఏఈలో, విమానయాన సంస్థలు కార్యాచరణపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు వివిధ విమానాశ్రయాల నుంచి సుమారు 80 విమానాలు భారత్‌కు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచీ భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు సుమారు 9 షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను భారత్‌కు నడపనుంది.
· కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూసి ఉన్నాయి. భారత పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలుగా జజీరా ఎయిర్‌వేస్, గల్ఫ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు సౌదీ అరేబియా నుంచి ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడుపుతున్నాయి.
· ఇరాన్‌లోని భారత పౌరులను అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా స్వదేశానికి తరలించేందుకు సహాయం కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం సహాయంతో 717 మంది విద్యార్థులు, 326 మంది భారత పౌరులు సహా 1,043 మంది ఇరాన్ నుంచి బయటకు వెళ్లారు.
· ఇజ్రాయెల్‌లోని భారత పౌరులు జోర్డాన్ మీదుగా భారత్‌కు ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.
· కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లలో ఆంక్షల దృష్ట్యా, భారతీయ పౌరులకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సౌకర్యం కల్పించడం కొనసాగుతోంది.
· పలు ఘటనల్లో మృతి చెందిన భారత పౌరుల మృత దేహాలను స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ మద్దతునందిస్తోంది. ఈ నెల 18న రియాద్‌లో మరణించిన ఒక భారత పౌరుడి మృత దేహాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
· ఒమన్, ఇరాక్, యూఏఈల్లోని భారత మిషన్లు... గల్లంతయిన, మృతి చెందిన భారత పౌరుల విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడానికి సహకరిస్తున్నాయి.
(రిలీజ్ ఐడి: 2245344)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam