పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం
· వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్ల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు సూచన
· ప్రభుత్వ సంస్థలలో పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని, సీజీడీ అనుమతులను వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖలకు ఆదేశం
· ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని సూచన
· రెస్టారెంట్లు, సబ్సిడీ క్యాంటీన్లు, వలస కార్మికుల (5 కిలోల ఎఫ్‌టీఎల్) కోసం రాష్ట్రాలకు అదనంగా 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపునకు ఆమోదం
· దీనితో ఇప్పుడు 50 శాతానికి చేరుకున్న మొత్తం కేటాయింపు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న దాడులు
· భారతదేశ సముద్రయాన రంగంలో సాఫీగా కొనసాగుతున్న కార్యకలాపాలు
· దేశంలోని ఏ ఓడరేవులోనూ రద్దీ ఉన్నట్లు అందని నివేదికలు
· గల్ఫ్, పశ్చిమాసియాలోని పరిణామాలపై నిరంతరం కొనసాగుతున్న పర్యవేక్షణ
· అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం
· ఇరాక్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న 'ఎంటీ సేఫ్‌సీ విష్ణు' నౌకకు చెందిన 15 మంది భారతీయ సిబ్బంది
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2026 4:40PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంసిద్ధత, ప్రతిస్పందన చర్యల తాజా సమాచారం వివరణ ఇక్కడ ఉంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న మద్దతు వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత దృష్ట్యా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ స్థిరంగా లభ్యమయ్యేలా చూడటానికి తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితి ఈ కింది విధంగా ఉంది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటిలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
· దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వల నిర్వహణ నిరంతరాయంగా కొనసాగుతోంది.
రిటైల్ విక్రయ కేంద్రాలు
· ఏ రిటైల్ విక్రయకేంద్రంలోనూ ఇంధన కొరత ఉందని చమురు మార్కెటింగ్ కంపెనీల నివేదించలేదు. పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. సరఫరా క్రమం తప్పకుండా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు ఆందోళనతో ముందస్తుగా కొనుగోళ్లు చేయొద్దని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేస్తోంది.
సహజ వాయువు
· ప్రాధాన్యత రంగాలకు రక్షిత సరఫరా అందుతోంది. ఇందులో గృహ వినియోగ పీఎన్‌జీ, రవాణా రంగానికి 100 శాతం సీఎన్‌జీ సరఫరాను కొనసాగిస్తున్నారు. గ్రిడ్‌కు అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం వరకు సరఫరాను పరిమితం చేశారు.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై ఉన్న ఆందోళనలను రూపుమాపేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్ల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు కేంద్ర ప్రభుత్వంసూచించింది.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్ల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి.
· వినియోగదారుల నుంచి దరఖాస్తు అందిన సమయం నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభమయ్యే సమయానికి మధ్యనున్న వ్యవధిని తగ్గించాలని సిటీ గ్యాస్ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని 16.03.2026 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలికంగా మారేందుకు సహకరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
· దీనితో పాటు భారత ప్రభుత్వం 19.03.2026 నాటి లేఖ ద్వారా సంబంధిత అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఈ కింది విధంగా కోరింది.
o సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు కొత్త అనుమతులన్నింటినీ తక్షణమే వేగవంతం చేయడానికి, పరిష్కరించడానికి సంబంధిత విభాగాలు, సంస్థలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి.
o భవిష్యత్తులో సీజీడీకి సంబంధించిన అనుమతి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయటానికి సరళీకృతమైన, కాలపరిమితితో కూడిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
o పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న చోట అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కాలనీలు, కార్యాలయాలు, క్యాంటీన్లు పీఎన్‌జీకి మారాలని సూచించాలి.
· కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలోని సంస్థల్లో పీఎన్‌జీ కనెక్షన్ల సంభావ్య డిమాండ్‌పై సమగ్ర అంచనా వేయాలని.. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి ప్రతి మంత్రిత్వ శాఖ లేదా విభాగం నుంచి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం 20.03.2026 నాటి లేఖ ద్వారా కోరింది.
· పైన పేర్కొన్న ప్రభుత్వ లేఖకు స్పందనగా పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజీవ్ సేఫ్టీ ఆర్గనైజేషన్).. సీజీడీ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో అంటే అందిన 10 రోజులలోపు పూర్తి చేయాలని తన పరిధిలోని అన్ని కార్యాలయాలకు సూచించింది.
· ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని కోరారు.
ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది.
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా:
o ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల్లో నిల్వల కొరత ఉన్నట్లు ఎటువంటి నివేదికలు అందలేదు.
o మెజారిటీ సిలిండర్ల పంపిణీ 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) ద్వారానే జరుగుతోంది.
o ఆందోళనతో ముందస్తుగా చేసే బుకింగ్‌లు తగ్గాయి.
o దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే సాగుతోంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా
o ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షికంగా (20 శాతం) వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు 'సులభతర వాణిజ్య సంస్కరణలు' చేపట్టిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
o కేంద్ర ప్రభుత్వం 21.03.2026 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపునకు అనుమతి ఇచ్చింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (పీఎన్‌జీ వినియోగాన్ని పెంచే సంస్కరణల ఆధారంగా ఇచ్చే 10 శాతంతో కలిపి) చేరుకుంటుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును ప్రాధాన్య రంగాలైన రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ లేదా డైరీ పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా నడిచే సబ్సిడీ క్యాంటీన్లు లేదా అవుట్లెట్లు, సామాజిక వంటశాలలు, వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు వంటి వాటికి ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు.
o కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్‌పీజీని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేస్తున్నాయి. గత వారం రోజులలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మొత్తం సుమారు 13,479 ఎంటీల గ్యాస్‌ను సేకరించాయి.
o విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులలో సుమారు 50 శాతం ఈ రంగాలకే అందుతోంది.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· జిల్లాల్లో కిరోసిన్ పంపిణీకి తగిన ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
· ఇప్పటివరకు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు ఎటువంటి కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి. నేటి వరకు ఇంకా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సమావేశాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి.
భారత ప్రభుత్వం 13.03.2026, 18.03.2026 తేదీల నాటి లేఖల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇలా అభ్యర్థించింది.
అక్రమ నిల్వలు కలిగి ఉండడం, బ్లాక్ మార్కెటింగ్, గృహావసర ఎల్‌పీజీ దారి మళ్లింపు సహా ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు వాటిపై గట్టి నిఘా ఉంచడం.
నిత్యావసర వస్తువుల చట్టం-1955, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నియమాలు-2002, మోటార్ స్పిరిట్, హెచ్ఎస్‌డీ ఉత్తర్వులు-2005, వర్తించే ఇతర చట్టాల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం.
స్థానిక ప్రాధాన్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీకి తగిన విధానాలను రూపొందించడం.
భయాందోళనలతో చేసే కొనుగోళ్లను నివారించడానికి ప్రజలకు సూచనలు జారీ చేయడం, ఎల్‌పీజీని వివేకంతో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, కచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చాలా వరకు రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
కంట్రోల్ రూమ్‌లు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యవసర ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరడమైనది.
అమలవుతున్న చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారాన్ని అరికట్టేందుకు అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో 3,500లకు పైగా తనిఖీలు నిర్వహించి, సుమారు 1,400 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిరంతర తనిఖీలు నిర్వహించాలని కోరడమైనది.
సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ఏవైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కేసులు ఉన్నాయా తనిఖీ చేయడానికి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులు దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఆర్‌ఓ, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
ఈ యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం గృహావసర ఎల్‌పీజీ, పీఎన్‌జీలకు అత్యధిక ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఆసుపత్రులు, విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యమిస్తోంది.
సరఫరా, డిమాండ్ రెండింటి కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రతిపాదించారు. కిరోసిన్, బొగ్గులను ప్రత్యామ్నాయ వినియోగంగా అనుమతించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎమ్‌వోఈఎఫ్‌సీసీ ఇప్పటికే సూచించింది.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గృహ, వాణిజ్య వినియోగదారులకూ కొత్త పీఎన్‌జీ కనెక్షన్ల ఏర్పాటును సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ, వేగవంతం చేసే రాష్ట్రాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు చేయాలని ప్రతిపాదన చేసింది.
ప్రజలకు సూచనలు
గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్లు నిరంతరాయంగా అందుబాటులో ఉంచడం, సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. పౌరులు అధికారిక సమాచార వనరులను మాత్రమే విశ్వసించాలనీ, వదంతులను నివారించాలని సూచించడమైనది.
పౌరులు భయాందోళనలతో బుకింగ్‌లు చేయవద్దని, ఎల్‌పీజీ బుకింగ్‌ల కోసం డిజిటల్ వేదికలను మాత్రమే ఉపయోగించాలని, పంపిణీదారులను నేరుగా సందర్శించకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సిలిండర్ల హోం డెలివరీ నిరాటంకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు.
భయాందోళనలతో చేసే బుకింగ్‌లు తగ్గినప్పటికీ, పంపిణీ కేంద్రాల వద్ద అక్కడక్కడా రద్దీ ఘటనలు నమోదయ్యాయి. వినియోగదారులు క్యూలో నిలబడి హోం డెలివరీల కోసం వేచి ఉండవద్దని సూచించారు.
పీఎన్‌జీ, విద్యుత్-ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, దైనందిన వినియోగంలో ఇంధన పొదుపు పద్ధతులను పాటించాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ నౌకలు, నావికులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
నౌకల రాకపోకలు, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యక్రమాల కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలు చోటుచేసుకోలేదు.
పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 611 మంది భారతీయ నావికులతో కూడిన మొత్తం 22 భారత జెండా గల నౌకలు ఉన్నాయి. నౌకల యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారతీయ దౌత్య కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ డీజీ షిప్పింగ్ ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఒక ఘటనలో, ఒక భారతీయ నావికుడు (పనామా జెండా కలిగిన 'ఏఎస్‌పీ అవానా' నౌక కెప్టెన్) ఈ నెల 18న మృతి చెందారు. యూఏఈలోని భారతీయ దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ డీజీ షిప్పింగ్ మృతుని కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,670 ఫోన్ కాల్‌లు, 6,929 ఈమెయిళ్ళను (గత 24 గంటల్లో వచ్చిన 120 కాల్‌లు, 181 ఈమెయిళ్ళతో కలిపి) స్వీకరించి, పరిష్కరించింది. ఇప్పటివరకు 534 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. గత 24 గంటల్లో వచ్చిన 21 మందీ వీరిలో ఉన్నారు.
భారత నౌకా వాణిజ్య రంగం కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి. ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. నావికుల భద్రత, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలు, ఓడరేవు కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ రాష్ట్ర మారిటైమ్ బోర్డులు, ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారతీయ మిషన్లు, పోస్టులు భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. వారి భద్రత, శ్రేయస్సు కోసం అవసరమైన సూచనలు జారీ చేస్తూ, అవసరమైన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ఈ సమాచారం తెలియజేసింది:
బహ్రెయిన్ రాజు, గౌరవ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫాతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు, బహ్రెయిన్ ప్రజలకు ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు నేతలు పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ప్రధానమంత్రి ఖండించారు. ప్రపంచ ఆహార, ఇంధన, ఎరువుల భద్రతపై వాటి ప్రభావాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత నౌకాయాన మార్గాల ప్రాముఖ్యతనూ ఆయన పునరుద్ఘాటించారు. బహ్రెయిన్‌లోని భారతీయ పౌరులకు అందిస్తున్న నిరంతర మద్దతు కోసం ఆ దేశ రాజుకు ధన్యవాదాలు తెలిపారు.
భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఒక ప్రత్యేక 24x7 కంట్రోల్ రూమ్ దీని కోసం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులు ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూ, హెల్ప్లైన్లను నిర్వహిస్తూ, సూచనలనూ జారీ చేస్తున్నాయి. సామాజిక సంస్థలు, స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి. సముద్రయాన కార్మికులు, విద్యార్థులు, చిక్కుకుపోయిన భారత జాతీయులు, స్వల్పకాలిక సందర్శకులకు సహాయం కొనసాగుతోంది.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 3.3 లక్షల మంది ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు.
యూఏఈ నుంచి ఈ రోజు సుమారు 90 విమానాలు నడుస్తాయని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచీ విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఖతార్ తన గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరుస్తూ 8 నుంచి 10 వరకు షెడ్యూల్ చేయని విమానాలను నడుపుతోంది.
కువైట్, బహ్రెయిన్‌ల గగనతలం మూసివేత కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాలను సౌదీ అరేబియా మీదుగా (దమ్మమ్, అల్ ఖైసుమా విమానాశ్రయాలతో సహా) నడుపుతున్నారు. భారతీయ పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఎమ్‌టీ సేఫ్‌సీ విష్ణు నౌకకు చెందిన 15 మంది భారతీయ సిబ్బంది ఇరాక్ నుంచి సురక్షితంగా భారత్ తిరిగి వచ్చారు.
వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలోని మిషన్లు గాలింపు చర్యల కోసం, మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడం కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2243468)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9