సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హాంకాంగ్ ఫిల్మ్‌మార్ట్ 2026 - మీడియా, వినోద రంగంలో పెరుగుతున్న ఇండియా ప్రభావాన్ని చాటిచెప్పిన భారత్ పెవిలియన్
భారతీయ ఆవిష్కర్తలకు సహ చిత్ర నిర్మాణ ఒప్పందాలు, వ్యాపార మార్పిడి, అంతర్జాతీయ మార్కెట్
ప్రవేశాన్ని కల్పించడం ద్వారా ప్రపంచ చలనచిత్ర విపణిలో భారత్ సామర్ధ్యాన్ని నిరంతరం చాటుతున్న ఎన్ఎఫ్డీసీ
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 5:47PM by PIB Hyderabad
హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, టీవీ మార్కెట్ (ఫిల్మార్ట్) 2026లో భారత పెవిలియన్, ప్రపంచ మీడియా, వినోద రంగంలో పెరుగుతున్న భారతదేశ ఉనికిని మరింత బలపరుస్తోంది. ఇది అంతర్జాతీయ భాగస్వామ్యం, వ్యాపార మార్పిడి, పరిశ్రమల మధ్య సహకారం కోసం ఒక వ్యూహాత్మక వేదికగా పనిచేస్తోంది.
హాంకాంగ్, మాకావు ఎస్ఏఆర్లలోని భారత కాన్సులేట్ జనరల్‌కు చెందిన కాన్సుల్ జనరల్ శ్రీ రాజేష్ నాయక్ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. సినిమా, టెలివిజన్, అభివృద్ధి చెందుతున్న మీడియా రంగాలలో ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ మీడియా, వినోద వ్యవస్థపై అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవంలో భారత ప్రతినిధి బృందం క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఆయన అభినందించారు.
హాంకాంగ్ మాకావు ఎస్ఏఆర్ లోని భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ ఎక్స్ పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ (ఎస్ఈపీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) సంయుక్తంగా,ఈ భారత్ పెవిలియన్‌ను నిర్వహించాయి. ఎస్ఈపీసీ, ఎన్ఎఫ్డీసీ, హాంకాంగ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (హెచ్కేటీడీసీ) నుంచి సీనియర్ ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
చలనచిత్రాలు, టెలివిజన్, యానిమేషన్, అభివృద్ధి చెందుతున్న మీడియా రంగాలలో భారతదేశ వైవిధ్య భరితమైన కంటెంట్, నిర్మాణ వ్యవస్థను ఈ పెవిలియన్ ప్రదర్శించింది. అంతర్జాతీయ భాగస్వాములతో బి2బి సమావేశాలు, కో-ప్రొడక్షన్ పై చర్చలు నెట్‌వర్కింగ్ కార్యకలాపాలను కూడా నిర్వహించింది. ప్రపంచ కంటెంట్ రంగంలో సినిమాల ప్రభావం, అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై ఒక ప్యానెల్ చర్చను కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పరిశ్రమ నిపుణులు మారుతున్న మార్కెట్ ధోరణులు, దేశాల మధ్య సహకారాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతీయ సృజనకర్తలకు కో-ప్రొడక్షన్ ఒప్పందాలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశం, పంపిణీ అవకాశాలను కల్పించడం ద్వారా ప్రధాన అంతర్జాతీయ చలనచిత్ర మార్కెట్లలో భారతదేశాన్ని నిలబెట్టడంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ముంబయిలోని పెద్దర్ రోడ్‌లో ఉన్న ఎన్ఎఫ్డీసీ క్యాంపస్‌లో 2026 జూన్ 15 నుంచి జరగనున్న ముంబయి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (ఎంఐఎఫ్ఎఫ్), వేవ్స్ డాక్ బజార్ వంటి రాబోయే ముఖ్యమైన ఎన్ఎఫ్డీసీ కార్యక్రమాలను కూడా ఈ పెవిలియన్ ప్రచారం చేసింది. ఇవి ప్రధానంగా డాక్యుమెంటరీ, యానిమేషన్, లఘు చిత్రాలపై దృష్టి సారిస్తాయి. గోవాలో 2026 నవంబర్‌లో జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి భారత ప్రతిష్టాత్మక వేదికల గురించి కూడా ఇది ప్రముఖంగా వివరించింది.
అంతర్జాతీయ మీడియా, వినోద రంగంలో భారతదేశాన్ని ఒక కీలక భాగస్వామిగా నిలబెడుతూ, విధానపరమైన నిర్ణయాలు, పరిశ్రమ, అంతర్జాతీయ విస్తరణను ఏకం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న సమన్వయ కృషిని భారత్ పెవిలియన్ ప్రతిబింబించింది.
***
(రిలీజ్ ఐడి: 2242686)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13