పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
సుమారు 57 లక్షలకు తగ్గిన ముందస్తు బుకింగ్‌లు
వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీజీడీ సంస్థలకు సూచన
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసేందుకు అవసరమైన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రోత్సాహం
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలు, ఇతర అక్రమాలను అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్ర ప్రభుత్వం
క్రమం తప్పకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల (ఎఫ్‌సీ-ఎస్) అధికారులందరికీ విన్నపం
రోజువారీ మీడియా సమావేశాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్రం
అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు
ఇప్పటివరకు 6,000కు పైగా దాడులు నిర్వహించి 11,000 కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
నౌకాయాన కదలికలు, ఓడరేవు కార్యకలాపాలు, నావికుల భద్రత, సముద్ర వాణిజ్యం కొనసాగేలా నిరంతరం పర్యవేక్షిస్తోన్న ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ
గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భారతీయ సమాజం రక్షణ, భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత
పశ్చిమ ఆసియాలో రవాణా అంతరాయాల దృష్ట్యా ఎగుమతిదారులకు మద్దతుగా ‘రిలీఫ్’ పథకాన్ని ఆమోదించిన ప్రభుత్వం
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచన
అనుమానాస్పద ఫైళ్లు లేదా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయొద్దని, ఇన్‌స్టాల్ చేయొద్దని విజ్ఞప్తి
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 5:26PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలోని తాజా పరిణామాలపై మీడియాకు క్రమం తప్పకుండా సమాచారం అందించే ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఈ రోజు (2026 మార్చి 19) జాతీయ మీడియా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్ మినిస్ట్రీయల్) సమావేశం నిర్వహించాయి. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయం వంటి కీలక అంశాలపై తాజా సమాచారాన్ని వారు పంచుకున్నారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ సమావేశంలో తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను తెలియజేసింది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
రిటైల్ అవుట్‌లెట్లు
-
రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం అయిపోయినట్లు ఎక్కడా నివేదికలు రాలేదు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమబద్ధంగా కొనసాగుతోంది.
-
తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ఆందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.
సహజ వాయువు
-
గృహ అవసరాల పీఎన్‌జీ, రవాణా రంగ సీఎన్‌జీ విభాగాలకు 100 శాతం సరఫరాను కొనసాగిస్తూనే ప్రాధాన్యత కలిగిన రంగాలకు రక్షిత సరఫరాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను సుమారు 80 శాతానికి పరిమితం చేశారు.
-
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు సూచించారు. వాణిజ్య సంస్థలు తమ పరిధిలోని అధీకృత సీజీడీ సంస్థల నుంచి ఈ కనెక్షన్లను పొందొచ్చు.
-
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సిజీడీ సంస్థలు పీఎన్‌జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. పీఎన్‌జీ వినియోగాన్ని విస్తృతం చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేలా కనెక్షన్ల జారీ గడువును కూడా తగ్గించారు.
-
పీఎన్‌జీ డ్రైవ్‌లో భాగంగా భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సీజీడీ సంస్థలకు పీఎన్‌జీఆర్‌బీ సూచించింది.
-
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసేందుకు 2026 మార్చి 16 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు 'తక్షణ అనుమతులు (డీమ్డ్ పర్మిషన్లు)' మంజూరు చేయడం, కొత్త అనుమతులను 24 గంటల్లోపు ఆమోదించడం, రోడ్డు పునరుద్ధరణ- అనుమతి రుసుములను రద్దు చేయడం, పని వేళలు- సీజన్ల నిబంధనలను సడలించడం, వేగవంతమైన అమలు కోసం రాష్ట్ర నోడల్ అధికారులను నియమించాలని కోరింది.
-
2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారడానికి మద్దతుగా చేపట్టిన సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును ప్రతిపాదించింది. ఇందులో:
-
సీజీడీ దరఖాస్తుల ఆమోదం, ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేసినందుకు 1 శాతం అదనపు కేటాయింపు.
-
సీజీడీకి తక్షణ అనుమతులు (డీమ్డ్ పర్మిషన్స్) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు 2 శాతం అదనపు కేటాయింపు
-
సీజీడీ సంస్థల కోసం ‘డిగ్ అండ్ రిస్టోర్ స్కీమ్’ ప్రవేశపెట్టినందుకు 3 శాతం అదనపు కేటాయింపు
-
వార్షిక అద్దె, లీజు రుసుములను తగ్గించినందుకు 4 శాతం అదనపు కేటాయింపు ఉంటాయి.
-
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడానికి.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్‌లను త్వరితగతిన అందించడానికి ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నారు.
-
పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారేలా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలి రోజుల్లోనే ఇప్పటికే 5,600 మందికి పైగా వినియోగదారులు పీఎన్‌జీకి మారారు. ఈ చర్యల వల్ల ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
ఎల్‌పీజీ
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
-
డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎక్కడా ఎల్‌పీజీ కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
-
ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 84 శాతం నుంచి 94 శాతానికి పెరిగాయి. గ్యాస్ దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) విధానాన్ని 83 శాతం వరకు పెంచారు.
-
ఆందోళనతో ముందస్తుగా చేసే బుకింగ్‌లు సుమారు 57 లక్షలకు తగ్గాయి. గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా ఎప్పటిలాగే సాధారణంగా కొనసాగుతోంది.
-
గృహేతర ఎల్‌పీజీ కేటాయింపుల కోసం ఇప్పటికే 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా అందుబాటులో ఉంది.
కిరోసిన్
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలో లీటర్ల (కేఎల్) కిరోసిన్ కేటాయించారు. పంపిణీ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
-
ఇప్పటికే 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్కేఎం- సుపీరియర్ కిరోసిన్ ఆయిల్) కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశాయి. కొన్ని రాష్ట్రాలు తమకు ఎటువంటి అదనపు అవసరం లేదని తెలియజేశాయి.
రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు
-
నిత్యావసర సరకుల చట్టం, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. సమన్వయంతో కూడిన తనిఖీలు, ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని వాటికి సూచించారు.
-
పెట్రోల్ బంకులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్లు, నిల్వ కేంద్రాలు మొదలైన చోట్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా అరికట్టడానికి సమన్వయంతో కూడిన తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 13.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను తెలియజేసింది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించాలని సూచించింది.
-
18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కింది చర్యలు తీసుకోవాలని కోరింది:
-
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలు, గృహ అవసరాల ఎల్‌పీజీ దుర్వినియోగం, ఇతర అక్రమాలను అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలి.
-
నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిత్యావసర సరకుల చట్టం- 1955, పెట్రోలియం చట్టం- 1934, పెట్రోలియం నిబంధనలు- 2002, మోటార్ స్పిరిట్- హెచ్ఎస్డీ (హెచ్ఎస్డీ) ఉత్తర్వు- 2005, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
-
ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎల్‌పీజీ ట్యాంకర్లు, సిలిండర్ల రవాణా సాఫీగా సాగేలా చూడటంతో పాటు తగిన పరిపాలనా, రవాణా చర్యలు చేపట్టాలి.
-
స్థానిక ప్రాధాన్యతలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీకి తగిన పద్ధతులను రూపొందించాలి.
-
ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని ప్రజలను హెచ్చరిస్తూ సూచనలను జారీ చేయాలి. ఎల్పీజీని పొదుపుగా వాడాలని ప్రోత్సహించడంతో పాటు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలి.
-
జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల (ఎఫ్‌సీ-ఎస్) అధికారులందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని కోరారు.
-
సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించాలని కోరారు.
-
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని.. వాటి గురించి క్రమబద్ధమైన విరామాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు.
-
పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి.
-
25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలనుఏర్పాటు చేశాయి.
-
కంట్రోల్ రూంలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యవసర ప్రతిపాదికన వెంటనే వీటిని ఏర్పాటు చేయాలని కోరారు.
అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు
-
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు 6,000కు పైగా దాడులు నిర్వహించి 11,000 కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.
-
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో గణనీయమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా సిలిండర్ల సీజ్, ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో పాటు ఆరెస్టులు చేశారు.
-
నల్లబజారు క్రయవిక్రయాలు, అక్రమ నిల్వలను పూర్తిగా నిరోధించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలి.
-
ఇంధన సరఫరా సాఫీగా సాగేలా చూడటానికి, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ రిటైల్ అవుట్‌లెట్లు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల వద్ద 2,000కు పైగా ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నాయి.
ప్రభుత్వ చర్యలు
-
గృహ అవసరాలతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి ప్రాధాన్యత కలిగిన రంగాలకు ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా అందేలా చూడటం, పీఎన్‌జీ విస్తరణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది.
-
చమురు శుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచడం.. ఎల్‌పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు సవరించడం.. ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు చేయడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
-
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. కిరోసిన్, బొగ్గును ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఉపయోగించేందుకు అనుమతించాలని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సూచించింది.
-
చిన్న- మధ్యతరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకునే ప్రక్రియను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసే రాష్ట్రాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు చేయాలనే ప్రతిపాదన కూడా చేశారు.
-
నిత్యావసర సరకుల చట్టం- 1955లోని సెక్షన్-3 ప్రకారం సమాచార సేకరణ, సంకలనం, నిర్వహణ, విశ్లేషణ కోసం పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్‌ను (పీపీఏసీ) నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ 18.03.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోలియం ఉత్పత్తులు లేదా సహజ వాయువు ఉత్పత్తి, ప్రాసెసింగ్, రిఫైనింగ్, నిల్వ, రవాణా, దిగుమతి-ఎగుమతి, మార్కెటింగ్, పంపిణీలో నిమగ్నమై ఉన్న అన్ని సంస్థలు తమ సమాచారాన్ని తప్పనిసరిగా పీపీఏసీకి సమర్పించాలని ఆదేశించారు.
ప్రజలకు సూచనలు
పౌరులు సమాచారం కోసం అధికారిక వర్గాలపైనే ఆధారపడాలనీ, వదంతులకు దూరంగా ఉండాలని సూచించడమైనది.
హోమ్ డెలివరీ కొనసాగుతున్నందున, వినియోగదారులు భయాందోళనలతో బుకింగ్‌లు చేయవద్దని, డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లనే ఉపయోగించాలని, ఎల్‌పీజీ పంపిణీదారులను సంప్రదించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పీఎన్‌జీ, విద్యుత్-ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ఇంధనాన్ని పొదుపు చేయాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నిర్వహించిన బ్రీఫింగ్‌లో... పర్షియన్ గల్ఫ్‌లో నౌకా వాణిజ్య పరిస్థితిని, భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి సమాచారం తెలియజేశారు. మంత్రిత్వ శాఖ కింది విషయాలను తెలియజేసింది:
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి నౌకా ప్రమాదం నమోదు కాలేదు.
ప్రస్తుతం, 611 మంది భారతీయ నావికులతో కూడిన 22 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకల యజమానులు, ఆర్‌ఎస్‌పీఎల్ ఏజెన్సీలు, భారతీయ మిషన్లతో సమన్వయం చేసుకుంటూ డీజీ షిప్పింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ముడి చమురు నౌక 'జాగ్ లడ్కీ' మార్చి 18న ఉదయం 6 గంటలకు ముంద్రా పోర్టుకు చేరుకుంది. ప్రస్తుతం అన్ లోడింగ్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మార్చి 19 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
డీజీ షిప్పింగ్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ప్రారంభం నుంచి ఇది 3,425 కాల్‌లు, 6,539 ఈమెయిళ్లను స్వీకరించి, పరిష్కరించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 150 కాల్‌లు, 215 ఈమెయిళ్లు ఉన్నాయి.
విమానాశ్రయాలు, ప్రాంతీయ కేంద్రాల నుంచి గత 24 గంటల్లో 16 మంది సహా మొత్తం 488 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించుటను డీజీ షిప్పింగ్ సుగమం చేసింది.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి సహా ఆయా రాష్ట్రాల మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించినట్లుగా... ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.
ఓడరేవులు నౌకల రవాణాను, సరుకు రవాణా కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, ముంద్రా సహా పలు పోర్టులలో అదనపు నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు.
దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ సుమారు 54 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, ఛార్జీలపై మినహాయింపులు, కార్యాచరణ సహాయక చర్యలతో అదనపు నిల్వ సామర్థ్యాన్ని కల్పించింది. పోర్ట్ వినియోగదారులకు హార్బర్ మొబైల్ క్రేన్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపును అందించింది.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నౌకా రవాణాను, ఓడరేవు కార్యకలాపాలు, నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యకలాపాల కొనసాగింపును పర్యవేక్షిస్తూనే ఉంది.
సంక్షోభ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం, విస్తరణ సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారం తెలియజేసింది:
కువైట్ యువరాజు హెచ్.హెచ్. షేక్ సబా అల్-ఖాలేద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో మాట్లాడిన ప్రధానమంత్రి... రాబోయే ఈద్ పండుగ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవలి పరిణామాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను భారత్ ఖండిస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
హార్మూజ్ జలసంధి గుండా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి నిరంతర దౌత్య సంబంధాలు అత్యవసరమని ఇరువురు నేతలు అంగీకరించారు.
కువైట్‌లో భారతీయ పౌరుల భద్రత, శ్రేయస్సు పట్ల నిరంతర మద్దతు అందించినందుకు ప్రధానమంత్రి ఆ దేశ యువరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ... గల్ఫ్, విస్తృత పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
సమాచార మార్పిడి, ప్రతిస్పందన సమర్థంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగిస్తూ... విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోంది.
ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, కార్యాలయాలు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తున్నాయి. స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలనూ కొనసాగిస్తున్నాయి.
సముద్రయాన సిబ్బందికి, విద్యార్థులకు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు, స్వల్పకాలిక సందర్శకులకు వీసాలు, కాన్సులర్ సేవలు, లాజిస్టిక్ సంబంధిత ఏర్పాట్లలో మిషన్లు సహాయాన్ని అందిస్తున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 2,80,000 మంది ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు.
కొన్ని దేశాల్లో తాత్కాలిక కార్యకలాపాల నిలిపివేతలు ఉన్నప్పటికీ, అదనపు సేవలను ప్రవేశపెడుతూ విమాన కార్యకలాపాలు క్రమంగా మెరుగవుతున్నాయి.
యూఏఈలో, పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ నెల 18న సుమారు 75 విమానాలు, ఈ రోజు వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌కు దాదాపు 90 విమానాలు బయలుదేరనున్నాయి.
ఒమన్, సౌదీ అరేబియా నుంచి భారత్‌కు విమానాలు నడుస్తూనే ఉన్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు భారత్‌కు తొమ్మిది విమానాలు సహా షెడ్యూల్ చేయని విమానాలనూ నడుపుతోంది.
2026 ఫిబ్రవరి 28 నుంచి కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని అల్-ఖైసుమా విమానాశ్రయం నుంచి జజీరా ఎయిర్‌వేస్ ద్వారా ప్రత్యేక, షెడ్యూల్ చేయని విమానాలు నడుపుతున్నారు. ఇందులో భాగంగా కొచ్చికి వెళ్ళే మొదటి విమానం రేపు బయలుదేరనుంది.
బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. గల్ఫ్ ఎయిర్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అదనపు సర్వీసులూ అందుబాటులోకి రానున్నాయి.
గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్న కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లలోని భారతీయ పౌరుల కోసం, ముఖ్యంగా అత్యవసర సందర్భాల్లో... సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సదుపాయం కల్పించడం కొనసాగుతోంది.
సురక్షితంగా రక్షించిన ఎమ్‌టీ సేఫ్‌సీ విష్ణు నౌకకు చెందిన 15 మంది భారతీయ సిబ్బంది ఇరాక్ నుంచి బయలుదేరారు. వారు త్వరలోనే భారత్ తిరిగి వస్తారని భావిస్తున్నారు.
వారి రాకను సులభతరం చేయడానికి, ఒక భారతీయ పౌరుడి భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సిబ్బందితోనూ, ఇరాక్ అధికారులతోనూ మిషన్ సంప్రదింపులు కొనసాగిస్తోంది.
ప్రజా సమాచారం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థ, లాజిస్టిక్స్ అంతరాల దృష్ట్యా ఎగుమతిదారుల కోసం ఒక కొత్త ఉపశమన ప్యాకేజీని ప్రకటిస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది.
'రీలైఫ్' (ఎగుమతుల సులభతరం కోసం సమర్థమైన, లాజిస్టిక్ ఇంటర్వెన్షన్) పేరుతో రూపొందించిన ప్యాకేజీ, ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఆమోదం పొందింది.
కొనసాగుతున్న బాహ్య అంతరాయాల మధ్య ఎగుమతిదారులకు మద్దతునివ్వడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ సహాయ ప్యాకేజీ లక్ష్యం.
అంతర్జాతీయ వాణిజ్యంలో తలెత్తుతున్న సవాళ్లకు ప్రభుత్వ వేగవంతమైన స్పందనను ఈ ఆమోదం ప్రతిబింబిస్తుంది.
సమర్థ సరుకు రవాణా వ్యవస్థ కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఇది కార్యరూపం దాల్చింది.
ఐఎంజీ మారుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, రోజువారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. సహాయక చర్యలనూ సమన్వయం చేస్తోంది. నిరంతర అంచనాలు, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల ఆధారంగా రీలైఫ్ ప్యాకేజీని రూపొందించారు.
సహాయ ప్యాకేజీకి మొత్తం రూ. 497 కోట్ల ఆర్థిక కేటాయింపు ఉంది. దీనిని ఎగుమతి ప్రోత్సాహక మిషన్ విధాన ప్రణాళిక కింద అమలు చేస్తారు. ఈ ప్యాకేజీలో ఎగుమతి సౌలభ్యం, లాజిస్టిక్స్ మద్దతును లక్ష్యంగా చేసుకున్న అనేక అంశాలు ఉన్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో ఎల్‌పీజీ బుకింగ్‌లకు సంబంధించిన సైబర్ మోసాల ఉదంతాలు నమోదయ్యాయి. మోసగాళ్లు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, వినియోగదారులను తప్పుదోవ పట్టించేందుకు వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా “గ్యాస్ బిల్ అప్‌డేట్ ఏపీకే” వంటి హానికరమైన ఫైళ్లను పంపిస్తున్నారు.
సందేశాల ద్వారా అందిన అనుమానాస్పద ఫైళ్లు, అప్లికేషన్లను డౌన్‌లోడ్ గానీ, ఇన్‌స్టాల్ గానీ చేయవద్దని వినియోగదారులకు సూచించడమైనది. ఇవి వ్యక్తిగత డేటాను, బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేయవచ్చు. ఎల్‌పీజీ బుకింగ్‌ల కోసం పౌరులు అధికారిక వేదికలపై మాత్రమే ఆధారపడాలని కోరడమైనది.
ఎల్‌పీజీ పంపిణీ నిరంతరాయంగా జరిగేలా చూడటానికి పరిపాలనాపరమైన, లాజిస్టికల్ ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
అధికారులు జిల్లా స్థాయిలో ఎల్‌పీజీ సరఫరాను నిశితంగా పర్యవేక్షిస్తూ ఎల్‌పీజీ ట్యాంకర్లు, సిలిండర్ల రవాణా ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
భయాందోళనలతో వస్తువులు కొనుగోలు చేయడాన్ని నివారించడానికి, ఎల్పీజీని వివేకవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, కచ్చితమైన సమాచారం వ్యాప్తి చెందేలా చూడటానికి... ప్రజలకు సూచనలను జారీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
తక్షణ అమలు నిమిత్తం భారత ప్రభుత్వ ఆదేశాలను సంబంధిత అధికారులందరికీ తెలియజేస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2242669)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam