సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి ఐఐసీటీ సందర్శన: విస్తరణ ప్రణాళికలు... కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ ప్రణాళికపై సమీక్ష


· భారత సృజనాత్మక ప్రతిభావంతుల వ్యవస్థను పెంపొందించడంలో ఐఐసీటీ కీలక పాత్ర పోషించాలని సూచన

· మీడియా-వినోద రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఐఐసీటీ శక్తిమంతమైన కేంద్రంగా వ్యవహరించాలని శ్రీ సంజయ్‌ జాజు పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 6:13PM by PIB Hyderabad

కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఇవాళ ముంబయిలో ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ ప్రాంగణంలోగల ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్’ (ఐఐసీటీ)ని  సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ వృద్ధి పథం, విస్తరణ ప్రణాళికలను ఆయన సమీక్షించారు.

శ్రీ జాజు అధ్యక్షత వహించిన ఈ సమీక్ష సమావేశంలో బోర్డు సభ్యులందరితోపాటు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సంస్థ సారథ్య బృందంతో వారి వ్యూహాత్మక భవిష్యత్‌ ప్రణాళికపై శ్రీ జాజు కూలంకషంగా చర్చించారు. సృజనాత్మక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న అవసరాలను తీర్చడానికి ఐఐసీటీ విద్యా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రధానంగా చర్చ కేంద్రీకృతమైంది. పారిశ్రామిక, విద్యాసంస్థల సహకార బలోపేతం లక్ష్యంగా కొనసాగుతున్న కార్యక్రమాలను కూడా ఆయన సమీక్షించారు.

శ్రీ జాజు మాట్లాడుతూ- “ఐఐసీటీలో మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి.. సుమారు 150 మంది విద్యార్థులు ఇప్పటికే అధ్యయన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో జూలై నాటికి 400 మంది విద్యార్థులతోపాటు ప్రత్యక్షంగా 20, వర్చువల్ విధానంలో మరెన్నో అంకుర సంస్థలను జోడించడమే లక్ష్యం. ఈ సంస్థ నిర్మాణ, నిర్మాణానంతర పనుల కోసం అత్యుత్తమ నాణ్యత గల మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది” అన్నారు. ప్రస్తుతం, ఐఐసీటీలో 11 అంకుర సంస్థల సంపోషణ కొనసాగుతున్నదని కూడా ఆయన పేర్కొన్నారు. గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో త్వరలో ఒక పెద్ద ప్రాంగణాన్ని రూపొందిస్తున్నామని, 2028కల్లా అక్కడ తరగతులు ప్రారంభం కాగలవని శ్రీ జాజు తెలిపారు.

సమావేశంలో చర్చల గురించి ప్రస్తావిస్తూ- కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విజువల్ గేమింగ్, వీఎఫ్ఎక్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్‌ల అంశంపైనా పరిశ్రమ ప్రతినిధులతో చర్చించినట్లు శ్రీ జాజు చెప్పారు. సృజనార్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. గత సంవత్సరం వేవ్స్ సమ్మిట్‌లో “సృజనార్ధిక వ్యవస్థ” (ఆరెంజ్ ఎకానమీ) కార్యక్రమం కింద కంటెంట్ క్రియేషన్, సృజనాత్మక రంగాలతో 20 లక్షల మందిని అనుసంధానించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపైనా నేటి చర్చల్లో దృష్టి సారించామని శ్రీ జాజు తెలిపారు.

దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్‌ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ ఈ పర్యటనలో ఓ కీలకాంశం. డిజిటల్ సృజనాత్మకతకు ప్రోత్సాహం, మీడియా అవగాహన పెంపు, క్రియేటర్ ఎకానమీలో భవిష్యత్‌ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు కంటెంట్ ప్రొడక్షన్ నైపుణ్య కల్పన ఈ కార్యక్రమం లక్ష్యాలు.

ఇన్‌స్టిట్యూట్‌లోని అత్యాధునిక సౌకర్యాలతోపాటు అక్కడి శిక్షణ కార్యక్రమాలు, ప్రొడక్షన్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణ హబ్‌లను శ్రీ జాజు సందర్శించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులతో సంభాషిస్తూ దేశీయ సృజనాత్మక ప్రతిభా వ్యవస్థ వృద్ధిలో ఐఐసీటీ పాత్రపై అభిప్రాయాలను వారితో పంచుకున్నారు.

ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుతం యానిమేషన్, గేమింగ్, పోస్ట్-ప్రొడక్షన్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ విభాగాలలో 18 ప్రత్యేక కోర్సులను అందిస్తోంది. వీటిలో గేమింగ్‌లో 6, పోస్ట్-ప్రొడక్షన్‌లో 4, యానిమేషన్, కామిక్స్, ‘ఎక్స్‌ఆర్‌’లలో 8 వంతున కోర్సులున్నాయి. కీలక కార్యక్రమాల్లో యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఇంటరాక్టివ్ వీడియో గేమ్ డిజైన్-డెవలప్‌మెంట్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ తదితరాల్లో 24 నెలల అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా 3డీ క్యారెక్టర్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటిక్ వర్చువల్ రియాలిటీ, ఫిల్మ్‌ మేకింగ్, ఈ-స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, ఫిల్మ్‌ మేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లోనూ 3 నుంచి 6 నెలల స్వల్పకాలిక డిప్లొమా-సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ సృజనాత్మకతకు ప్రోత్సాహం, వేగంగా పురోగమిస్తున్న భారత మీడియా-వినోద రంగానికి మద్దతు దిశగా సంస్థాగత చట్రాల బలోపేతంపై కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ప్రాథమ్యాన్ని శ్రీ జాజు సందర్శన స్పష్టం చేసింది.

ఐఐసీటీ సందర్శనలో భాగంగా ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా (ఎన్‌ఎంఐసీ)ను కూడా పరిశీలించిన కేంద్ర సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ జాజు, అక్కడి పాఠశాల విద్యార్థుల ప్రతినిధి బృందంతో కొద్దిసేపు ముచ్చటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2242223) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Kannada