|
భారత ఎన్నికల సంఘం
సాధారణ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు/యూటీలు, ఉపఎన్నికలు జరిగే 6 రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఈసీఐ ఆదేశం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 1:36PM by PIB Hyderabad
-
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ శాసనసభల సాధారణ ఎన్నికల షెడ్యూలును 2026 మార్చి 15న ఎన్నికల సంఘం ప్రకటించింది.
-
షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లను అస్సాం, కేరళ, పుదుచ్చేరి తమ గెజిట్లో ప్రచురించాయి.
-
ఈ ప్రకటన నేపథ్యంలో, ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సంబంధిత ప్రధాన కార్యదర్శులకు, ఎన్నికల ప్రధానాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనలు/విధాన పరమైన అంశాల్లో సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం ఎంసీసీ వర్తిస్తుంది.
-
ప్రభుత్వ, ప్రజా, ప్రైవేటు ఆస్తులపై ఉన్న పోస్టర్లు లేదా రాతలను తొలగించడం, ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా ఎన్నికలతో సంబంధమున్న ఎవరైనా అధికారిక వాహనాలను లేదా ప్రభుత్వ వసతులను దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనల జారీపై నిషేధం లాంటి అంశాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది.
-
ప్రైవేటు నివాసాల వెలుపల ప్రదర్శనలు లేదా పికెటింగ్ నిర్వహించకుండా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి. యజమాని అనుమతి లేకుండా స్థలాలు, భవనాలు, గోడలపై జెండాలు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేయకూడదు.
-
ప్రత్యేక ఫిర్యాదు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో 1950 కాల్ సెంటర్ కూడా ఉంది. దీని ద్వారా ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన వారు సంబంధిత డీఈవో/ఆర్వోకు ఫిర్యాదు చేయవచ్చు.
-
ఈసీఐనెట్‌లో ఉన్న సీ-విజిల్ యాప్ ద్వారా ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు లేదా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 100 నిమిషాల్లోనే ఫిర్యాదులను పరిష్కరించేలా ఆయా రాష్ట్రాలు/యూటీల్లో దాదాపు 5,173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా 5,200కు పైగా స్థిర పర్యవేక్షణా బృందాలను రంగంలోకి దించారు.
-
ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను చేయడానికి, నిషేధాజ్ఞలను పాటించడానికి, లౌడ్ స్పీకర్లు, ఇతర సౌకర్యాల కోసం అవసరమైన అనుమతులు పొందడానికి సమావేశాలు, ఊరేగింపులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు అధికారులకు రాజకీయ పార్టీలు ముందుగానే తెలియజేయాలి.
-
మంత్రులు తమ అధికారిక విధులను ఎన్నికల ప్రచారంతో ముడిపెట్టకూడదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, వాహనాలను లేదా సిబ్బందిని ప్రచారం కోసం ఉపయోగించకూడదు.
-
ఎంసీసీ అమల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అన్ని పార్టీలను సమానంగా చూడాలని, అధికారిక వసతులను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని అన్ని స్థాయుల అధికారులను ఆదేశించింది. సమావేశాలు, ఊరేగింపులను నియంత్రించాలని, ఎన్నికల ఏర్పాట్లను న్యాయంగా నిర్వహించాలని సూచించింది. శాంతిభద్రతలను పరిరక్షించాలని, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను కాపాడాలని ఆదేశించింది.
-
మైదానాలు, హెలిప్యాడ్ల వంటి ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవడానికి ఈసీఐనెట్‌లో ఉన్న సువిధ మాడ్యూల్‌ను యాక్టివేట్ చేశారు. వాటిని ముందు వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం విధానంలో కేటాయిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2240687)
|