ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 8:00PM by PIB Hyderabad

నా ప్రియమైన గువాహటి ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.

సోదరీసోదరులారా,

నవరాత్రులకు ముందుగానే ఈరోజు మాతా కామాఖ్య పవిత్ర భూమిలో మీ అందరినీ కలుసుకోవడం నా అదృష్టం. కామాఖ్య మాత ఆశీర్వాదంతో కొద్దిసేపటి క్రితమే, ఇక్కడ 19.5 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నాం. విద్యుత్ రంగంలో స్వావలంబన అందించే ప్రాజెక్టుల నుంచి, ఈ రాష్ట్ర ప్రజలకు సౌలభ్యాన్ని అందించే పనుల వరకు అనేక ప్రాజెక్టులు అస్సాంలో కొనసాగుతున్నాయి. దేశంలోని రైతులకు, అస్సాంలోని టీ తోటల్లో పనిచేసే మిత్రులకు కూడా ఈ రోజు చాలా ముఖ్యమైనది. కొన్ని క్షణాల క్రితమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి. వీటితో పాటుగా, అస్సాంలోని టీ తోటలతో అనుబంధం ఉన్న అనేక కుటుంబాలకు భూమి పత్రాలను కూడా ఈ రోజు అందించాం. అస్సాం ప్రజలకు, ఇక్కడ ఉన్న కుటుంబాలకు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులు మాతా కామాఖ్య పవిత్ర భూమితో అనుసంధానమై ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఖాతాల్లో కిసాన్ నిధి సొమ్ము జమయినట్లు కోట్లాది మంది రైతుల మొబైల్ ఫోన్లకు సందేశాలు చేరి ఉంటాయి. ఈ పథకం నిజంగా అద్భుతమైనది. ఒక్క క్లిక్కుతో కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇది అసాధ్యంగానే ఉంది. విదేశీ అతిథులను కలుసుకున్నప్పుడు వారు ఈ అంశంపై అనేక ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ప్రపంచంలోని ప్రముఖ దేశాల నాయకులు సైతం దీనిని అద్భుతంగానే చూస్తారు. నా రైతు సోదరీసోదరుల్లో చాలా మందికి 2014కి ముందు మొబైల్ ఫోన్ కానీ, బ్యాంకులో ఖాతా కానీ లేవు. ఇలాంటి కోట్లాది మంది రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 4.25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమయింది. అందులో 19 లక్షల మంది అస్సాం రైతులున్నారు. వారికి ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందాయి.

మిత్రులారా,

పీఎం కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సమయంలో, ఈ పథకం ద్వారా మోదీ డబ్బులు ఇస్తున్నప్పటికీ ఎన్నికల తర్వాత దానిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీవారు చెబుతూ ఉండేవారు. వారు వదంతులను, అబద్ధాలను వ్యాప్తి చేయడంలో నిష్ణాతులు. అయినప్పటికీ, దేశంలో ఉన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రతను అందించే మాధ్యమంగా కిసాన్ సమ్మాన్ నిధి పథకం నేడు మారింది.

మిత్రులారా,

బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే ముఖ్యమైనది మరేదీ లేదు. రైతులకు డబ్బు ఇస్తున్నామంటే కాంగ్రెస్ వారి ఊపిరి ఆగిపోతుంది. మీకు మరో ఉదాహరణ చెబుతాను. 2014కు ముందు కేంద్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధర కింద రైతులకు 6.5 లక్షల కోట్ల రూపాయలు అందాయి. పదేళ్లలో 6.5 లక్షల కోట్లు. మా పదేళ్ల ప్రభుత్వ కాలంలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కనీస మద్దతు ధరగా రైతులకు అందింది.

మిత్రులారా,

గడచిన 11 ఏళ్లలో దేశంలోని రైతుల చుట్టూ బలమైన రక్షణ వ్యవస్థను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది ఎంఎస్‌పీ, తక్కువ వడ్డీకి రుణాలు, పంట బీమా అయినా లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అయినా ఈ పథకాలు రైతులకు గొప్ప తోడ్పాటునందిస్తున్నాయి. ఇవే కాకుండా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాల ప్రభావాన్ని సాగుపై, వ్యవసాయంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా, తదనంతరం జరిగిన యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. విదేశీ మార్కెట్లలో ఎరువులు దొరకడం కష్టతరంగా మారింది. కానీ ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో బస్తా యూరియా ధర 3 వేల రూపాయలుగా ఉంటే.. అదే బస్తాను రైతుల కోసం 300 రూపాయలకే మా ప్రభుత్వం అందిస్తోంది. రైతులపై భారం పడకుండా ఖజానా నుంచి 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.

మిత్రులారా,

స్వావలంబన దిశగా బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం మరో గొప్ప కార్యాన్ని గత దశాబ్దంలో చేపట్టింది. విదేశీ ఇబ్బందుల నుంచి వ్యవసాయాన్ని రక్షించేందుకు స్వయం సమృద్ధిని మేం ప్రోత్సహించాం. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు లేదా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మన రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని స్వతంత్ర భారతం అనేక సార్లు చూసింది. కొన్నిసార్లు ఎరువులు ప్రియంగా మారేవి. మరికొన్ని సందర్భాల్లో డీజిల్, ఇంధన ధరలు పెరిగేవి. ఎందుకంటే దశాబ్దాల పాటు విదేశాలపై ఆధారపడి ఉండే పరిస్థితుల్లో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంచింది. దీనివల్ల సాగు వ్యయం కూడా పెరుగుతూ ఉండేది.

మిత్రులారా,

వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, నూతన నీటి పారుదల పద్ధతులతో అనుసంధానించడం, పంటలకు ప్రయోజనం అందించాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ‘పెర్ డ్రాప్ మోర్ క్రాప్’ విధానాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా డ్రిప్, స్ర్పింక్లర్స్ లాంటి సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలను రైతులకు అందిస్తోంది. ఫలితంగా నీటి పారుదల మెరుగై, వ్యయం తగ్గింది. మీ వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. వీలైనంత వరకు డీజిల్‌పై మీరు చేసే వ్యయాన్ని తగ్గించేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే కుసుమ్ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ప్రస్తుతం అనేక మంది రైతులు సోలార్ పంపులతో సాగు చేయడం మాత్రమే కాకుండా వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయాన్ని ఆర్జించగలుగుతున్నారు. అందుకే అన్నదాత.. విద్యుత్ దాతగా మారాలని నేను చెబుతూ ఉంటాను.

మిత్రులారా,

ఎరువులు, పురుగు మందులపై రైతులు ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. కాంగ్రెస్ అనుసరించిన అసంబద్ధ విధానాల కారణంగా దేశంలో అయిదు పెద్ద ఎరువుల కర్మాగారాలు మూతపడ్డాయి. మేం వాటిని తిరిగి ప్రారంభించాం. వీటితో పాటు నానో యూరియాను రైతులు ఉపయోగించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు మన దేశంలో రైతులు ఆ ప్రయోజనాలను పొందుతున్నారు. దేశంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించేలా రైతులను బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు ప్రోత్సహిస్తోంది. విస్తృత స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రైతులు స్వీకరించినప్పుడు భూమి సురక్షితంగా ఉంటుంది. అంతర్జాతీయ సంక్షోభాల నుంచి మన అన్నదాతలు కూడా సురక్షితంగా ఉంటారు.

మిత్రులారా,

ఓ వైపు రైతుల కోసం కృషి చేస్తున్న బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు మేం పని చేస్తున్నాం. మరోవైపు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశం పట్ల కాంగ్రెస్ విధేయత చూపదని మరోసారి నిరూపితమైంది. యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వదంతులను, వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో నిమగ్నమై ఉంది. ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగాలను వినాలని కాంగ్రెస్ మిత్రులను కోరుతున్నాను. మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఒక సందర్భంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని పండిట్ జీ అన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగిందని నెహ్రూ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దేశాన్ని తప్పుదోవ పట్టించడంలో నిమగ్నమై ఉన్నారు. నేడు అంతర్జాతీయ సంక్షోభ ప్రభావం ఏమిటో ఈ ప్రపంచం చూస్తోంది.

సహచరులారా,

మన రిఫైనరీల అభివృద్ధికి, వాటి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇవాళ భారత్ సొంత అవసరాలను మాత్రమే కాక, ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చగలిగే శక్తిమంతమైన దేశంగా ఎదిగింది. కొన్నేళ్లుగా అస్సాంలోని రిఫైనరీలను విస్తరించాం. అస్సాంతో సహా ఈశాన్య భారతదేశంలో గ్యాస్ పైప్‌లైన్‌ మౌలిక సదుపాయాలకు కీలక పెట్టుబడులు పెడుతున్నాం. నుమాలిగఢ్-సిలిగురి పైప్‌లైన్‌ నవీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రపంచంలోనే తొలి రెండోతరం బయో-ఇథనాల్ ప్లాంట్‌ను అస్సాంలోని గోలాఘాట్‌లో ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్టులన్నింటితో ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

సహచరులారా,

రైల్వే రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, చమురు దిగుమతిని తగ్గించటానికి గత దశాబ్ద కాలంగా ఎంతో కృషి చేశాం. పదేళ్లలో దేశంలోని రైల్వే వ్యవస్థను పూర్తిగా విద్యుదీకరణ చేశాం. త్వరలోనే 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ విద్యుదీకరణ కారణంగా దేశంలో సుమారు 175 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతోంది. అస్సాంలోనూ రైల్వే విద్యుదీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ రైల్వే విద్యుదీకరణకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి.

మిత్రులారా,

దేశంలో పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనలో అస‌్సాం కీలక పాత్ర పోషిస్తుంది. లోయర్ కోపిలి హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా అస్సాంతో పాటు ఈశాన్య భారతానికి ప్రయోజనం కలుగుతుంది. అస్సాంలో ప్రారంభమైన వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్రం సుసంపన్నం అవుతుంది.

సహచరులారా,

సున్నితత్వం, సుపరిపాలనకు బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గుర్తింపు పొందింది. దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి వర్గం అభివృద్ధికి మేం ప్రాధాన్యతనిస్తాం. ఈ స్ఫూర్తితో అస్సాం టీ కార్మికుల కోసం ఇవాళ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరి కృషి వల్ల అస్సాంకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందో, ఎవరు పండించిన టీ పరిమళం ప్రపంచమంతటా భారతదేశ ప్రతిష్ఠను చాటిందో అలాంటి కార్మికులకు ఇవాళ బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గౌరవాన్ని, సహాయాన్ని అందిస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరి గురించి కనీసం పట్టించుకోలేదు. వారి భూములకు సంబంధించిన కనీస పత్రాలు ఉండేవి కాదు. హిమంత జీ, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. టీ తోటల్లో పనిచేసే ఈ కుటుంబాల కోసం మీరు చాలా గొప్ప పని చేశారు. నేడు అస్సాం ప్రభుత్వం గతంలో జరిగిన అన్యాయాన్ని అంతం చేస్తోంది. ఇప్పుడు ఈ కుటుంబాలకు సొంత భూమి లభించింది. వీరికి శాశ్వత ఇళ్లను పొందే మార్గం సుగమమైంది. దీనివల్ల ముఖ్యంగా టీ తోటల్లో నివసించే మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు టీ తోటల్లో పనిచేసే కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇందుకోసం కావాల్సిన వసతులను బీజేపీ ప్రభుత్వం కల్పించింది. అందుకే ప్రతి టీ తోట కార్మికుడు మరోసారి బీజేపీ ప్రభుత్వమని నినదిస్తున్నారు. నా దృష్టిలో ఈ టీ తోటల శ్రామికులను గౌరవించటమంటే రుణాన్ని తీర్చుకోవటమే. ఎందుకంటే.. మీరు ఇక్కడ తోటల్లో కష్టపడుతుంటే, ఆ టీ ఆకులు సుదూరంలోని గుజరాత్ గ్రామానికి చేరుకునేవి. నేను టీ అమ్ముకుంటూనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ టీ తోటల ప్రజల ఆశీస్సులు లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడినా? మీ టీ నా దగ్గరకు చేరింది.. ఈరోజు నేను మీ మధ్యకు చేరుకున్నాను. ఇది ఆ కామాఖ్యా దేవి అనుగ్రహం కాక మరేమిటి? నా టీ తోట సోదరుల రుణం తీర్చుకునే అవకాశాన్ని ఆ కామాఖ్యా మాత ఇవాళ నాకు ప్రసాదించింది.

మిత్రులారా,

ఇవాళ్టి నుంచి ప్రసిద్ధ నీమతి ఘాట్, బిశ్వనాథ్ ఘాట్ వద్ద ఆధునిక క్రూయిజ్ టెర్మినల్స్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. అస్సాంలోని పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను నిర్దేశిస్తుంది. పర్యాటక రంగాన్ని కేవలం సందర్శనీయ స్థలాలకే పరిమితం చేయకుండా.. ఉపాధి కల్పనకు, అభివృద్ధికి గొప్ప అవకాశంగా బీజేపీ ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనతో బ్రహ్మపుత్ర నదిలో వాటర్ టూరిజం అవకాశాలను పెంచుతోంది. క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణంతో బ్రహ్మపుత్రపై క్రూయిజ్ నౌకలను నడిపే ప్రక్రియ సాగుతుంది. దీనివల్ల దేశ విదేశాల పర్యాటకులు సులభంగా అస్సాం చేరుకోవచ్చు. క్రూయిజ్ టూరిజం పెరగటం వల్ల స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దీనివల్ల హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. చిన్న వ్యాపారులు, పడవ నడిపేవారు, హోటల్, రవాణా రంగాల వారి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అస్సాంలో పర్యాటకం కేవలం సందర్శనకే పరిమితం కాకుండా.. స్థానిక అభివృద్ధికి, ప్రజల సుసంపన్నతకు నూతన శక్తిగా మారుతోంది.

సహచరులారా,

నేడు ఈశాన్య భారత భవిష్యత్తుకు అస్సాం, అష్టలక్ష్మి నమూనాగా మారుతోంది. ఈ రాష్ట్ర పురోగతి మొత్తం ఈశాన్య ప్రాంతానికే నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. దశాబ్ద కాలంలో అస్సాంలో బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు ప్రభావం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి ప్రజలు కూడా బీజేపీ-ఎన్డీయే సుపరిపాలననే కోరుకుంటున్నారు. అందుకే అస్సాంలోని ప్రతి యువకుడికి, ప్రతి కుటుంబానికి నేను చెప్పేదొక్కటే.. అభివృద్ధి చెందిన అస్సాం కోసం మనమంతా కలిసి పనిచేయాలి. అప్పుడే దేశంలోనే మోడల్ స్టేట్‌గా అస్సాం ఎదుగుతుంది. ఈ ఆకాంక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రులందరినీ నేను ఒకటి కోరుతున్నాను. ఇక్కడ ప్రారంభించిన పీఎం ఏక్తా మాల్‌లో మీ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తుల విక్రయానికి తగిన ఏర్పాట్లు చేయండి. మీరు ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. అస్సాంలోని వ్యక్తికి కేరళ వస్తువేదైనా కావాలంటే ఇక్కడే లభించాలి. మహారాష్ట్ర, గుజరాత్ వస్తువులు, రాజస్థాన్ ఉత్పత్తులైనా ఇక్కడే అందుబాటులో ఉండాలి. ఈ మాల్‌ ద్వారా దేశ ఏకత్వం ప్రతిబింబించాలి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ఈ మాల్‌లో ఉనికిని చాటుకోవాలి. అస్సాంలోని ప్రతి జిల్లా ఇందులో భాగస్వామిగా ఉండాలి. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి నినాదంతో ఏక్తా మాల్‌కి వచ్చిన వారికి యావత్ భారతం దర్శనమివ్వాలి. అస్సాంలో నిర్మితమవుతున్న ఈ నమూనాను దేశం మొత్తం స్వీకరిస్తుందని, ఇలాంటి ఏక్తా మాల్స్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో విజయవంతంగా ఏర్పాటవుతాయని నేను నమ్ముతున్నాను. అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీకు మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా మాతో అనుసంధానమైన రైతులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరికొద్ది రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కామాఖ్యా దేవి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ తల్లి కృపతో మనం సరికొత్త విశ్వాసంతో, నూతనోత్తేజంతో అన్ని సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు.

భారతమాతకు జై!

భారతమాతకు జై!

భారతమాతకు జై!

వందేమాతరం

వందేమాతరం

వందేమాతరం

వందేమాతరం

వందేమాతరం

 

***


(రిలీజ్ ఐడి: 2240219) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Gujarati