లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో వాక్‌ స్వాతంత్య్రం నిబంధనలకు లోబడి ఉంటుంది… ఈ చట్రాన్ని అతిక్రమించే హక్కు సభ్యులెవరికీ లేదు: లోక్‌సభ స్పీకర్


· “మైక్రోఫోన్‌ ఆన్ లేదా ఆఫ్ మీట ఏదీ సభాధ్యక్షుడి వద్ద ఉండదు.. సభలోని వ్యవస్థే ఆ పని చేస్తుంది.. నిర్దేశిత సభ్యునికి మాత్రమే ప్రసంగించే అనుమతి ఉంటుంది”

· “వివాదాలు-నినాదాలు.. అంతరాయాలు.. సభలో ప్లకార్డుల ప్రదర్శన వంటివి పార్లమెంటు గౌరవప్రతిష్ఠలను దెబ్బతీస్తాయి”

· “సభ్యులందరూ సభా నియమాలకు కట్టుబడాలి.. పార్లమెంటరీ వ్యవస్థలపై గౌరవభావం అవశ్యం”

· “అధ్యక్ష స్థానం ఏ వ్యక్తికీ లోబడదు... ఇది భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ప్రతీక”

· “ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు-ముమ్మర చర్చ సహజం.. కానీ, ప్రజాస్వామ్యబద్ధ ప్రసంగం-క్రమశిక్షణ
రాహిత్యం మధ్య విస్పష్ట విభజన రేఖ ఉంది”

· మహిళా సభ్యులపై తనకుగల అత్యున్నత గౌరవాన్ని లోక్‌సభ స్పీకర్ పునరుద్ఘాటించారు.. వారికి మాట్లాడే వీలు కల్పించేందుకు అన్నివిధాలా కృషి చేశానని ఆయన స్పష్టం చేశారు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 4:33PM by PIB Hyderabad

పార్లమెంటులో వాక్ స్వాతంత్య్రానికి హామీ ఉన్నప్పటికీ, అది రాజ్యాంగానికి, పార్లమెంటు విధివిధానాల నియంత్రణ నిబంధనలు, స్థాయీ ఉత్తర్వులకు లోబడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఇవాళ స్పష్టం చేశారు. సభలో సభ్యులు వ్యవహరించాల్సిన పద్ధతిని నిర్దేశించే నియమాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందాయని ఆయన గుర్తుచేశారు.

పార్లమెంటులో వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 105కు చేసిన సూచనలకు సంబంధించి, ఈ స్వేచ్ఛను రాజ్యాంగమే పార్లమెంటరీ నియమాల చట్రం పరిధిలో ఉంచిందని స్పీకర్ స్పష్టం చేశారు.

తనను పదవి నుంచి తప్పించాలని కోరుతూ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ ముగిసిన ఒక రోజు అనంతరం ఆయన ఇవాళ సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ అంశంపై రెండు రోజులుగా సభలో 12 గంటలకుపైగా చర్చ సాగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు, వాదనలు, ఆందోళనలను వెలిబుచ్చారని తెలిపారు.

“గౌరవనీయులైన ప్రతి సభ్యుడి అభిప్రాయాన్ని నేను జాగ్రత్తగా, శ్రద్ధగా విన్నాను. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు తనకు మద్దతుగా అభిప్రాయాలను వ్యక్తం చేసినా లేదా విమర్శల ద్వారా సూచనలిచ్చినా అదంతా ప్రజాస్వామ్యం గొప్పదనం. ప్రతి గళాన్నీ వినాలి... అలాగే, ప్రతి దృక్కోణం విలువైనదే” అని ఆయన అన్నారు.

సభలో మాట్లాడే అవకాశాల గురించి చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ఆందోళనలపై స్పీకర్ స్పందిస్తూ- సభా నియమాలు నిర్దేశించే విధానాలను సభ్యులందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. “ప్రతిపక్ష నేత ఎప్పుడైనా లేచి నిలుచుని, తనకు నచ్చిన ఏ అంశంపై మాట్లాడే ప్రత్యేక హక్కు ఉందని కొందరు సభ్యులు విశ్వసిస్తున్నారు. కానీ, తాను స్వయంగా రూపొందించిన నిబంధనల ప్రకారమే సభ పనిచేస్తుందని నేను స్పష్టం చేస్తున్నాను. ఈ నిబంధనలన్నీ ప్రతి సభ్యుడికీ సమానంగా వర్తిస్తాయి” అని ఆయన వివరించారు. “ఈ సభలోని గౌరవనీయ సభ్యులలో ఎవరికైనా ఈ నిబంధనల చట్రాన్ని అతిక్రమించే హక్కు లేదు” అని నొక్కిచెప్పారు.

ప్రతిపక్ష సభ్యుల మైక్రోఫోన్‌ను సభాధ్యక్షుడు ఆపివేశారనే ఆరోపణపైనా స్పీకర్ స్పందించారు. “మైక్రోఫోన్‌ ఆన్ లేదా ఆఫ్ చేసే మీట ఏదీ నా దగ్గర లేదని నేను మరోసారి స్పష్టం  చేస్తున్నాను. ఈ సభలోని వ్యవస్థ, మాట్లాడే అనుమతి పొందిన సభ్యుడి మైక్రోఫోన్‌ను మాత్రమే పని చేయిస్తుంది” అని ఆయన వివరించారు.

సభాధ్యక్ష స్థానం ఏ వ్యక్తి ఆధీనంలోనూ ఉండదని స్పీకర్ స్పష్టం చేశారు. “ఈ కుర్చీ ఏ వ్యక్తికీ చెందినది కాదు... ఇది భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, రాజ్యాంగ స్ఫూర్తిని నిలిపే విశిష్ట వ్యవస్థకు ప్రతీక. నేను రాక పూర్వం అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఈ సభ గౌరవాన్ని, సంప్రదాయాలను సుసంపన్నం చేశారు. ఈ సభకు వారు సముపార్జించి పెట్టిన ప్రతిష్ఠను ఇనుమడిపంజేయడమే నా కర్తవ్యం” అని స్పీకర్ పేర్కొన్నారు. సభ నిర్దేశించిన నియమాలు, విధానాలకు తగినట్లు తాను సదా నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, సంతులనంతో కార్యకలాపాలను నిర్వహిస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ సభ 140 కోట్ల మంది పౌరుల సార్వభౌమ సంకల్పానికి ప్రతీక అని, ప్రతి సభ్యుడు లక్షలాది ప్రజల ఆశలు-ఆకాంక్షలను ప్రతిబింబిస్తారని స్పీకర్ వ్యాఖ్యానించారు. “ప్రతి సభ్యుడు ప్రజల ఆందోళనలను లేవనెత్తడానికి, వారి ఆశలు-అంచనాలను నెరవేర్చడానికి కర్తవ్యబద్ధుడై ఇక్కడికి వస్తాడు” అని ఆయన అన్నారు.

మహిళా సభ్యులపై గౌరవం విషయంలో సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను ప్రస్తావిస్తూ- మహిళా ఎంపీలందరిపైనా తనకుగల లోతైన గౌరవాన్ని స్పీకర్ పునరుద్ఘాటించారు. “గౌరవనీయ మహిళా సభ్యులందరిపై నాకు సదా అత్యంత గౌరవం ఉంది. ప్రతి సభ్యురాలికీ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేలా చూడటానికి నేను సదా కృషి చేశాను. నా పదవీకాలంలో... తొలిసారి ఎంపీ అయినవారు సహా ప్రతి సభ్యురాలికీ తమ అభిప్రాయం వెల్లడించే అవకాశం లభించింది” అని ఆయన గుర్తుచేశారు.

చర్చలలో విపక్ష సభ్యులకు తగిన అవకాశం ఇవ్వడంలేదనే వాదనను స్పీకర్ తోసిపుచ్చారు. ఇటీవలి లోక్‌సభ కార్యకలాపాల నుంచి అధికార సమాచారాన్ని ఉటంకిస్తూ- మాట్లాడే సమయాన్ని సంఖ్యా బలానికి అనులోమానుపాతంలో చూసినప్పుడు, ప్రధాన చర్చలలో ప్రతిపక్ష సభ్యులు కేటాయించిన దానికన్నా అధిక సమయం పొందారన్నారు. ఈ క్రమంలో చిన్న పార్టీలు, ఏక సభ్య పార్టీలు, స్వతంత్ర సభ్యులందరికీ అవకాశం లభించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. “నేను తరచూ చర్చలతోపాటు జీరో అవర్‌ సమయాన్ని కూడా పొడిగిస్తుంటాను. తద్వారా ఎక్కువ మంది సభ్యులకు  తమ అభిప్రాయం వెల్లడించే అవకాశం లభిస్తుంది” అన్నారు.

సభలో కొందరు సభ్యలు గందరగోళం సృష్టించడాన్ని స్పీకర్ తీవ్రంగా విమర్శించారు. నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, కాగితాలు చింపి విసరడం, సభాపతి స్థానం వద్దకూ దూసుకురావడం వంటివి సుస్థిర పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. “ఈ చర్యలు సభ పనితీరును దెబ్బతీయడమే కాకుండా దాని గౌరవప్రతిష్టలకు భంగం కలిగిస్తాయి” అని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలను నిలబెట్టాల్సిందిగా ఆయన ఎంపీలను కోరారు.

సభలో నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, అనుచిత హావభావాల ప్రకటన, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు శాసన వ్యవస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని 1997, 2001 నాటి ప్రిసైడింగ్ అధికారులు-పార్లమెంటరీ నాయకుల సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్లు శ్రీ బిర్లా గుర్తు చేసుకున్నారు. “ప్రజాస్వామ్యంలో అసమ్మతి, ముమ్మర చర్చలు సహజం. కానీ, ప్రజాస్వామ్యబద్ధ చర్చ, క్రమశిక్షణ రాహిత్యం మధ్య విస్పష్ట విభజన రేఖ ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

పార్లమెంటు గౌరవమర్యాదల పరిరక్షణ సభ్యుల సమష్టి బాధ్యతని స్పీకర్ స్పష్టం చేశారు. “వ్యవస్థలు శాశ్వతం... బలమైన ప్రజాస్వామ్యానికి అవి పునాది వేస్తాయి. కాబట్టి, మన సంస్థల ప్రతిష్టను మనమే మసకబారిస్తే, నష్టం ఏదో వ్యక్తికి లేదా పార్టీకి పరిమితం కాదు.. యావద్దేశానికి హాని కలుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. సభలో అంతరాయం ఏర్పడితే- పార్లమెంటు హుందాగా, బాధ్యతతో పనిచేయాలని ఆశించే పౌరులలో నిస్పృహ అలముకుంటుందని చెప్పారు.

చివరగా- పార్లమెంటు బలోపేతం సహా ప్రజల విశ్వాసం నిలబెట్టేలా పార్టీలకు అతీతంగా సభ్యులు కలిసి పనిచేయాలని శ్రీ బిర్లా విజ్ఞప్తి చేశారు. “నేను అధికార పక్షాన్ని, ప్రతిపక్షాలను ఈ వ్యవస్థకు  సమాన సంరక్షకులుగా పరిగణిస్తాను. ప్రశంసలు లేదా విమర్శలు ఏవైనా, నా సంకల్పం సడలదు. ఈ సభ గౌరవ పరిరక్షణ, నిబంధనల అనుసరణ నా కర్తవ్యాలు” అని ఆయన తన ప్రసంగం ముగించారు.

వాడి-వేడి చర్చల తర్వాత సానుకూల భావనతో ముందుకు సాగాలని సభ్యులను కోరుతూ- “ఈ రోజు నుంచి సరికొత్త, సానుకూల, నిర్మాణాత్మక అధ్యాయానికి మనమంతా శ్రీకారం చుడదాం. జాతికి సేవ దేశ పురోగమన మార్గంలో ఐక్యంగా ముందడుగు వేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.

 

***


(రిలీజ్ ఐడి: 2239286) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam