ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 6:58PM by PIB Hyderabad
శ్రీ పీయుష్ గోయల్, డాక్టర్ ఎల్. మురుగన్, శ్రీ ఎడప్పాడి కె. పళనిస్వామి, శ్రీ నైనార్ నాగేంద్రన్, శ్రీ తంగం తెన్నరసు, నా తమిళ సోదరీ, సోదరులారా, వణక్కం!
మిత్రులారా,
ఈ అద్భుతమైన తిరుచ్చి నగరంలో ఇక్కడ ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
తమిళనాడు భవిష్యత్తుకు నేటి కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ ప్రాజెక్టులు: స్వచ్ఛ ఇంధనం కోసం మౌలిక సదుపాయాలు, పెట్రోలియం సంబంధిత తయారీ రంగాలు, రహదారులు, రైల్వేలు, గ్రామీణ రోడ్లకు సంబంధించినవి. ఇవి ఇంధన లభ్యతను, అనుసంధానాన్ని పెంచుతాయి తమిళనాడు యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.
మిత్రులారా,
భారత్ పెట్రోలియంకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు శంకుస్థాపన జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. దీని కోసం సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఈ నెట్‌వర్క్ తమిళనాడులోని నీలగిరి, ఈరోడ్ జిల్లాలకు వర్తిస్తుంది. ఇది దాదాపు తొమ్మిది లక్షల కుటుంబాలకు, వందలాది వాణిజ్య సంస్థలకు పైపుల ద్వారా సహజ వాయువును అందిస్తుంది. పైపుల ద్వారా గ్యాస్ నేరుగా ఇళ్లకు చేరుతుంది. ఇది జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభిస్తాయి. సహజ వాయువు పర్యావరణ అనుకూల ఇంధనం. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కేవలం ఎనిమిదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే సానుకూల పర్యావరణ ప్రభావం, నాలుగు కోట్ల చెట్లను నాటడంతో సమానమని నాకు చెప్పారు!
మిత్రులారా,
నేడు, చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ల్యూబ్ బ్లెండింగ్ ప్లాంట్ జాతికి అంకితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అతిపెద్ద సదుపాయాలలో ఇది ఒకటని తెలియజేయడానికి నాకు గర్వంగా ఉంది. ఈ ప్లాంట్ తమిళనాడులోనే కాకుండా వెలుపల ఉన్న అనేక ముఖ్యమైన పరిశ్రమల అవసరాలను తీరుస్తుంది. లూబ్రికెంట్ల స్థానిక ఉత్పత్తి పెరగడం వల్ల దిగుమతులు తగ్గుతాయి. దేశానికి డబ్బు ఆదా అవుతుంది.
మిత్రులారా,
నేడు, మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రామీణ రహదారులను మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ పనులు జరిగాయి. ఈ రోడ్లలో ప్రతి ఒక్కటి కేవలం భౌతిక మౌలిక సదుపాయం మాత్రమే కాదు. వీటి ద్వారా రోగులు మెరుగైన ఆరోగ్య సేవలను పొందగలరు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లగలరు. మొత్తంగా, ప్రతి రోడ్డు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది.
మిత్రులారా,
గత ఏడాది గంగైకొండ చోళపురంలో జరిగిన ఆడి తిరువాదిరై ఉత్సవాల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. చక్రవర్తి రాజేంద్ర చోళుడు నిర్మించిన ఆ మహా అద్భుత ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవం జరిగి వెయ్యి ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనం వేడుకలు జరుపుకున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం. ఈ రోజు, అక్కడ ఒక ముఖ్యమైన హైవే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న హైవే ఆలయానికి చాలా దగ్గరగా వెళ్లడం వల్ల భక్తులు, పర్యాటకుల భద్రత పట్ల ఆందోళనలు ఉన్నాయి. అయితే, కొత్త బైపాస్ నిర్మాణంతో, ఇతర వాహనాలను ఇప్పుడు ఆలయానికి దూరంగా మళ్లిస్తారు కనుక అందరికీ మెరుగైన భద్రత లభిస్తుంది.
మిత్రులారా,
గత వారమే, మదురై నుంచి అమృత్ భారత్ కార్యక్రమం కింద ఆధునికీకకరించిన, పునరాభివృద్ధి చేసిన ఎనిమిది రైల్వే స్టేషన్లను మేం ప్రారంభించాం. ఈ రోజు, పలు కొత్త రైలు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇవి నాగర్‌కోయిల్, కోయంబత్తూరు, రామేశ్వరం, తిరునెల్వేలి, మయిలాడుతురై, కారైక్కుడి వంటి ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తాయి. ఈ కొత్త రైలు సర్వీసులు పర్యాటకాన్ని పెంచుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. యువతకు అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన తమిళనాడును నిర్మించడమే మా లక్ష్యం. తమిళనాడు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రాష్ట్ర పురోగతి కోసం మేం పగలు, రేయి శ్రమిస్తున్నాం. ఇకముందు కూడా ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తాం.
***
(రిలీజ్ ఐడి: 2238633)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7