రాష్ట్రపతి సచివాలయం
న్యూఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి
దేశ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు సగం… సమాన సంఖ్యలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి…. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 2:55PM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8, 2026) న్యూఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను, వారు అందిస్తున్న సహకారాన్ని గౌరవించేందుకు, స్త్రీపురుష సమానత్వం, భద్రత, గౌరవం, మహిళా సాధికారత పట్ల సామూహిక నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. విద్య, పరిపాలన, న్యాయవ్యవస్థ, సైనిక, వైద్యం, విజ్ఞాన, సాంకేతికత, కళలు, వ్యవస్థాపకత వంటి ప్రతి రంగంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారని, పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది మహిళలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ.. పరిశ్రమలు, అంకుర సంస్థలు, కార్పొరేట్ ప్రపంచంలో నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రీడల్లో కూడా రాణిస్తున్నారని, మహిళలకు తగిన అవకాశాలు, మద్దతు ఇస్తే వారు ప్రతి రంగంలోనూ రాణించగలరనే నమ్మకాన్ని ఇలాంటి ఉదాహరణలు కలిగిస్తున్నాయని అన్నారు.

మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వైపు భారత్ వేగంగా దూసుకుపోతోందని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. గత దశాబ్ద కాలంలో మహిళల బాటలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి బలమైన పునాది పడిందని ఆమె పేర్కొన్నారు. పాఠశాల విద్యలో భారత్ స్త్రీపురుష సమానత్వాన్ని సాధించిందని, ఉన్నత విద్యలో కూడా స్థూల నమోదు నిష్పత్తి పరంగా విద్యార్థినుల సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపారు. సైన్సు, సాంకేతికత, ఇంజనీరింగ్, గణిత- (స్టెమ్) విద్యలో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందన్నారు. స్టెమ్ రంగంలో విద్యార్థినులు తమ చదువును కొనసాగించడంలో సహాయపడటానికి ప్రతి జిల్లాలో ఒక మహిళా హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రతిపాదించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మన కుమార్తెలు నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్రపతి అన్నారు.

మహిళలు నేడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని రాష్ట్రపతి అన్నారు. స్టార్టప్ ఇండియా పథకం కింద మద్దతు పొందుతున్న అంకుర సంస్థల్లో సగానికి పైగా కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను కలిగి ఉన్నాయని తెలిపారు. రెండు లక్షలకు పైగా మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలు ప్రస్తుతం ప్రభుత్వం ఈ-మార్కెట్‌లో చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రారంభించిన షీ మార్ట్ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. గత ఏడాది అమలు చేసిన కార్మిక చట్టాలు మహిళా కార్మికులకు మరింత సమగ్రమైన, సురక్షితమైన, సాధికారతతో కూడిన పని వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు.
మహిళా సాధికారత కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, వారి అభివృద్ధి ప్రయాణంలో ఇంకా అనేక అడ్డంకులు మిగిలే ఉన్నాయని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉదాహరణకు నేటికీ చాలా మంది మహిళలు వివక్ష, సమాన పనికి అసమాన వేతనం, గృహ హింస వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటిని కేవలం చట్టాల ద్వారానే పరిష్కరించలేమని, సమాజ దృక్పథంలో మార్పు రావడం అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. లింగ వివక్షతో కూడిన ఆలోచనా విధానాన్ని అధిగమించినప్పుడే మనం సమాజంలో నిజమైన సమానత్వాన్ని స్థాపించగలమని చెప్పారు.

నిజమైన అర్థంలో అభివృద్ధిని సాధించాలంటే దేశ జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల సమాన భాగస్వామ్యాన్ని మనం తప్పనిసరిగా ఉండేలా చూడాలని రాష్ట్రపతి అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నామని, దేశం వేగంగా పురోగమించాలన్నా, జాతీయ ప్రయోజనాల కోసం పౌరుల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలన్నా, మనం మహిళలను పెద్ద కలలు కనేలా ప్రోత్సహించడమే కాకుండా, ఆ కలలను సాధించడంలో వారికి అడుగడుగునా అండగా నిలవడం చాలా ముఖ్యమని తెలిపారు. భయం, వివక్ష లేని వాతావరణంలో మాత్రమే మహిళలు దేశ నిర్మాణానికి తమ ఉత్తమ సహకారాన్ని అందించగలరని చెప్పారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి బాలికకు విద్య, సమాన అవకాశాలను అందించాలని.. మహిళల గౌరవం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో ఉన్న అన్ని రకాల వివక్షలను తొలగించడానికి కృషి చేయాలని పౌరులందరూ ప్రతిజ్ఞ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అలా చేయడం ద్వారా మనం మహిళా సాధికారత ఆదర్శాన్ని ప్రపంచానికి చాటిచెప్పవచ్చని అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2236647)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam