సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోందన్న భారత ప్రభుత్వం, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ
లక్ష్మీప్రియ దేవి నటించిన బూంగ్ చిత్రానికి బీఎఏఎఫ్‌టీఏ-2026లో ఉత్తమ బాలల, కుటుంబ చిత్ర పురస్కారం
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 8:45PM by PIB Hyderabad
బీఏఎఫ్‌టీఏ 2026 సినీ పురస్కారాల్లో లక్ష్మీప్రియ దేవి నటించిన బూంగ్ చిత్రం ఉత్తమ బాలల, కుటుంబ చిత్రంగా ఎంపికైంది. ఈ పురస్కారం గెలుచుకున్న సందర్భంగా భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ బూంగ్ చిత్రనిర్మాత లక్ష్మీప్రియ దేవిని, చిత్ర బృందాన్నీ అభినందించాయి. ఈ గొప్ప విజయం భారతీయ సినిమాకు గర్వకారణం. వైవిధ్యంగా, అర్థవంతంగా కథను చెప్పే భారత సంప్రదాయాల పట్ల పెరుగుతున్న ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇది స్పష్టం చేస్తుంది.
ఈ సినిమా ప్రయాణానికి భారత చలనచిత్ర అభివృద్ధి సంస్థ, చిత్రోత్సవ వ్యవస్థ ఎంతో మద్దతునిచ్చాయి. 2023లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్, ఫిల్మ్ బజార్ రికమెండ్స్ కింద ఫిల్మ్ బజార్‌లోని నిపుణుల బృందం బూంగ్ చిత్రాన్ని ఎంపిక చేసింది. వర్ధమాన సినీ రూపకర్తలను ప్రోత్సహించడానికి, ప్రపంచ పరిశ్రమతో భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి వీలుకల్పిస్తూ ఈ కార్యక్రమాలను రూపొందించారు. 2024లో 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడ ఇది ఉత్తమ తొలి దర్శకుడు విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది.
భారత ప్రభుత్వం, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థలు ఫిల్మ్ బజార్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వంటి వేదికలను బలోపేతం చేయడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. ఇవి సినిమా రూపకర్తలను మరింత శక్తిమంతం చేస్తాయి. వారి సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. భారతీయ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకోవడానికి మార్గాలను సృష్టిస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2232906)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11