ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఏఐ రంగంలో ఒక కీలక ఘట్టం: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026లో బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు ప్రపంచ దేశాధినేతలు, పెద్ద సాంకేతిక కంపెనీల సీఈఓల మద్దతు
అత్యంత తెలివైన ఏఐ అంటే అత్యంత ఖరీదైనది కాదు.. సరైన లక్ష్యం కోసం ఉత్తమ వ్యక్తులు నిర్మించినదే
అసలైన ఏఐ: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఏఐ భవిష్యత్తును కేవలం కొన్ని దేశాలు లేదా కొద్దిమంది బిలియనీర్ల ఇష్టాయిష్టాలకు వదిలేయకూడదు. ఏఐ కోసం ఒక ప్రపంచ స్థాయి నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది: ఆంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
డిజిటల్ అసమానత కాస్తా ఏఐ అసమానతగా మారడానికి మనం అనుమతించకూడదు: సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
మనం ఏఐ పరికరాలను దేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి: ఎన్. చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్
చాలా రంగాలలో ఏఐ త్వరలోనే మానవ మేధో సామర్థ్యాలను మించిపోయే అవకాశం ఉన్నందున
మనం అప్రమత్తంగా ఉండాలి: డారియో అమోడెయ్, ఆంత్రోపిక్ సీఈఓ
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 3:00PM by PIB Hyderabad
భారత్ మండపంలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026'కు సంబంధించిన భారీ ప్రారంభోత్సవం వివిధ దేశాధినేతలు, పెద్ద సాంకేతిక కంపెనీల సీఈఓల కలయికకు వేదికైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధ భవిష్యత్తును రూపొందించడంలో బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు, శాస్త్రీయ పురోగతి, అంతర్జాతీయ సహకారంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుందని ఈ ప్రారంభోత్సవ వేడుక స్పష్టం చేసింది.
భారతదేశపు ఏఐ వ్యూహాన్ని ప్రజాస్వామ్యీకరణ, విస్తృతి, సార్వభౌమాధికారం ప్రాతిపదికన రూపొందించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఏఐ స్టాక్‌లోని ఐదు ప్రధాన అంచెలైన అప్లికేషన్లు, మోడల్స్, కంప్యూట్, టాలెంట్, ఇంధనాల గురించి ఆయన సమగ్రంగా వివరించారు. ఈ సాంకేతికతను ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ప్రభుత్వ సేవల వంటి రంగాలలో వాస్తవ ప్రపంచ అవసరాల కోసం వినియోగించడం గురించి ప్రధానంగా చెప్పారు.
ఏఐని తదుపరి ప్రాథమిక మౌలిక సదుపాయంగా పేర్కొంటూ దీనిని 'మేధో మౌలిక సదుపాయం'గా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అభివర్ణించారు. ఆవిరి యంత్రాలు, విద్యుత్, ఇంటర్నెట్ మాదిరిగానే ఏఐ కూడా ప్రపంచాన్ని సమూలంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం సాధించిన డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల విజయాలను ఆయన ప్రధానంగా చెప్పారు. చిప్స్, సిస్టమ్స్ నుంచి ఇంధనం, అప్లికేషన్ల వరకు అన్ని విభాగాల్లోనూ (ఫుల్ స్టాక్) విస్తరించిన ఏఐని ఒక వ్యూహాత్మక జాతీయ శక్తిగా ఆయన అభివర్ణించారు. పరిశ్రమలకు ఉన్న అపారమైన అవకాశాలను గురించి ప్రస్తావిస్తూ.. "ఏఐ అనేది తదుపరి పెద్ద మౌలిక సదుపాయం. ఇది మేధోపరమైన మౌలిక సదుపాయం. ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఏఐ ప్రయోజనం చేకూరేలా చేయడం మన లక్ష్యం కావాలి. మనం ఏఐ సాధనాలను దేశంలోని చిట్టచివరి వ్యక్తికి.. నిజానికి ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలి. మనం ఒక చారిత్రాత్మక మలుపు సమయంలో ఉన్నాం. ఇది అపారమైన మేధస్సు గల యుగం. ఇక్కడ నమ్మకం, బాధ్యతాయుతమైన నిర్వహణ, మానవ సామర్థ్యం అనేవే అత్యంత విలువైన వనరులు" అని వ్యాఖ్యానించారు.
2023లో బ్లెచ్లీ పార్క్‌లో జరిగిన మొదటి గ్లోబల్ ఏఐ సేఫ్టీ సదస్సు నుంచి ఏఐ సాధించిన అసాధారణ పురోగతిని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ గుర్తు చేశారు. గత రెండున్నరేళ్లలో ఈ ప్రగతి విస్మయపరిచే విధంగా ఉందని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఏఐ గణనీయమైన వృద్ధి రేటుతో దూసుకుపోతోందని.. చాలా రంగాల్లో మానవ మేధో సామర్థ్యాలను మించిపోయే దిశగా ఇది వేగంగా అడుగులు వేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. "గత 10 ఏళ్లుగా ఏఐ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో చాలా ముందుకు వచ్చాం. 'డేటా సెంటర్‌లో కేంద్రీకృతమైన మేధో ప్రపంచం' అని పిలిచే స్థితికి మనం చేరువవుతున్నాం. అంటే చాలా విషయాల్లో మెజారిటీ మనుషుల కంటే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ సూపర్ హ్యూమన్ వేగంతో సమన్వయం చేసుకునే ఏఐ ఏజెంట్ల సమూహం సిద్ధమవుతోంది. ఈ స్థాయి సామర్థ్యం వ్యాధులను నయం చేయడానికి, బిలియన్ల సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడానికి, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి అసాధారణమైన అవకాశాలను అందిస్తుంది. కానీ ఇది తీవ్రమైన ముప్పులను కూడా తెస్తుంది. ఈ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నందున కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. తద్వారా రాబోయే మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ సంపదను బాధ్యతాయుతంగా అందరికీ సమానంగా పంచొచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
ఏఐని మన జీవితకాలంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫాం మార్పుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభివర్ణించారు. శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో దీనికి ఉన్న సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. "ఏఐ అనేది మన జీవితకాలంలో చూస్తున్న అతిపెద్ద సాంకేతిక మార్పు. మనం అత్యంత వేగవంతమైన పురోగతి, కొత్త ఆవిష్కరణల అంచున ఉన్నాం. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు పాత తరం లోపాలను అధిగమించి వేగంగా ముందుకు సాగడానికి సహాయపడతాయి. అయితే ఈ ఫలితం కచ్చితంగా లభిస్తుందని గానీ.. దానంతట అదే జరుగుతుందని గానీ చెప్పలేం. ప్రతి ఒక్కరికీ నిజంగా ఉపయోగపడే ఏఐని తయారుచేయాలంటే మనం దానిని ధైర్యంగా అనుసరించాలి.. బాధ్యతాయుతంగా అడుగులు వేయాలి.. ఈ కీలక సమయంలో అందరం కలిసి పనిచేయాలి. డిజిటల్ అసమానతలు కాస్తా ఏఐ అసమానతలుగా మారడానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు" అని అన్నారు.
గ్లోబల్ సౌత్‌లో మొట్టమొదటి ఏఐ సదస్సును నిర్వహించడంలో భారతదేశం చూపించిన నాయకత్వాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. కృత్రిమ మేధ భవిష్యత్తును కేవలం కొన్ని దేశాలు లేదా ప్రైవేట్ ప్రయోజనాలు మాత్రమే శాసించకూడదని ఆయన అన్నారు. 40 మంది అంతర్జాతీయ నిపుణులతో కూడిన స్వతంత్ర సైంటిఫిక్ ప్యానెల్ ఏర్పాటు, సమ్మిళిత బహుళపక్ష భాగస్వామ్యంతో కూడిన 'ఏఐ నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ చర్చ (గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్)' ప్రారంభించటం అనే రెండు చర్యలను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీసుకోవటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మానవ నియంత్రణను కాపాడే రక్షణ కవచాల కోసం పిలుపునిస్తూ ఆయన.. "ఏఐ భవిష్యత్తును కేవలం కొన్ని దేశాలు నిర్ణయించకూడదు లేదా కొద్దిమంది బిలియనీర్ల ఇష్టాయిష్టాలకు వదిలేయకూడదు. మానవ ప్రమేయం, పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని కాపాడే రక్షణ కవచాలు మనకు అవసరం. ఏఐ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాథమిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి 'ఏఐకి సంబంధించిన అంతర్జాతీయ నిధి'ని ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. సాంకేతికత అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలి.. ఈ భూగ్రహాన్ని రక్షించాలి. కాబట్టి గౌరవప్రదమైన జీవనాన్ని ప్రాథమిక సూత్రంగా ఉంచుతూ అందరి కోసం ఏఐని తయారుచేద్దాం" అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలకోపాన్యాసం ఇచ్చారు. వేగంగా పెరుగుతున్న సాంకేతిక పోటీలో స్వతంత్ర, సార్వభౌమ, సహకార ఏఐ అభివృద్ధి ప్రాధాన్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం సాధించిన డిజిటల్ ప్రజా మౌలుకసదుపాయాల విప్లవానికి, ప్రస్తుత ఏఐ మార్పులకు మధ్య ఉన్న సారూప్యతలను ఆయన ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక శక్తి, ప్రపంచ సమతుల్యతను నిర్దేశించే ఒక వ్యూహాత్మక రంగంగా ఆయన ఏఐని అభివర్ణించారు. భారత్, ఐరోపా అనుసరిస్తున్న ప్రయోజనకర మార్గాలను ప్రస్తావిస్తూ ఆయన.. "అత్యంత ఖరీదైన ఏఐ మాత్రమే తెలివైనది కాదు. అత్యుత్తమ వ్యక్తుల ద్వారా సరైన ప్రయోజనం కోసం నిర్మాణమైన అసలైనదే అసలైన ఏఐ. ఆవిష్కరణలను బాధ్యతతో సాంకేతికతను మానవత్వంతో కలిపి ముందుకు సాగేవారే ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. విదేశీ కంపెనీలు తమ మోడళ్లను అమ్ముకోవడానికి, ప్రజలు డేటాను సేకరించుకోవడానికి మాత్రమే పరిమితమయ్యే ఒక 'మార్కెట్'గా ఏ దేశం మిగిలిపోవాల్సిన అవసరం లేదు. ఆవిష్కరణలు, స్వాతంత్య్రం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సాధించడానికి ఒక మార్గం ఉంది. ఈ భవిష్యత్తును రూపొందించడంలో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయి” అని వ్యాఖ్యానించారు.
ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రపంచ రాజకీయ నాయకులు, బహుపాక్షిక సంస్థలు, సాంకేతిక రంగ మార్గదర్శకులు పాల్గొనడం అనేది దీని విశిష్టతను చాటిచెప్పింది. పరస్పరం అనుసంధానమై ఉండి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో కృత్రిమ మేధ భవిష్యత్ గమనాన్ని నిర్దేశించే ఒక అత్యున్నత వేదికగా ఈ సదస్సు ప్రత్యేకతను చాటుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2230393)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4