ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 11:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.
ద్వైపాక్షిక సహకారానికి భవిష్యత్ నిర్దేశం దిశగా రెండు దేశాల మధ్య సంబంధాలను “ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం” స్థాయికి విస్తరించడంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఉభయ దేశాల స్నేహబంధంపై వారి సంయుక్త దృక్కోణం-ఆకాంక్షలను ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణ ప్రస్ఫుటం చేస్తోంది. రెండు ఆర్థిక వ్యవస్థల శ్రేయస్సు, పునరుత్థాన సామర్థ్యం పెంపు సహా పరస్పర జాతీయ భద్రతను పటిష్టం చేయడంలో ఈ పరిణామం తోడ్పడుతుంది. అలాగే, అంతర్జాతీయ శ్రేయస్సుతోపాటు పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి సవాళ్ల పరిష్కారానికి, తద్వారా సుస్థిర నియమాధారిత క్రమం రూపకల్పనలో సంయుక్త శక్తిగా కృషి చేసేందుకు దోహదం చేస్తుంది. ఇక 2023లో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో- 2047 దాకా ద్వైపాక్షిక సంబంధాల మార్గనిర్దేశానికి ఉద్దేశించిన ‘హొరైజన్-2047’ భవిష్యత్ ప్రణాళికను నాయకులిద్దరూ ఆమోదించారు. భారత్ 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకోనుండగా, ఆ ఏడాదితో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు వందేళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 50 సంవత్సరాలు పూర్తి కానుండటం విశేషం. మరోవైపు ద్వైపాక్షిక సహకార విస్తృతి, భాగస్వామ్యం ఉన్నతీకరణ అంశాల అమలుపై క్రమబద్ధ సమీక్ష కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల స్థాయి వార్షిక సమావేశాల నిర్వహణకు వారిద్దరూ నిర్ణయించారు. విశేషించి ‘హొరైజన్-2047’ సహా రెండు దేశాల ఆర్థిక భద్రత, అంతర్జాతీయ అంశాలు, ప్రజల మధ్య ఆదానప్రదానంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య రక్షణ, భధ్రత రంగాల్లో సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రక్షణ వేదికల సహ-రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి సారించడానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ అగ్రశ్రేణి రక్షణ రంగ భాగస్వాములుగా రెండు దేశాల స్థాయిని పెంచింది. భారీ సామర్థ్యం గల అణు విద్యుత్ ప్లాంట్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అత్యాధునిక మాడ్యులర్ రియాక్టర్లు వంటి పురోగామి రంగాల్లో సంభావ్య సంయుక్త కృషిపై ఫలవంతమైన చర్చల ద్వారా పౌర అణుశక్తి రంగంలో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకున్నాయి. ఉపగ్రహాల తయారీ, లాంచర్లు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు సహా అంతరిక్ష రంగంలోనూ ఉభయ దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారం కొనసాగుతోంది. మరోవైపు కృత్రిమ మేధ, ఆవిష్కరణ, పరిశోధన, సాంకేతికత, డిజిటల్-సైబర్, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు సహా ప్రజల మధ్య ఆదానప్రదానంలోనూ పరస్పర సహకార వైవిధ్యభరితంగా విస్తరించింది. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు కూడా మరింత ఇనుమడించడంతో విశ్వసనీయ, పునరుత్థాన సరఫరా వ్యవస్థల రూపకల్పన సహా ఆర్థిక భద్రత పరిరక్షణలోనూ భారత్-ఫ్రాన్స్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం’ ద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ-అంతర్జాతీయ స్థాయిలో సహకార విస్తృతి, సమన్వయంపై నిబద్ధత ప్రకటిస్తూ ‘ఇండియా-ఫ్రాన్స్ హొరైజన్-2047’ భవిష్యత్ ప్రణాళికను రెండు దేశాలూ ఆమోదించాయి.
శాస్త్ర విజ్ఞానం, పరిశోధన-ఆవిష్కరణల పురోగమన ప్రాధాన్యాన్ని, ఈ రంగాల్లో రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక-శాశ్వత సంబంధాలకు ప్రతీకగా ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్-2026’ వేడుకలను నాయకులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సహకారాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఏడాది వివిధ రంగాల సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత, సైబర్ ప్రపంచం, కృత్రిమ మేధ, ఆరోగ్య సంరక్షణ, సుస్థిర ప్రగతి, సాంస్కృతిక-సృజనార్థిక వ్యవస్థ, విద్య-పరిశోధన వంటి విభిన్న రంగాలలో ఈ కార్యక్రమాలుంటాయి. ప్రస్తుత ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడమే కాకుండా అంకుర, విద్యా, పరిశోధన సంస్థలు-పరిశ్రమల మధ్య సంబంధాలు ఏర్పరచడం వీటి లక్ష్యం. వివేచనాత్మక, సుస్థిర భవిష్యత్తు కోసం పరిష్కారాల దిశగా సంయుక్త మార్గాన్వేషణలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్య నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ప్రధానమంత్రి మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అభినందించారు. కృత్రిమ మేధతో వాటిల్లే ముప్పుపై హెచ్చరికతోపాటు దాని ద్వారా అందివచ్చే అవకాశాలను కూడా ఈ శిఖరాగ్ర సదస్సు ప్రస్ఫుటం చేసింది. దీనికిముందు కృత్రిమ మేధపై ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2025 ఫిబ్రవరిలోనే మాక్రాన్, మోదీల సహాధ్యక్షతన ఇటువంటి సదస్సును నిర్వహించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధపై రెండు దేశాల ఆనాటి సంయుక్త ప్రకటనను నాయకులిద్దరూ గుర్తుచేసుకుంటూ, ప్రజలతోపాటు ప్రజా ప్రయోజనాలకు, భూగోళానికి, ప్రపంచ ప్రగతి కోసం సురక్షిత-విశ్వసనీయ ఏఐ దిశగా తమ నిబద్ధతను ప్రకటించారు. నిష్పాక్షికతతో ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ, ప్రపంచ ఏఐ అంతరాల తగ్గింపును ఉభయ పక్షాలూ ప్రధానాంశాలుగా గుర్తించాయి. పునరుత్థానం, ఆవిష్కరణ, సామర్థ్యంపై కార్యాచరణ బృందానికి సహాధ్యక్ష పాత్రలో ఫ్రాన్స్ గణనీయంగా సహకరించింది.
ఈ ఏడాది ఫ్రాన్స్ నిర్వహించే జి7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అధ్యక్షుడు మాక్రాన్ ఆహ్వానించారు. అలాగే, సదస్సు సన్నాహక చర్చలు, కార్యక్రమాల్లో భారత్ చురుగ్గా పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ప్రపంచ స్థూల ఆర్థిక అసమతౌల్య పరిష్కారం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు-సంఘీభావం దిశగా కొత్త నమూనా రూపకల్పన వంటి కీలకాంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఆహ్వానంపై ప్రధానమంత్రి మోదీ హృదయపూర్వకంగా హర్షం వ్యక్తం చేస్తూ- జి7తో భారత్ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచ ఆర్థిక అసమతౌల్యాన్ని పరిష్కరించడం సహా అభివృద్ధి నిధులు, అంతర్జాతీయ భాగస్వామ్యం, ఆర్థిక భద్రత, పునరుత్థాన సరఫరా వ్యవస్థలు, వాతావరణ కార్యాచరణ, అంతర్జాతీయ భద్రతపై అంతర్జాతీయ చర్చలకు నిర్దిష్టంగా దోహదపడటంపై భారత్ నిబద్ధతను ప్రకటించారు. ప్రపంచ సవాళ్ల పరిష్కారం, మరింత సమతుల, సమ్మిళిత, పునరుత్థాన అంతర్జాతీయ క్రమానికి ప్రోత్సాహం తదితరాలపై సమష్టి కృషిని భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తుందని నాయకులిద్దరూ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ సవాళ్లను... ముఖ్యంగా స్థూల ఆర్థిక సమస్యల పరిష్కారంలో సంయుక్త కృషి ప్రాధాన్యాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు.
నైరోబీలో ఈ ఏడాది మే 11, 12 తేదీల్లో నిర్వహించే “ఆఫ్రికా ఫార్వర్డ్: పార్టనర్ షిప్స్ బిట్వీన్ ఆఫ్రికా-ఫ్రాన్స్ ఫర్ ఇన్నొవేషన్ అండ్ గ్రోత్” శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా కెన్యా అధ్యక్షుడు రుటోతో కలిసి ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం పంపడాన్ని అధ్యక్షుడు మాక్రాన్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్-ఆఫ్రికన్ దేశాలతో భారత్ దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఈ ఆహ్వానంపై ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర ప్రయోజనకర రంగాలు... ప్రత్యేకించి ఇంధన మార్పిడి, కృత్రిమ మేధ, ఆరోగ్యం, వ్యవసాయం, నీలి ఆర్థిక వ్యవస్థ తదితరాల్లో భారత్ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం సహా నియమాధారిత క్రమంపై తమ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య సంబంధాల ఉన్నతీకరణ భవిష్యత్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. తద్వారా సార్వభౌమ, నిర్ణయాత్మక స్వయంప్రతిపత్తి కూడా పటిష్ఠమవుతుంది. అలాగే, భారత్-ఐరోపా సమాఖ్య మధ్య సహకారంతో ప్రపంచం ప్రధాన సవాళ్లపై సమష్టిగా స్పందించే వీలుంటుంది.
నిష్పాక్షిక, శాంతియుత అంతర్జాతీయ క్రమం కొనసాగింపు, ప్రపంచవ్యాప్త సవాళ్ల పరిష్కారం, సాంకేతిక-ఆర్థిక రంగాలు సహా భవిష్యత్ పరిణామాలపై ప్రపంచాన్ని సిద్ధం చేసే దిశగా సంస్కరించిన, ప్రభావశీల బహుపాక్షికత కోసం తమ పిలుపును వారిద్దరూ పునరుద్ఘాటించారు. ముఖ్యంగా, ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సంస్కరణల అత్యావశ్యకతపై తమ నిశ్చితాభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ అంశంతోపాటు బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సమన్వయానికి కూడా వారు అంగీకరించారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సంస్కరణపై అంతర-ప్రభుత్వ చర్చల సమాప్తి కోసం కృషిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, భద్రత మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు ఫ్రాన్స్ తన దృఢ మద్దతును పునరుద్ఘాటించింది. సామూహిక దురాగతాల సందర్భంలో వీటో అధికార ప్రయోగంపై నియంత్రణ సంబంధిత చర్చల బలోపేతానికి నాయకులిద్దరూ అంగీకరించారు. దీర్ఘకాలిక ప్రపంచ సవాళ్లు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై వారు విస్తృతంగా చర్చించడంతోపాటు సంబంధాల పటిష్ఠంపై అంగీకారానికి వచ్చారు.
ఐరోపా సమాఖ్య-భారత్ సంబంధాల బలోపేతంలో కీలక ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్-ఈయూ మధ్య చారిత్రక శిఖరాగ్ర సదస్సు నిర్వహణపై హర్షం ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగిశాయి. ఈ ఒప్పందం ఖరారుతో భారత్-ఫ్రాన్స్, ఐరోపా దేశాల మధ్య ఆర్థిక సహకార విస్తృతికి మరిన్ని అవకాశాలు అందివస్తాయి. అంతేకాకుండా రెండు దేశాల వాణిజ్య పోటీతత్వం ఇనుమడించి సుస్థిర శ్రేయస్సు, పునరుత్థాన విలువ వ్యవస్థల నవ శకానికి పునాది పడుతుంది. ఈయూ-భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి దోహదం చేసే భద్రత-రక్షణ భాగస్వామ్యం ఒప్పందంపైనా నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో సముద్ర-సైబర్ భద్రత, హైబ్రిడ్ ముప్పులు, అంతరిక్షం, ఉగ్రవాద నిరోధం వంటి సార్వత్రిక భద్రత సమస్యలపై విస్తృత సమాచార ఆదానప్రదానం, సహకారం సహా పరస్పర ప్రయోజనకర రక్షణ-పారిశ్రామిక సహకారాన్ని ప్రోత్సహించే చట్రం రూపొందుతుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తమ ఆందోళనను వారిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ ఘర్షణ అపార మానవాళి వేదనకు, ప్రపంచ ప్రతికూల పరిణామాలకు దారితీస్తోంది. ఇటువంటి వైరుధ్యాల స్వస్తికిగల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నియమావళి, అంతర్జాతీయ చట్ట సూత్రాలకు అనుగుణంగా చర్చలు-దౌత్యం ద్వారా స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సహా ఉక్రెయిన్‌లో సమగ్ర, నిష్పాక్షిక, శాశ్వత శాంతి ప్రక్రియకు వారు మద్దతు ప్రకటించారు.
ఇరాన్ సహా ఆ ప్రాంతంలో ఇటీవలి ఆందోళనకర పరిణామాలపై ఉభయ పక్షాలూ చర్చించాయి. సమస్యలకు శాంతియుత పరిష్కారం, చర్చలు, దౌత్యం ప్రాధాన్యాన్ని కూడా వారు స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఆమోదించిన తీర్మానం 2803 సహా న్యూయార్క్ డిక్లరేషన్‌లో పొందుపరచిన సూత్రాల ప్రకారం గాజా ప్రాంతంలో శాంతి ప్రణాళిక అమలుకు ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ మద్దతు ప్రకటించారు. ఆ తీర్మానాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని అందులో భాగస్వాములైన దేశాలన్నిటికీ వారు సూచించారు. నిష్పాక్షిక, శాశ్వత శాంతి దిశగా కృషికి మద్దతిచ్చేందుకు సిద్ధమని రెండు పక్షాలు పునరుద్ఘాటించాయి. ప్రధానంగా గాజా ప్రాంతమంతటా సురక్షిత, అవరోధ రహిత సాయం వేగంగా అందాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ద్వంద్వ దేశ పరిష్కారం ప్రాతిపదికన చర్చలు-దౌత్యం ద్వారా సముచిత, శాశ్వత పరిష్కారం దిశగా భారత్-ఫ్రాన్స్ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు.
I. భద్రత, సార్వభౌమాధికారం విషయంలో భాగస్వామ్యం
భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్న లోతైన, దీర్ఘకాలిక రక్షణ సహకారాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 2024లో అంగీకారం కుదిరిన 'డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్‌మ్యాప్'కు అనుగుణంగా వాయు, నౌకా, భూతల వ్యవస్థలతో పాటు అభివృద్ధి చెందుతున్న ద్వంద్వ-వినియోగ సాంకేతికతలలో సంయుక్త పరిశోధన, కో-డిజైన్, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య జరగనున్న 'వార్షిక రక్షణ చర్చల' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు. నవంబర్ 2025లో డీజీఏ, డీఆర్డీఓల మధ్య రక్షణ సాంకేతికతలలో సహకారం కోసం కుదిరిన 'సాంకేతిక ఒప్పందాన్ని' వారు స్వాగతించారు. ఇది రెండు ఏజెన్సీల మధ్య పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యానికి ఒక వేదికగా నిలుస్తుంది. అత్యాధునిక సాంకేతికత రంగంలో భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తూ.. సైనిక శక్తిలో పైచేయి సాధించడానికి, సరఫరా గొలుసు లోపాలను అధిగమించడానికి, కీలకమైన సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు ఒక 'జాయింట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ గ్రూప్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హెలికాప్టర్, జెట్ ఇంజిన్ల తయారీలో రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా జరుగుతున్న చర్చలు.. ఇరు పక్షాల సంబంధింత ఏజెన్సీల మధ్య ఉన్న గట్టి సమన్వయాన్ని వారు అభినందించారు. ముఖ్యంగా 26 రాఫెల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. రక్షణ వైమానిక రంగంలో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే కోరికను వారు వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా యుద్ధ విమానాలు, వాటి ఇంజిన్ల తయారీలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే ఆకాంక్షను ఇరుపక్షాలు వెల్లడించాయి. ఈ దిశగా ఇటీవల జరుగుతున్న సానుకూల పరిణామాలను వారు స్వాగతించారు. సాఫ్రాన్ గ్రూప్, సంబంధిత భారతీయ సంస్థల మధ్య ఉన్న అద్భుతమైన సహకారాన్ని వారు గుర్తించారు. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) అభివృద్ధి కోసం సాఫ్రాన్, హెచ్ఏఎల్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని వారు అభినందించారు. లీప్ ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రం ప్రారంభోత్సవం, రాఫెల్ యుద్ధ విమానాల ఎం-88 ఇంజిన్ల కోసం ఎంఆర్ఓ సదుపాయం ఏర్పాటు, భారత్‌లో హామర్ మిసైల్స్ తయారీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్‌ను ఇరుపక్షాలు స్వాగతించాయి. ఇద్దరు నాయకులు కలిసి హెచ్125 తుది అసెంబ్లీ లైన్‌ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రం. ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా దోహదపడుతుంది. భారతదేశపు పినాకా ఎంబీఆర్ఎల్ వ్యవస్థపై ఫ్రాన్స్ చూపుతున్న ఆసక్తిని ప్రధానమంత్రి మోదీ అభినందించారు.
మేడ్ ఇన్ ఇండియా స్కార్పీన్ కార్యక్రమం (పీ75 – కల్వరి) సాధించిన ఘన విజయాన్ని ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 6వ సబ్‌మెరైన్‌ను 2025 జనవరి 15న భారత నౌకాదళానికి విజయవంతంగా అందజేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సబ్‌మెరైన్ల తయారీ రంగంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఈ అద్భుతమైన సహకారాన్ని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించాలని వారు నిర్ణయించారు.
అన్ని రంగాలలో క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ఇరువురు నేతలు అభినందించారు. ముఖ్యంగా 2025లో జరిగిన మూడు ప్రధాన విన్యాసాలను (వరుణ, శక్తి, గరుడ) వారు ప్రస్తావించారు. వీటితో పాటు బహుపాక్షిక విన్యాసాలలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఫ్రాన్స్ నిర్వహించిన అంతరిక్ష సైనిక విన్యాసాలలో భారత్ పాల్గొనడాన్ని వారు స్వాగతించారు. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న నావికాదళ నౌకల సందర్శనలను కూడా వారు అభినందించారు. 2026లో ఇరు దేశాల సైన్యాలలో అధికారుల పరస్పర నియామకాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఇది రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో ఇరు దేశాల సాయుధ దళాల మధ్య కార్యాచరణ సంబంధాలను మరింత పెంచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు.
జనవరి 2024లో కుదిరిన ఉద్దేశ పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ప్రకారం రక్షణ అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. డీఆర్డీఓ, డీజీఏ మధ్య కుదిరిన సాంకేతిక ఒప్పందం పరిధిలో రక్షణ అంతరిక్ష రంగం కూడా వస్తుంది. ఇది ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య, పారిశ్రామిక సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన, వినూత్నమైన సహకారానికి ఒక బలమైన ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది.
హరిత- డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు, వర్ధమాన సాంకేతికతలు, అత్యాధునిక తయారీ రంగాల్లో కీలక ఖనిజాలను ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ వైవిధ్యభరితమైన, స్థిరమైన, బాధ్యతాయుతమైన సరఫరా గొలుసులను తయారుచేయటం కోసం కీలక ఖనిజాలు, అరుదైన భూ పదార్థాల విషయంలో అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, పునర్వినియోగ సాంకేతికతలలో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కీలక ఖనిజాల రంగంలో సహకారం కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన 'ఉమ్మడి ఉద్దేశ ప్రకటన (జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్)'ను ఇరువురు నేతలు స్వాగతించారు.
ప్రపంచ వాణిజ్యం, అనుసంధానత, శ్రేయస్సును సరికొత్తగా తీర్చిదిద్దే సామర్థ్యం గల భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ) పట్ల తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక చర్చలను వారు అభినందించారు. 2026లో జరగనున్న మొదటి ఐఎంఈసీ మంత్రుల స్థాయి సమావేశంలో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో కలిసి త్రైపాక్షిక విధానంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నేతలు అభినందించారు. దీని కింద పరస్పరం గుర్తించిన రంగాల్లో ఉమ్మడి కార్యక్రమాలను అమలు చేసేందుకు ఆస్ట్రేలియా, యూఏఈ ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేయటానికి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్న, నిబంధనలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2018 నాటి ‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్-ఫ్రాన్స్ సహకార ఉమ్మడి వ్యూహాత్మక దార్శనికత’, 2023 నాటి ‘భారత్-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రోడ్‌మ్యాప్’కు అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత సన్నిహిత సహకారం కోసం వారు పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం (ఐపీఓఐ) కింద మెరుగైన భాగస్వామ్యం కోసం, భారత్ అధ్యక్షతన ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్‌లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉమ్మడి కార్యక్రమాల తాజా పురోగతిని వారు స్వాగతించారు. ఇందులో భారత్, ఫ్రాన్స్ నిధులతో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ద్వారా ఇండో-పసిఫిక్ దేశాలలో సౌర విద్యుత్ విషయంలో కొత్తగా చేపట్టిన శిక్షణలు, తృతీయ దేశాల్లో విపత్తు తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 'విపత్తు తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి' (సీడీఆర్ఐ)0 'ఏఎఫ్‌డీ గ్రూప్' మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తృతీయ దేశాల్లో వాతావరణం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఇండో-పసిఫిక్ త్రైపాక్షిక అభివృద్ధి సహకారం’ (ఐపీటీడీసీ) పురోగతిని వారు ప్రశంసించారు. ఇందులో భాగంగా డిజిటల్ అంకురాలు, ఆరోగ్యం, డిజిటల్ ప్రజా మౌలిసదుపాయాల రంగాలలో ఉమ్మడిగా అమలు చేయాల్సిన ప్రాజెక్టులను ఇరుపక్షాలు గుర్తించాయి.
అంతరిక్ష రంగంలో సీఎన్ఈఎస్, ఇస్రో మధ్య ఉన్న భాగస్వామ్య దృఢత్వాన్ని వారు కొనియాడారు. ఇరు దేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించుకోవడానికి మద్దతు తెలిపారు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 'భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక అంతరిక్ష చర్చల' మొదటి రెండు సమావేశాల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన ఇరువురు నేతలు.. 2026లో మూడో సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రక్షణ అంతరిక్ష సహకారంపై కుదిరిన ఉద్దేశ పత్రం(లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఆధారంగా ఇతర విషయాలతోపాటు అంతరిక్షాన్ని స్వతంత్రంగా ఉపయోగించుకోవటం, అంతరిక్ష పరిస్థితుల అవగాహనను పెంపొందించుకోవడంలో సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. అంతరిక్షంలో బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం కోసం 2026 జూలైలో ఫ్రాన్స్ నిర్వహించనున్న 'అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సు'ను స్వాగతించిన భారత్.. దీనిలో భాగస్వామి కానున్నట్లు ధ్రువీకరించింది.
ఇరు దేశాల ప్రధాన సముద్ర శాస్త్ర సంస్థల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని, ‘సముద్ర-అంతరిక్ష అనుసంధానం’లో సమన్వయాన్ని వృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు ప్రధానంగా చెప్పారు. సముద్రాల సుసంపన్నత, శ్రేయస్సును కాపాడేందుకు ముఖ్యంగా సముద్రపు నౌకాదళాల సహాయంతో సముద్ర పరిశీలనను మెరుగుపరచడానికి.. సముద్ర సంరక్షణను, దాని ద్వారా లభించే సంపదను సమన్వయపరిచే సుస్థిర నిర్వహణకు మద్దతు ఇచ్చేలా సీఎన్ఈఎస్, ఇంకోయిస్‌ల మధ్య బలోపేతమైన సహకారం ఉండాలని వారు కోరారు.
సైబర్ రంగంలో భారత, ఫ్రెంచ్ పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా ఏర్పడిన బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు కొనియాడారు. క్రమం తప్పకుండా జరిగే ద్వైపాక్షిక సైబర్ చర్చలు, కార్యక్రమాల ద్వారా సైబర్ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ప్రధానంగా పేర్కొన్నాయి. తదుపరి చర్చలు 2026లో జరగాలని వారు పిలుపునిచ్చారు. సైబర్ స్పేస్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాల వర్తింపు, సైబర్ స్పేస్‌లో బాధ్యతాయుతమైన దేశాల ప్రవర్తన నియమావళి అమలు విషయంలో ఐక్యరాజ్యసమితి వద్ద తమ సమన్వయాన్ని బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదకరమైన సైబర్ సాధనాలు, పద్ధతుల వ్యాప్తి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు.
సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ఇరువురు నాయకులు నిస్సందేహంగా తీవ్రంగా ఖండించారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని అధ్యక్షుడు మాక్రాన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రక్షించుకునే భారతదేశ హక్కుకు మద్దతు తెలిపారు. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఘటనను కూడా ఆయన ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ జాబితాలో ఉన్న వాటితో సహా ఉగ్రవాదులు, ఉగ్రవాద ముఠాలు, అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటంలో సహకరించుకోవాలనే నిబద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు అనుగుణంగా ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి.. అలాగే ఉగ్రవాద నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి, ఉగ్రవాదానికి నిధుల సరఫరాను అరికట్టడానికి నిరంతరం కృషి చేయాలని ఇరుపక్షాలు అన్ని దేశాలకు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి, ఎఫ్ఏటీఎఫ్, ఇతర బహుళపక్ష వేదికలలో కలిసి పనిచేయడానికి ఇరు దేశాలు నిబద్ధతను తెలియజేశాయి. 2026 మే నెలలో పారిస్‌లో జరగనున్న తదుపరి 'నో మనీ ఫర్ టెర్రర్' (ఎన్ఎంఎఫ్‌టీ) సదస్సుకు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వడాన్ని భారత్ సమర్థించింది.
2025 నవంబర్‌లో భారత 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్' (ఎన్ఎస్‌జీ), ఫ్రాన్స్‌కు చెందిన 'గ్రూప్ డి ఇంటర్వెన్షన్ డి లా జెండర్‌మెరీ నేషనల్' (జీఐజీఎన్) మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం కోసం 'ఉద్దేశ పత్రం(లెటర్ ఆఫ్ ఇంటెంట్)'పై సంతకాలు చేయడాన్ని ఇరువురు నాయకులు అభినందించారు. 2025 సంవత్సరంలో ఒకరి దేశంలో మరొకరు 'మిలిపోల్' ప్రదర్శనల నిర్వహణలో అందించుకున్న పరస్పర సహకారాన్ని వారు ప్రశంసించారు. అలాగే 2027లో ఢిల్లీ, పారిస్‌లలో జరగనున్న మిలిపోల్ ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు.
II. భూగోళం కోసం భాగస్వామ్యం
వాతావరణ మార్పుల తీవ్రత, తరచుదనం పెరుగుతున్నాయని ఇరువురు నాయకులు గుర్తించారు. పారిస్ ఒప్పందం ప్రాముఖ్యాన్ని, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కన్నా 2°C కంటే తక్కువగా ఉంచడం, ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5°C తక్కువకి పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించడం ద్వారా దాని ప్రభావవంతమైన అమలు కోసం సన్నిహిత సహకారం, చర్యలను మరింత వేగవంతం చేయడానికి సమష్టి నిబద్ధతను పెంపొందించడానికి వారు అంగీకరించారు. వాతావరణ చర్యలకు ఆధారమైన సైన్స్ పాత్రను సమర్థించడం, ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) కృషికి మద్దతునివ్వాలనే తమ దృఢ సంకల్పాన్ని ఇరు దేశాలూ పునరుద్ఘాటించాయి. 2024 నుంచి ఫ్రాంకో-ఇండియన్ అధ్యక్షతన కొనసాగుతున్న విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), 2018 నుంచి కొనసాగుతున్న అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) విధాన ప్రణాళికలు సహా బహుళపక్ష వేదికల్లో ద్వైపాక్షిక సహకారాన్ని వారు స్వాగతించారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ రెండు సంస్థల పట్ల వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2025లో సీడీఆర్ఐ అంతర్జాతీయ సమావేశానికి సహ అధ్యక్ష హోదాలో ఫ్రాన్స్ ఆతిథ్యం... రెండు సంస్థలకు భారత్-ఫ్రాన్స్ అందిస్తున్న దృఢమైన మద్దతు ద్వారా న్యూఢిల్లీలోని ఈ రెండు సంస్థల పట్ల ఇరు దేశాల నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. పారిస్‌లో అంతర్జాతీయ సౌర కూటమి యూరోపియన్ కార్యాలయ ఏర్పాటు కోసం జరుగుతున్న చర్చలనూ వారు స్వాగతించారు. ముఖ్యంగా వారు డిక్లరేషన్ డి చైలోట్, ఇంటర్‌గవర్నమెంటల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్స్ అండ్ క్లైమేట్ ద్వారా భవన నిర్మాణ రంగంలో డీకార్బనైజేషన్, విపత్తులను తట్టుకోగల సామర్థ్యం పెంపొందించడం కోసం కృషి చేయడంతో పాటు లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్‌ఐటి) కార్యక్రమం ద్వారా హార్ట్-టు-అబాట్ రంగాల్లో డీకార్బనైజేషన్ ప్రయత్నాలకు మద్దతునిస్తారు.
వాతావరణ, పర్యావరణ అంశాలపై భారత్-ఫ్రాన్స్ మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన సహకారంపై నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహా ఆర్థిక, పారిశ్రామిక, డిజిటల్ సాధికారత మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణనూ వారు స్వాగతించారు. భారత్‌లో పట్టణ రవాణా, ఇంధన పరివర్తన, గ్రీన్ ఫైనాన్స్, జీవవైవిధ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ ప్రాజెక్టుల్లో ఏఎఫ్‌డీ గ్రూప్ ప్రమేయం సహా ద్వైపాక్షిక సహకారం పట్ల వారు ప్రశంసలు వ్యక్తం చేశారు. భారత్‌లో ఇంధన పరివర్తన ప్రభావాల నూతన స్థూల ఆర్థిక నమూనాను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం నీతి ఆయోగ్, ఏఎఫ్‌డీ గ్రూప్ మధ్య ఉద్దేశ్య ప్రకటన గురించిన చర్చల్లో పురోగతినీ వారు గుర్తించారు.
జూన్ 2025లో నీస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి మహా సముద్రాల సమావేశం (యూఎన్ఓసీ-3) విజయాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. అంతర్జాతీయ మహాసముద్ర పాలనకు మూలస్తంభాల్లో ఒకటైన... జాతీయ అధికార పరిధికి ఆవల ఉన్న ప్రాంతాల్లో సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, దాని సుస్థిర ఉపయోగం గురించిన ఒప్పందం (బీబీఎన్‌జే ఒప్పందం) అమలులోకి రావడాన్ని ఫ్రాన్స్-భారత్‌లు స్వాగతించాయి. బహుపాక్షికత, విజ్ఞానం, భవిష్యత్ తరాలకు ఈ ఒప్పందం అందించే ప్రధాన పురోగతి గురించిన అవగాహనతో ఇరువురు నేతలు... ఆయా పక్షాల మొదటి సమావేశం నుంచే దీని సమర్థ అమలును నిర్ధారించడానికి గానూ అత్యధిక సంఖ్యలో దేశాల ఆమోదం పొందాల్సిన ప్రాముఖ్యాన్నీ అంగీకరించారు. మహాసముద్ర జీవవైవిధ్య రక్షణను కీలక ప్రాముఖ్యంగా అంగీకరించిన ఫ్రాన్స్-భారత్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా సముద్ర రక్షిత ప్రాంతాలను విస్తరించాలని పిలుపునిచ్చాయి. కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ విధాన ప్రణాళికను పూర్తిస్థాయిలో, ప్రభావవంతంగా అమలు చేయడం పట్ల ఇరు దేశాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. సముద్ర అన్వేషణ, పరిశీలనలో తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి గానూ హై సీస్ ఒప్పందం అమలు కోసం విశ్వసనీయ శాస్త్రీయ డేటాను రూపొందించడం, పంచుకోవడంలో మద్దతుతో పాటు, అంతర్జాతీయ సముద్ర ప్రాంతాల పాలనను బలోపేతం చేయడం, నూతన సముద్ర రక్షిత ప్రాంతాల అభివృద్ధి పట్ల ఫ్రాన్స్-భారత్‌లు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన చెందడానికి అణు విద్యుత్, ముఖ్యమైన అన్ని తక్కువ కార్బన్ శక్తుల మధ్య సంబంధాన్ని గుర్తిస్తూ... 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని, ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం సహా అణు ఇంధన రంగంలో ఇటీవల భారత్ చేపట్టిన సంస్కరణలను అధ్యక్షుడు గౌరవనీయ మాక్రాన్ ప్రశంసించారు. పరిశోధన, నైపుణ్యాల అభివృద్ధి నుంచి పారిశ్రామిక అనువర్తనాల వరకు వాల్యూ చెయిన్ అంతటా అణు ఇంధన రంగంలో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి, భారత ఇంధన మిశ్రమంలో అణు ఇంధనాన్ని మూలాధారంగా మార్చడానికి మరింత సహకారం కోసం గల అవకాశాలను అన్వేషించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టు విషయంలో చర్చల పురోగతి సహా పౌర అణు ఇంధనం విషయంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సాధారణ సమావేశాలనూ వారు గుర్తించారు. 2025లో పారిస్‌లో జరిగిన 6వ ప్రపంచ అణు ప్రదర్శన (డబ్ల్యూఎన్ఈ)లో భారతీయ కంపెనీలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొనడం... ఐఏఈఏ సహకారంతో ఫ్రాన్స్‌లో నిర్వహించనున్న రెండో ప్రపంచ అణు ఇంధన శిఖరాగ్ర సమావేశంలో భారత్ భాగస్వామ్యం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అణుశక్తి విభాగం (డీఏఈ), ఫ్రెంచ్ ప్రత్యామ్నాయ ఇంధనాలు-అణు ఇంధన కమిషన్ (సీఈఏ) మధ్య దీర్ఘకాల సంబంధాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణు శాస్త్ర సాంకేతిక రంగంలో పరస్పర సహకారాన్ని పునరుద్ధరించడం, మరింత బలోపేతం చేయడం అవసరమని వారు పిలుపునిచ్చారు. ఇరు దేశాల సంబంధిత నియంత్రణ సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలనూ అన్వేషించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
2025లో భారత్-ఫ్రాన్స్ మధ్య చిన్న, అధునాతన మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎమ్ఆర్/ఏఎమ్ఆర్) రంగంలో సహకారం కోసం ఉద్దేశ ప్రకటన (డీవోఐ)ను... రక్షణ, భద్రత, అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడం విషయంలో అత్యున్నత ప్రమాణాలను వర్తింపజేయడం పట్ల వారి నిబద్ధతను గుర్తుచేసుకున్న ఇరువురు నేతలు ఈ రంగంలో ఫ్రెంచ్ అంకుర సంస్థలు, సంబంధిత భారతీయ కంపెనీల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఇరు పక్షాల ప్రయత్నాలను గుర్తించారు. ఈ డీవోఐ విధాన ప్రణాళికలో ఫ్రెంచ్ ప్రత్యామ్నాయ ఇంధనాలు, అణు ఇంధన కమిషన్ (సీఈఏ), భారత అణుశక్తి విభాగం (డీఏఈ) మధ్య ఎస్ఎమ్ఆర్/ఏఎమ్ఆర్ విషయంగా పరిశోధనాభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థిరమైన వృద్ధిని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక పెట్టుబడులను ఇరువురు నేతలు స్వాగతించారు. ఎంఎస్ఎంఈలు, అంకురసంస్థలు, డిజిటలైజేషన్, ఏఐ, ఆవిష్కరణ-ఆధారిత సంస్థల ద్వారా పూర్తిగా ఉపయోగించుకోని ఆర్థిక సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్-ఫ్రాన్స్ సీఈవోల సదస్సును నిర్వహించడం పట్ల ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఎకనమిక్-ఫైనాన్స్ చర్చలు నిర్వహించడం పట్ల ఇరు దేశాల నిబద్ధతనూ వారు పంచుకున్నారు. ఇరు దేశాల కంపెనీల మధ్య, ముఖ్యంగా ఏరోస్పేస్, ఇంధనం, లాజిస్టిక్స్, వ్యవసాయం-ఆహారం, టెలికాం, సాంకేతిక రంగాల్లో వాణిజ్య సంబంధాల్లో వేగవంతమైన పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న సీఈవోల సదస్సు ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్రెంచ్, భారతీయ వ్యాపారాలకు ఆర్థిక కార్యకలాపాలను సురక్షితం చేసే, ఇరు దేశాల మధ్య మరిన్ని పెట్టుబడులు, మరింత సహకారానికి మార్గం సుగమం చేసే ద్వైపాక్షిక పన్ను సవరణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.
యూపీఐ సేవలను అందిస్తున్న మొదటి యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్‌లో యూపీఐ నిరంతర పురోగతి సాధించడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక ప్రధాన దుకాణాలు ఇప్పటికే యూపీఐ అంగీకరిస్తున్నాయనీ, దీనివల్ల పారిస్ భారతీయ పర్యాటకులకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. పర్యాటకుల చెల్లింపులను మెరుగుపరచడానికి సురక్షితమైన, సమర్థమైన డిజిటల్ చెల్లింపు పద్ధతులను మరింత ఎక్కువగా ఆమోదించే దిశగా కృషి చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
రైల్వే రంగంలో సహకారాన్నీ ఇరు దేశాల నేతలు స్వాగతించారు. కార్యకలాపాలు, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు, సుస్థిరత, పర్యావరణ ప్రభావ నిర్వహణ, రైల్వే సిబ్బంది శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, హై-స్పీడ్ రైలు వంటి నిర్మాణ సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు, అలాగే హైడ్రోజన్-ఇంధనంతో నడిచే రైళ్లు సహా తయారీ సాంకేతికతల వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారతీయ రైల్వే, హై-స్పీడ్ రైల్వే అభివృద్ధిలో సహకారం గురించిన ఉమ్మడి ఉద్దేశ ప్రకటనపై వారు సంతకం చేశారు.
III. ప్రజల కోసం భాగస్వామ్యం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ సహకారానికి గల గొప్ప చరిత్రను గుర్తుచేసుకుంటూ... ముఖ్యంగా భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరమైన 2026 సందర్భంగా ఈ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. అంతరిక్షం, పౌర అణు ఇంధనం, సైబర్, ఏఐ వంటి కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో ప్రస్తుత ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని వారు స్వాగతించారు. సాంకేతిక సహకారంలోనూ మరింత ముందుకు సాగాలని సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఇరు దేశాల ఆవిష్కర్తలు, అంకురసంస్థలు, వాణిజ్యం, ఇంక్యుబేటర్‌లు సహా కీలక వాటాదారులను అనుసంధానించడం ద్వారా డిజిటల్ నెట్‌వర్క్ సహాయంతో ఇరుదేశాల ఆవిష్కరణ వ్యవస్థలను ఒకచోట చేర్చడానికి భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ఏర్పాటునూ వారు స్వాగతించారు.
గత సంవత్సరం స్టేషన్ ఎఫ్‌లో పది భారతీయ అంకురసంస్థలు విజయవంతమైన తర్వాత, తదుపరి స్టార్టప్ ఇంక్యుబేషన్, భారతీయ-ఫ్రెంచ్ అంకురసంస్థల వ్యవస్థల మధ్య పరస్పర సహకారం విషయంలో జరుగుతున్న చర్చలను ఇరువురు నేతలు స్వాగతించారు. ఇరు దేశాల అంకురసంస్థల వ్యవస్థల మధ్య సహకారం కోసం టీ-హబ్, నార్డ్ ఫ్రాన్స్ ఇన్వెస్ట్ మధ్య సంతకాలు జరిగిన ఎల్‌వోఐని వారు స్వాగతించారు. ఈ సందర్భంలో బెంగళూరు టెక్ సమ్మిట్ భాగస్వామ్యంతో యూరప్‌లోని అతిపెద్ద టెక్ ఫెయిర్ అయిన వివాటెక్‌ను భారత్‌కు తీసుకురావడం పట్ల ఫ్రెంచ్ దేశం తమ నిబద్ధతను వ్యక్తం చేసింది. బహుళ ప్రాజెక్టులపై ఇప్పటికే ఉన్న బలమైన శాస్త్రీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా, ఫ్రెంచ్ జాతీయ సంస్థ అయిన ఐఎన్ఆర్ఐఏ, భారత్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) భాగస్వామ్యంతో భారత్‌లో డిజిటల్ సైన్సెస్, టెక్నాలజీపై ద్వైపాక్షిక కేంద్రం ఏర్పాటు గురించిన ఉద్దేశ ప్రకటననూ ఇరువురు నేతలు స్వాగతించారు. ఇరుపక్షాలు ఈ ఉమ్మడి ఉద్దేశ ప్రకటనపై సంతకం చేశాయి. ఫ్రెంచ్ సంస్థ సీఎన్ఆర్ఎస్, భారత్‌కు చెందిన డీఎస్‌టీల మధ్య శాస్త్రీయ సహకారం కోసం అవగాహన ఒప్పందం పునరుద్ధరణ... ఈ రెండు సంస్థల మధ్య అధునాతన మెటీరియల్స్ కోసం సంయుక్త కేంద్రం ఏర్పాటుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పునరుద్ధరణ... ఏఐ, అనువర్తిత గణిత రంగంలో ఏఎన్ఆర్, డీఎస్‌టీ సంస్థల ప్రాజెక్టుల కోసం జాయింట్ కాల్‌ను త్వరగా ఖరారు చేయాలనీ వారు పిలుపునిచ్చారు.
పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఇటీవల సంతకం చేసిన ఉద్దేశ ప్రకటనను ఇరుదేశాలు స్వాగతించాయి. సెయింట్-డెనిస్ డి లా రీయూనియన్, చెన్నై మధ్య కొత్త విమాన మార్గాన్ని ప్రారంభించటాన్ని ఇరుదేశాల నేతలు అభినందించారు. ఇది లా రీయూనియన్, భారత్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి దోహదపడుతుంది. కాన్పూర్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఎస్‌టీఐ)లో ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాల నాయకులు స్వాగతించారు. నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా, శిక్షణ రంగాల్లో ప్రస్తుతమున్న అవగాహన ఒప్పందం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచటంపై దృష్టి సారించి, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
ఆరోగ్య రంగంలో అపూర్వమైన ముందడుగును భారత్, ఫ్రాన్స్ స్వాగతించాయి. జనవరి 2024లో న్యూఢిల్లీలో అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఆరోగ్యం, వైద్య రంగంలో కుదుర్చుకున్న సహకార ఒప్పందానికి అనుగుణంగా ఏఐ, డిజిటల్ హెల్త్ అంశాలను ఈ వ్యూహాత్మక సహకారంలో కీలకంగా మార్చాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆరోగ్య సంరక్షణలో ఏఐ కోసం ప్రత్యేకంగా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఇరుదేశాల నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ కేంద్రం సోర్బోన్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), పారిస్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. పారిసాంటే క్యాంపస్, సీ-క్యాంప్ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్) మధ్య ఒప్పందం.. హెల్త్ డేటా హబ్, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మధ్య భాగస్వామ్యం డిజిటల్ హెల్త్ రంగంలో ఇండో-ఫ్రెంచ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించేందుకు రెండు దేశాల్లోని 22కి పైగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలను ఒకచోట చేర్చే ప్రధాన ప్రాజెక్టు ఫ్రెంచ్-ఇండియన్ క్యాంపస్ ఆన్ లైఫ్ సైన్సెస్ ఫర్ హెల్త్ పురోగతిని, ఆశయాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. అంటు వ్యాధులపై పరిశోధన, అభివృద్ధి, ప్రపంచ ఆరోగ్య పరిశోధనలను ప్రోత్సహించటానికి భారత్-ఫ్రాన్స్ సహకారానికి సంబంధించి ఇరుపక్షాల ఉద్దేశాలను తెలిపే పత్రంపై సంతకం చేయటాన్ని స్వాగతించారు.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ, భారత-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026 నేపథ్యంలో సాంస్కృతిక సంబంధాలను పటిష్ఠం చేసేందుకు ఇరుదేశాల నాయకులు నిబద్ధతను తెలియజేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రెండు దేశాల్లో వరుసగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించటంలో పరస్పర ‘విల్లా స్వాగతం’ రెసిడెన్సీ వ్యవస్థ ప్రాముఖ్యతను ఇరువురు నేతలు గుర్తించారు.
డిసెంబర్ 2024లో ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం, ఫ్రాన్స్ మ్యూజియమ్స్ డెవలప్‌మెంట్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటూ.. యుగే యుగీన్ భారత్ మ్యూజియాన్ని ప్రపంచ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో సాధించిన పురోగతిని ఇరుదేశాల నాయకులు కొనియాడారు. లోథల్‌లోని జాతీయ సముద్ర వారసత్వ సముదాయ సహకారంపై జరుగుతున్న చర్చల పురోగతిని కూడా స్వాగతించారు. 2028లో ఫ్రాన్స్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ (గిమెట్ మ్యూజియం)లో భారతదేశానికి అంకితమిచ్చిన సాంస్కృతిక సంవత్సరం ప్రకటనను, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మ్యూసీ డు క్వాయ్ బ్రాన్లీ-జాక్వెస్ చిరాక్‌లో సమకాలీన భారతీయ ఫోటోగ్రఫీ ప్రదర్శనను ఉభయ నేతలు స్వాగతించారు. 2025 చివర్లో ఫ్రాన్స్‌లోని మొబిలియర్ నేషనల్‌లో ప్రదర్శించిన, ఇరుదేశాల వస్త్ర నైపుణ్యాలను చాటిచెప్పే "సీ క్వి సే ట్రేమ్" లేదా "టెక్స్‌టైల్ మ్యాటర్స్" ప్రదర్శన త్వరలోనే భారతదేశంలోనూ ఏర్పాటు చేయనున్నారు.
సుసంపన్నమైన సాంస్కృతిక, సృజనాత్మక సంప్రదాయాలు గల భారత్, ఫ్రాన్స్ దేశాలు కొత్త సహకారాలను ప్రోత్సహించటానికి, అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవటానికి వీలుగా... సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలను (సీసీఐలు) ప్రోత్సహించటంలో సహకరించుకోవాలనే ఆకాంక్షను వెల్లడించాయి.
2022 పారిస్ పుస్తక మహోత్సవానికి భారతదేశాన్ని, 2023 న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనకు ఫ్రాన్స్‌ను పరస్పరం ఆహ్వానించుకుని సాధించిన విజయ స్ఫూర్తితో.. ఇరుదేశాల నిపుణుల పరస్పర ఆహ్వానాలు, ఉభయ భాషల్లోకి అనువాద ప్రక్రియలు, ఉమ్మడి ప్రాజెక్టులను ప్రోత్సహించటం ద్వారా పుస్తక, సాహిత్య రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఫ్రాన్స్, భారత్ ఆకాంక్షిస్తున్నాయి.
2023లో నమస్తే ఫ్రాన్స్ విజయవంతమైన నేపథ్యంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2028లో మరోసారి నమస్తే ఫ్రాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరుదేశాల నాయకులు నిర్ణయించారు. ద్వైపాక్షిక సాంస్కృతిక సహకారంలో భాగంగా ఈ వేడుకను ఇకపై క్రమం తప్పకుండా నిర్వహించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
భారతదేశంలోని అలయన్స్ ఫ్రాంచైజ్ వ్యవస్థ, లా రీయూనియన్‌లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం చేసిన కృషిని ఇరుదేశాల నేతలు కొనియాడారు. పారిస్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రాన్ని (స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రం-ఎస్‌వీసీసీ) ప్రారంభించటాన్ని స్వాగతించారు. పారిస్‌లోని ఈ కేంద్రం, భారతదేశంలోని అలయన్స్ ఫ్రాంచైజ్ వ్యవస్థల విశిష్ట బాధ్యతలను అధికారికంగా గుర్తించేందుకు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని సెకండరీ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కేంద్రాల్లో ఫ్రెంచ్ భాషా బోధనను విస్తరించాలనే లక్ష్యానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి. ఇందులో భాగంగా అందరికీ ఫ్రెంచ్, మెరుగైన భవిష్యత్తుకు ఫ్రెంచ్ వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
విద్యా రంగంలో సహకారాన్ని బలోపేతం చేయటం, విద్యార్థుల రాకపోకలను పెంచటానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఇరుదేశాల నాయకులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ క్లాసెస్ కార్యక్రమాన్ని అభినందించారు. దీని ద్వారా భారతీయ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భాషా శిక్షణ, విద్యా పద్ధతుల్లో మెళకువలు నేర్పించటం వల్ల ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల్లో సులభంగా ప్రవేశం పొందే అవకాశముంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 10,000 ఉండగా, 2030 నాటికి ఆ సంఖ్యను 30,000కు చేర్చాలనే లక్ష్యానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ముంబైలో ఈఎస్‌ఎస్‌ఈసీ బిజినెస్ స్కూల్, సెంట్రల్ సుపెలెక్ ఇంజినీరింగ్ స్కూళ్లను అనుసంధానిస్తూ ఒక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయటాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. అకడమిక్ అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందంలో త్వరలో చేయబోయే సవరణలపై హర్షం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి విద్యా, శాస్త్రీయ సమావేశాల విజయాన్ని.. విద్యా, శాస్త్రీయ రంగాల్లో పెరుగుతున్న సహకారాన్ని ఇరుదేశాల నాయకులు కొనియాడారు. ఉభయదేశాలకు చెందిన 200కు పైగా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, శాస్త్రీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నాయి. రెండు వైపులా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య క్రియాశీల సహకారాన్ని, ముఖ్యంగా ఉమ్మడి, ద్వంద్వ డిగ్రీ ఒప్పందాలను ఈ వేదిక స్పష్టం చేసింది. సామాజిక శాస్త్ర రంగంలో, ద్వైపాక్షిక శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించటంలో, నిధులను సమకూర్చడంలో సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ చేస్తున్న కృషిని ఇరువురు అభినందించారు.
రెండు దేశాల మధ్య ప్రయోజనకరమైన నైపుణ్యాలను, ప్రతిభావంతుల రాకపోకలను పరస్పరం పెంపొందించే ఉద్దేశంతో భారత్-ఫ్రాన్స్ వలస, రాకపోకల భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపీఏ), యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ (వైపీఎస్) ప్రాముఖ్యతను ఇరుదేశాల నాయకులు తెలియజేశారు. నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా, శిక్షణ రంగాల్లో సహకారానికి కుదిరిన అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు. ఇది యువతకు, నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచటమే కాక.. భారత్, ఫ్రాన్స్ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో ఫ్రెంచ్ విమానాశ్రయాల ద్వారా భారతీయ పౌరులకు వీసారహిత ట్రాన్సిట్ సౌకర్యాన్ని కల్పించే ప్రకటనను నాయకులు స్వాగతించారు. దీన్ని ఆరు నెలల పైలట్ వ్యవధి తర్వాత పునః సమీక్షించనున్నారు.
మధ్యధరా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల మధ్య వాణిజ్యం, అనుసంధానతను పెంపొందించే లక్ష్యంతో మార్సెయిల్ నగరంలో నిర్వహించిన రైసినా డైలాగ్ మెడిటరేనియన్ ఎడిషన్ ప్రారంభోత్సవాన్ని ఉభయ దేశాల నాయకులు స్వాగతించారు. ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల అధిపతులు, వాణిజ్య, అనుసంధాన నిపుణులు, ఇతర భాగస్వాములతో జరిగిన ఈ ఉన్నత స్థాయి చర్చను వారు అభినందించారు. ఈ వేదిక ద్వారా ఇరుపక్షాల విద్యావేత్తలు, మేధో సంస్థల మధ్య.. మధ్యధరా ప్రాంతంలోని దేశాల మధ్య పరస్పర మార్పిడి మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఈ ఫోరమ్ తదుపరి ఎడిషన్ కోసం ఇరువురు నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపన ఇరుదేశాల సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది రెండు దేశాల ప్రజలకు మరిన్ని అవకాశాలను సృష్టించటమే కాక.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నతను పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2229575)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9