ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత 38,000 జీపీయూలకు అదనంగా మరో 20,000 జీపీయూలతో దేశ ఏఐ మౌలిక సదుపాయాల బలోపేతం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
· సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అద్దం పడుతున్న భారత ఏఐ వ్యూహం
· వచ్చే రెండేళ్లలో 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా
· ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ప్రామాణికంగా నిలిచిన దేశీయ ఏఐ మోడళ్లు... మూడు అగ్రగామి ఏఐ దేశాల్లో ఒకటిగా ర్యాంకు
· ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు విద్యా సంస్థలకూ, దేశ ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్‌కూ నడుమ భాగస్వామ్యం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 5:14PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 రెండో రోజున కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత 38,000 జీపీయూలకు అదనంగా మరో 20,000 జీపీయూలను జోడించడం ద్వారా.. రాబోయే కొన్ని వారాల్లోనే భారత్ తన కంప్యూట్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనుందని ఆయన వెల్లడించారు. భారత ఏఐ వ్యూహంలో తదుపరి దశకు ఇది సంకేతమనీ, కంప్యూట్ మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంపై తాము దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు.
సమ్మిట్‌లో మీడియానుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా ఏఐ అభివృద్ధిపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని పునరుద్ఘాటించారు. కృత్రిమ మేధ ప్రయోజనాలు అందరికీ అందేలా చూడడం కోసం.. ఆరోగ్యం, విద్యా రంగాల్లో విస్తృతంగా దీన్ని వినియోగిస్తామని తెలిపారు.

సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు భారత ఏఐ వ్యూహమే నిదర్శనమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లో ఏఐ మౌలిక సదుపాయాలు కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండగా.. భారత్ మాత్రం దేశంలోని అన్ని వర్గాలకు విస్తృతంగా ఏఐ కంప్యూట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్ ఈ చర్చలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సు.. వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, అంతర్జాతీయ సాంకేతిక రంగ ప్రముఖులు, బహుపాక్షిక సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, అంకుర సంస్థలు, విద్యార్థులను ఒకే వేదికపైకి తెచ్చింది.
ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యమూ బలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల అగ్రశ్రేణి కార్యనిర్వాహకులు దాదాపు 20 సదస్సులు నిర్వహిస్తున్నారనీ, ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో అగ్రగాములకు భారత్ పట్ల ఉన్న నిబద్ధతను ఇది చాటుతోందనీ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సుగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మొత్తం బృందం రేయింబవళ్లూ కృషిచేస్తోందంటూ ప్రశంసించారు.
పెట్టుబడి అవకాశాలపై శ్రీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. డీప్‌టెక్ స్టార్టప్‌ల పట్ల వెంచర్ క్యాపిటల్ సంస్థలు అమితాసక్తిని కనబరుస్తున్నాయని గుర్తు చేశారు. ఏఐ రంగంలోని మొత్తం అయిదు దశల నుంచీ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. భారీ స్థాయి ప్రాజెక్టులు, ప్రధానమైన అప్లికేషన్ల కోసం వెంచర్ క్యాపిటల్ సంస్థలు నిధులను కేటాయిస్తున్నాయనీ ఆయన తెలిపారు.

భారతదేశ అతిపెద్ద బలాల్లో ఐటీ రంగం ఒకటనీ, సాంకేతికతలో వచ్చే ప్రతి మార్పునూ పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం ఉమ్మడిగా అందిపుచ్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం కృషిచేస్తోంది: ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం, కొత్త నైపుణ్యాలపై శిక్షణ, కొత్త ప్రతిభావంతులను సిద్ధం చేయడం, అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడం. ఈ మూడు ప్రయత్నాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి.
విద్యుత్ సామర్థ్యం గురించి ప్రస్తావిస్తూ.. శుద్ధ ఇంధన వనరుల నుంచే 50 శాతానికి పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న అరుదైన దేశాలలో భారత్ ఒకటి అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 51 శాతంగా ఉందనీ, ఇది దేశానికి ఒక గొప్ప సానుకూలత అనీ అన్నారు. మూడేళ్ల కిందట ప్రారంభించిన ఫ్యూచర్ స్కిల్స్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ కోసం ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త అవకాశాలను అందుకునేలా యువతను తీర్చిదిద్దేందుకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను మార్చేందుకు విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ కలిసి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.
భారత దేశీయ ఏఐ మోడళ్ల గురించి మంత్రి మాట్లాడుతూ... ఈ సదస్సులో ప్రారంభించిన పలు మోడళ్లను వివిధ ప్రమాణాల ఆధారంగా పరీక్షించినట్లు తెలిపారు. అంతర్జాతీయ మోడళ్లతో పోల్చి చూస్తే - పలు దేశీయ మోడళ్లు అనేక భారీ అంతర్జాతీయ ఏఐ వ్యవస్థల కన్నా మెరుగైన రేటింగ్‌ను సాధించాయనీ, ఇది భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని చాటుతోందనీ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న మొదటి మూడు దేశాల్లో ఒకటిగా మన దేశానికి స్టాన్‌ఫోర్డ్ ర్యాంకు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
కృత్రిమ మేధ దుర్వినియోగమయ్యే ముప్పు ఉందని అంగీకరిస్తూ.. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగిస్తూనే, దాని వల్ల కలిగే హానిని తగ్గించడానికి టెక్నో-లీగల్ విధానం చాలా ముఖ్యమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానం సాంకేతిక పరిష్కారాలను, చట్టపరమైన నిబంధనలను అనుసంధానిస్తుంది. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక మార్గాలను దేశ ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తున్న వర్చువల్ సంస్థ ఇది.
రంగాలవారీగా ఏఐ వినియోగం గురించి శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ.. అయిదో పారిశ్రామిక విప్లవానికి కృత్రిమ మేధ నాంది పలుకుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజంలోని ప్రతి రంగాన్నీ ఇది ప్రభావితం చేస్తుందన్నారు. ఈ సదస్సులో ప్రదర్శించిన ఆరోగ్య రంగ సాధనాలు వైద్య సేవలను సామాన్యులకు మరింత అందుబాటు ధరల్లోకి తెస్తాయని, అలాగే విద్యా రంగ సాధనాలు ప్రతి విద్యార్థికి వారి అవసరాలకు తగ్గట్టుగా వ్యక్తిగత బోధనను అందిస్తాయని ఆయన ఉదాహరణలతో పేర్కొన్నారు.
చిప్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ.. సెమీకండక్టర్ మిషన్ పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సెమీకండక్టర్ 2.0లో డిజైన్ అంశంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆవిష్కరణలు, అభివృద్ధి చర్యల ఫలితంగా.. రాబోయే కొన్నేళ్లలో భారత్ నుంచి కనీసం 50 డీప్‌టెక్ అంకుర సంస్థలు పుట్టుకొస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
పర్యావరణ సుస్థిరత గురించి ప్రస్తావిస్తూ.. ఏఐ డేటా సెంటర్లకు విద్యుత్తును అందించడానికి శుద్ధ ఇంధన వనరులపై పెట్టుబడులు పెడుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్, నీటి వినియోగాన్ని తగ్గించడానికి పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కొత్త ఆవిష్కరణల ద్వారా ఏఐ మౌలిక సదుపాయాల ఇంధన వినియోగాన్ని 35 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
సదస్సు మొదటి రోజే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు బాధ్యతాయుత ఆవిష్కరణల కోసం ఏఐని ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు కోసం పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు.
బాధ్యతాయుత రీతిలో ఏఐని అభివృద్ధి చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా వివిధ రంగాల్లో దీన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2229390)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2