సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

భారతదేశపు ఏఐ సత్తా: ఎంఓఐబీ పెవిలియన్ వేదికపై

ప్రభుత్వం, అంకురాలు, క్రియేటర్లు

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భారతదేశ ఏఐ సామర్థ్యాలు,

అంకురాల బలాన్ని చాటిచెబుతున్న ఎంఓఐబీ పెవిలియన్

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 12:44PM by PIB Hyderabad

కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గళం బలంగా వినిపిస్తున్న తరుణంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026'లో ఒక ప్రత్యేక పెవిలియన్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఓఐబీ) ఏర్పాటు చేసింది. దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలు, అంకురాల దృఢత్వం, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంపై దూరదృష్టిని చాటిచెప్పడానికి ప్రభుత్వం ఈ వేదికను వినియోగిస్తోంది.

 

ఈ పెవిలియన్‌లో 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'ను కూడా ఏర్పాటు చేశారు. విధాన నిర్ణేతలు, అంకురాలు, క్రియేటర్లు, పారిశ్రామిక దిగ్గజాలు ఒకచోట చేరి చర్చించే ఒక మీడియా, సంభాషణ వేదికగా దీనిని రూపొందించారు. భారత అభివృద్ధి ప్రాధాన్యతలు, సాంస్కృతిక వైవిధ్యం, జాతీయ భద్రతా అంశాలకు అనుగుణంగా ఏఐని ఎలా మలచుకోవాలో ఇక్కడ చర్చిస్తారు.

 

భారతదేశ ఏఐ వ్యవస్థ కేవలం అంతర్జాతీయ సాంకేతికతను వాడుకునే వినియోగదారుగా మాత్రమే కాకుండా స్వదేశీ, విస్తరణకు వీలైన, సామాజిక ప్రయోజనం చేకూర్చే ఏఐ పరిష్కారాలను రూపొందించే సృష్టికర్తగా ఎదగడమే ఈ పెవిలియన్ ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.

 

భారతీయ ఏఐ ఆవిష్కరణలకు ఒక గొంతుక

 

ఆరోగ్యం, మీడియా, కంటెంట్, పరిపాలన, సామాజిక ప్రభావం వంటి వివిధ రంగాలలో పనిచేస్తున్న భారతీయ అంకురాలు, పారిశ్రామికవేత్తలకు ఎంఓఐబీ పెవిలియన్ ఒక ప్రధాన వేదికగా నిలుస్తోంది. దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం ఏఐ ఉత్పత్తులను రూపొందిస్తున్న భారతీయ కంపెనీలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఇక్కడ ప్రత్యేక చర్చలు, వ్యవస్థాపకుల నేతృత్వంలో సదస్సులు నిర్వహిస్తున్నారు.

“భారతీయ ఏఐ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం, వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థం కావాలన్నదే మా ఉద్దేశం" అని ఒక అధికారి తెలిపారు. అంకురాలు, ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ ప్రతినిధులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఈ పెవిలియన్ ఏర్పరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

ఈ పెవిలియన్ కార్యకలాపాలలో 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్' అత్యంత కీలకమైనది. ఇక్కడ వరుసగా ప్యానెల్ చర్చలు, ఫైర్‌సైడ్ చాట్‌లు, అంకురాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. సదస్సుకు రాలేని వారి కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రసార భారతికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫాం 'వేవ్స్ ఓటీటీ'లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

 

అంకురాల కోసం 'యువర్‌ స్టోరీ' ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన

 

ఈ పెవిలియన్‌లో అంకురాలు, ఆవిష్కరణలకు సంబంధించిన చర్చా కార్యక్రమాల బాధ్యతను 'యువర్‌స్టోరీ' తీసుకుంది. వర్ధమాన వ్యవస్థాపకులు, ఏఐ రంగంలో మహిళా నాయకులు, భారత్‌లోని ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాల కోసం ప్రత్యేక పరిష్కారాలను రూపొందిస్తున్న కంపెనీలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ సదస్సులో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు, సీఈఓ శ్రద్ధా శర్మ స్వయంగా పలు చర్చా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీటిలో ఏఐ సార్వభౌమాధికారం, సామాజిక ప్రభావం చూపే అంకురాలు- వ్యవస్థాపకుల లైవ్ పిచ్ సెషన్లు వంటి కీలక అంశాలు ఉన్నాయి.

 

ప్రభుత్వ పెవిలియన్‌లో అంకురాలపై దృష్టి సారించే ఒక అంకుర మీడియా సంస్థ భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఇది భారతదేశపు ఆవిష్కరణల గాథను కేవలం ప్రభుత్వ విధానాల స్థాయి నుంచి నేరుగా వ్యవస్థాపకుల గొంతుకలతో ప్రపంచానికి చాటిచెప్పే దిశగా వచ్చిన మార్పుకు సంకేతమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

ఎంఓఐబీ పెవిలియన్ వద్ద రోజువారీ కార్యక్రమాల వివరాలు

 

సోమవారం, ఫిబ్రవరి 16

 

ప్రణాళికలో ఉన్న ఉన్నత స్థాయి సమావేశాల కారణంగా పరిమితం ప్రవేశం ఉంటుంది.

 

మధ్యాహ్నం 12:00 – 1:00

 

ప్యానెల్: అభివృద్ధి చెందుతున్న అంకురాల ప్రదర్శన (సెట్ 1)

 

యాంకర్ నేతృత్వంలో మూడు ఏఐ అంకురాలతో ముఖాముఖి

 

మధ్యాహ్నం 3:00 – 4:00

 

ప్యానెల్: అభివృద్ధి చెందుతున్న అంకురాల ప్రదర్శన (సెట్ 2)

మంగళవారం, ఫిబ్రవరి 17

 

పరిపాలన, సార్వభౌమాధికారం, భారతదేశ ఏఐ విధాన దిశానిర్దేశంపై ప్రత్యేక దృష్టి

 

మధ్యాహ్నం 12:00 – 12:30

 

ఫైర్‌సైడ్ చాట్: భారతదేశ ఏఐ సత్తా

 

భారతదేశ ఏఐ గమనాన్ని కొనసాగించడంపై ఎంఓఐబీ కార్యదర్శితో శ్రద్ధా శర్మ సంభాషణ

 

మధ్యాహ్నం 1:00 – 1:40

 

ప్యానెల్: ఏఐ, సార్వభౌమాధికారం

 

జాతీయ భద్రత, డేటా నియంత్రణ, స్వదేశీ ఏఐ అభివృద్ధిపై చర్చ

 

మధ్యాహ్నం 3:00 – 3:30

 

ఫైర్‌సైడ్ చాట్: కుకు ఎఫ్ఎం

 

స్థానిక భాషా కంటెంట్, ఏఐ ఆధారిత పంపిణీపై వ్యవస్థాపకులు లాల్ చంద్ బిసుతో చర్చ

 

సాయంత్రం 5:00 – 6:00

 

భూమి పెడ్నేకర్‌తో ఫైర్‌సైడ్ చాట్

 

సినిమా, సామాజిక చైతన్యం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై చర్చ

 

బుధవారం, ఫిబ్రవరి 18

 

సమ్మిళితత్వం, వ్యవస్థాపకుల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి

 

మధ్యాహ్నం 1:00 – 2:00

 

ప్యానెల్: అభివృద్ధి చెందుతున్న అంకురాల ప్రదర్శన (సెట్ 3)

 

మధ్యాహ్నం 3:00 – 3:40

 

ప్యానెల్: ఏఐ రంగంలో మహిళలు

 

నాయకత్వం, ఆవిష్కరణలపై మహిళా వ్యవస్థాపకులు, పారిశ్రామిక వేత్తల చర్చ

 

సాయంత్రం 4:30 – 6:00

 

ఎస్‌ఎస్‌తో అంకురాల లైవ్

 

వ్యవస్థాపకుల ద్వారా రెండు నిమిషాల వేగవంతమైన పిచ్ సెషన్లు.

 

గురువారం, ఫిబ్రవరి 19

 

నరేంద్ర మోదీ, ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పర్యటనల దృష్ట్యా సాధారణ సందర్శకులకు ప్రవేశం లేదు

 

శుక్రవారం, ఫిబ్రవరి 20

 

ముగింపు కార్యక్రమం - సామాజిక ప్రభావం, భారత కేంద్రీకృత ఆవిష్కరణలపై దృష్టి

 

మధ్యాహ్నం 12:00 – 1:00

 

ప్యానెల్: సామాజిక ప్రభావం చూపుతున్న ఏఐ అంకురాలు

 

మధ్యాహ్నం 3:00

 

ప్యానెల్: భారత్‌కు ఉన్న అవకాశం 

 

ఏఐ పరిష్కారాలను రూపొందిస్తున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని అంకురాలు

 

సాయంత్రం 4:00

 

ప్యానెల్: అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ల ప్రదర్శన (సెట్ 4)

 

ఏఐకి సంబంధించిన అంతర్జాతీయ చర్చల్లో భారత్‌కు కీలక స్థానం

 

భారతీయ కంపెనీలను ప్రపంచ స్థాయి ఏఐ చర్చలతో అనుసంధానించడమే ఈ పెవిలియన్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అదే సమయంలో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని సదస్సుకు విచ్చేస్తున్న అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఇతర దేశాల ప్రభుత్వాలతో భారతీయ అంకురాలు నేరుగా సంభాషించే అవకాశాన్ని ఇది కల్పిస్తోంది.

 

అంకురాలు, క్రియేటర్లు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా భారతదేశపు ఏఐ దార్శనికతను ప్రత్యక్షంగా మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న సామర్థ్యాలుగా మార్చడమే ఎంఓఐబీ పెవిలియన్ లక్ష్యం. తద్వారా ప్రపంచ ఏఐ వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషించాలనే భారత ఆకాంక్షను ఇది బలపరుస్తోంది.

 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 కొనసాగుతుండగా కృత్రిమ మేధ‌ను తనదైన శైలిలో రూపొందించడం, నియంత్రించడం, విస్తరించడంలో భారత భవిష్యత్తు ప్రణాళికలను ఈ పెవిలియన్ ప్రతిబింబిస్తోంది. 

***


(రిలీజ్ ఐడి: 2228682) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam