మంత్రిమండలి
నోయిడా సెక్టర్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 11.56 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్ కొత్తగా రానున్న 8 స్టేషన్లు
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 1:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా నోయిడా సెక్టర్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ (నోయిడా) వరకు 11.56 కి.మీ పొడవైన మెట్రో మార్గం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో 8 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో మొత్తం మెట్రో రైలు నెట్‌వర్క్ 61.62 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
ప్రయోజనాలు, అభివృద్ధి:
నోయిడా సెక్టర్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు చేపట్టే ఈ విస్తరణ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నగరంలోని మెట్రో నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరిస్తుంది.
మెరుగైన అనుసంధానం:
ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ప్రజా రవాణాను ఈ 11.56 కి.మీల కొత్త మెట్రో మార్గం మెరుగుపరుస్తుంది. దీనితో పాటు అత్యధిక రద్దీ ఉండే కారిడార్లతో ప్రత్యక్ష అనుసంధానాన్ని కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా బొటానికల్ గార్డెన్ వద్ద ఢిల్లీ మెట్రోలోని నీలి రంగు మార్గం, మెజెంటా రంగు మార్గాలకు ఇంటర్‌ఛేంజ్ సౌకర్యాన్ని అందిస్తుంది.
ఇది కింది వాటితో పాటు నోయిడాలోని కీలక ప్రాంతాలను నిరంతరాయంగా అనుసంధానించనుంది:
-
సెక్టార్-142లోని అడ్వాంట్ బిజినెస్ పార్క్, సెక్టార్-98లోని స్కైమార్క్ వన్ మాల్, సెక్టార్-93లోని మాల్ ఆఫ్ నోయిడా వంటి వాణిజ్య కేంద్రాలు
-
సెక్టార్-145లో మైక్రోసాఫ్ట్, సెక్టార్-157లో టీసీఎస్, సెక్టార్-126లో హావెల్స్.. సెక్టార్-132లో ఇన్ఫోసిస్, అడోబ్.. సెక్టార్-135లో కాగ్నిజెంట్, సెక్టార్-127లో ఒరాకిల్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలు, ఐటీ హబ్‌లు
-
సెక్టార్-125లోని అమిటీ యూనివర్సిటీ, సెక్టార్-91లోని పంచశీల్ బాలక్ ఇంటర్మీడియట్ కళాశాల, సెక్టార్-44లోని మహామాయ బాలికల ఇంటర్మీడియట్ కళాశాల వంటి విద్యా సంస్థలు
-
ప్రధానంగా సెక్టార్-128లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి కీలక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు
-
బొటానికల్ గార్డెన్, సెక్టార్-93 పార్క్ వంటి ప్రధాన పర్యాటక ఆకర్షణలు
మెట్రో నెట్‌వర్క్‌తో ఈ కీలక ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా నోయిడా సెక్టార్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ (నోయిడా) వరకు నిర్మించనున్న ఈ మెట్రో కారిడార్ కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజాన్నివ్వనుంది. ఇది ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల కోసం ప్రయాణించే వారితో పాటు స్థానిక ప్రజలకు కూడా నగర రవాణాను ఎంతో సులభతరం చేస్తుంది.
-
ట్రాఫిక్ రద్దీ తగ్గింపు: రోడ్డు రవాణాకు మెట్రో రైలు ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయం. నోయిడా సెక్టార్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ఈ కారిడార్ అందుబాటులోకి రావడం వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా రోడ్డు భద్రత కూడా పెరుగుతుంది.
-
పర్యావరణ ప్రయోజనాలు: నోయిడా సెక్టార్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ఈ కొత్త మెట్రో కారిడార్ ఏర్పాటుతో పూర్తి మెట్రో మార్గం పెరగనుంది. దీని వల్ల శిలాజ ఇంధనాలపై నడిచే సంప్రదాయ రవాణా వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.
-
ఆర్థిక వృద్ధి: ప్రయాణ సమయం తగ్గడం.. ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వంటి రవాణా కేంద్రాలకు సులభంగా చేరుకునే సదుపాయం కలగడం వల్ల ప్రజల ఉత్పాదకత పెరుగుతుంది. మెరుగైన అనుసంధానం వల్ల కొత్త మెట్రో స్టేషన్ల పరిసరాల్లోని స్థానిక వ్యాపారాలు పుంజుకుంటాయి. అంతేకాకుండా గతంలో రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు పెట్టుబడులు కూడా వస్తాయి.
-
సామాజిక ప్రభావం: నోయిడా సెక్టార్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నోయిడా మెట్రో రైలును పొడగించటం వల్ల ప్రజలందరికీ సమానమైన రవాణా సౌకర్యాలు అందుతాయి. ఇది వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రవాణా పరంగా ఉన్న అసమానతలను తగ్గిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, అవసరమైన సేవలకు చేరువగా ఉండటం ద్వారా ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న నోయిడా సెక్టార్ 142- బొటానికల్ గార్డెన్ (నోయిడా) మార్గం నగరానికి ఒక పరివర్తనాత్మక అభివృద్ధి కానుంది. ఇది మెరుగైన అనుసంధానాన్ని అందించడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి ప్రయోజనాలను ఇస్తుంది. కీలకమైన నగర సవాళ్లను పరిష్కరిస్తూ భవిష్యత్ విస్తరణకు ఒక బలమైన పునాదిని వేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ నగర అభివృద్ధి పథాన్ని, సుస్థిరతను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2228217)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14