ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్


మలేషియాలోని కౌలాలంపూర్‌లో సామాజిక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

కౌలాలంపూర్‌లోని ప్రవాస భారతీయుల ఆత్మీయతకు కృతజ్ఞుడను.. భారత్, మలేషియా మధ్య బలమైన వారధిగా నిరంతరం సేవలందిస్తున్న ప్రవాస భారతీయులు: పీఎం

ప్రపంచంలో అత్యధికంగా భారత సంతతి వారు నివసిస్తున్న దేశాల్లో మలేషియాది రెండో స్థానం.. భారత్, మలేషియా ప్రజల మధ్య బలమైన బంధం: పీఎం

శతాబ్దాలుగా మీరు సంప్రదాయాలను కాపాడుతున్న తీరు అద్భుతం.. మలేషియాలోని 500కు పైగా పాఠశాలల్లో పిల్లలకు భారతీయ భాషల బోధిస్తున్నట్లు రేడియో ప్రసంగం మన్ కీ బాత్‌లో ప్రస్తావన, 1.4 బిలియన్ భారతీయుల హర్షం: పీఎం

అనేక దశాబ్దాలుగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న మలేషియాలోని ప్రవాస తమిళులు.. ఎన్నో శతాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడిన వారి సుదీర్ఘ చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది, మలేషియా విశ్వవిద్యాలయంలో తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేయటం గర్వకారణం.. ఇప్పుడు మన ఉమ్మడి వారసత్వాన్ని మరింత బలోపేతం చేయటానికి ఏర్పాటు చేయనున్న తిరువళ్లువర్ కేంద్రం: పీఎం

భారతదేశ విజయం, మలేషియా విజయం, ఆసియా విజయం.. మన సంబంధానికి మార్గనిర్దేశం చేసే పదం ఇంపాక్ట్.. ఇండియా, మలేషియా పార్టనర్‌షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్‌ఫార్మేషన్: పీఎం

భారతదేశంలో పర్యటించి, 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' అనుభూతిని పొందాలని మలేషియా వాసులకు పిలుపు.. స్నేహితులతో కలిసి రండి.. ప్రజల మధ్య పరస్పర సంబంధాలే మన మైత్రికి ఆధారం: పీఎం

అభివృద్ధి పథంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్.. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలే దీనికి నిదర్శనం.. విశ్వసనీయత భారతదేశానికి అత్యంత బలమైన కరెన్సీ: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 6:15PM by PIB Hyderabad

మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇవాళ జరిగిన సామాజిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. అక్కడ లభించిన ఘన స్వాగతం మన ఉమ్మడి సంస్కృతిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న తన ప్రియ మిత్రుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడమే కాకుండా.. ఆయన కారులోనే ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. "ఈ ప్రత్యేక మర్యాదలు భారత్‌పై, ఇక్కడున్న ప్రజలపై ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుతున్నాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

800లకు పైగా నృత్యకారులు ప్రదర్శించిన రికార్డు స్థాయి సాంస్కృతిక కార్యక్రమం రాబోయే కాలంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ప్రశంసించారు. కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. తాను ప్రధానమంత్రి కాకముందు నుంచే అన్వర్ ఇబ్రహీం మంచి మిత్రుడని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం చేపడుతున్న సంస్కరణలు, ఆయన అపార మేధస్సు, 2025లో ఆసియాన్ అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

గత ఏడాది ఆసియాన్ సదస్సు కోసం మలేసియాకు రాలేకపోయానని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి, త్వరలోనే వస్తానని ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నట్లు తెలిపారు. 2026లో ఇదే తన తొలి విదేశీ పర్యటన అని పేర్కొంటూ, పండుగ వాతావరణంలో ఇక్కడి భారతీయ సమాజంతో కలిసి ఉండటం సంతోషంగా ఉందన్నారు. అందరూ సంక్రాంతి, పొంగల్ సహా తైపూసం వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని ఆశిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రానున్న శివరాత్రి, రంజాన్ ప్రారంభం సహా హరిరాయ పండుగలను పురస్కరించుకుని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రపంచంలోనే భారతీయ సంతతి ప్రజలున్న రెండో అతిపెద్ద దేశంగా మలేసియా ఉందని, భారత్, మలేసియా ప్రజల హృదయాలను కలిపే అంశాలెన్నో ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను కొద్దిసేపటి క్రితం చూసిన ప్రదర్శన ఈ అనుబంధాలను అద్భుతంగా చిత్రీకరించిందన్నారు. "భారత సంతతి ప్రజలు ఇరుదేశాల మధ్య ఒక సజీవ వారధిలా ఉన్నారని కొనియాడారు. మలబార్ పరోటాను పోలి ఉండే రోటీ చనాయ్, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు సహా తేహ్ తారిక్ వంటి రుచులు కౌలాలంపూర్ నుంచి కొచ్చి వరకు ఎంతో సుపరిచితమైనవని, ఇవి మన సాంస్కృతిక బంధానికి ప్రతీకలని" ఆయన వ్యాఖ్యానించారు. ఇరుదేశాల భాషల్లోని సారూప్య పదాలు, మలేసియాలో భారతీయ సినిమాలు, సంగీతానికి ఉన్న ఆదరణ ప్రజల మధ్య అవగాహనను పెంచుతున్నాయన్నారు. ముఖ్యంగా మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అద్భుతంగా పాడతారని, దిగ్గజ నటుడు ఎంజీఆర్ తమిళ పాటలను ఆయన ఇష్టపడటం అద్భుతమని ప్రధానమంత్రి అన్నారు.

మలేషియాలోని భారత సంతతి ప్రజల హృదయాల్లో దేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 2001లో స్వరాష్ట్రమైన గుజరాత్‌లో భూకంపం సంభవించినప్పుడు మలేషియాలోని భారత సమాజం అందించిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటానికి మలేషియాలోని భారత సమాజానికి చెందిన వేలాది మంది పూర్వీకులు గొప్ప త్యాగాలు చేశారు. వారిలో చాలామంది అంతకుముందు ఎప్పుడూ భారత్‌ను చూడలేదు. అయినప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో చేరిన వ్యక్తుల్లో వారు ఉన్నారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా మలేషియాలోని భారత సాంస్కృతిక కేంద్రానికి ఆయన పేరును పెట్టినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మలేషియాలోని నేతాజీ సర్వీస్ సెంటర్, నేతాజీ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.

మలేషియాలోని భారతీయ మూలాలున్న వారు శతాబ్దాలుగా తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ఈ సమాజం గురించి ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మలేషియాలోని 500కు పైగా పాఠశాలల్లో భారతీయ భాషల్లో పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ‘‘మలేషియాలో తిరువళ్లువర్, స్వామి వివేకానంద వంటి మహాత్ముల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బాటు గుహలలో ఇటీవల జరిగిన తైపూసం వేడుకలు అత్యంత దివ్యంగా జరిగాయి. అవి పళనిలో జరిగే ఉత్సవాలకు సమానం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. మలేషియాలో గర్బా నృత్యం కూడా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. శ్రీ గురునానక్ దేవ్ జీ బోధనలను ప్రచారం చేస్తున్న సిక్కు సమాజంతో భారత్‌కు ఉన్న సాంస్కృతిక బంధాలను తాము ఎంతో గౌరవిస్తామని ఆయన తెలిపారు.

తమిళ భాష ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప కానుక అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. తమిళ సాహిత్యం అజరామరమని, తమిళ సంస్కృతి ప్రపంచవ్యాప్తమని, తమిళ ప్రజలు తమ ప్రతిభతో మానవాళికి సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్‌ జైశంకర్, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ మురుగన్.. వీరంతా తమిళనాడుకు చెందినవారే’’ అని శ్రీ మోదీ అన్నారు.

మలేషియాలోని తమిళ ప్రవాసులు వివిధ రంగాల్లో సమాజానికి సేవ చేస్తున్నారని, వారు అనేక శతాబ్దాలుగా మలేషియాలో నివసిస్తున్నారని ప్రధామంత్రి గుర్తుచేశారు. ఈ చరిత్ర స్ఫూర్తితో మలేషియా విశ్వవిద్యాలయంలో భారత్ ఇప్పటికే తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పుడు మన ఉమ్మడి వారసత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక తిరువళ్లువర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

భారత్-మలేషియా సంబంధాలు ప్రతి సంవత్సరం కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2024లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ పర్యటనను గుర్తుచేసుకుంటూ.. ఆ సమయంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని ఆయన తెలిపారు. అభివృద్ధి, శ్రేయస్సు దిశగా ఇరుదేశాలు భాగస్వాములుగా చేతులు కలిపి నడుస్తున్నాయని, ఒకరి విజయాన్ని మరొకరు తమ సొంత విజయంగా జరుపుకుంటున్నారని ప్రధాని అన్నారు.

చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయంపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపిన శుభాకాంక్షలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. భారత్‌ విజయం మలేషియా విజయం మాత్రమే కాదు..అది మొత్తం ఆసియా విజయం అని ఆయన అంగీకరించారని అన్నారు. ఈ సంబంధానికి మార్గదర్శక పదంగా ‘ఇంపాక్ట్‌’ (ఇండియా-మలేషియా పార్టనర్‌షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్‌ఫర్మేషన్) అని ఆయన అభివర్ణించారు. ఈ భాగస్వామ్యం సంబంధాల వేగంపై, లక్ష్యాల పరిధిపై, ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇరుదేశాలు కలిసి మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చగలవని ఆయన అన్నారు.

మలేషియాతో కలిసి పనిచేయడానికి భారతీయ కంపెనీలు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. మలేషియాలో మొదటి, ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో భారత్‌ పాత్రను ఆయన ప్రస్తావించారు. ‘100కు పైగా భారతీయ ఐటీ కంపెనీలు మలేషియాలో కార్యకలాపాలు సాగిస్తూ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. మలేషియా-ఇండియా డిజిటల్ కౌన్సిల్ డిజిటల్ సహకారానికి కొత్త మార్గాలను సుగమం చేస్తోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే భారతీయ యూపీఐ విధానం త్వరలోనే మలేషియాకు రానుందని ఆయన ప్రకటించారు.

భారత్‌, మలేషియా హిందూ మహాసముద్రంలోని ఒకే జలాలను పంచుకుంటున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా ఆయన అందరికీ ఆహ్వానం పలికారు. ‘‘గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌ మౌలిక సదుపాయాల రంగంలో అపూర్వమైన వృద్ధిని సాధించింది. విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయ్యింది, రికార్డు వేగంతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి’’ అని మోదీ వివరించారు. ఇరు దేశాల మధ్య స్నేహానికి ప్రజల మధ్య సంబంధాలే కీలకమని, మలేషియా స్నేహితులతో కలిసి భారత్‌ను సందర్శించాలని ఆయన ప్రోత్సహించారు.

గత దశాబ్ద కాలంలో భారత్‌ భారీ మార్పులకు లోనైందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి చేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’’ అని శ్రీ మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ఒక చిన్న మొక్కలా ప్రారంభమై నేడు దేశాన్ని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా మార్చిందని ఆయన గుర్తుచేశారు. రక్షణ ఎగుమతులు 2014 నుంచి దాదాపు 30 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ‘‘భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర సంస్థల కేంద్రంగా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయలు, ఫిన్‌టెక్ వ్యవస్థను నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత డిజిటల్ లావాదేవీలలో దాదాపు సగం యూపీఐ ద్వారా భారత్‌లోనే జరుగుతున్నాయి. స్వచ్ఛత, హరిత వృద్ధిలో భాగంగా సౌర శక్తి సామర్థ్యం దశాబ్ద కాలంలో దాదాపు 40 రెట్లు పెరిగింది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

భారత్‌ ఇప్పుడు కేవలం ఒక భారీ మార్కెట్‌గానే కాకుండా పెట్టుబడులకు,వాణిజ్యానికి ఒక కేంద్రంగా, అభివృద్ధిలో ఒక నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఐరోపా సమాఖ్య, అమెరికా వంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉందని ఆయన తెలిపారు. నేడు నమ్మకం భారత్‌కు బలమైన కరెన్సీగా మారిందని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులను దేశం ఎప్పుడూ సాదరంగా ఆహ్వానిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. మలేషియాలోని భారతీయ సంతతి పౌరులకు 6వ తరం వరకు ఓసీఐ కార్డు అర్హతను విస్తరించిన చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇండియన్ స్కాలర్‌షిప్స్ ట్రస్ట్ ఫండ్ ద్వారా భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు భారత్‌లో చదువుకోవడానికి వీలుగా త్వరలో తిరువళ్లువర్ స్కాలర్‌షిప్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే నో ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. మలేషియాలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త భారత రాయబార కార్యాలయం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడమే 140 కోట్ల మంది భారతీయులు లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఈ ప్రయాణంలో ప్రవాసీ భారతీయుల విలువైన భాగస్వామి అని ప్రధానమంత్రి అన్నారు. ‘‘కౌలాలంపూర్‌లో జన్మించినా లేదా కోల్‌కతాలో జన్మించినా ప్రవాసుల గుండెల్లో భారత్‌ ఎప్పుడూ జీవించే ఉంటుంది. మలేషియా, భారత్‌ పురోగతిలో వీరు చురుకైన భాగస్వాములుగా ఉంటూ.. సుసంపన్నమైన మలేషియా, వికసిత్‌ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.


(రిలీజ్ ఐడి: 2225168) సందర్శకుల సూచీ సంఖ్య : : 13