ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 10:33AM by PIB Hyderabad
గౌరవ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికీ,
ఇరు దేశాల గౌరవ ప్రతినిధులకూ,
మీడియా మిత్రులకూ,
నమస్కారం!
సెలామత్ పాగి!
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.
మిత్రులారా,
భారత్, మలేషియాల మధ్య సంబంధం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. సముద్రానికి ఇరుగుపొరుగున ఉన్న దేశాలు మనవి. శతాబ్దాలుగా మన ప్రజల మధ్య ఎంతో బలమైన, ఆత్మీయమైన అనుబంధం ఉంది. నేడు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భారత సంతతి ప్రజలు నివసిస్తున్న దేశాల్లో మలేషియా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలతో మన నాగరికతలు మమేకమై ఉన్నాయి.
మిత్రులారా,
ఇటీవలి సంవత్సరాల్లో మన సంబంధాలు నవోత్తేజాన్ని పొందాయి. మిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంది ఈ పురోగతిలో విశేషమైన పాత్ర.
ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో మన సహకారం మరింత బలోపేతమైంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బయోటెక్నాలజీ, సమాచార సాంకేతిక రంగాలలో పరస్పర పెట్టుబడులు పెరిగాయి. పర్యాటకమూ, ప్రజల మధ్య సంబంధాలూ మరింత విస్తృతమయ్యాయి. ఇదే స్ఫూర్తితో అపూర్వమైన వేగంతో మన భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలని మేం నిశ్చయించుకున్నాం.
మిత్రులారా,
భద్రతా రంగంలో.. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సమాచార మార్పిడి, సముద్ర తీర భద్రతలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. అలాగే మన రక్షణ రంగ భాగస్వామ్యాన్నీ మరింత విస్తరించుకుంటాం.
కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతలతోపాటు.. సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాలలో మన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు నిర్వహించిన సీఈఓ ఫోరమ్ వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త మార్గాలను తెరిచింది. పరస్పర విశ్వాసంతో ఆర్థిక పరిపుష్టికి బాటలు వేస్తాం.
మిత్రులారా,
మలేషియాలోని భారత సంతతి ప్రజలను కలిసే అవకాశం నాకు నిన్న లభించింది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారు ఆ సమావేశానికి విచ్చేసి.. కార్యక్రమ గౌరవాన్ని మరింత పెంచారు. ఈ ముప్పై లక్షల మంది భారత వారసత్వం మన రెండు దేశాల మధ్య ఒక సజీవ వారధి. ఇది మనకు గొప్ప శక్తి. వారి సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు మన సంబంధాలకు ఒక మానవీయ ప్రాతిపదికను అందిస్తున్నాయి.
మలేషియాలోని భారతీయ కార్మికుల కోసం సామాజిక భద్రతా ఒప్పందం, పర్యాటకం కోసం ఉచిత ఇ-వీసాలు, మలేషియాలో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని అమలు చేయడం వంటి చర్యలు ఇరు దేశాల ప్రజలకూ జీవన సౌలభ్యాన్ని కల్పిస్తాయి. అయితే, ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరినప్పుడే ఏ భాగస్వామ్యమైనా నిజంగా విజయం సాధించినట్టు భావించాలి.
మిత్రులారా,
భారత్, మలేషియాలను కలిపి ఉంచే మరో బలమైన బంధం తమిళ భాషపై మనకున్న మమకారం. మలేషియాలో విద్య, మీడియా, సాంస్కృతిక రంగాల్లో తమిళ భాషా ప్రాభవం స్పష్టంగా కనిపిస్తుంది. చలనచిత్రాలు, సంగీతం, ముఖ్యంగా తమిళ సినిమా ద్వారా.. నేడు మనం కుదుర్చుకున్న ఆడియో - విజువల్ ఒప్పందం మన హృదయాలను మరింత దగ్గర చేస్తుందన్న నమ్మకం నాకుంది.
విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకార కార్యక్రమాలు, అంకుర సంస్థల నడుమ అనుసంధానాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవకాశాలను కూడా యువత కోసం మనం విస్తరిస్తున్నాం. మన మధ్య పెరుగుతున్న ఈ సత్సంబంధాలకు ఆసరాగా నిలిచేలా.. మలేషియాలో ఒక కొత్త దౌత్య కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం.
మిత్రులారా,
నేడు ఇండో - పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా ఎదుగుతోంది. ఆసియాన్ భాగస్వామ్యంతో ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, శాంతి, స్థిరత్వానికి మేం కట్టుబడి ఉన్నాం. ఆసియాన్‌ను కేంద్రంగా నిలిపేందుకు భారత్ అత్యున్నత ప్రాధాన్యమిస్తోంది. ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న మలేషియాకు మరోసారి హృదయపూర్వక అభినందనలు.
మలేషియా వంటి మిత్రదేశాల మద్దతుతో.. ఆసియాన్‌తో తన సంబంధాలను భారత్ మరింత విస్తృతం చేసుకుంటుంది. ఆసియాన్-భారత్ వస్తు వాణిజ్య ఒప్పందం (ఏఐటీఐజీఏ) సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేం భావిస్తున్నాం.
మిత్రులారా,
ఈ రోజు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మేం అర్థవంతమైన చర్చలు నిర్వహించాం. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న ఈ వాతావరణంలో.. భారత్, మలేషియాల మధ్య పెరుగుతున్న స్నేహబంధం ఇరు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం.
నేటి సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మేమిద్దరం ఏకీభవిస్తున్నాం. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మా మద్దతును కొనసాగిస్తాం. ఇక ఉగ్రవాదంపై మా సందేశం సుస్పష్టం: ద్వంద్వ ప్రమాణాలు లేవు.. రాజీ పడబోము.
గౌరవ మలేషియా ప్రధానమంత్రి గారూ,
భారత్ – మలేషియా సత్సంబంధాల పట్ల మీ నిబద్ధతకు ఎంతగానో అభినందనీయం. మలేషియా సమృద్ధి అన్న మీ ఆశయాన్నీ, అలాగే అభివృద్ధి చెందిన భారతదేశమన్న మా సంకల్పాన్నీ సాకారం చేసుకునే దిశగా కలిసి పనిచేద్దాం.
మీ స్నేహానికీ, ఆత్మీయ స్వాగతానికీ, గొప్ప ఆతిథ్యానికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. భారత్‌లో మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తూంటాం.
“ధన్యవాదాలు.
జుంపా లగీ!
****
(రిలీజ్ ఐడి: 2225159)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2