యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెటుపై యువతలో అవగాహనను పెంచడానికి ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్-2026’ను ప్రారంభించిన డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ


ప్రధానమంత్రితో సంభాషించే అవకాశాన్ని అందుకోనున్న విజేతలు

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2026 2:38PM by PIB Hyderabad

‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ - 2026’ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర బడ్జెటుపై  దేశ యువతీయువకుల్లో అవగాహనను పెంపొందించడంతో పాటు, బడ్జెటులో చేసిన కేటాయింపుల్ని మరింత ఎక్కువ మంది అర్థం చేసుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కళాశాలలు, సంస్థలు, శిక్షణ కేంద్రాల్లోని యువతను నిర్దిష్ట ప్రాతినిధ్య ప్రణాళిక ద్వారా భాగస్తుల్ని చేసి, పౌరులు తమ నిత్య జీవితంలో 2026 కేంద్ర బడ్జెటుకు ఉన్న ప్రాధాన్యాన్ని గ్రహించేలా చూడాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ పోటీ రేపటి నుంచి.. అంటే 2026 ఫిబ్రవరి 3 నుంచి.. మై భారత్ వేదిక (https://mybharat.gov.in/)లో మొదలవుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది 2026 కేంద్ర బడ్జెటుకు సంబంధించిన జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్. మై భారత్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న యువతీయువకులు దీనిలో పాల్గొనవచ్చు. ఈ  క్విజ్‌లో పాల్గొనడానికి ఫిబ్రవరి 17 ఆఖరి గడువుతేదీ. దీని తరువాత, ప్రతి ఒక్క రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలో అగ్రగాములుగా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. వారు ఫిబ్రవరి 17 నుంచి 2026 మార్చి 3 వరకు రెండో విడత పోటీలో పాల్గొంటారు. ఈ విడతలో వ్యాసరచన పోటీని నిర్వహిస్తారు. వికసిత్ భారత్ దృష్టికోణానికి అనుగుణంగా కేంద్ర బడ్జెటు‌లోని 8 అంశాలను దీనిలో భాగంగా యువతకు సూచిస్తారు. పోటీలో పాల్గొనేవారు తమ అభిప్రాయాల్నీ
, ఆలోచనల్నీ వ్యాసాల రూపంలో తెలియజేస్తారు.
‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ)లో యువజనులు వ్యక్తం చేసిన కొత్త కొత్త ఆలోచనల్ని గౌరవ ఆర్థిక మంత్రి ఈ సంవత్సర బడ్జెటు ప్రసంగంలో అభినందించడంతో పాటు, వాటిలో నుంచి కొన్ని ఆలోచనల్ని 2026-27 కేంద్ర బడ్జెటులో ప్రస్తావించారు’’ అని కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్‌ను నిర్వహించి ఈ భావనను ముందుకు తీసుకుపోయి, యువ వాణికి మరింత సాధికారితను అందించాలని మేం కోరుకుంటున్నాం’ అని కూడా ఆయన వివరించారు.
వ్యాసాల మూల్యాంకనాన్ని 2026 మార్చి 3 మొదలు అదే నెల 10 మధ్య చేపడుతారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీ ప్రతిభావంతుల జాబితాల్ని 2026 మార్చి 10న ప్రకటిస్తారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విజేతలు ఆ తరువాత వికసిత్ భారత్ దార్శనికత అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో వర్చువల్ మాధ్యమం ద్వారా ఏర్పాటు చేసే ఒక సంభాషణ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు. జాతీయ ఆర్థిక పరిణామాలు, అభివృద్ధి ప్రాధాన్యాలకు సంబంధించిన విషయాలపై యువతలో అవగాహననీ, యువత ప్రాతినిధ్యాన్నీ పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమ నిర్వహణ పునరుద్ఘాటిస్తున్నది.

 

***


(రిలీజ్ ఐడి: 2222146) సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam