ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెనాల్టీ, ప్రాసిక్యూషన్‌ల హేతుబద్ధీకరణకు ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలను ప్రకటించిన 2026-27 కేంద్ర బడ్జెట్


బహుళ ప్రొసీడింగ్స్ నివారించడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం అసెస్మెంట్, పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఏకీకరణ

01.10.2024 నుంచి... రూ. 20 లక్షల లోపు విలువ గల విదేశీ చరాస్తుల వివరాలు వెల్లడించని వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 12:54PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పెనాల్టీ, ప్రాసిక్యూషన్‌లను హేతుబద్ధీకరించే లక్ష్యంతో ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలను ఈ బడ్జెట్ ప్రతిపాదించింది.

బహుళ ప్రొసీడింగ్స్ నివారించడం కోసం అసెస్మెంట్, పెనాల్టీ ప్రొసీడింగ్‌లను రెండింటినీ ఒకే ఆర్డర్‌గా పరిగణిస్తూ వాటిని ఏకీకృతం చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అప్పీల్ ప్రక్రియ ఫలితంతో సంబంధం లేకుండా మొదటి అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్ ఉన్న కాలానికి జరిమానా మొత్తంపై పన్ను చెల్లింపుదారు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ముందస్తు చెల్లింపు మొత్తాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంతో పాటు దీనిని ప్రధాన పన్ను డిమాండ్‌పై మాత్రమే లెక్కించడం కొనసాగిస్తారు.

వివాదాలను తగ్గించడానికి అదనపు చర్యగా... రీఅసెస్మెంట్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా సంబంధిత సంవత్సరానికి వర్తించే రేటుకు అదనంగా 10 శాతం పన్ను రేటుతో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను నవీకరించడానికి అనుమతించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అసెసింగ్ అధికారి తన కార్యకలాపాల్లో ఈ నవీకరించిన రిటర్న్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.

తక్కువ ఆదాయాన్ని నివేదించిన సందర్భాల్లో పెనాల్టీ, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు కల్పించే విధానం ఇప్పటికే అమలులో ఉంది. తప్పుగా నివేదించిన వారికీ ఈ మినహాయింపును వర్తింపజేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అటువంటి సందర్భంలో పన్ను చెల్లింపుదారులు బకాయి ఉన్న పన్ను, వడ్డీ మొత్తాలకు అదనంగా పన్ను మొత్తంలో 100 శాతం మొత్తాన్ని అదనపు ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఖాతాల ఆడిట్ వైఫల్యం, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను అందించకపోవడం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను అందించకపోవడం వంటి కొన్ని సాంకేతిక డిఫాల్ట్‌లకు విధించే పెనాల్టీలను రుసుముగా మార్చాలనీ ప్రతిపాదించారు.

కొన్ని తీవ్రమైన నేరాల్లో నిరోధం కోసం సమతుల్యతను జాగ్రత్తగా కొనసాగిస్తూనే, ఆదాయపు పన్ను చట్టం కింద ప్రాసిక్యూషన్ విధానాన్ని హేతుబద్ధీకరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

ఖాతా పుస్తకాలు, పత్రాలను సమర్పించకపోవడాన్ని, టీడీఎస్ మినహాయించని నగదేతర చెల్లింపులను నేరరహితం చేశారు. చిన్నపాటి నేరాలకు జరిమానా మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన ప్రాసిక్యూషన్‌లనూ నేరం పరిమాణానికి అనుగుణంగా వర్గీకరిస్తారు. వాటికి సాధారణ జైలు శిక్ష మాత్రమే వర్తిస్తుంది. గరిష్ట జైలు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గించారు అయితే దానినీ జరిమానాగా మార్చేందుకు న్యాయస్థానాలకు అధికారం ఉంటుంది.

20 లక్షల రూపాయల కంటే తక్కువ విలువ కలిగిన విదేశీ చరాస్తుల వివరాలు వెల్లడించని వారికి ప్రస్తుతం ఎటువంటి జరిమానా లేదు. 1.10.2024 నుంచి వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

***


(రిలీజ్ ఐడి: 2221721) సందర్శకుల సూచీ సంఖ్య : : 123
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada , Malayalam