ప్రధాన మంత్రి కార్యాలయం
2026 వ సంవత్సరం జనవరి 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 130 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
प्रविष्टि तिथि:
25 JAN 2026 11:53AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈ 'మన్ కీ బాత్' కార్యక్రమం 2026 సంవత్సరంలో మొదటిది. రేపు- జనవరి 26వ తేదీన మనమందరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జనవరి 26 వ తేదీన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగ వ్యవస్థాపకులకు నివాళులర్పించే అవకాశాన్ని ఇచ్చే రోజిది. ఈ రోజు- జనవరి 25వ తేదీ -చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మ.
మిత్రులారా! 18 ఏళ్లు నిండి ఓటరుగా మారడాన్ని జీవితంలో ఒక సాధారణ మైలురాయిగా పరిగణిస్తాం. అయితే ఈ సందర్భం వాస్తవానికి ఏ భారతీయుడి జీవితంలోనైనా ఒక పెద్ద మైలురాయి. అందువల్ల మన దేశంలో ఓటర్లుగా మారడాన్ని ఉత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. పుట్టినరోజును జరుపుకునే విధంగానే, యువతీయువకులు మొదటిసారి ఓటర్లుగా మారినప్పుడు వారిని అభినందించడానికి, స్వీట్లు పంపిణీ చేయడానికి మొత్తం నివాస ప్రాంతం, గ్రామం లేదా నగరం కలిసి రావాలి. ఇది ఓటు వేయడంపై అవగాహనను పెంచుతుంది. ఓటరుగా ఉండటం చాలా ముఖ్యమనే భావనను బలోపేతం చేస్తుంది.
మిత్రులారా! మన దేశంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ, మన ప్రజాస్వామ్యాన్ని ఉత్సాహంగా ఉంచడానికి క్షేత్ర స్థాయిలో పనిచేసే వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈ రోజు- ఈ 'ఓటరు దినోత్సవం' నాడు- నేను నా యువ స్నేహితులను మరోసారి కోరుతున్నాను. ఇది ప్రతి పౌరుడి నుండి రాజ్యాంగం ఆశించే కర్తవ్య పాలన భావాన్ని నెరవేరుస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ధోరణిని నేను గమనిస్తున్నాను. ప్రజలు 2016 సంవత్సరం జ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ఆ స్ఫూర్తితో ఈ రోజు నా జ్ఞాపకాలలో ఒకదాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పదేళ్ల కిందట 2016 జనవరి లో మనం ఒక ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించాం. చిన్న ప్రయాణమే అయినా అది యువతరానికి, దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైందని గ్రహించాం. కొంతమందికి దాని గురించి అప్పుడు అర్థం కాలేదు. మిత్రులారా! నేను మాట్లాడుతున్న ప్రయాణం స్టార్ట్-అప్ ఇండియా ప్రయాణం. ఈ అద్భుతమైన ప్రయాణంలో హీరోలు మన యువ స్నేహితులే. వారు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన ఆవిష్కరణలు చరిత్రలో నమోదు అవుతున్నాయి.
మిత్రులారా! నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థగా మారింది. ఈ స్టార్ట్-అప్‌లు విభిన్న రంగాలలో ఉన్నాయి. ఈ స్టార్టప్ సంస్థలు 10 సంవత్సరాల కిందట ఊహకు కూడా అందని రంగాలలో ఈరోజు పనిచేస్తున్నాయి. కృత్రిమ మేధ , అంతరిక్షం, న్యూక్లియర్ శక్తి, సెమీ కండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ... ఇలా మీరు ఏ రంగంలో అయినా చూడండి. ఆ రంగంలో కొన్ని భారతీయ స్టార్ట్-అప్‌లు పనిచేయడాన్ని మీరు చూస్తారు. ఏదైనా స్టార్టప్‌తో సంబంధం ఉన్న లేదా సొంతంగా ప్రారంభించాలనుకునే నా యువ స్నేహితులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను.
మిత్రులారా! నా దేశ ప్రజలకు, ముఖ్యంగా పరిశ్రమలు, స్టార్టప్‌లతో సంబంధం ఉన్న యువతకు ఈ రోజు 'మన్ కీ బాత్' ద్వారా నేను ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. ఇటువంటి సమయంలో మనందరికీ ఒక పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత నాణ్యతపై దృష్టి పెట్టడం. ‘ఏదో నడుస్తోంది, నడిపిస్తున్నాం, ఇలా గడిచిపోతుంది' అనే కాలం ముగిసింది. ఈ సంవత్సరం మన శక్తి మేరకు నాణ్యతకు ప్రాధాన్యత ఇద్దాం. మన ఏకైక మంత్రం నాణ్యత, నాణ్యత, నాణ్యత మాత్రమే. నిన్నటి కంటే నేడు మెరుగైన నాణ్యత అందించాలి. మనం తయారు చేసే దేని నాణ్యతనైనా మెరుగుపరచాలని సంకల్పిద్దాం. మన వస్త్రాలు, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ లేదా ప్యాకేజింగ్- ఏ రంగం అయినా, భారతీయ ఉత్పత్తి అత్యుత్తమ నాణ్యతకు పర్యాయపదంగా మారాలి. శ్రేష్ఠతను మన ప్రమాణంగా చేసుకుందాం. నాణ్యతకు కొరత ఉండకూడదని, నాణ్యతపై రాజీ పడకూడదని మనం సంకల్పిద్దాం. నేను ఎర్రకోట నుండి 'జీరో డిఫెక్ట్ - జీరో ఎఫెక్ట్' అని చెప్పాను. ఇలా చేయడం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన దేశ ప్రజలు చాలా వినూత్నంగా ఉంటారు. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం మన దేశప్రజలలో అంతర్లీనంగా ఉంటుంది. కొందరు దీన్ని స్టార్టప్‌ల ద్వారా చేస్తారు, మరికొందరు సమాజ సామూహిక శక్తి ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో అలాంటి ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రాంతం గుండా ప్రవహించే తమసా నదికి ప్రజలు కొత్త జీవితాన్ని ఇచ్చారు. తమసా నది కేవలం ఒక నది మాత్రమే కాదు- అది మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ జీవధార. అయోధ్యలో ప్రారంభమై గంగానదిలో కలిసే ఈ నది ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవన కేంద్రంగా ఉండేది. కానీ కాలుష్యం దాని నిరంతర ప్రవాహానికి ఆటంకం కలిగించింది. బురద, చెత్త, మురికి దాని ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. తర్వాత ఇక్కడి ప్రజలు దానికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. నదిని శుభ్రపరిచారు. దాని ఒడ్డున నీడనిచ్చే చెట్లను, పండ్ల చెట్లను నాటారు. స్థానిక ప్రజలు ఈ ఉద్యమాన్ని తమ విధి నిర్వహణగా భావించారు. అందరి ప్రయత్నాల వల్ల నది పునరుద్ధరణ జరిగింది.
మిత్రులారా! ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కూడా ఇలాంటి ప్రజా భాగస్వామ్య ప్రయత్నం జరిగింది. అది తీవ్రమైన కరువు సమస్యతో సతమతమవుతున్న ప్రాంతం. అక్కడి నేల ఎరుపు, ఇసుక రంగులో ఉంటుంది. అక్కడి ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అక్కడి చాలా ప్రాంతాలలో చాలా కాలంగా వర్షాలు పడడం లేదు. కొన్నిసార్లు ప్రజలు అనంతపురం ప్రాంతాన్ని ఎడారిలోని కరువు పరిస్థితితో పోలుస్తారు. మిత్రులారా! ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు నీటి వనరులను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. పరిపాలనా యంత్రాంగం సహకారంతో అక్కడ 'అనంత నీటి సంరక్షణ ప్రాజెక్టు' ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా 10 కి పైగా నీటి వనరులను పునరుద్ధరించారు. ఆ నీటి వనరులు ఇప్పుడు నీటితో నిండిపోతున్నాయి. అంతేకాకుండా 7,000 కి పైగా చెట్లను నాటారు. అంటే అనంతపురంలో నీటి సంరక్షణ మాత్రమే కాకుండా పచ్చదనం కూడా పెరిగింది. పిల్లలు ఇప్పుడు అక్కడ ఈత కొట్టడాన్ని ఆనందించవచ్చు. ఒక విధంగా అక్కడ యావత్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ జరిగింది.
మిత్రులారా! అది ఆజంగఢ్ అయినా, అనంతపురం అయినా, లేదా దేశంలో మరెక్కడైనా, ప్రజలు ఐక్యంగా ఉండి కర్తవ్య నిష్టతో పెద్ద సంకల్పాలను నెరవేర్చుకోవడం చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజా భాగస్వామ్యం, సామూహిక భావన మన దేశానికి గొప్ప బలం.
నా ప్రియమైన దేశప్రజలారా! శతాబ్దాలుగా భజనలు, కీర్తనలు మన మన దేశ సంస్కృతికి ఆత్మగా ఉన్నాయి. మనం దేవాలయాలలో భజనలు, కథలు వింటూనే ఉంటాం. ప్రతి కాలం ఆ కాలానికి తగ్గట్టు భక్తిని తమ జీవన విధానంలో చేర్చుకుంది. నేటి తరం కూడా దానికి నవీన రూపం ఇస్తోంది. నేటి యువతరం తమ అనుభవాలలో, జీవనశైలిలో భక్తిని చేర్చుకుంటోంది. ఈ ఆలోచన కొత్త సాంస్కృతిక ధోరణికి దారితీసింది. మీరు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలను చూసి ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెద్ద సంఖ్యలో యువత గుమిగూడుతున్నారు. వేదికలు అలంకరిస్తారు. లైటింగ్ ఉంటుంది. సంగీతం ఉంటుంది. పూర్తి వైభవం , ప్రదర్శన ఉంటాయి. వాతావరణం ఒక కచేరీ కంటే తక్కువేమీ కాదు. అది ఒక భారీ కచేరీలా అనిపిస్తుంది. కానీ అక్కడ పూర్తి ఏకాగ్రత, అంకితభావం, లయతో భజనలు నిర్వహిస్తున్నారు. భజనల ప్రతిధ్వనితో ఆ ప్రాంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ ధోరణిని ఇప్పుడు 'భజన్ క్లబ్బింగ్' అని పిలుస్తున్నారు. ముఖ్యంగా జెన్ జెడ్ లో ఈ ధోరణి బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కార్యక్రమాలలో భజనల గౌరవం, స్వచ్ఛతపై దృష్టి పెట్టడాన్ని చూడటం ఆనందదాయకంగా ఉంది. భక్తిని తేలికగా తీసుకోలేదు. శబ్దాలు, పదాల గౌరవానికి భంగం కలగలేదు. భావాలపరంగా రాజీపడలేదు. వేదిక ఆధునికంగా ఉండవచ్చు. సంగీత ప్రదర్శన భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రధాన స్ఫూర్తి అలాగే ఉంది. అక్కడ ఆధ్యాత్మికత నిరంతరం ప్రవహిస్తోంది.
నా ప్రియమైన దేశవాసులారా! నేడు మన సంస్కృతి, పండుగలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయ పండుగలను గొప్ప ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకుంటారు. మన భారతీయ సోదరసోదరీమణులు అన్ని రకాల సాంస్కృతిక చైతన్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నా తమ సంస్కృతి ప్రధాన స్ఫూర్తిని కాపాడుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మలేషియాలోని మన భారతీయ సమాజం కూడా ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేస్తోంది. మలేషియాలో 500 కంటే ఎక్కువ తమిళ పాఠశాలలు ఉన్నాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తమిళ భాషను బోధించడంతో పాటు ఇతర విషయాలను కూడా తమిళంలో బోధిస్తారు. దీనితో పాటు తెలుగు, పంజాబీతో సహా ఇతర భారతీయ భాషలపై కూడా అక్కడ దృష్టి పెడుతున్నారు.
మిత్రులారా! భారతదేశం- మలేషియా మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ సంస్థ పేరు 'మలేషియా ఇండియా హెరిటేజ్ సొసైటీ'. వివిధ కార్యక్రమాలతో పాటు ఆ సంస్థ హెరిటేజ్ వాక్ ను కూడా నిర్వహిస్తుంది. ఇందులో రెండు దేశాలను అనుసంధానం చేసే సాంస్కృతిక ప్రదేశాలను కవర్ చేస్తారు. గత నెలలో మలేషియాలో 'లాల్ ప్యాడ్ చీర' నడక నిర్వహించారు. ఈ చీరకు మన బెంగాల్ సంస్కృతితో ప్రత్యేక సంబంధం ఉంది. అత్యధిక సంఖ్యలో చీరను ధరించిన వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డులో రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా ఒడిస్సీ నృత్యం, బవూల్ సంగీతం ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. అందుకే నేనిలా చెప్పగలను –
సాయా బర్ బాంగా / దెంగాన్ డయాస్పోరా ఇండియా /
ది మలేషియా //
మెరెకా మంబావా / ఇండియా దాన్ మలేషియా /
సెమాకిన్ రాపా //
అంటే మలేషియాలోని ప్రవాస భారతీయుల విషయంలో నేను గర్వపడుతున్నాను. వారు భారతదేశాన్ని, మలేషియాను దగ్గరికి తీసుకువస్తున్నారు. మలేషియాలోని మన ప్రవాస భారతీయులకు నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా! భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అసాధారణమైన, అపూర్వమైన విషయం ఏదో ఒకదాన్ని మనం తప్పకుండా చూస్తాము. తరచుగా ఈ విషయాలు మీడియా వెలుగులో మరుగున పడతాయి. కానీ అవి మన సమాజానికి సంబంధించిన నిజమైన శక్తిని వెల్లడిస్తాయి. అవి మన వాల్యూ సిస్టమ్స్ గురించి ఒక సంగ్రహావలోకనాన్ని కూడా అందిస్తాయి. దీనిలో ఐకమత్య స్ఫూర్తి అత్యంత ముఖ్యమైంది. గుజరాత్‌లోని బెచ్రాజీ ప్రాంతంలో ఉన్న చందంకి గ్రామ సంప్రదాయం ప్రత్యేకమైంది. అక్కడి ప్రజలు- ముఖ్యంగా వృద్ధులు- తమ ఇళ్లలో వంట చేయరని నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కారణం గ్రామంలోని అద్భుతమైన కమ్యూనిటీ వంటగది. ఈ కమ్యూనిటీ వంటగదిలో మొత్తం గ్రామానికి ఆహారం వండుతారు. ప్రజలందరూ కలిసి కూర్చుని తింటారు. ఈ సంప్రదాయం గత 15 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే టిఫిన్ సేవ కూడా అందుబాటులో ఉంది. అంటే ఇంటికి డెలివరీ ఏర్పాటు కూడా ఉంది. గ్రామంలో ఈ కమ్యూనిటీ భోజనం ప్రజల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ చొరవ ప్రజలను అనుసంధానించడమే కాకుండా కుటుంబ భావనను కూడా ప్రోత్సహిస్తుంది.
మిత్రులారా! భారతదేశ కుటుంబ వ్యవస్థ మన సంప్రదాయంలో అంతర్భాగం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ వ్యవస్థవైపు ఎంతో ఆసక్తిగా చూస్తాయి. అనేక దేశాలలో ఇటువంటి కుటుంబ వ్యవస్థలను ఎంతో గౌరవిస్తారు. కొద్ది రోజుల కిందట నా సోదరుడు, యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు. యుఎఇ 2026 ను కుటుంబ సంవత్సరంగా జరుపుకుంటుందని ఆయన నాకు చెప్పారు. ఆ దేశ ప్రజలలో సామరస్యం, సమాజ స్ఫూర్తిని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇది నిజంగా ప్రశంసనీయమైన చొరవ.
మిత్రులారా! కుటుంబం, సమాజ బలం కలిస్తే మనం చాలా ముఖ్యమైన సవాళ్లను కూడా అధిగమించగలం. అనంతనాగ్‌లోని షేక్‌గుండ్ గ్రామం గురించి నాకు తెలిసింది. అక్కడ మాదకద్రవ్యాలు, పొగాకు, సిగరెట్లు, మద్యానికి సంబంధించిన సవాళ్లు గణనీయంగా పెరిగాయి. ఇవన్నీ చూసిన మీర్ జాఫర్ గారు చాలా బాధపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. యువత నుండి పెద్దల వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆయన ఏకం చేశారు. ఆయన చొరవ ప్రభావం వల్ల అక్కడి దుకాణాలు పొగాకు ఉత్పత్తులను అమ్మడం మానేశాయి. ఈ ప్రయత్నం మాదకద్రవ్యాల ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహనను కూడా పెంచింది.
మిత్రులారా! మన దేశంలో చాలా సంవత్సరాలుగా నిస్వార్థంగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ ప్రాంతంలోని ఫరీద్‌పూర్‌లో ఒక సంస్థ ఉంది. దాని పేరు 'వివేకానంద లోక్ శిక్షా నికేతన్'. ఈ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా పిల్లలు, వృద్ధుల సంరక్షణలో నిమగ్నమై ఉంది. గురుకుల వ్యవస్థ ద్వారా విద్యను అందించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ సంస్థ సామాజిక సంక్షేమం కోసం అనేక గొప్ప పనులలో నిమగ్నమై ఉంది. ఈ నిస్వార్థ సేవా స్ఫూర్తి దేశప్రజలలో మరింత బలంగా పెరగాలని నేను కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మనం నిరంతరం పరిశుభ్రత అంశంపై చర్చ జరుపుతున్నాం. మన యువత తమ చుట్టూ ఉన్న పరిశుభ్రత విషయంలో చాలా స్పృహతో ఉండడం చూసి నేను గర్వపడుతున్నాను. అరుణాచల్ ప్రదేశ్‌లో అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. దేశంలో సూర్యకిరణాలు మొదటగా చేరే భూమి అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ, ప్రజలు ‘జై హింద్’ అని చెప్పుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటారు. అక్కడి ఇటానగర్‌లో ఎక్కువ శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను శుభ్రం చేయడానికి యువకుల బృందం కలిసి వచ్చింది. ఈ యువకులు వివిధ నగరాల్లోని ప్రజా స్థలాలను శుభ్రపరచడం తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఈ ప్రచారాన్ని ఇటానగర్, నాహర్ లాగున్, దోయిముఖ్, సెప్పా, పాలిన్, పాసిఘాట్‌లలో కూడా ప్రారంభించారు. ఈ యువకులు ఇప్పటివరకు 11 లక్షల కిలోగ్రాములకు పైగా చెత్తను శుభ్రం చేశారు. ఊహించుకోండి స్నేహితులారా…. యువకులు కలిసి 11 లక్షల కిలోగ్రాముల చెత్తను తొలగించారు.
మిత్రులారా! మరొక ఉదాహరణ అస్సాంకు సంబంధించింది. అస్సాంలోని నాగావ్‌లో ప్రజలు అక్కడి పాత వీధులతో భావోద్వేగపరంగా అనుసంధానమయ్యారు. అక్కడ కొంతమంది తమ వీధులను సామూహికంగా శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. క్రమంగా ఎక్కువ మంది వారితో చేరారు. ఆ విధంగా వీధుల నుండి చాలా చెత్తను తొలగించే బృందం ఏర్పడింది. మిత్రులారా! బెంగళూరులో కూడా ఇలాంటి ప్రయత్నం జరుగుతోంది. బెంగళూరులో సోఫా వ్యర్థాలు ఒక ప్రధాన సమస్యగా తయారయ్యాయి. కాబట్టి కొంతమంది నిపుణులు తమ స్వీయ మార్గాల్లో ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు.
మిత్రులారా! నేడు అనేక నగరాల్లో ల్యాండ్‌ఫిల్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి అంకితమైన బృందాలు ఉన్నాయి. చెన్నైలోని అలాంటి ఒక బృందం అద్భుతమైన పని చేసింది. పరిశుభ్రతకు సంబంధించిన ప్రతి ప్రయత్నం ప్రాముఖ్యతను ఇటువంటి ఉదాహరణలు వెల్లడిస్తాయి. మనం వ్యక్తిగతంగా లేదా బృందంగా పరిశుభ్రత కోసం మన ప్రయత్నాలను పెంచాలి. అప్పుడే మన నగరాలు మెరుగుపడతాయి.
నా ప్రియమైన దేశప్రజలారా! పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడేటప్పుడు మనం తరచుగా గొప్ప ప్రణాళికలు, గొప్ప ప్రచారాలు, పెద్ద సంస్థల గురించి ఆలోచిస్తాం. కానీ తరచుగా మార్పు చాలా సాధారణమైన విధానంలో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి, ఒక ప్రాంతం, ఒక అడుగు, చిన్న, స్థిరమైన ప్రయత్నాలు కూడా గణనీయమైన మార్పును తీసుకువస్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ నివాసి బెనాయ్ దాస్ ప్రయత్నాలు దీనికి ప్రధాన ఉదాహరణ. గత కొన్ని సంవత్సరాలుగా తన జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆయన ఒంటరిగా పనిచేశారు. బెనాయ్ దాస్ వేలాది చెట్లను నాటారు. మొక్కల కొనుగోలు, నాటడం, సంరక్షణ ఖర్చులన్నింటినీ చాలా సార్లు ఆయన స్వయంగా భరించారు. అవసరమైన చోట అక్కడి నివాసితులు, విద్యార్థులు, మునిసిపల్ సంస్థలతో ఆయన కలిసి పనిచేశారు. ఆయన ప్రయత్నాలు రోడ్ల పక్కన పచ్చదనాన్ని మరింత పెంచాయి.
మిత్రులారా! మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన జగదీష్ ప్రసాద్ అహిర్వార్ గారు కూడా ప్రశంసనీయ సేవలందిస్తున్నారు. ఆయన అడవిలో బీట్-గార్డ్‌గా పనిచేస్తున్నారు. అడవిలోని అనేక ఔషధ మొక్కల గురించి సమాచారం ఎక్కడా క్రమపద్ధతిలో నమోదు కాలేదని ఒకసారి పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆయన గ్రహించారు. జగదీష్ ఈ సమాచారాన్ని తదుపరి తరానికి అందించాలనుకున్నారు. కాబట్టి ఆయన ఔషధ మొక్కలను గుర్తించడం, రికార్డ్ చేయడం ప్రారంభించారు. నూట ఇరవై ఐదుకు పైగా ఔషధ మొక్కలను గుర్తించారు. ప్రతి మొక్క ఛాయాచిత్రం, పేరు, ఉపయోగం, అది దొరికే ప్రదేశాన్ని నమోదు చేశారు. అటవీ శాఖ ఆయన సేకరించిన సమాచారాన్ని సంకలనం చేసి ఒక పుస్తకంగా ప్రచురించింది. ఈ పుస్తకంలోని సమాచారం ఇప్పుడు పరిశోధకులు, విద్యార్థులు, అటవీశాఖ అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉంది.
మిత్రులారా! పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి నేడు పెద్ద ఎత్తున కనబడుతోంది. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది ఈ ప్రచారంలో చేరారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కోట్లకు పైగా చెట్లను నాటారు. ప్రజలు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మరింత అవగాహన కలిగి ఉన్నారని, ఏదో ఒక విధంగా తమ సహకారం అందించాలని కోరుకుంటున్నారని ఇది చూపిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఇంకొక విషయంలో మిమ్మల్ని ప్రశంసించాలనుకుంటున్నాను. ఆ విషయం మిల్లెట్స్ లేదా శ్రీఅన్న్. శ్రీఅన్న్ పట్ల దేశ ప్రజల ఆసక్తి నిరంతరం పెరుగుతుండడం చూసి నేను సంతోషిస్తున్నాను. 2023ని మిల్లెట్ సంవత్సరంగా మనం ప్రకటించాం. మూడు సంవత్సరాల తరువాత కూడా దేశంలో, ప్రపంచంలో మిల్లెట్ల విషయంలో అభిరుచి, నిబద్ధత నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది.
మిత్రులారా! తమిళనాడులోని కల్ల-కురిచి జిల్లా మహిళా రైతుల బృందం కృషి స్ఫూర్తిదాయకంగా మారింది. దాదాపు 800 మంది మహిళా రైతులు ‘పెరియపాళయం మిల్లెట్’ రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. మిల్లెట్ల విషయంలో పెరుగుతున్న ప్రజాదరణను చూసి, ఈ మహిళలు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించారు. ఇప్పుడు, వారు నేరుగా మిల్లెట్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు.
మిత్రులారా! రాజస్థాన్‌లోని రాంసర్ రైతులు కూడా శ్రీఅన్న్ తో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. 900 మందికి పైగా రైతులు రాంసర్ ఆర్గానిక్ రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ రైతులు ప్రధానంగా జొన్నలను పండిస్తారు. తినడానికి సిద్ధంగా ఉన్న లడ్డులను తయారు చేయడానికి ఇక్కడ జొన్నలను ప్రాసెస్ చేస్తారు. వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మిత్రులారా! ఈ రోజుల్లో చాలా దేవాలయాలు తమ ప్రసాదాలలో చిరు ధాన్యాలను మాత్రమే ఉపయోగిస్తున్నాయని తెలుసుకుని నేను సంతోషిస్తున్నాను. ఈ చొరవకు ఆలయ నిర్వాహకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా! చిరు ధాన్యాలు ఆహార దాతల ఆదాయాన్ని పెంచడమే కాకుండా మెరుగైన ఆరోగ్యానికి కూడా హామీ ఇస్తున్నాయి. చిరు ధాన్యాలు పోషకాహారంతో సమృద్ధిగా ఉంటాయి. సూపర్ ఫుడ్ గా ఉంటాయి. శీతాకాలాన్ని మన దేశంలో ఆహారపానీయాల సేవనానికి అత్యుత్తమ కాలంగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ కాలంలో మనం చిరు ధాన్యాలను ఖచ్చితంగా తినాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్'లో మనకు మరోసారి అనేక విభిన్న అంశాలను చర్చించే అవకాశం లభించింది. మన దేశ విజయాలను గుర్తించి ఉత్సవంగా జరుపుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం మనందరికీ ఇస్తుంది. అలాంటి మరొక అవకాశం ఫిబ్రవరిలో వస్తోంది. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ వచ్చే నెలలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు- ముఖ్యంగా సాంకేతిక రంగంలోని వారు- ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశానికి వస్తారు. ఈ సమ్మేళనం కృత్రిమ మేధ విషయంలో భారతదేశం సాధించిన పురోగతి, విజయాలను కూడా ప్రపంచం దృష్టికి తెస్తుంది. ఈ సమ్మేళనంలో పాల్గొనే ప్రతి ఒక్కరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ గురించి వచ్చే నెల 'మన్ కీ బాత్'లో ఖచ్చితంగా చర్చిద్దాం. మన దేశవాసులు సాధించిన కొన్ని ఇతర విజయాలను కూడా చర్చిద్దాం. అప్పటి వరకు దయచేసి ఈ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నాకు వీడ్కోలు చెప్పండి. రేపటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2218561)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
Punjabi
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam