రాష్ట్రపతి సచివాలయం
16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి
ఓటు వేయడం కేవలం ఒక రాజకీయ వ్యక్తీకరణ మాత్రమే కాదు.. ఎన్నికల ప్రజాస్వామ్య విధానంపై పౌరులకు ఉన్న విశ్వాసానికి ప్రతిబింబం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
25 JAN 2026 2:32PM by PIB Hyderabad
నేడు (జనవరి 25, 2026) న్యూఢిల్లీలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సభను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రపతి మాట్లాడుతూ.. మన ప్రజాస్వామ్య బలం కేవలం ఓటర్ల సంఖ్యలోనే కాకుండా, లోతైన ప్రజాస్వామ్య స్పూర్తిలోనూ ఉందని అన్నారు. ఒటు కలిగిన అత్యంత వృద్ధులు, దివ్యాంగులు అలాగే మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలను అందించినందుకు, చైతన్యవంతులైన ఓటర్లను, ఎన్నికల సంఘం నాయకత్వంలో ఎన్నికల యంత్రాంగంలో భాగమైనవారందరినీ ఆమె అభినందించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చేది ప్రజా భాగస్వామ్యమేనని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘‘ఏ ఒక్క ఓటరు కూడా ఓటు వేయకుండా మిగిలిపోకూడదు ’’ అనే లక్ష్యంతో ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేసిందని ఆమె తెలిపారు. ఓటర్లలో అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ఈ ఏడాది కోసం ఎంపిక చేసిన ఇతివృత్తం..‘ నా దేశం, నా ఓటు: భారత ప్రజాస్వామ్యానికి కీలకం భారత పౌరుడే’ మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను స్పష్టంగా సూచిస్తోందని అన్నారు.
"ఓటు వేయడం అనేది కేవలం ఒక రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం మాత్రమే కాదని రాష్ట్రపతి అన్నారు. ఇది ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియపై పౌరులకు ఉన్న విశ్వాసానికి ప్రతిబింబమని తెలిపారు. ఇది పౌరులు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి ఒక సాధనంగా పనిచేస్తుదని చెప్పారు. వివక్ష లేకుండా వయోజన పౌరులందరికీ అందుబాటులో ఉన్న ఈ ఓటు హక్కు.. మన రాజ్యాంగ ఆదర్శాలైన రాజకీయ, సామాజిక న్యాయం, సమానత్వానికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇస్తుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ విధానం, సామాన్య ప్రజల విజ్ఞతపై మన రాజ్యాంగ నిర్మాతల దృఢమైన విశ్వాసానికి ఫలితంగా వచ్చిందన్నారు. మన దేశ ఓటర్లు ఆ నమ్మకాన్ని నిజం చేశారని, తద్వారా భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ వేదికపై ఒక గొప్ప ఉదాహరణగా గౌరవాన్ని పొందిందని తెలిపారు.
"ఓటు హక్కు ఎంత ముఖ్యమైనదో, పౌరులందరూ తమ రాజ్యాంగ విధులను దృష్టిలో ఉంచుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు. ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు, అజ్ఞానానికి, తప్పుడు సమాచారానికి, దుష్ప్రచారానికి, ముందస్తు పక్షపాతాలకు లోనవ్వకుండా.. తమ అంతరాత్మ శక్తితో మన ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు కార్డులు పొందిన యువ ఓటర్లందరినీ రాష్ట్రపతి అభినందించారు. ఈ కార్డు వారికి ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా పాల్గొనే అమూల్యమైన హక్కును కల్పిస్తుందని ఆమె చెప్పారు. నేటి ఓటర్లే భారతదేశ భవిష్యత్తు రూపశిల్పులని ఆమె పేర్కొన్నారు. దేశంలోని యువ ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతతో వినియోగించి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని నమ్మకం తనకుందని అన్నారు.
2011 నుంచి భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఓటరు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. పౌరుల్లో ఎన్నికల అవగాహన పెంచి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి క్రీయాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కొనసాగుతుంది.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
***
(रिलीज़ आईडी: 2218533)
आगंतुक पटल : 20