భారత ఎన్నికల సంఘం
రేపు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపనున్న ఈసీఐ
प्रविष्टि तिथि:
24 JAN 2026 3:00PM by PIB Hyderabad
1. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ‘నా దేశం, నా ఓటు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ ఏడాది వేడుకలకు ‘భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువు పౌరుడు’ అనేది నినాదం.
2. న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞనేష్ కుమార్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.
3. ముందుగా భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులను అందజేస్తారు. అలాగే సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ఎన్నికల నిర్వహణ, వినూత్న ఓటర్ల అవగాహన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, శిక్షణ,సామర్థ్య పెంపు వంటి వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఉత్తమ ఎన్నికల ప్రాక్టీసెస్ అవార్డులను, ఇతర ప్రత్యేక అవార్డులను, మీడియాకు ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్రపతి ప్రధానం చేస్తారు.
4. ఎన్వీడీ 2026 సందర్భంగా రెండు ప్రచురణలను కూడా ఆవిష్కరించనున్నారు. అవి 2025: ఎ ఇయర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ,బిహార్లో సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా నిర్వహించడంపై రూపొందించిన ‘చునావ్ కా పర్వ్, బిహార్ కా గర్వ్’. ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్య అభివృద్ధిలో భారత ఎన్నికల సంఘం అంతర్జాతీయ నాయకత్వాన్ని ప్రతిబింబించే వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు.
5. ఎన్నికల జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఓటర్ల ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ఇటీవలి కార్యక్రమాలు, 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన తీరును కూడా ఈ ప్రదర్శనలో ప్రధానంగా చూపిస్తారు.
6. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు), జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓలు) కార్యాలయాల ద్వారా ఏకకాలంలో నిర్వహిస్తారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) కూడా వారి పోలింగ్ కేంద్రాల వద్ద కార్యక్రమాలను ఏర్పాటు చేసి, కొత్తగా నమోదైన ఓటర్లను సత్కరించి, గుర్తింపు కార్డులను అందజేస్తారు.
***
(रिलीज़ आईडी: 2218337)
आगंतुक पटल : 7