మంత్రిమండలి
azadi ka amrit mahotsav

భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు ఈక్విటీ సాయాన్ని ఆమోదించిన కేబినెట్


తక్కువ ధరలకే సిడ్బీకి అందుబాటులోకి అదనపు వనరులు.. తద్వారా ఎంఎస్ఎంఈలకు మరింత మెరుగ్గా రుణ లభ్యత

కొత్తగా 25.74 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి

प्रविष्टि तिथि: 21 JAN 2026 12:17PM by PIB Hyderabad

భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ)కి రూ.5,000 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.

ఈ రూ. 5,000 కోట్ల ఈక్విటీ మూలధనాన్ని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) మూడు విడతల్లో సిడ్బీకి అందిస్తుంది. 2025-26లో రూ. 3,000 కోట్లు (2025 మార్చి 31 నాటి బుక్ వాల్యూ రూ. 568.65 చొప్పున), అనంతరం 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి రూ. 1,000 కోట్ల చొప్పున (కిందటి ఆర్థిక సంవత్సరాల్లో మార్చి 31 నాటి బుక్ వాల్యూ ప్రకారం) ఈ నిధులను సమకూరుస్తుంది.

ప్రభావం:

రూ. 5,000 కోట్ల ఈక్విటీ మూలధన కల్పన అనంతరం.. ఆర్థిక సాయం పొందే ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 76.26 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య.. 2028 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 102 లక్షలకు పెరుగుతుందని అంచనా (అంటే కొత్తగా దాదాపు 25.74 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి కలుగుతుంది). ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం (2025 సెప్టెంబరు 30 నాటికి).. దేశంలోని 6.90 కోట్ల ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం 30.16 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది (సగటున ఒక్కో ఎంఎస్ఎంఈతో 4.37 మందికి ఉపాధి లభిస్తోంది). ఈ సగటును పరిగణనలోకి తీసుకుంటే.. 2027-28 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అదనంగా చేరబోయే 25.74 లక్షల కొత్త ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపు 1.12 కోట్ల మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని అంచనా.

నేపథ్యం:

నిర్దేశిత రుణాలపై ప్రధానంగా దృష్టి సారించడం, వచ్చే అయిదేళ్లలో ఆ విభాగంలో మరింత పెరుగుదల ఉంటుందని భావిస్తుండడంతో.. సిడ్బీ ఆస్తి- అప్పుల పట్టీలో వసూళ్ల పరంగా సందేహాస్పదమైన రుణాల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ పెరుగుదల కారణంగా.. మూలధనానికీ - వసూళ్ల పరంగా సందేహాస్సదమైన రుణాలకూ మధ్య నిష్పత్తిని (సీఆర్ఏఆర్) అదే స్థాయిలో కొనసాగించడం కోసం సిడ్బీకి అధిక మూలధనం అవసరమవుతుంది. రుణ ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో సిడ్బీ రూపొందిస్తున్న డిజిటల్, డిజిటల్ ఆధారిత పూచీకత్తు లేని రుణాలు, అలాగే అంకుర సంస్థలకు అందిస్తున్న వెంచర్ రుణాల కారణంగా.. వసూళ్ల పరంగా సందేహాస్పదమైన రుణాల విలువ మరింత పెరుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన సీఆర్ఏఆర్ నిర్వహణ కోసం సిడ్బీకి మరింత మూలధనం అవసరమవుతుంది.

క్రెడిట్ రేటింగును కాపాడుకోవడంలో నిర్దేశిత స్థాయి కన్నా మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన సీఆర్ఏఆర్ అత్యంత కీలకం. అదనపు వాటా మూలధనం అందడం వల్ల.. ఆరోగ్యకరమైన సీఆర్ఏఆర్‌ను కొనసాగిస్తూ సిడ్బీ ప్రయోజనం పొందుతుంది. ఈ అదనపు మూలధన కల్పన వల్ల.. మార్కెట్ నుంచి తక్కువ వడ్డీకే సిడ్బీ నిధులను సేకరించగలుగుతుంది. తద్వారా ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను అందించడానికి వీలవుతుంది. ఈ ప్రతిపాదిత విడతల వారీ వాటా మూలధన కల్పన వల్ల... తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో కూడా సిడ్బీ తన సీఆర్ఏఆర్‌ను 10.50 శాతం కన్నా ఎక్కువగానూ, అలాగే వచ్చే మూడేళ్లలో పిల్లర్-1, పిల్లర్-2  ప్రకారం 14.50 శాతం కన్నా ఎక్కువగానూ కొనసాగించగలుగుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2216928) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam